Islamic Terrorists
-
ప్రధాని నరేంద్ర మోదీని చంపేందుకు కుట్ర
-
ప్రధాని మోదీ హత్యకు కుట్ర?.. ఇద్దరు అనుమానిత ఉగ్రవాదుల అరెస్ట్
పాట్నా: ప్రధానమంత్రి నరేంద్రమోదీ హత్యకు పన్నిన కుట్రను బిహార్ పోలీసులు భగ్నం చేశారు. పాట్నాలో మోదీని లక్ష్యంగా చేసుకొని కుట్ర పన్నిన ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 2047 నాటికి భారత్‌ను ఇస్లామిక్ దేశంగా మార్చేందుకు ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నట్లు గుర్తించారు. అంతేగాక జూలై 12న మోదీ బిహార్ పర్యటన సందర్భంగా ఆయన్ను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు కుట్ర జరిగినట్లు వెల్లడించారు. అరెస్ట్ చేసిన వారిని జార్ఖండ్ రిటైర్డ్ పోలీసు అధికారి మహ్మద్ జల్లావుద్దీన్, అథర్ పర్వేజ్‌గా పోలీసులు పేర్కొన్నారు. వీరికి పీఎఫ్ఐతో లింకులు ఉన్నట్లు గుర్తించారు. అనుమానిత ఉగ్రవాదులు ప్రధాని పర్యటనకు 15 రోజుల ముందు పుల్వారీ షరీఫ్‌లో శిక్షణ పొందినట్లు పోలీసులు కనుగొన్నారు. జూలై 6,7 తేదీల్లో మోదీ టార్గెట్‌గా వ్యూహాత్మక సమావేశాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. దీంతో ఉగ్రవాదుల ఫుల్వారీ షరీఫ్ కార్యాలయంలో బీహార్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పోలీసులు పలు నేరారోపణ డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. వాటిలోని ఒక దాంట్లో ‘2047 వరకు ఇండియాను ఇస్లామిక్ ఇండియాగా మార్చాలి’ అని ఉంది. వీటితోపాటు 25 పీఎఫ్ఐ కరపత్రాలను స్వాధీనం చేసుకున్నారు. చదవండి: అన్సారీది దేశద్రోహం.. మాజీ ఉపరాష్ట్రపతిపై బీజేపీ తీవ్ర ఆరోపణలు పాట్నాలోని ఫుల్వారీ షరీఫ్ ప్రాంతంలో ఉగ్రవాద కదిలక గురించి ఇంటెలిజెన్స్ బ్యూరోకి సమాచారం అందింది. అనంతరం పోలీసులు, కేంద్ర ఏజెన్సీలు జూలై 11న నయా తోలా ప్రాంతంలో దాడి చేసి అనుమానిత ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వీరిద్దరూ పాకిస్థాన్, బంగ్లాదేశ్, టర్కీతో సహా పలు ఇస్లామిక్ దేశాల నుంచి దేశంలో ఉంటూ దేశ వ్యతిరేక ప్రచారాలు చేసేందుకు డబ్బును పొందేవారని దర్యాప్తులో తేలింది. -
జోర్డాన్‌లో సంక్షోభం
చెదురు మదురుగా ఎప్పుడైనా జరిగే నిరసన ప్రదర్శనలు తప్ప ఇతర అరబ్ దేశాలతో పోలిస్తే గత అయిదు దశాబ్దాలుగా ప్రశాంతంగా, సుస్థిరంగా వుంటున్న జోర్డాన్‌లో ముసలం పుట్టింది. మాజీ యువరాజు హమ్జా బిన్ హుసేన్ ‘విదేశీ శక్తుల’తో కుమ్మక్కై ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి కుట్ర పన్నారని, దాన్ని సకాలంలో గుర్తించి అడ్డుకున్నామని జోర్డాన్ ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు సంబంధించి 20 మందిని అరెస్టు చేశామని తెలిపింది. అయితే