Ishwar Pandey
-
MS Dhoni: ధోని ఒక్క ఛాన్స్ ఇచ్చి ఉంటే నా కెరీర్ వేరేలా ఉండేది.. కానీ!
Ishwar Pandey On Unfulfilled Team India Dream: టీమిండియా కెప్టెన్‌గా మహేంద్ర సింగ్ ధోని హయాంలో ఎంతో మంది యువ ఆటగాళ్లు అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టారు. మిస్టర్ కూల్ నమ్మకాన్ని గెలుచుకుని.. వరుస అవకాశాలు దక్కించుకుని.. తమను తాము నిరూపించుకుని మేటి ఆటగాళ్లుగా ఎదిగారు. ధోని ప్రోత్సాహంతో తమ రాతను మార్చుకుని జట్టులో స్థానం సుస్థిరం చేసుకున్నారు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి, ప్రస్తుత భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఆ జాబితాలోని వాళ్లే! నాకు మాత్రం ఆ అవకాశం రాలేదు! అయితే, తనకు మాత్రం అలాంటి అదృష్టం దక్కలేదంటున్నాడు మాజీ ఫాస్ట్‌బౌలర్ ఈశ్వర్ పాండే. తనపై కాస్త నమ్మకం ఉంచి ధోని గనుక తనకు అవకాశం ఇస్తే తన కెరీర్ మరోలా ఉండేదని వ్యాఖ్యానించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ధోని సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడాడు ఈ మాజీ పేసర్. ఈశ్వర్ పాండే(PC: Ishwar Pandey Instagram) ధోని ముందుండి నడిపించిన పుణె సూపర్‌జెయింట్స్, పుణె వారియర్స్ జట్టులో కూడా భాగమయ్యాడు ఈశ్వర్ పాండే. ఐపీఎల్ కెరీర్లో మొత్తంగా 25 మ్యాచ్‌లు ఆడి 18 వికెట్లు తీశాడు. అయితే, ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో మాత్రం అతడికి అద్భుత రికార్డు ఉంది. 75 మ్యాచ్‌లలో 263 వికెట్లు పడగొట్టాడు. కానీ.. టీమిండియా తరఫున ఆడాలన్న తన కోరిక మాత్రం నెరవేరలేదు. 2014లో న్యూజిలాండ్ పర్యటనకు ఎంపికైనప్పటికీ తుది జట్టులో మాత్రం ఈశ్వర్ పాండేకి చోటు దక్కలేదు. దీంతో టీమిండియా నుంచి అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాలనుకున్న అతడి కల కలగానే మిగిలిపోయింది. ఈ నేపథ్యంలో మంగళవారం రిటైర్మెంట్ ప్రకటించాడు ఈ 33 ఏళ్ల మధ్యప్రదేశ్ ఫాస్ట్‌బౌలర్. దేశానికి ఆడాలన్న తన చిరకాల కోరిక నెరవేరకుండానే భారమైన, బాధాతప్త హృదయంతో ఆటకు వీడ్కోలు పలుకుతున్నట్లు వెల్లడించాడు. ఈ క్రమంలో దైనిక్ జాగ్రన్తో మాట్లాడిన ఈశ్వర్ పాండే చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ధోని భాయ్ ఒక్క అవకాశం ఇచ్చి ఉంటే.. ఈ మేరకు ఈశ్వర్ పాండే మాట్లాడుతూ.. ‘‘ఒకవేళ ధోని నాకు ఛాన్స్ ఇచ్చి ఉంటే నా కెరీర్ వేరే విధంగా ఉండేది. అప్పుడు నాకు 23- 24 ఏళ్ల వయసు ఉంటుంది. ఫిట్‌గా కూడా ఉన్నాడు. ఆరోజు ధోని భాయ్ ఒక్క అవకాశం ఇచ్చి ఉంటే... నా దేశం