నిషేధంపై తగ్గేది లేదు | No compramise on the ban sayes Trump | Sakshi
Sakshi News home page

నిషేధంపై తగ్గేది లేదు

Published Wed, Feb 8 2017 2:48 AM | Last Updated on Sat, Aug 25 2018 7:50 PM

నిషేధంపై తగ్గేది లేదు - Sakshi

నిషేధంపై తగ్గేది లేదు

కోర్టులో మాదే విజయం: ట్రంప్‌ సర్కారు

  • ట్రంప్‌ ఉత్తర్వులపై అప్పీల్‌ కోర్టు తీర్పు నేపథ్యంలో ఉత్కంఠ
  • బుధవారం ఉదయం తీర్పు వెలువడే అవకాశం(భారత కాలమానం)

వాషింగ్టన్‌/లండన్‌: ట్రావెల్‌ బ్యాన్‌పై వెనక్కి తగ్గేది లేదని ట్రంప్‌ సర్కారు తేల్చి చెప్పింది. కోర్టులో విజయం తమదేనంటూ ధీమా వ్యక్తం చేసింది. అమెరికా ప్రయోజనాల కోసమే ఏడు ముస్లిం ఆధిక్య దేశాల నుంచి పౌరుల రాకపై అధ్యక్షుడు ట్రంప్‌ నిషేధం విధించారంటూ వైట్‌హౌస్‌ మంగళవారం మరోసారి వివరణిచ్చింది. ‘న్యాయం అధ్యక్షుడి వైపే ఉంది. రాజ్యాంగం కూడా ట్రంప్‌కు అనుకూలంగా ఉంది. అమెరికా ప్రజల రక్షణ కోసం, దేశ ప్రయోజనాల్ని ఆశించి విశాల దృక్పథంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కేసులో విజయం సాధిస్తామనే నమ్మకంతో ఉన్నాం’ అని వైట్‌హౌస్‌ మీడియా కార్యదర్శి సీన్‌ స్పైసర్‌ విలేకరుల సమావేశంలో వెల్ల ్లడించారు. ప్రయాణపు నిషేధ ఉత్తర్వుల్ని ఉపసంహరించుకుంటారా? అని ప్రశ్నించగా... ఆ విషయంలో వెనకడుగు వేసేది లేదని స్పష్టం చేశారు. ‘అమెరికా ఈ తీరం నుంచి ఆ తీరం వరకూ కార్యనిర్వాహక ఉత్తర్వులపై  ప్రజల నుంచి మద్దతుంది. మేం మొదలుపెట్టిన దాన్ని కొనసాగిస్తాం. దేశ, ప్రజల భద్రతకు అధ్యక్షుడు కట్టుబడి ఉన్నారు’ అని స్పైసర్‌ పేర్కొన్నారు.

దాడులకు ఉగ్రవాదులు
ప్రయత్నిస్తున్నారు.. ట్రంప్‌: మరోవైపు ట్రంప్‌ మీడియాపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఉగ్ర ముప్పును మీడియా తక్కువ చేసి చూపుతోందని ఆయన ఆరోపించారు. ‘9/11 దాడులు, బోస్టన్, ఆర్లాండో, శాన్‌ బెర్నార్డినో, యూరప్‌లో దాడులకు పాల్పడిన రీతిలో అమెరికాపై మళ్లీ దాడులకు ఇస్లామిక్‌ ఉగ్రవాదులు సిద్ధమవుతున్నారు’ అని అన్నారు. అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ పర్యటన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

‘పార్లమెంటులో ట్రంప్‌ ప్రసంగం వద్దు’
బ్రిటన్‌ పార్లమెంటులో ప్రసంగించేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను ఆహ్వానించకూడదని హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌ స్పీకర్‌ జాన్‌ బెర్కౌవ్‌ సోమవారం అన్నారు. జాత్యహంకారం, స్త్రీలపై వివక్షకు తాము వ్యతిరేకమనీ, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. వెంటనే దీనిపై అధికార పార్టీ సభ్యుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. పార్లమెంటులో ప్రసంగించేందుకు ఆహ్వానం అందుకోవడమనేది దానంతట అదే వచ్చే హక్కు కాదనీ, సంపాదించుకోవాల్సిన గౌరవమని జాన్‌ పేర్కొన్నారు. ట్రంప్‌ ప్రసంగానికి తాను ముందు నుంచే వ్యతిరేకమనీ, ఏడు ముస్లిం దేశాల వలసదారులపై ట్రంప్‌ నిషేధం విధించిన తర్వాత ఆ వ్యతిరేకత మరింత పెరిగిందని జాన్‌ అన్నారు. జాన్‌ ఈ మాటలు చెబుతున్నప్పుడు సభలోని కొంత మంది సభ్యులు లేచి చప్పట్లు కొట్టారు. జాన్‌ వ్యాఖ్యలను అధికార కన్జర్వేటివ్‌ పార్టీ ఎంపీలు తప్పుబట్టారు. తటస్థంగా ఉండాల్సిన స్పీకర్‌ ఆయన బాధ్యతలను మరిచారనీ, పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని ఎంపీలు ఆరోపించారు. బ్రిటన్‌ ప్రధాని థెరిసా ట్రంప్‌ను బ్రిటన్‌ రావాల్సిందిగా  ఇటీవలే ఆహ్వానించారు.