మాజీ యువరాజు అందులో లేరని ప్రభుత్వం అంటుండగా, తనను గృహ నిర్బంధంలో వుంచారని హమ్జా ఆరోపిస్తున్నాడు. జోర్డాన్‌లో హఠాత్తుగా సమస్యలు పుట్టుకురావటం... అది కూడా అంతఃపుర కుట్ర కావటం అమెరికాను కల వరపెట్టింది. దాంతోపాటు జోర్డాన్‌కు సన్నిహితంగా వుండే ఈజిప్టు, సౌదీ అరేబియాలు ఆందోళన పడుతున్నాయి. ఇజ్రాయెల్‌కు సైతం జోర్డాన్ పరిణామాలు ఇబ్బందికరంగానే వున్నాయి. అమెరి కాకు జోర్డాన్ మొదటినుంచీ మిత్ర దేశం. అరబ్ దేశాల్లో ఇజ్రాయెల్ ఆవిర్భావం తర్వాత దాన్ని మొట్టమొదటగా గుర్తించింది జోర్డానే. పశ్చిమాసియాలో ఇజ్రాయెల్, అరబ్ దేశాల మధ్య చెలిమి కుదర్చటంలో అది ఎంతో దోహదపడింది. ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) ఉగ్రవాదులు ఇరాక్, సిరియాల్లో సృష్టించిన బీభత్సాన్ని ఎదుర్కొనడానికి, మొత్తంగా అరబ్ దేశాల్లో సమస్యలు ఉత్పన్నమైనప్పుడు జోర్డాన్నుంచే అమెరికా అంతా చక్కబెట్టింది. పైగా జోర్డాన్‌లో దానికి కీలకమైన సైనిక స్థావరం వుంది. కనుక అక్కడ యధాతథ స్థితి కొనసాగకపోతే అమెరికా సహజంగానే కలవరపడుతుంది. ప్రశాంతంగా ఉండే జోర్డాన్‌లో చిచ్చు ఎందుకు రగిలింది? కరోనా మహమ్మారి చుట్టుముట్టాక ఈ పరిస్థితి ఏర్పడింది. దాన్నుంచి బయటపడటానికి లాక్‌డౌన్‌తోసహా ప్రభుత్వం తీసుకున్న అనేక చర్యలు వివిధ వర్గాల్లో అసంతృప్తిని రగిల్చాయి. ముఖ్యంగా ఉపాధ్యాయుల సమ్మె ఒక సవాలుగా మారింది. లాక్డౌన్ వంకన జీతాలకు కోత పెడుతున్నారని, నిరసనకు కూడా చోటీయడం లేదని ఉపాధ్యాయులు ఆరోపించారు. భావప్రకటనా స్వేచ్ఛను అడ్డుకుంటున్నారంటూ విపక్షాలు విరు చుకుపడ్డాయి. ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తూ యువత రోడ్డెక్కారు. జీతాలు కోత పెట్టడం విరమించుకోవాలని, అధిక ధరలను నియంత్రించాలని ఉద్యమాలు బయల్దేరాయి. జోర్డాన్‌కు ఇదంతా కొత్త. దశాబ్దం క్రితం అరబ్ దేశాలను ప్రజాస్వామిక ఉద్యమాలు ఊపిరాడ నీయకుండా చేసినప్పుడు ఆ దేశం చెక్కుచెదరలేదు. ఇతర దేశాల మాదిరిగా రాజు అబ్దుల్లా వ్యవహరించక పోవటమే ఇందుకు కారణం. ఆ సమయంలో ఆయన తన అవసరార్థం విశాల దృక్పథాన్ని ప్రద ర్శించారు. నిరసనలు తమ దేశం తాకకముందే పాలనాపరమైన సంస్కరణలు తీసుకొస్తున్నట్టు ప్రక టించారు. రాజ్యాంగంలో అనేక మార్పులు తీసుకురావటం మొదలుపెట్టారు. భిన్న తెగలకు పార్లమెంటులో వారి జనాభా నిష్పత్తి ప్రకారం స్థానాలు కేటాయించి 2016లో ఎన్నికలు నిర్వహిం చారు. అప్పటికే పొరుగునున్న సిరియాలో ప్రజాస్వామిక ఉద్యమంపై అక్కడి ప్రభుత్వం ఉక్కు పాదం మోపడంతో ఆ దేశం నుంచి 14 లక్షలమంది శరణార్థులు వచ్చిపడ్డారు. ఆ వెంటనే ఐఎస్ ఉగ్రవాదుల బెడద మొదలైంది. ఇన్నిటిమధ్యనే కొత్త పార్లమెంటుకు సజావుగా ఎన్నికలు నిర్వహిం