కోసం ఆడే అదృష్టం లభించేది. కచ్చితంగా నన్ను నేను నిరూపించుకునేవాడిని. నా కెరీర్ అసలు వేరేలా ఉండేది’’ అని వ్యాఖ్యానించాడు. అయితే, తన రిటైర్మెంట్ ప్రకటనలో సీఎస్కే యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన ఈశ్వర్ పాండే.. ధోని, స్టీఫెన్ ఫ్లెమింగ్ మార్గదర్శనంలో ఆడటం తనకు ఎంతో తృప్తినిచ్చిందని పేర్కొనడం గమనార్హం. చదవండి: T20 WC 2022: ప్రపంచకప్‌నకు బంగ్లాదేశ్ జట్టు ప్రకటన.. మాజీ కెప్టెన్‌పై వేటు దూసుకొస్తున్న రన్ మెషీన్.. ఆఫ్ఘన్‌పై సెంచరీతో భారీ జంప్ View this post on Instagram A post shared by Ishwar pandey (@ishwar22) -
రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా ఫాస్ట్ బౌలర్
భారత క్రికెట్ జట్టు మాజీ సభ్యుడు, ఐపీఎల్ ఆటగాడు, 33 ఏళ్ల మధ్యప్రదేశ్ ఫాస్ట్ బౌలర్ ఈశ్వర్ పాండే అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ఇన్‌స్టా వేదికగా సోమవారం (సెప్టెంబర్ 12) ప్రకటించాడు. 2014 న్యూజిలాండ్ పర్యటనలో టీమిండియా సభ్యుడిగా ఉన్న ఈశ్వర్ పాండే.. భారత్ తరఫున ఒక్క మ్యాచ్ కూడా ఆడనప్పటికీ, ఫస్ట్ క్లాస్ క్రికెట్, ఐపీఎల్ ద్వారా పాపులర్ అయ్యాడు. ఈశ్వర్ 2014 ఐపీఎల్ సీజన్లో ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఆ సీజన్లో సీఎస్కే అతన్ని 1.5 కోట్లకు కొనుగోలు చేసింది. ఐపీఎల్లో 25 మ్యాచ్‌ల్లో 18 వికెట్లు పడగొట్టిన ఈశ్వర్.. 2013, 2016 సీజన్లలో పూణే జట్టుకు ఆడాడు. ఈశ్వర్ 2012-13 రంజీ సీజన్లో లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. కెరీర్ మొత్తంలో 75 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు, 58 లిస్ట్-ఏ మ్యాచ్‌లు, 71 టీ20లు ఆడిన ఈశ్వర్.. 394 వికెట్లు (263, 63, 68) సాధించాడు. అప్పట్లో ధోని ఈశ్వర్‌కు వరుస అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించాడు. అయితే పూర్తిగా ఫామ్ కోల్పోయిన అతను క్రమంగా ఐపీఎల్ నుంచి కనుమరుగయ్యాడు. -
ఈశ్వర్ పాండే హ్యాట్రిక్
వడోదర:ముస్తాక్ అలీ ట్వంటీ 20 ట్రోఫీలో మధ్యప్రదేశ్ పేస్ బౌలర్ ఈశ్వర్ పాండే హ్యాట్రిక్ నమోదు చేశాడు. గ్రూప్-సిలో భాగంగా ఆంధ్రతో జరిగిన మ్యాచ్ లో పాండే ఈ ఘనతను అందుకున్నాడు. ఆంధ్ర కోల్పోయిన తొలి మూడు వికెట్లను పాండే తన ఖాతాలో వేసుకుని హ్యాట్రిక్ సాధించాడు. పాండే మూడో ఓవర్ ను అందుకుని ఆ ఓవర్ మూడో బంతికి ఆంధ్ర కెప్టెన్ భరత్(9) ను పెవిలియన్ కు పంపగా, ఆ తరువాత వరుస బంతుల్లో ప్రశాంత్ , శ్రీకాంత్‌లను అవుట్ చేశాడు. ఓవరాల్ గా 20 