ప్రత్యేక ప్యాకేజీ సాధించడంలో టీడీపీ ఎంపీలు విఫలం
కర్నూలు(అర్బన్) : రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీని సాధించడంలో టీడీపీ ఎంపీలు ఘోరంగా విఫల మాయ్యరని బీసీ జనసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జే లక్ష్మీనరసింహ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు టి. శేషఫణి విమర్శిం చారు. గురువారం స్థానిక మద్దూర్‌నగర్‌లోని బీసీ, ఎస్సీ, ఎస్టీ,మైనార్టీ విద్యార్థి సమాఖ్య కార్యాలయంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీకి యు వజన చట్టం సెక్షన్ 46 (3) ప్రకారం రూ.25 వేల కోట్లు కేటాయించాల్సి ఉందన్నారు. పార్లమెంట్లో సీమ టీడీపీ ఎంపీలు ఈ విషయం గురించి ఏ మాత్రం చర్చించకపోవడం దారుణమన్నారు.
విభజనకు ముందు రాష్ట్ర అభివృద్ధి కోసం రూ.5 లక్షల కోట్లు అడిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తుతం నోరు మెదపడం లేదన్నారు. డీఆర్డీఓ, డీటీటీ, ఉర్దూ విశ్వ విద్యాలయం, వ్యవసాయ యూనివర్శిటీ గురించి ఎక్కడా ప్రస్తావించకపోవడం దురదృష్టకరమన్నారు. రాయలసీమలో నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం రాయలసీమ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో విద్యార్థి సమాఖ్య జిల్లా అధ్యక్షుడు వీ భరత్‌కుమార్, నాయకులు లక్ష్మయ్య, నాగరాజు, రంగస్వామి, మధు తదితరులు పాల్గొన్నారు.