చగలిగారు. అయితే కరోనా జోర్డాన్‌ను ఆర్థికంగా కుంగదీసింది. పర్యవసానంగా అన్ని వర్గాల్లో అసంతృప్తి పెరిగింది. ఈ నేపథ్యంలోనే అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. దీన్నంతటినీ తనకు అనుకూలంగా మలుచుకునేందుకు మాజీ యువరాజు హమ్జా ప్రయత్నించటమే తాజా పరిణా మాలకు మూలం. అవినీతిపై నిలదీసినందుకే తనను గృహ నిర్బంధంలో వుంచారని హమ్జా ఒక వీడియో సందేశం ద్వారా తెలిపారు. ఈ సందేశం నిజానికి జోర్డాన్ ప్రజల కోసం కాదు... అమెరికానుద్దేశించి రూపొందించిందే. జోర్డాన్‌కు సహజ వనరులు అతి స్వల్పం. ఆఖరికి మంచినీరు సైతం అది కొనుక్కోవాల్సిందే. అయితే అత్యంత విశ్వసనీయమైన దేశం గనుక దానికి అమెరికా నిధులు పోటెత్తుతాయి. అమెరికా విదేశీ సాయంకింద భారీగా సొమ్ము పొందే దేశాల్లో జోర్డాన్ ఒకటి. నిరుడు 190 కోట్ల డాలర్ల సాయం అందిందని ఒక అంచనా. సైన్యానికి ఆయుధాలు సమకూర్చటం, శిక్షణ అందించటం... నిధులు ఇవ్వటం అమెరికాకు రివాజు. అక్కడున్న తన సైనిక స్థావరంలో అరబ్ దేశాల సైన్యానికి అది ఏడాది పొడవునా శిక్షణనిస్తుంది. ఒకపక్క రాచరికం, వంశపారంపర్య పాలన సాగిస్తూనే దానికి ప్రజాస్వామ్యం ముసు గేయటం... జనం మౌలిక సమస్యల పరిష్కారంలో వైఫల్యం ఇప్పుడు జోర్డాన్‌ను పీడిస్తున్నాయి. ప్రస్తుత రాజు అబ్దుల్లా 1999లో స్వయంగా తన సవతి సోదరుడు హమ్జాను యువరాజుగా ప్రకటించారు. కానీ 2004లో దాన్ని రద్దుచేసి, తన కుమారుడు హుస్సేనీకి కట్టబెట్టారు. అప్పటి నుంచీ హమ్జా సమయం కోసం ఎదురుచూస్తున్నాడు. కరోనా అనంతర సంక్షోభం అతనికి అందివచ్చింది. ప్రజాస్వామిక హక్కులు సాధారణ ప్రజానీకానికి ఎప్పుడూ పెద్దగా ఉపయోగ పడింది లేదుగానీ... రాజకుటుంబంలో ప్రస్తుత ఆధిపత్య పోరుకు అవి తోడ్పడ్డాయి. జోర్డాన్ రాజకుటుంబంలో విభేదాలు పెరిగితే అక్కడ అసమ్మతి, ఉగ్రవాదం మరింత ముదురుతాయని, అరబ్ ప్రపంచంలో అది కొత్త సమస్యలకు దారితీయొచ్చని అమెరికా ఆందోళన. ప్రజలకు ప్రాతి నిధ్యం వహించాల్సిన ప్రభుత్వం అగ్రరాజ్యం చేతిలో కీలుబొమ్మగా వుండటం, ప్రజాస్వామ్యం అడు గంటడం పర్యవసానాలు ఇలాగే వుంటాయి. -
నిషేధంపై తగ్గేది లేదు
కోర్టులో మాదే విజయం: ట్రంప్ సర్కారు ట్రంప్ ఉత్తర్వులపై అప్పీల్ కోర్టు తీర్పు నేపథ్యంలో ఉత్కంఠ బుధవారం ఉదయం తీర్పు వెలువడే అవకాశం(భారత కాలమానం) వాషింగ్టన్/లండన్: ట్రావెల్ బ్యాన్పై వెనక్కి తగ్గేది లేదని ట్రంప్ సర్కారు తేల్చి చెప్పింది. కోర్టులో విజయం తమదేనంటూ ధీమా వ్యక్తం చేసింది. అమెరికా ప్రయోజనాల కోసమే ఏడు ముస్లిం ఆధిక్య దేశాల నుంచి పౌరుల రాకపై అధ్యక్షుడు ట్రంప్ నిషేధం విధించారంటూ వైట్‌హౌస్ మంగళవారం మరోసారి వివరణిచ్చింది. ‘న్యాయం అధ్యక్షుడి వైపే ఉంది. రాజ్యాంగం కూడా ట్రంప్‌కు అనుకూలంగా ఉంది. అమెరికా ప్రజల రక్షణ కోసం, దేశ ప్రయోజనాల్ని ఆశించి విశాల దృక్పథంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కేసులో విజయం సాధిస్తామనే నమ్మకంతో ఉన్నాం’ అని వైట్‌హౌస్ మీడియా కార్యదర్శి సీన్ స్పైసర్ విలేకరుల సమావేశంలో వెల్ల ్లడించారు. ప్రయాణపు నిషేధ ఉత్తర్వుల్ని ఉపసంహరించుకుంటారా? అని ప్రశ్నించగా... ఆ విషయంలో వెనకడుగు వేసేది లేదని స్పష్టం చేశారు. ‘అమెరికా ఈ తీరం నుంచి ఆ తీరం వరకూ కార్యనిర్వాహక ఉత్తర్వులపై ప్రజల నుంచి మద్దతుంది. మేం మొదలుపెట్టిన దాన్ని కొనసాగిస్తాం. దేశ, ప్రజల భద్రతకు అధ్యక్షుడు కట్టుబడి ఉన్నారు’ అని స్పైసర్ పేర్కొన్నారు. దాడులకు ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నారు.. ట్రంప్: మరోవైపు ట్రంప్ మీడియాపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఉగ్ర ముప్పును మీడియా తక్కువ చేసి చూపుతోందని ఆయన ఆరోపించారు. ‘9/11 దాడులు, బోస్టన్, ఆర్లాండో, శాన్ బెర్నార్డినో, యూరప్‌లో దాడులకు పాల్పడిన రీతిలో అమెరికాపై మళ్లీ దాడులకు ఇస్లామిక్ ఉగ్రవాదులు సిద్ధమవుతున్నారు’ అని అన్నారు. అమెరికా సెంట్రల్ కమాండ్ పర్యటన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘పార్లమెంటులో ట్రంప్ ప్రసంగం వద్దు’ బ్రిటన్ పార్లమెంటులో ప్రసంగించేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను ఆహ్వానించకూడదని హౌస్ ఆఫ్ కామన్స్ స్పీకర్ జాన్ బెర్కౌవ్ సోమవారం అన్నారు. జాత్యహంకారం, స్త్రీలపై వివక్షకు తాము వ్యతిరేకమనీ, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. వెంటనే దీనిపై అధికార పార్టీ సభ్యుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. పార్లమెంటులో ప్రసంగించేందుకు ఆహ్వానం అందుకోవడమనేది దానంతట అదే వచ్చే హక్కు కాదనీ, సంపాదించుకోవాల్సిన గౌరవమని జాన్ పేర్కొన్నారు. ట్రంప్ ప్రసంగానికి తాను ముందు నుంచే వ్యతిరేకమనీ, ఏడు ముస్లిం దేశాల వలసదారులపై ట్రంప్ నిషేధం విధించిన తర్వాత ఆ వ్యతిరేకత మరింత పెరిగిందని జాన్ అన్నారు. జాన్ ఈ మాటలు చెబుతున్నప్పుడు సభలోని కొంత మంది సభ్యులు లేచి చప్పట్లు కొట్టారు. జాన్ వ్యాఖ్యలను అధికార కన్జర్వేటివ్ పార్టీ ఎంపీలు తప్పుబట్టారు. తటస్థంగా ఉండాల్సిన స్పీకర్ ఆయన బాధ్యతలను మరిచారనీ, పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని ఎంపీలు ఆరోపించారు. బ్రిటన్ ప్రధాని థెరిసా ట్రంప్‌ను బ్రిటన్ రావాల్సిందిగా ఇటీవలే ఆహ్వానించారు. అప్పీలు కోర్టు తీర్పుపై ఉత్కంఠ ట్రావెల్ బ్యాన్పై నేడు(భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం) శాన్ఫ్రాన్సిస్కో తొమ్మిదో సర్క్యూట్ అప్పీల్ కోర్టులో విచారణ కొనసాగనుంది. గత శుక్రవారం ట్రంప్ ఉత్తర్వులపై సియాటెల్ ఫెడరల్ డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జి తాత్కాలిక నిషేధం విధించారు. ఆ తీర్పుపై ట్రంప్ సర్కారు శాన్ఫ్రాన్సిస్కోలోని అప్పీల్ కోర్టును ఆశ్రయించగా అక్కడ చుక్కెదురైంది. కింది కోర్టు స్టే ఆదేశాల్ని కొట్టివేయాలని, అధ్యక్షుడి ఉత్తర్వులు అమలయ్యేలా అనుమతివ్వాలంటూ చేసుకున్న అప్పీల్‌ను కోర్టు తిరస్కరించింది. పూర్తి స్థాయి విచారణ లేకుండా కింది కోర్టు ఉత్తర్వుల్ని రద్దు చేయలేమంది. నిషేధాన్ని వ్యతిరేకిస్తున్నవారు ప్రభుత్వ అప్పీలుపై స్పందించాలని, అలాగే ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు స్పష్టం చేసింది. అప్పీల్ కోర్టులో ఈ కేసును విచారిస్తున్న ముగ్గురు న్యాయమూర్తుల్లో ఇద్దరు డెమొక్రాట్ల హయాంలో, ఒకరు రిపబ్లికన్ హయాంలో నియమితులవడం తీర్పును ప్రభావితం చేస్తుందని భావిస్తున్నారు. అమెరికాలోకి ఏ దేశాలవారు ప్రవేశించాలన్న అంశంలో అధికారం అధ్యక్షుడికే ఉంటుందని ప్రభుత్వం వాదిస్తుండగా... రాష్ట్రాలు, ఫెడరల్ న్యాయవాదులు మాత్రం ట్రంప్ ఉత్తర్వులు రాజ్యాంగ విరుద్ధమంటూ వాదనలు వినిపిస్తున్నారు. న్యాయపోరాటంలో 127కు చేరిన కంపెనీలు వలస ఉత్తర్వులకు వ్యతిరేకంగా ప్రముఖ దిగ్గజ కంపెనీల న్యాయ పోరాటంలో తాజాగా మరో 31 కంపెనీలు జత కలిశాయి. ఈ మేరకు టెల్సా, స్పేస్ఎక్స్ కంపెనీలతో పాటు కాస్పర్, స్లాక్ వంటి సంస్థలు సోమవారం తొమ్మిదో సర్క్యూట్ అప్పీళ్ల కోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. దీంతో ట్రంప్‌పై న్యాయపోరాటం చేస్తున్న అమెరికన్ కంపెనీల సంఖ్య 127కు చేరింది. అమెరికా తొమ్మిదో సర్క్యూట్ అప్పీళ్ల కోర్టుకు దాదాపు ఆదివారం 97 కంపెనీలు విజ్ఞప్తి చేశాయి. ట్రంప్ ఉత్తర్వులు రాజ్యాంగ విరుద్ధమని, తమ కంపెనీలకు నష్టం కలిగిస్తాయంటూ మైక్రోసాఫ్ట్, యాపిల్, గూగుల్, ఫేస్బుక్, ట్వీటర్, ఈబే, ఇంటెల్ వంటి ప్రముఖ సంస్థలు పిటిషన్లో పేర్కొన్నాయి. ‘నైపుణ్యం కలిగిన వలసదారులు విదేశాల్లో ఎంతో కష్టపడి పనిచేస్తారు. అలాంటి చోట వారు, వారి సహచరులు స్వేచ్ఛగా తిరిగే వాతావరణం ఉండాలి. అలాగే వలసదారుల హోదా అకస్మాత్తుగా తొలగించరనే హామీనివ్వాలి’ అని తమ విజ్ఞప్తిలో కంపెనీలు పేర్కొన్నాయి. టెక్ కంపెనీలతో పాటు జీన్స్ తయారీ సంస్థ లెవీ స్ట్రాస్, ఉబర్, మొజిల్లా, డ్రాప్‌బాక్స్ వంటి సంస్థలు కూడా కోర్టును ఆశ్రయించాయి. నిధుల సేకరణ సమన్వయంలో గూగుల్ ట్రంప్‌కు వ్యతిరేకంగా కంపెనీల న్యాయపోరాటానికి అవసరమైన నిధుల్ని సమకూర్చే పనిని గూగుల్ సమన్వయం చేస్తుంది.. గూగుల్ మాతృసంస్థ ఆల్పాబెట్ ఇన్కార్పొరేషన్ ఈ వ్యవహారాల్ని పర్యవేక్షిస్తోంది.