ఒప్పించి మెప్పించాడు | I didn't lose hope, knew my time would come: Ishwar Pandey | Sakshi
Sakshi News home page

ఒప్పించి మెప్పించాడు

Published Tue, Jan 7 2014 2:07 AM | Last Updated on Mon, Oct 8 2018 3:28 PM

ఈశ్వర్ పాండే - Sakshi

ఈశ్వర్ పాండే

తండ్రి సైనికుడు...
 కొడుకు క్రమశిక్షణతో బాగా చదివి వృద్ధిలోకి రావాలన్నదే ఆయన ఆకాంక్ష. కుర్రాడు కూడా అదే ఆలోచనతో 12వ తరగతి వరకు... ఆటలంటూ తిరగకుండా బుద్ధిగా చదువుకున్నాడు. అయితే సరదాగా స్నేహితులతో కలిసి వెళ్లిన ఒక బౌలింగ్ ట్రయల్స్ కార్యక్రమం అతని జీవితాన్ని మార్చేసింది. ఐదేళ్ల లోపే రాష్ట్ర క్రికెట్ జట్టుకు, తాజాగా భారత టీమ్‌లోకి ఎంపికైన ఆ కుర్రాడే ఈశ్వర్ చంద్ పాండే. మధ్య ప్రదేశ్‌కు చెందిన ఈ 6.2 అడుగుల ఎత్తున్న పేసర్ నేపథ్యం, క్రికెటర్‌గా మారిన వైనం ఆసక్తికరం.
 
 ముంబై: న్యూజిలాండ్‌లో పర్యటించే భారత జట్టును ప్రకటించగానే చాలామందిని ఆశ్చర్యపరిచిన పేరు ఈశ్వర్ పాండే. గత సీజన్‌లో రంజీల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా గుర్తింపు ఉన్నా... అటు టెస్టుల్లో, ఇటు వన్డేల్లోనూ భారత జట్టుకు ఎంపిక కావడం ఆశ్చర్యకరమే. అసలు ఈశ్వర్ పాండే నేపథ్యమే ఆసక్తికరం.

సాధారణంగా భారతదేశంలో ఎవరైనా పిల్లలు కెరీర్‌గా క్రికెట్‌ను ఎంచుకుంటానంటే తల్లిదండ్రులు సంతోషించే పరిస్థితి. కానీ ఈశ్వర్ తండ్రి మాత్రం ఆటలకు ‘నో’ అన్నారు. బుద్దిగా చదువుకుని ఏదో ఒక మంచి ఉద్యోగంలో చేరమని సూచించారు. ఓ వైపు మనసు క్రికెట్ వైపు లాగుతున్నా... తండ్రి మాటను కాదనలేని పరిస్థితి. క్లాసులో సైన్స్ పాఠాలు వింటున్నా... మనసు మాత్రం క్రికెట్ కోచింగ్ కావాలంది.


 భారత స్వాతంత్య్ర దినోత్సవం నాడే పుట్టిన పాండే... మొదట్లో స్నేహితులతో సరదాగా టెన్నిస్‌బాల్‌తో క్రికెట్ ఆడే వాడు. 12వ తరగతి పూర్తయ్యాక వేసవి సెలవుల్లో ఓ స్నేహితుడితో కలిసి సమ్మర్ క్యాంప్‌కు వెళ్లాడు. అక్కడ తొలిసారి ‘లెదర్ బంతి’తో బౌలింగ్ చేశాడు. పూర్తి స్థాయిలో క్రికెట్ ఆడాలని కోరిక ఉన్నా తండ్రి ఏమంటారో అనే సందేహం ఓ వైపు. ఈలోగా ఈశ్వర్ నైపుణ్యాన్ని యూనివర్శిటీ కోచ్ అరిల్ ఆంథోనీ గుర్తించారు. అండర్-19 స్థాయిలో క్రికెట్ ఆడే అవకాశం కల్పించారు.

