రైతులపై ‘థర్డ్ డిగ్రీ’ దుర్మార్గం
అనంతపురం సెంట్రల్ : విచారణ పేరుతో రైతులపై థర్డ్ డిగ్రీ (పోలీస్ మార్క్ కౌన్సెలింగ్)కు పాల్పడటం దుర్మార్గమైన చర్య అని వైఎస్సార్సీపీ రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అన్నారు. రాప్తాడు మండలం బోగినేపల్లిలో వైఎస్సార్సీపీ సానుభూతిపరులైన రైతులు నారాయణ, శంకర్, మాదన్న, ముత్యాలప్పలు పొలానికి ఎరువులు తోలడం పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని శుక్రవారం పొలంలోనే మద్యం లేకుండా విందు ఏర్పాటు చేసుకున్నారు. ఎవరికీ ఇబ్బంది కలిగించకపోయినా, ఫిర్యాదు ఇవ్వకపోయినా విచారణ పేరుతో రైతులను ఇటుకులపల్లి స్టేషన్‌కు తీసుకుపోయిన సీఐ రాజేంద్రనాథ్ తనదైన శైలిలో ‘కౌన్సిలింగ్’ ఇచ్చారు. ఆదివారం బాధితులను తీసుకొని ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డితో కలిసి తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అనంతపురం డీఎస్పీ మల్లికార్జునవర్మను ఆయన కార్యాలయంలో కలిసి సీఐపై ఫిర్యాదు చేశారు.
ఇటుకలపల్లి సీఐ కూడా అక్కడే ఉండడంతో కొద్దిసేపు వాగ్వాదం చేటు చేసుకుంది. తప్పుచేయకున్నా కౌన్సిలింగ్ ఇస్తారా అంటూ నిలదీశారు. అనంతరం సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డిలు మాట్లాడుతూ రాప్తాడు నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ సానుభూతి పరులే లక్ష్యంగా పోలీసులు కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రామగిరి, రాప్తాడు మండలాల్లో పరిస్థితి మరీ దారుణంగా తయారైందన్నారు. అకారణంగా కౌన్సెలింగ్ పేరుతో భయభ్రాంతులకు గురి చేయడం మంచిది కాదన్నారు. పోలీసులు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జెడ్పీ ఫ్లోర్ లీడర్ వెన్నపూసరవీంద్రరెడ్డి, వైఎస్సార్సీపీ రాప్తాడు మండల కన్వీనర్ రామాంజనేయులు, నాయకులు సత్యనారాయణ, కేశవరెడ్డి, ఓబిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.