దావూద్‌పై 'దేశభక్త' డాన్ ప్రయోగం!
ముంబై/న్యూఢిల్లీ: మాఫియా గ్యాంగ్‌స్టర్ ఛోటారాజన్ అరెస్టుతో చాలా కేసుల్లో మిస్టరీ తొలగిపోతుందని ముంబై పోలీసులు భావిస్తున్నారు. ముఖ్యంగా మాఫియా చేతిలో హాతమైన 'మిడ్ డే' పత్రిక జర్నలిస్టు జే డే హత్యతోపాటు అనేక నేర, ఉగ్రవాద కేసుల్లో అతని నుంచి కీలక ఆధారాలు రాబట్టాలనే ఆలోచనలో పోలీసులు ఉన్నారు. అయితే వాస్తవానికి అండర్ వరల్డ్ మాఫియా గురించి ప్రస్తుతం ఛోటారాజన్ వద్ద పెద్దగా సమాచారం ఉండకపోవచ్చునని దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి.
అందుకు కారణం లేకపోలేదు. చాలా ఏళ్ల నుంచి మాఫియా ప్రపంచంతో ఏమాత్రం సంబంధాలు లేకుండా ఆయన ఏకాంత జీవితాన్ని గడుపుతున్నాడు. తన అనుచరులకు కూడా అందకుండా అజ్ఞాతవాసంలో ఉన్నాడు. తాను ఎక్కడున్నది బయటపడకుండా వీవోఐపీని వాడుతూ ప్రొక్సీ ఐడీలో వాట్సప్ లో మాత్రమే ఆయన ఫోన్ కాల్స్ చేసేవాడు. ఈ నేపథ్యంలో అనారోగ్యం, ప్రత్యర్థి ఛోటా షకీల్ నుంచి ముప్పు ఉండటంతో ఛోటారాజన్ తిరిగి భారత్ కు వచ్చేందుకు తానే స్వయంగా ముందుకొచ్చి అరెస్టయి ఉంటాడని భావిస్తున్నారు.
దేశభక్త డాన్..!
నిజానికి 1998లోనే థాయ్‌ల్యాండ్‌లో ఛోటా రాజన్‌ను పట్టుబడ్డాడు. నకిలీ పాస్ పోర్టుతో ప్రయాణిస్తున్న అతను అరెస్టయిన తెల్లారే విడుదలయ్యాడు. అప్పట్లో థాయ్‌లాండ్ నుంచి అతన్ని భారత్ తీసుకువచ్చేందుకు కేంద్ర హోంమంత్రిత్వాశాఖ, భద్రతా సంస్థలు ఆసక్తి చూపలేదు. ఇందుకు కారణం అప్పట్లో మాఫియా డాన్ దావూద్‌ను ఎదుర్కొనేందుకు కేంద్ర నిఘా సంస్థలు ఛోటా రాజన్‌ను ప్రధాన ఆయుధంగా వాడుకున్నాయి. 1993 ముంబై పేలుళ్లతో దావూద్ కు దూరం జరిగిన ఛోటా రాజన్ తనను తాను దేశభక్త హిందూ డాన్‌గా అభివర్ణించుకునేవాడు.
ముఖ్యంగా రీసెర్చ్ అనాసిస్ వింగ్ (రా), ఐబీలు రాజన్ ను దావూద్ గ్యాంగ్ కు వ్యతిరేకంగా ఉపయోగించుకున్నాయని అధికార వర్గాలు చెప్తాయి. దీంతో దావూద్, ఐఎస్ఐ అనుచరులను తుదముట్టించడంలో రాజన్ కీలకంగా వ్యవహరించాడు. నేపాల్ లో ఎమ్మెల్యే దిల్షాద్ మీర్జా బైగ్, ఐఎస్ఐ మాస్టర్ మైండ్ ఖలీద్ మసూద్, పర్వెజ్ టాండాలను నిఘావర్గాల మద్దతుతోనే ఛోటా రాజన్ హతమార్చాడు. దావూద్ కీలక అనుచరుడు, ఈస్ట్ వెస్ట్ ఎయిర్ లైన్స్‌కు చెందిన తకివుద్దీన్ వాహిద్ ఖాన్ హత్యలోనూ రాజన్ హస్తమున్నట్టు వార్తలు వచ్చాయి.