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లను సాధించిన పాండే జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. వడోదరలోని రిలయన్స్ స్టేడియంలో మధ్యప్రదేశ్ తో జరిగిన మ్యాచ్ లోతొలుత బ్యాటింగ్ చేసిన ఆంధ్ర నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసింది. ఆంధ్ర టాపార్డర్ లో భరత్(9),ప్రశాంత్(3), శ్రీకాంత్(9), ప్రదీప్(0), అశ్విన్ హెబర్(15) ఘోరంగా విఫలం చెందడంతో జట్టు వంద మార్కులు అంకెను కూడా చేరలేదు. అనంతరం స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన మధ్యప్రదేశ్ 18.2 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. మధ్యప్రదేశ్ ఆటగాళ్లలో హర్ ప్రీత్ సింగ్(40 నాటౌట్) రాణించగా, సహాని(22), ధలివాల్(25 నాటౌట్)లు విజయంలో సహకరించారు. -
ఒప్పించి మెప్పించాడు
తండ్రి సైనికుడు... కొడుకు క్రమశిక్షణతో బాగా చదివి వృద్ధిలోకి రావాలన్నదే ఆయన ఆకాంక్ష. కుర్రాడు కూడా అదే ఆలోచనతో 12వ తరగతి వరకు... ఆటలంటూ తిరగకుండా బుద్ధిగా చదువుకున్నాడు. అయితే సరదాగా స్నేహితులతో కలిసి వెళ్లిన ఒక బౌలింగ్ ట్రయల్స్ కార్యక్రమం అతని జీవితాన్ని మార్చేసింది. ఐదేళ్ల లోపే రాష్ట్ర క్రికెట్ జట్టుకు, తాజాగా భారత టీమ్‌లోకి ఎంపికైన ఆ కుర్రాడే ఈశ్వర్ చంద్ పాండే. మధ్య ప్రదేశ్‌కు చెందిన ఈ 6.2 అడుగుల ఎత్తున్న పేసర్ నేపథ్యం, క్రికెటర్‌గా మారిన వైనం ఆసక్తికరం. ముంబై: న్యూజిలాండ్‌లో పర్యటించే భారత జట్టును ప్రకటించగానే చాలామందిని ఆశ్చర్యపరిచిన పేరు ఈశ్వర్ పాండే. గత సీజన్లో రంజీల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా గుర్తింపు ఉన్నా... అటు టెస్టుల్లో, ఇటు వన్డేల్లోనూ భారత జట్టుకు ఎంపిక కావడం ఆశ్చర్యకరమే. అసలు ఈశ్వర్ పాండే నేపథ్యమే ఆసక్తికరం. సాధారణంగా భారతదేశంలో ఎవరైనా పిల్లలు కెరీర్‌గా క్రికెట్‌ను ఎంచుకుంటానంటే తల్లిదండ్రులు సంతోషించే పరిస్థితి. కానీ ఈశ్వర్ తండ్రి మాత్రం ఆటలకు ‘నో’ అన్నారు. బుద్దిగా చదువుకుని ఏదో ఒక మంచి ఉద్యోగంలో చేరమని సూచించారు. ఓ వైపు మనసు క్రికెట్ వైపు లాగుతున్నా... తండ్రి మాటను కాదనలేని పరిస్థితి. క్లాసులో సైన్స్ పాఠాలు వింటున్నా... మనసు మాత్రం క్రికెట్ కోచింగ్ కావాలంది. భారత స్వాతంత్య్ర దినోత్సవం నాడే పుట్టిన పాండే... మొదట్లో స్నేహితులతో సరదాగా టెన్నిస్‌బాల్‌తో క్రికెట్ ఆడే వాడు. 12వ తరగతి పూర్తయ్యాక వేసవి సెలవుల్లో ఓ స్నేహితుడితో కలిసి సమ్మర్ క్యాంప్‌కు వెళ్లాడు. అక్కడ తొలిసారి ‘లెదర్ బంతి’తో బౌలింగ్ చేశాడు. పూర్తి స్థాయిలో క్రికెట్ ఆడాలని కోరిక ఉన్నా తండ్రి ఏమంటారో అనే సందేహం ఓ వైపు. ఈలోగా ఈశ్వర్ నైపుణ్యాన్ని యూనివర్శిటీ కోచ్ అరిల్ ఆంథోనీ గుర్తించారు. అండర్-19 స్థాయిలో క్రికెట్ ఆడే అవకాశం కల్పించారు. ఈ దశలో ఈశ్వర్ తొలిసారి తన తండ్రిని ఒప్పించే ప్రయత్నం చేశాడు. ‘నేను ఆర్మీలో చేరాలని నాన్న పట్టుపట్టకపోయినా, ఒక మంది ఉద్యోగం సాధించాలని మాత్రం చెప్పేవారు. అందుకే క్రికెటర్ అయ్యేందుకు ఆయన ససేమిరా అన్నారు’ అని పాండే ఆ రోజులను గుర్తు చేసుకున్నాడు. చివరకు ఈశ్వర్ తండ్రిని ఒప్పించే బాధ్యత కూడా ఆంథోనీయే తీసుకున్నారు. ఒక్కసారి ఇంట్లో గ్రీన్ సిగ్నల్ వచ్చాక ఈశ్వర్ రెట్టింపు కష్టపడ్డాడు. కట్ చేస్తే... ఐదే సంవత్సరాల్లో మధ్య ప్రదేశ్ జట్టులోకి వచ్చి ఫస్ట్‌క్లాస్ క్రికెట్ ఆడాడు. ఫాస్ట్ బౌలర్‌గా... ‘నా దృష్టిలో బ్యాటింగ్‌కంటే బౌలింగ్ చేయడం చాలా బాగా అనిపించింది. బౌలింగ్‌ను నేను బాగా ఎంజాయ్ చేస్తాను. అందుకే ప్రొఫెషనల్‌గా ఆ వైపు మళ్లాను’ అని అతను తన ఆరంభాన్ని గుర్తు చేసుకున్నాడు. పాండే పేసర్‌గా ఎదగడంలో చాలా మంది పాత్ర ఉంది. అతడిని మరింత మెరుగైన బౌలర్‌గా తీర్చి దిద్దేందుకు మాజీ క్రికెటర్ అమయ్ ఖురాసియా... ఎం.ఆర్.ఎఫ్ పేస్ ఫౌండేషన్‌లో చేర్పించారు. ‘ఖురాసియా చలవతో నేను ఎం.ఆర్.ఎఫ్. ఫౌండేషన్‌కు వెళ్లాను. అక్కడ డెన్నిస్ లిల్లీతో పాటు... నేను అభిమానించే మెక్‌గ్రాత్ నా లోపాలు సరిదిద్దారు. ఇక పుణే జట్టు బౌలింగ్ కోచ్ అలన్ డొనాల్డ్ కూడా నాకు ఎంతో విలువైన సూచనలిచ్చారు’ అని పాండే చెప్పాడు. భవిష్యత్తుపై గురి... తొలి రెండు రంజీ సీజన్లలోనే ఆకట్టుకున్న ఈశ్వర్ పాండే 2012-13 సీజన్లో అత్యధిక వికెట్లు (48) తీసిన బౌలర్‌గా అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు. దీంతో పుణే జట్టులో ఐపీఎల్ ఆడే అవకాశం లభించింది. ఆ తర్వాత ఇండియా ‘ఎ’ జట్టు సభ్యుడిగా దక్షిణాఫ్రిలో పర్యటించిన పాండే... రెండు ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో, లిస్ట్ ఎ మ్యాచ్‌ల్లో 11 చొప్పున వికెట్లు పడగొట్టాడు. ఆ ప్రదర్శనే అతనికి జాతీయ టెస్టు, వన్డే జట్టులో చోటు కల్పించింది. ‘చాలా మంది బౌలర్లు కలలు గనే న్యూజిలాండ్ గడ్డపై తొలి సిరీస్ ఆడనుండటం నాకు కలిసొస్తుందనే నమ్ముతున్నా. జహీర్ మార్గదర్శకత్వం కూడా ఆశిస్తున్నా. ప్రస్తుతం 130-135 కిలో మీటర్ల వేగంతో బౌలింగ్ చేస్తున్నాను. వేగంకంటే కూడా నా స్వింగ్‌ను మెరుగు పర్చుకోవడంపైనే దృష్టి పెట్టా’ అని పాండే చెప్పాడు. 24 ఏళ్ల ఈశ్వర్, కివీస్ సిరీస్‌లో సత్తా చాటితే భారత పేస్ బౌలింగ్ మరింత పదునెక్కడం ఖాయం.