జబర్దస్త్ పండుగ
‘హాయ్ దోస్తుల్స్.. నేనొచ్చేసినా..’ అంటూ టీవీలోకి జబర్దస్త్‌గా ఎంట్రీ ఇచ్చిన కత్తి.. కార్తీక ! సిటీల పుట్టి పెరిగిన ఈ అమ్మాయి.. పర్ఫెక్ట్ వెస్ట్రన్ స్టయిల్స్ మెయింటేన్ చేసినా.. పండుగలప్పుడు మాత్రం ట్రెడిషనల్ వేర్‌లోకి షిఫ్ట్ అయిపోతుంది. అందులోనూ బతుకమ్మ పండుగంటే ఈ అమ్మడికి వెరీవెరీ స్పెషల్. ముచ్చట్లేందో ఆమె మాటల్లోనే..
బతుకమ్మ.. జబర్దస్త్ పండుగ. చిన్నప్పటి నుంచి ఈ పండుగ నాకు స్పెషలే. ఏ పండుగొచ్చినా మా ఇంట్ల నేనే స్పెషల్. ఒక్కతే ఆడకూతురిని గదా..! గందుకే ఇంట్ల అందరు నన్ను లాడ్ చేసేటోళ్లు. బతుకమ్మ స్టార్ట్ అయిందంటనే కొత్త బట్టలు, గాజులు ఉండాలె. ఇప్పటికీ ఏం మారలె.
పే..ద్ద బతుకమ్మ
మా నాన్న రైల్వేలో జాబ్ చేస్తుండే. అప్పుడు రైల్వే కాలనీలో ఉండేటోళ్లం. బతుకమ్మకు మా కాలనీలో మస్తు పోటీ ఉంటుండే. నానమ్మతో పొయ్యి పూలు తెస్తుంటి. బతుకమ్మ పేర్చుట్ల మా అమ్మను మించినోళ్లు లేరు. బతుకమ్మ మధ్యలో మా పేర్లు వచ్చేటట్టు.. ఆర్టిస్టిక్‌గా పేరుస్తుండే. చిన్నప్పుడు నేను బాగ జిద్దు చేస్తుండే. అమ్మ ఎంత పెద్దగ పేర్చినా.. ఇంకా పెద్దగా చెయ్యమని అంటుంటి. బతుకమ్మను తయారు చేసినాంక అమ్మ నన్ను తయారు చేసేది. మిగిలిన రోజుల్లో ఎట్లున్నా.. పండుగలప్పుడు.. మాత్రం కంప్లీట్ ట్రెడిషనల్ లుక్కే!
చుట్టాలందరం కలసి
చుట్టాలు పక్కాలు అందరు కలిస్తే 25 మంది అయ్యేటోళ్లం. అందరం కలిసి బతుకమ్మ ఆడేటోళ్లం. బతుకమ్మ పాటలు పాడటంలో నానమ్మ ఫస్ట్. నేను ఎంత ట్రై చేసిన. కానీ.. ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో..’ పాటొక్కటే ఒస్తది. బతుకమ్మ పేర్చుడు కూడా అంతగా రాలే. అమ్మ పెద్ద బతుకమ్మ పేరిస్తే నేను చిన్న బతుకమ్మ పేర్చేదాన్ని.
సంత లెక్కుండేది..
అప్పుడు బతుకమ్మ టైమ్‌లో ఏ గల్లీ చూసినా సంతలెక్క ఉండేది. ఇప్పుడు అంతా కాంక్రీట్ జంగిలే. పూల కోసం కోఠి పోవాలి. కొత్త చీర ఉంది. దానికి మ్యాచింగ్ బ్యాంగిల్స్ కొనడం అన్నీ అయిపోయాయి. ఇప్పుడు కూడా బతుకమ్మను అమ్మే పేరుస్తది. అయితే నా చిన్నప్పటి లెక్క మా అత్తలు, చిన్నమ్మలతో కాకుండా మాకు మేమే ఆడుకుంటం. ఎవరి లైఫ్లల్ల వాళ్లు బిజీ అయిపోయిండ్రు. ఇప్పుడు పండుగల్లో మునుపటి జోష్ లేదు. కొత్త పండుగ.. తెలంగాణ వచ్చినాంక మొదలు బోనాలొచ్చినయ్. ఇపుడు ఈ పండుగ.. కాబట్టి నాకైతే ఫుల్ జోష్ వచ్చింది. రెండూ అమ్మవారి పండుగలే. తెలంగాణ సుఖసంతోషాలతో ఉండాలని ఆ అమ్మవారు ఇట్లా బ్లెసింగ్స్ ఇస్తున్నరేమో అనిపిస్తుంది.
- సరస్వతి రమ