అప్పీలు కోర్టు తీర్పుపై ఉత్కంఠ
ట్రావెల్‌ బ్యాన్‌పై నేడు(భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం) శాన్‌ఫ్రాన్సిస్కో తొమ్మిదో సర్క్యూట్‌ అప్పీల్‌ కోర్టులో  విచారణ కొనసాగనుంది. గత శుక్రవారం ట్రంప్‌ ఉత్తర్వులపై సియాటెల్‌ ఫెడరల్‌ డిస్ట్రిక్ట్‌ కోర్టు జడ్జి తాత్కాలిక నిషేధం విధించారు. ఆ తీర్పుపై ట్రంప్‌ సర్కారు శాన్‌ఫ్రాన్సిస్కోలోని అప్పీల్‌ కోర్టును ఆశ్రయించగా అక్కడ చుక్కెదురైంది. కింది కోర్టు స్టే ఆదేశాల్ని కొట్టివేయాలని, అధ్యక్షుడి ఉత్తర్వులు అమలయ్యేలా అనుమతివ్వాలంటూ చేసుకున్న అప్పీల్‌ను కోర్టు తిరస్కరించింది. పూర్తి స్థాయి విచారణ లేకుండా కింది కోర్టు ఉత్తర్వుల్ని రద్దు చేయలేమంది. నిషేధాన్ని వ్యతిరేకిస్తున్నవారు ప్రభుత్వ అప్పీలుపై స్పందించాలని, అలాగే ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేయాలని కోర్టు స్పష్టం చేసింది. అప్పీల్‌ కోర్టులో ఈ కేసును విచారిస్తున్న ముగ్గురు న్యాయమూర్తుల్లో ఇద్దరు డెమొక్రాట్ల హయాంలో, ఒకరు రిపబ్లికన్‌ హయాంలో నియమితులవడం తీర్పును ప్రభావితం చేస్తుందని భావిస్తున్నారు. అమెరికాలోకి ఏ దేశాలవారు ప్రవేశించాలన్న అంశంలో అధికారం అధ్యక్షుడికే ఉంటుందని ప్రభుత్వం వాదిస్తుండగా... రాష్ట్రాలు, ఫెడరల్‌ న్యాయవాదులు మాత్రం ట్రంప్‌ ఉత్తర్వులు రాజ్యాంగ విరుద్ధమంటూ వాదనలు వినిపిస్తున్నారు.

న్యాయపోరాటంలో 127కు చేరిన కంపెనీలు
వలస ఉత్తర్వులకు వ్యతిరేకంగా ప్రముఖ దిగ్గజ కంపెనీల న్యాయ పోరాటంలో తాజాగా మరో 31 కంపెనీలు జత కలిశాయి. ఈ మేరకు టెల్సా, స్పేస్‌ఎక్స్‌ కంపెనీలతో పాటు కాస్పర్, స్లాక్‌ వంటి సంస్థలు సోమవారం తొమ్మిదో సర్క్యూట్‌ అప్పీళ్ల కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాయి. దీంతో ట్రంప్‌పై న్యాయపోరాటం చేస్తున్న అమెరికన్‌ కంపెనీల సంఖ్య 127కు చేరింది. అమెరికా తొమ్మిదో సర్క్యూట్‌ అప్పీళ్ల కోర్టుకు దాదాపు ఆదివారం 97 కంపెనీలు విజ్ఞప్తి చేశాయి. ట్రంప్‌ ఉత్తర్వులు రాజ్యాంగ విరుద్ధమని, తమ కంపెనీలకు నష్టం కలిగిస్తాయంటూ మైక్రోసాఫ్ట్, యాపిల్, గూగుల్, ఫేస్‌బుక్, ట్వీటర్, ఈబే, ఇంటెల్‌ వంటి ప్రముఖ సంస్థలు పిటిషన్‌లో పేర్కొన్నాయి. ‘నైపుణ్యం కలిగిన వలసదారులు విదేశాల్లో ఎంతో కష్టపడి పనిచేస్తారు. అలాంటి చోట వారు, వారి సహచరులు స్వేచ్ఛగా తిరిగే వాతావరణం ఉండాలి. అలాగే వలసదారుల హోదా అకస్మాత్తుగా తొలగించరనే హామీనివ్వాలి’ అని తమ విజ్ఞప్తిలో కంపెనీలు పేర్కొన్నాయి. టెక్‌ కంపెనీలతో పాటు జీన్స్‌ తయారీ సంస్థ లెవీ స్ట్రాస్, ఉబర్, మొజిల్లా, డ్రాప్‌బాక్స్‌ వంటి సంస్థలు కూడా కోర్టును ఆశ్రయించాయి.

నిధుల సేకరణ సమన్వయంలో గూగుల్‌
ట్రంప్‌కు వ్యతిరేకంగా కంపెనీల న్యాయపోరాటానికి అవసరమైన నిధుల్ని సమకూర్చే పనిని గూగుల్‌ సమన్వయం చేస్తుంది.. గూగుల్‌ మాతృసంస్థ ఆల్పాబెట్‌ ఇన్‌కార్పొరేషన్‌ ఈ వ్యవహారాల్ని పర్యవేక్షిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement