Ism Book
-
పవన్ 'ఇజమ్' రాసిన వారికైనా అర్ధమవుతుందా?
'పవన్ కళ్యాణ్ కన్నా గొప్ప నాయకుడు', 'జన సేన అనే పేరు శివసేన కంటే వెయిరెట్లు మెరుగు' అంటూ ట్విటర్ లో పవర్ స్టార్ ను ఆకాశానికెత్తేసిన రాంగోపాల్ వర్మ మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. జనసేన సిద్దాంతాలను విశాఖ సభలో 'ఇజమ్' పేరుతో పుస్తకాన్ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే 'ఇజమ్' పుస్తకంపై వర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ పుస్తకం కనీసం రాసిన వారికైనా అర్ధమవుతుందా అని సందేహం వ్యక్తం చేశారు. 'ఇటీవలే 'ఇజమ్' పుస్తకాన్ని చదివాను. ఆ పుస్తకం చదివిన తర్వాత నాకు అనేక సందేహాలు రేకెత్తాయి. 'ఇజమ్' పుస్తకం రాసిన రచయితలకైనా అర్ధమవుతుందా అనే అనుమానం వచ్చింది' అని తాజాగా వర్మ ట్వీట్ చేశారు. అందరికీ అర్ధమయ్యే సులభమైన భాషలో 'ఇజమ్' పుస్తకం పవన్ కళ్యాణ్ తీసుకువస్తారని అనుకుంటున్నాను అని వర్మ ట్విటర్ లో పోస్ట్ చేసిన ఓ సందేశంలో పేర్కోన్నారు. విశాఖపట్నం సభ తర్వాత పవన్ పై వర్మ పెట్టుకున్న భ్రమలు క్రమంగా తొలిగిపోయాని తాజా ట్వీట్ తో అర్ధమవుతోంది. విశాఖలో పవన్ ప్రసంగం విన్న తర్వాత ఏం చేయాలో ఆయనకే క్లారిటీ లేదని పలువర్గాల నుంచి విమర్శలు వినిపించిన సంగతి తెలిసిందే. i tried to read ISM nd I doubt if the writers themselves can understand it..I really wish that Pawan kalyan will release a simpler version— Ram Gopal Varma (@RGVzoomin) April 1, 2014 -
విశాఖలో 'ఇజం' ఆవిష్కరించనున్న పవన్
యూత్ ఫర్ ద నేషన్...ఫైట్ ఫర్ ద నేషన్ అనే నినాదంతో ఈ నెల 27న విశాఖపట్నం నగరంలో బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు జనసేన పార్టీ వెల్లడించింది. ఆదివారం హైదరాబాద్లో జనసేన పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఆ సభలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'ఇజం' పుస్తకాన్ని ఆవిష్కరిస్తారని తెలిపింది. ఆ సభకు 6 లక్షల మంది యువత హాజరవుతారని పేర్కొంది. జనసేన పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు సోమవారం నుంచి ద్విచక్రవాహన ర్యాలీని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు చెప్పింది. జనసేన పార్టీ ఐడియాలజీతో ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఇజం పుస్తకం రాసిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్ జనసేన పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. దేశం నుంచి కాంగ్రెస్ పార్టీని పంపించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆయన ఇటీవల హైదరాబాద్లో జరిగిన పార్టీ ఆవిర్బావ సభలో ప్రకటించిన విషయం విదితమే. రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీ కాంగ్రెస్సేతర పార్టీలతో జత కట్టేందుకు ప్రయత్నిస్తుంది. అందులోభాగంగా శనివారం గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీతో సమావేశమైయ్యారు. -
మరో సంచలనానికి సిద్ధమవుతున్న పవన్
హైదరాబాద్: రాజకీయ పార్టీ పెట్టి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తిన పవన్ కళ్యాణ్ మరో సంచలనానికి సిద్ధమవుతున్నారు. 'ఇజం' పేరుతో పుస్తకాన్ని విడుదల చేసేందుకు ఆయన రెడీ అవుతున్నారు. జనసేన పార్టీ భావజాలంతో పవన్ కళ్యాణ్ ఈ పుస్తకం రాసినట్టు తెలుస్తోంది. తన సన్నిహితుడు రాజు రవితేజతో కలిసి ఈ పుస్తకం రాసినట్టు సమాచారం. దీన్ని ఈనెల 25న విడుదల చేసే అవకాశముంది. మరోవైపు పార్టీ పనుల్లో పవన్ కళ్యాణ్ తీరిక లేకుండా ఉన్నారు. సామాజిక, రాజకీయ ఎజెండాతో ఆయన ముందుకు సాగనున్నారు. పార్టీలో చేరతామంటూ తమకు వేలాది ఫోన్లు వస్తున్నాయని జనసేన పార్టీ కార్యాలయం వెల్లడించింది. అయితే పవన్ కళ్యాణ్ పార్టీ విధి విధానాలు ఏవిధంగా ఉండబోతున్నాయనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరోవైపు ఈనెల 17న బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీతో పవన్ భేటీ అవుతారని వార్తలు వస్తున్నాయి.