ivory possession
-
మోహన్‌లాల్‌కు భారీ షాక్
మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్‌కు అటవీ శాఖ అధికారులు షాక్ ఇచ్చారు. తన ఇంట్లో అక్రమంగా ఏనుగు దంతపు కళాఖండాలు కలిగి ఉన్నారన్న ఆరోపణలపై ఎర్నాకుళంలోని కోర్టులో అతనిపై చార్జిషీట్ దాఖలు చేసింది. పెరుంబవూరులోని జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో శుక్రవారం అటవీ శాఖ ఈ చార్జ్‌షీటు నమోదు చేసింది. కోదనాడ్ రేంజ్‌లోని మేకప్పల ఫారెస్ట్ స్టేషన్లో మోహన్‌లాల్‌పై 2012లో క్రిమినల్ కేసు నమోదైన ఏడు సంవత్సరాల తరువాత ఈ పరిణామం చోటు చేసుకుంది. కేసు నమోదైన అనంతరం ఈ కళాఖండాలను కలిగి వుండేందుకు ధృవీకరణ పొందినట్టు కోర్టుకు తెలిపారు. కె కృష్ణన్ అయ్యర్ అనే వ్యక్తినుంచి 65వేల రూపాయలకు కొనుగోలు చేశానని మోహన్‌లాల్ వివరణ ఇచ్చారు. అయితే అతనికి ఈ అనుమతి ఇవ్వడంలో అవకతవకలు జరిగాయంటూ ఎర్నాకుళంకు చెందిన పౌలోస్ అనే పిటిషనర్ హైకోర్టులో సవాలు చేశారు. దీనిపై స్పందించిన కేరళ ప్రభుత్వం దంతపు కళాఖండాలను ఉంచుకునేందుకు మోహన్‌లాల్‌కు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ (వైల్డ్‌లైఫ్) ఎటువంటి అనుమతి ఇవ్వలేదని కేరళ ప్రభుత్వం ఈ నెల ప్రారంభంలో కోర్టుకు తెలిపింది. దీంతో వన్యప్రాణుల రక్షణ చట్టంలోని సెక్షన్ 39 (3) తో మోహన్‌లాల్‌పై అభియోగాలు మోపవచ్చని హైకోర్టు వ్యాఖ్యానించింది. దీంతో ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేయాల్సిందిగా పిటిషనర్ హైకోర్టును అభ్యర్థించారు. కాగా 2012లో ఆయన ఇంట్లో సోదాలు జరిపిన ఐటీ అధికారులు వీటిని స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో మోహన్‌లాల్‌తో పాటు మరో ఇద్దరిపై కేసు నమోదు చేసిన అటవీ శాఖ అధికారులు దానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ను పెరుంబవూర్‌లోని చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఎదుట దాఖలు చేశారు. భారతీయ వన్య ప్రాణి చట్టంలోని సెషన్ 44(6) కింద కేసు నమోదు చేసి, మోహన్‌లాల్‌ను ప్రధాన నిందితుడుగా చేర్చిన సంగతి తెలిసిందే. -
రైనోలను వేటాడితే మరణ దండనే..
కెన్యా: భూగోళంపై అంతరించి పోతున్న జీవజాతుల జాబితాలోకి ఉత్తర ప్రాంతపు తెలుపు జాతి రైనో చేరింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఒకే ఒక మగ రైనో ‘సుడాన్’ (45) గత నెలలో అనారోగ్యంతో కెన్యాలోని ఓల్ పెజెటా జాతీయ పార్కులో మరణించిన సంగతి తెలిసిందే. ఏనుగులు, రైనోల దంతాలకు అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. అరుదైన జాతికి చెందిన ఈ తెల్ల రైనోల దంతాల కోసం స్మగ్లర్లు విచ్చల విడిగా వేటాడటంతో వీటి సంఖ్య తగ్గిపోయింది. ఇందుకోసం కెన్యా ప్రభుత్వం కొత్త చట్టం తీసుకొచ్చింది. రైనోలను వేటాడితే వారికి మరణశిక్ష తప్పదని తెలిపింది. అయితే మగ రైనో సుడాన్‌ను సంరక్షించి ఆ జాతిని వృద్ధి చేద్దామనుకున్న పార్కు నిర్వాహకులకు నిరాశే మిగిలింది. కండరాల, ఎముకల క్షీణత వ్యాధితో బాధపడుతూ సుడాన్ మరణించింది. ప్రపంచం మొత్తంలో గల రెండు వైట్ రైనోలు సుడాన్ సంతతే. సుడాన్ మృతితో దాని సంతానం నాజిన్(27), ఫతు(17) చిన్నబోయాయి. అవి రెండూ కన్నీరు కారుస్తూ.. సుడాన్ మృతి పట్ల మౌనం వహించాయి. పార్కు నిర్వాహకులు సుడాన్ స్మృతి చిహ్నం వద్ద శనివారం ఏర్పాటు చేసిన స్మారక కార్యక్రమంలో నాజిన్, ఫతులు మౌనంగా రోదిస్తున్న దృశ్యాలు జంతు ప్రేమికులతో సహా ప్రభుత్వాన్ని ఆలోచనలో పడేశాయి. ఆ దిశగా కెన్యా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇకపై ఏనుగు, రైనోల దంతాల స్మగ్లింగ్‌లో పట్టుబడ్డ వారికి మరణశిక్ష విధిస్తామని తెలిపింది. ఆ మేరకు కెన్యా ప్రభుత్వం చట్టం కూడా తీసుకొచ్చింది. -
'జనతా గ్యారేజ్' స్టార్‌కు ఏనుగు దంతాల షాక్!
కోచి: 'జనతా గ్యారేజ్', 'మనమంతా' సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్‌ను ఏనుగుదంతాల కేసు వెంటాడుతోంది. ఆయన ఏనుగు దంతాలు కలిగి ఉన్నారన్న ఆరోపణలపై దర్యాప్తు జరపాలని కోచి కోర్టు శనివారం విజిలెన్స్ శాఖకు ఆదేశాలు ఇచ్చింది. మోహన్ లాల్ అక్రమంగా ఏనుగు దంతాలు కలిగి ఉన్నారంటూ హక్కుల కార్యకర్త ఏఏ పౌలాస్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన మువత్తుపుళా విజిలెన్స్ కోర్టు ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపి నవంబర్ 28లోగా దర్యాప్తు నివేదిక తమకు సమర్పించాలని ఆదేశించింది. 2011లో మోహన్‌లాల్ ఇంట్లో ఆదాయపన్ను అధికారులు సోదాలు జరిపినప్పుడు తొలిసారిగా ఆయన వద్ద ఏనుగు దంతాలు ఉన్నాయనే విషయం వెలుగుచూసింది. 2012లో ఆయనపై అటవీశాఖ అధికారులు కేసు నమోదు చేశారు. అప్పట్లో ఆయనపై ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. అయితే, తాను ఏనుగు దంతాలు కొనుగోలు చేసినట్టు మోహన్‌లాల్ చెప్తున్నారు. వన్యప్రాణి, అటవీ చట్టం ప్రకారం ఎవరైనా ఏనుగు దంతాలు కలిగి ఉండటం అక్రమం. ఈ వ్యవహారంలో అటవీ అధికారులు సక్రమంగా పనిచేయడం లేదని, కావాలనే ఉద్దేశపూర్వకంగా మోహన్‌లాల్‌ను కేసు నుంచి తప్పించేలా ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ పిటిషనర్ కోర్టును ఆశ్రయించాడు.