
మరో సంచలనానికి సిద్ధమవుతున్న పవన్
హైదరాబాద్: రాజకీయ పార్టీ పెట్టి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తిన పవన్ కళ్యాణ్ మరో సంచలనానికి సిద్ధమవుతున్నారు. 'ఇజం' పేరుతో పుస్తకాన్ని విడుదల చేసేందుకు ఆయన రెడీ అవుతున్నారు. జనసేన పార్టీ భావజాలంతో పవన్ కళ్యాణ్ ఈ పుస్తకం రాసినట్టు తెలుస్తోంది. తన సన్నిహితుడు రాజు రవితేజతో కలిసి ఈ పుస్తకం రాసినట్టు సమాచారం. దీన్ని ఈనెల 25న విడుదల చేసే అవకాశముంది.
మరోవైపు పార్టీ పనుల్లో పవన్ కళ్యాణ్ తీరిక లేకుండా ఉన్నారు. సామాజిక, రాజకీయ ఎజెండాతో ఆయన ముందుకు సాగనున్నారు. పార్టీలో చేరతామంటూ తమకు వేలాది ఫోన్లు వస్తున్నాయని జనసేన పార్టీ కార్యాలయం వెల్లడించింది. అయితే పవన్ కళ్యాణ్ పార్టీ విధి విధానాలు ఏవిధంగా ఉండబోతున్నాయనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరోవైపు ఈనెల 17న బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీతో పవన్ భేటీ అవుతారని వార్తలు వస్తున్నాయి.