చింటూ లేఖపై డీజీపీ పిట్టకథ
చిత్తూరు: చిత్తూరు మేయర్ కఠారి అనురాధ, ఆమె భర్త కఠారి మోహన్ హత్య కేసులో నిందితులు ఎంతటివారైనా వదలిపెట్టబోమని డీజీపీ జే.వెంకటరాముడు తెలిపారు. చిత్తూరులో శనివారం ఆయన జంట హత్యల కేసుపై దాదాపు మూడు గంటల పాటు పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు.
అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మేయర్ దంపతుల హత్య కేసులో ఇప్పటికే పలువురిని అరెస్టు చేశామన్నారు. ప్రధాన నిందితుడు చింటూ అలియాస్ చంద్రశేఖర్ కోసం తీవ్రంగా గాలిస్తున్నామన్నారు. హత్యకుట్రలో పాల్గొన్న వారు ఎంతటివారైనా వదిలే ప్రసక్తి లేదన్నారు. చింటూ తనకు ప్రాణహాని ఉందని చెప్పుతూ పోలీసులకు లేఖ రాశారన్న విషయంపై డీజీపీ వివరణ ఇచ్చారు. పోలీసులంటే ప్రాణాలు కాపాడేవాళ్లని, ప్రాణాలు తీయరని రాముడు తెలిపారు.
‘పూర్వం తల్లిదండ్రులను చంపిన ఓ దుండగుడికి న్యాయస్థానం ఉరిశిక్ష ఖరారు చేసి, ఆఖరు కోరిక ఏమిటని అడిగింది. అందుకు ఆ దుండగుడు నాకు తల్లిదండ్రులు లేరు. దయచూపి శిక్ష తగ్గించండి’ అన్నాడంటూ డీజీపీ పిట్టకథ చెప్పారు. డీజీపీ వెంట రాష్ట్ర సీఐడీ అదనపు డీజీపీ సీహెచ్.ద్వారకతిరుమలరావు, రాష్ట్ర అదనపు డీజీపీ ఠాకూర్, రాయలసీమ ఐజీ వీ.వేణుగోపాలకృష్ణ, చిత్తూరు ఎస్పీ జీ.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.