జనవరిలో సెట్స్ షెడ్యూల్!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షల (సెట్స్) షెడ్యూల్‌పై కసరత్తు మొదలైంది. ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదటి వారంలో షెడ్యూల్ జారీ చేయాలని ఉన్నత విద్యా మండలి భావిస్తోంది. గతంలో దేశం మొత్తం ఒకే రకమైన కోర్సులో ప్రవేశాలకు ఒకే ప్రవేశ పరీక్ష నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచనలు చేసింది. అలాగే జేఈఈ మెయిన్ ద్వారానే ఇంజనీరింగ్ ప్రవేశాలను 2019–20 విద్యా సంవత్సరం నుంచి చేపట్టాలని ప్రయత్నించింది. అయితే దీనిపై ఇంతవరకు కేంద్రం నుంచి ఎలాంటి స్పష్టత రాకపోవడం, మరోవైపు జేఈఈ మెయిన్ నిర్వహణకు సెప్టెంబర్‌లోనే నోటిఫికేషన్ జారీ అవ్వడంతో ఉన్నత విద్యా మండలి ఈసారి ఎంసెట్ నిర్వహించాలని నిర్ణయానికి వచ్చింది. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తోంది. దీంతో ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదటి వారంలో సెట్స్ షెడ్యూల్ జారీ చేయనుంది. ఈలోగా అన్ని యూనివర్సిటీల వైస్ చాన్సలర్లతో ఓసారి సమావేశమయ్యే అవకాశం ఉంది. అనంతరం ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, బీఎడ్, ఎల్ఎల్బీ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు ఎంసెట్, ఈసెట్, ఐసెట్, ఎడ్‌సెట్, లాసెట్ ప్రవేశ పరీక్షల తేదీలను ఖరారు చేసి ప్రకటించాలని భావిస్తోంది. ముఖ్యంగా ఎంసెట్‌ను ఏప్రిల్ నెలాఖరు లేదా మే మొదటి వారంలో నిర్వహించేలా షెడ్యూల్ జారీ చేయాలని యోచిస్తోంది.