iti colleges
-
ఐటీఐ పరీక్షల్లో...మాస్ కాపీయింగ్
అసలు కళాశాల క్లాసులకు రాకుండానే పరీక్షలకు హాజరు కావచ్చు... ఒకవేళ పరీక్షలు రాసే తీరిక కూడా లేకపోయినా మీ స్థానంలో వేరే వారితో పరీక్ష రాయించేస్తారు. ఒకే రోజు మూడు రోజుల పేపర్లు రాసేసుకోవచ్చు... దీనికంతటికి మీరు చేయాల్సిందేమిటంటే.. వారు అడిగినంత చెల్లించడమే. జిల్లాలోని పలు ఐటీఐ కళాశాలల్లో పరీక్షలు జరుగుతున్న తీరు ఇది. సాక్షి ప్రతినిధి, ఏలూరు : సోమవారం ఐటీఐ మొదటి సంవత్సరం విద్యార్థులకు మొదటి సెమిస్టర్, రెండో సంవత్సరం విద్యార్థులకు మూడో సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్నాయి. వీటికి సంబంధించిన ఆన్సర్లు, ప్రాక్టికల్స్ అన్నీ బోర్డు మీద ఇన్స్ట్రక్టర్లు రాస్తుంటే విద్యార్థులు చూసి ఎక్కించేసుకున్నారు. వీరికి 90 నుంచి 95 శాతం మార్కులు గ్యారెంటీ. గణపవరం, నిడమర్రు మండలం బువ్వనపల్లి, ఉంగుటూరు మండలం చేబ్రోలు, తణుకులలో ఐటీఐ కళాశాలలు ఉన్నాయి. ఈ కళాశాలల్లో ఒక్కో దానిలో 300 మంది వరకూ చదువుతున్నట్లు లెక్కల్లో ఉంటుంది. కళాశాలకు హాజరయ్యే వారి సంఖ్య 50కి మించదు. కళాశాలలో ఫర్నీచర్ కూడా 50 నుంచి 60 మందికి సరిపడా మాత్రమే ఉంటుంది. పరీక్షల సమయంలో వేరేచోటి నుంచి తీసుకువచ్చి వేస్తారు. ఐటీఐ అంటే ప్రతి రోజూ కళాశాలకు వెళ్లాలి. ప్రాక్టికల్స్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇదెక్కడా అమలు కాదు. ఇక్కడ జిల్లా నుంచే కాకుండా కృష్ణా, గుంటూరు, తూర్పుగోదావరి జిల్లాల నుంచి వచ్చి చేరే విద్యార్థుల సంఖ్యే ఎక్కువగా ఉంటుంది. ఓసీ విద్యార్థుల వద్ద నుంచి ఫీజు వసూలు చేసినా, బీసీ, ఇతర వెనుకబడిన కులాల విద్యార్థులకు వచ్చే స్కాలర్‌షిప్‌లతో కళాశాలలను నడిపేస్తున్నారు. కళాశాలకు రాని విద్యార్థుల పేరుతో వీరు స్కాలర్షిప్స్ పెడుతున్నారు. ఈ విద్యార్ధుల బ్యాంకు పుస్తకాలు కూడా కళాశాల ప్రిన్సిపల్ వద్దే ఉంటున్నాయి. విద్యార్థుల స్కాలర్షిప్లు బ్యాంకులో క్రెడిట్ అయినప్పుడు విద్యార్థిని బ్యాంకుకు తీసుకువెళ్లి విత్‌డ్రా చేయించి వారు తీసుకుంటారు. కళాశాలకు విద్యార్థులు రాకపోయినా రోజూ వచ్చినట్లుగా అటెండెన్స్‌లో చూపిస్తుంటారు. ఒక్కో సెమిస్టర్ పరీక్షకు ఐదు వేల రూపాయల చొప్పున విద్యార్థుల నుంచి వసూలు చేస్తున్నారు. ఇక్కడ పని చేస్తున్న సిబ్బందికి కూడా సరైన క్వాలిఫికేషన్ ఉండదు. వీరే ఇన్విజిలేటర్లుగా ఉంటారు. నిడమర్రు మండలంలోని ఐటీఐలో గణపవరం జెడ్పీహెచ్ఎస్లో పనిచేసే ఉపాధ్యాయుడే బోధన చేస్తుంటారు. తాను పనిచేసే స్కూల్లో బయోమెట్రిక్ వేసి ఇక్కడ ఉద్యోగం చేస్తుంటారు. పరీక్షలకు రాని విద్యార్థుల పేరుతో వేరేవారు పరీక్షలు రాస్తున్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఇక్కడ సీసీ కెమేరాలు పెట్టినా ఎక్కడా అవి పనిచేయడం లేదు. మూడు రోజులు జరగాల్సిన పరీక్షలు ఒకేరోజున ఏకబిగిన రాయించేశారు. ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ మూడు పరీక్షలు రాయించేశారు. ఆన్సర్లు, ప్రాక్టికల్స్ ఇన్విజిలేటర్లు బోర్డుపైన రాస్తుంటే విద్యార్థులు చూసి ఎక్కించేశారు. రాసేవారికి ఎన్నిమార్కులకు సబ్జెక్టులు ఉంటాయో తెలియని పరిస్థితి. అయితే పరీక్షా ఫలితాలలో ప్రతి ఒక్కరికి 90 నుంచి 95 శాతం రిజల్ట్ తగ్గకుండా వచ్చేలా చూస్తారు. అసలు పరీక్షకే హాజరు కాని వారి వద్ద రూ.50 వేలు తీసుకుని వేరేవారితో పరీక్షలు రాయిస్తున్నట్లు సమాచారం. పరీక్షల సమయంలో హాజరయ్యే ఇన్విజలేటర్, స్క్వాడ్‌కు రోజుకు పది వేల రూపాయల చొప్పున ముట్టచెబుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. టైంటేబుల్ ప్రకారం రేపు పరీక్ష నిర్వహించాల్సి ఉన్నప్పటికీ ఆ పరీక్ష ఇవాళే జరిపేయడంతో రేపు పరీక్ష లేదని విద్యార్థులకు చెప్పారు. పరీక్షల్లో జరుగుతున్న మాస్ కాపీయింగ్‌కు సంబంధించిన ఆధారాలు ‘సాక్షి’ సంపాదించింది. -
ఐటీఐలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
మహబూబ్‌నగర్ విద్యావిభాగం: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలో ఐటీఐలో 2వ విడత ప్రవేశానికి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కన్వీనర్ వేమారెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులకు ఈనెల 11 నుంచి 20వ తేదీలోపు దరకాస్తు చేసుకోవాలని సూచించారు. ఏ కళాశాలలో అభ్యర్థులు ప్రవేశం పొందాలనుకుంటున్నారో ఆ కళాశాలలో మాత్రమే దరఖాస్తులు సమర్పించాలని కోరారు. అన్ని ప్రభుత్వ ఐటిఐలలో ఈనెల 24న కౌన్సిలింగ్ జరుగుతుందని పేర్కొన్నారు. ప్రైవేటు ఐటిఐలలో ప్రవేశం కోసం ఈనెల 27 నుంచి 30వ తేదీ వరకు సంబంధిత ఐటీఐలలో జరుగుతుందని పేర్కొన్నారు. -
మన 'ఐటీఐ'లు నెంబర్ వన్ కావాలి: నాయిని
హైదరాబాద్: దేశంలో ఉన్న ఐటీఐలకంటే మన రాష్ట్రంలోని ఐటీఐలే నం-1 కావాలని, ఆ విధంగా ఐటీఐలను తీర్చిదిద్దాల్సిన బాధ్యత ప్రిన్సిపల్స్‌పై ఉందని హోం, కార్మిక శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డిఅన్నారు. యూసఫ్‌గూడలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైసెస్ (ఎన్‌ఐఎంఎస్‌ఎంఈ)లో సోమవారం రాష్ట్రంలోని ప్రభుత్వ ఐటీఐల ప్రిన్సిపల్స్‌తో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి నాయిని మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వ ఐటీఐలు 60, ప్రైవేట్ ఐటీఐలు 210 ఉన్నాయని, ఏటా 40వేల మంది విద్యార్థులు ప్రభుత్వ ఐటీఐల్లో చేరుతున్నారన్నారు. కొన్ని ప్రభుత్వ ఐటీఐలు అద్దె భవనాల్లో నడుస్తున్నాయని, అలాంటి వాటిని ప్రభుత్వ స్థలాల్లో సొంత భవనాలు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. పట్టణ ప్రాంతాల్లో ఉన్న ఐటీఐలలో ఎక్కువగా ఖాళీ స్థలాలు ఉన్నాయని, అలాంటి వాటిల్లో షాపింగ్ కాంప్లెక్స్‌ల నిర్మాణం చేపడతామన్నారు. తద్వారా ఆర్థిక వనరులు పెరుగుతాయని, ఆ వచ్చే మొత్తాన్ని ఐటీఐల నిర్వహణకే కేటాయిస్తామని మంత్రి పేర్కొన్నారు. స్థానికంగా ఉన్న పరిశ్రమలలో ఏఏ కోర్సులు అవసరమో అలాంటి కోర్సులనే ఐటీఐల్లో నేర్పిస్తే కోర్సు పూర్తి అయిన వెంటనే ఉపాధి దొరికే అవకాశం ఉంటుందన్నారు. ఐటీఐ పూర్తి చేసిన 80 శాతం మంది విద్యార్థులకు ఉద్యోగాలు దొరుకుతున్నాయన్నారు. నగరంలోని మల్లేపల్లి ఐటీఐని మోడల్ ఐటీఐగా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం 10 కోట్లు మంజూరు చేసిందని, మన రాష్ట్రంలో కూడా జిల్లాకు ఒకటి చొప్పున మోడల్ ఐటీఐగా మార్చడానికి కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయను ఆర్థిక సాయం అడిగామని, ఆయన సానుకూలంగా స్పందించారన్నారు. కేంద్ర, రాష్ట్ర నిధులతో ఐటీఐలలో అప్డేట్ మిషనరీని ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. కార్మిక శాఖ కార్యదర్శి హర్‌ప్రీత్‌సింగ్, డెరైక్టర్ నాయక్, డిప్యూటీ డెరైక్ట్ ధర్మరాజ్ ఆధ్వర్యంలోని నిర్వహించిన ఈ రివ్యూ మీటింగ్‌కు రాష్ట్రంలోని ప్రభుత్వ ఐటీఐల ప్రిన్సిపల్స్ పాల్గొన్నారు.