ఈ దశలో ఈశ్వర్ తొలిసారి తన తండ్రిని ఒప్పించే ప్రయత్నం చేశాడు. ‘నేను ఆర్మీలో చేరాలని నాన్న పట్టుపట్టకపోయినా, ఒక మంది ఉద్యోగం సాధించాలని మాత్రం చెప్పేవారు. అందుకే క్రికెటర్ అయ్యేందుకు ఆయన ససేమిరా అన్నారు’ అని పాండే ఆ రోజులను గుర్తు చేసుకున్నాడు. చివరకు ఈశ్వర్ తండ్రిని ఒప్పించే బాధ్యత కూడా ఆంథోనీయే తీసుకున్నారు. ఒక్కసారి ఇంట్లో గ్రీన్ సిగ్నల్ వచ్చాక ఈశ్వర్ రెట్టింపు కష్టపడ్డాడు. కట్ చేస్తే... ఐదే సంవత్సరాల్లో మధ్య ప్రదేశ్ జట్టులోకి వచ్చి ఫస్ట్‌క్లాస్ క్రికెట్ ఆడాడు.
 ఫాస్ట్ బౌలర్‌గా...
 ‘నా దృష్టిలో బ్యాటింగ్‌కంటే బౌలింగ్ చేయడం చాలా బాగా అనిపించింది. బౌలింగ్‌ను నేను బాగా ఎంజాయ్ చేస్తాను. అందుకే ప్రొఫెషనల్‌గా ఆ వైపు మళ్లాను’ అని అతను తన ఆరంభాన్ని గుర్తు చేసుకున్నాడు. పాండే పేసర్‌గా ఎదగడంలో చాలా మంది పాత్ర ఉంది. అతడిని మరింత మెరుగైన బౌలర్‌గా తీర్చి దిద్దేందుకు మాజీ క్రికెటర్ అమయ్ ఖురాసియా... ఎం.ఆర్.ఎఫ్ పేస్ ఫౌండేషన్‌లో చేర్పించారు. ‘ఖురాసియా చలవతో నేను ఎం.ఆర్.ఎఫ్. ఫౌండేషన్‌కు వెళ్లాను. అక్కడ డెన్నిస్ లిల్లీతో పాటు... నేను అభిమానించే మెక్‌గ్రాత్ నా లోపాలు సరిదిద్దారు. ఇక పుణే జట్టు బౌలింగ్ కోచ్ అలన్ డొనాల్డ్ కూడా నాకు ఎంతో విలువైన సూచనలిచ్చారు’ అని పాండే చెప్పాడు.
 భవిష్యత్తుపై గురి...
 తొలి రెండు రంజీ సీజన్లలోనే ఆకట్టుకున్న ఈశ్వర్ పాండే 2012-13 సీజన్‌లో అత్యధిక వికెట్లు (48) తీసిన బౌలర్‌గా అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు. దీంతో పుణే జట్టులో ఐపీఎల్ ఆడే అవకాశం లభించింది. ఆ తర్వాత ఇండియా ‘ఎ’ జట్టు సభ్యుడిగా దక్షిణాఫ్రిలో పర్యటించిన పాండే... రెండు ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో, లిస్ట్ ఎ మ్యాచ్‌ల్లో 11 చొప్పున వికెట్లు పడగొట్టాడు. ఆ ప్రదర్శనే అతనికి జాతీయ టెస్టు, వన్డే జట్టులో చోటు కల్పించింది.

‘చాలా మంది బౌలర్లు కలలు గనే న్యూజిలాండ్ గడ్డపై తొలి సిరీస్ ఆడనుండటం నాకు కలిసొస్తుందనే నమ్ముతున్నా. జహీర్ మార్గదర్శకత్వం కూడా ఆశిస్తున్నా. ప్రస్తుతం 130-135 కిలో మీటర్ల వేగంతో బౌలింగ్ చేస్తున్నాను. వేగంకంటే కూడా నా స్వింగ్‌ను మెరుగు పర్చుకోవడంపైనే దృష్టి పెట్టా’ అని పాండే చెప్పాడు. 24 ఏళ్ల ఈశ్వర్, కివీస్ సిరీస్‌లో సత్తా చాటితే భారత పేస్ బౌలింగ్ మరింత పదునెక్కడం ఖాయం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement