గోల్కొండలో కాల్పుల కలకలం
గోల్కొండ: నగరంలోని పాతబస్తీ ప్రాంతంలో కాల్పులు కలకలం సృష్టించాయి. భూ వివాదానికి సంబంధించిన విషయంలో జరిగిన వాగ్వాదం చివరకు బుల్లెట్ల వర్షం వరకు వెళ్లింది. టోలిచౌకికి చెందిన కాంగ్రెస్ నాయకుడు జాబేర్‌పటేల్ కొన్ని రోజుల కిందట గోల్కొండలో ఒక ఫ్లాట్ విషయంలో స్థానికులతో గొడవపడ్డాడు. ఈ విషయం ఆనోట ఈ నోట పోలీసుల వరకు చేరింది. దీంతో పోలీసులు ఇరువర్గాల వారిని పిలిచి సర్దుబాటు చేసుకొమ్మని సలహా ఇచ్చారు. దీంతో గురువారం రాత్రి జాబేర్ పటేల్ గోల్కొండకు చెందిన ఫరీద్‌తో భేటి అయ్యాడు.
ఈ సమయంలో ఇద్దరి మధ్య మాటమాట పెరిగి తీవ్ర వాగ్వదం జరిగింది. ఈ క్రమంలో ఆవేశానికి గురైన జాబేర్ తన తుపాకితో మూడు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపాడు. దీంతో ఫరీద్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా.. జాబేర్ పటేల్ జాతీయ మైనార్టీ సెల్ కన్వీనర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నట్లు సమాచారం. ఎర్రబుగ్గ వాహనాన్ని వాడుతున్నట్టు స్థానికలు తెలిపారు. ఈ సంఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.