Jabling
-
ఇన్విజిలేటర్ల జంబ్లింగ్
సాక్షి ప్రతినిధి, కడప : పకడ్బందీ ఏర్పాట్ల నడుమ జిల్లాలో పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 15వ తేదీ నుంచి నిర్వహించబోయే వార్షిక పరీక్షలకు అధికా రులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. మొదటిసారిగా ఈ పరీక్షల పర్యవేక్షించే ఇన్విజిలేటర్లు జంబ్లింగ్ పద్ధతిలో విధులు నిర్వర్తించనున్నారు. ముఖ్యంగా చూసిరాతల నిరోధానికి అన్ని పరీక్ష కేంద్రాల్లో సిట్టింగ్ స్క్వాడ్లను నియమించారు. అదేవిధంగా ఎనిమిది సమస్యాత్మక కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. పోలీసు పహారా మధ్య జిల్లావ్యాప్తంగా 53 స్టోరేజీ పాయింట్లలో ప్రశ్నపత్రాలను భద్రపరిచారు. చూచిరాతల నిరోధానికి చర్యలు జిల్లాలో టెన్త్ వార్షిక పరీక్షల నిర్వహణకు 164 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాల్లో జంబ్లింగ్ విధానంలో విద్యార్థులను కేటాయించారు. చూచిరాతల నిరోధానికి ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందుకోసం విద్యాశాఖ సిబ్బందితోపాటు రెవెన్యూ, పోలీసు శాఖల సిబ్బందిని అన్ని కేంద్రాల వద్ద సిట్టింగ్ స్క్వాడ్లుగా నియమించనున్నారు. ప్రతి జోన్‌లోని ఒక కేంద్రంలో రెగ్యులర్ విద్యార్థులతోపాటు ప్రైవేటు విద్యార్థులు పరీ క్షలు రాసేలా చర్యలు చేపట్టారు. జిల్లాలో టెన్త్ పరీక్షలకు మొత్తం 35,737 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వీరిలో బాలురు 18,513మంది, బాలికలు 17,224 మంది ఉన్నారు. 15నుంచి 29 వరకు ఉదయం 9.30 నుంచి 12.15 వరకు పరీక్షలు నిర్వహిస్తారు. జంబ్లింగ్ విధానంలో ఇన్విజిలేటర్ల నియామకం జిల్లావ్యాప్తంగా 1,640 మంది ఇన్విజిలేటర్లు విధుల్లో ఉండనున్నారు. వీరిని పరీక్ష కేంద్రాలకు జంబ్లింగ్ విధానంలో నియమిస్తారు. ప్రతి మూడు రోజులకోసారి ఇన్విజిలేటర్లను మారుస్తుంటారు. ఇన్విజిలేటర్లెవరైనా విద్యార్థులను చూచిరాతలకు ప్రోత్సహిస్తే కఠిన చర్యలు తీసుకుంటారు. ఈ మేరకు ఎస్ఎస్సీ బోర్డు డైరెక్టర్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. సీసీ కెమెరాల ఏర్పాటుపై విమర్శలు జిల్లాలో ఎనిమిది కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. కాగా కార్పొరేట్ స్కూల్స్ విద్యార్థులు పరీక్షలు రాస్తున్న కేంద్రాలను వదలేసి సీగ్రేడ్ కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రైవేటు స్కూల్ విద్యార్థులు పరీక్ష రాస్తున్న కేంద్రాల్లో మాస్ కాపీయింగ్ జరుగుతుందనే ఆరోపణలు గతంలో ఉన్నాయి. వాటిపై దృష్టిపెట్టాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సెల్ఫోన్లు నిషిద్ధం: పరీక్ష కేంద్రాల్లోపలికి సెల్ఫోన్లను నిషేధించారు. చీఫ్ సూపరింటెండెంట్ వద్ద మినహా ఎవరి వద్దా సెల్ఫోన్లు ఉండడానికి వీల్లేదు. ఆయన కూడా ఫోన్‌ను సైలెంట్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. పరీక్షల నిర్వహణకు సంబంధించి ఉన్నతాధికారులు తెలిపే సూచనలను వినేందుకు మాత్రమే సెల్‌ఫోన్‌ను ముఖ్య పర్యవేక్షకులు వినియోగించాలి తప్ప ఇతర కాల్స్ మాట్లాడకూడదనే నిబంధన విధించారు. పరీక్ష కేంద్రానికి ముందుగా చేరుకోవాలి విద్యార్థులు హాల్‌టిక్కెట్, పరీక్షలు రాసేందుకు అవసరమైన సామగ్రి తప్ప సెల్ఫోన్లుకానీ, ఎలక్ట్రానిక్ వస్తువులుకానీ వెంట తీసుకురాకూడదు. పరీక్ష ప్రారంభ సమయానికి కనీసం 30 నిమిషాల ముందుగా కేంద్రాలకు చేరుకోవడం అన్నివిధాలా మంచిది. అనుకోని పరిస్థితుల్లో విద్యార్థులెవరైనా నిర్ణీత సమాయానికి కేంద్రానికి చేరుకోకపోయినా.. పరీక్ష ప్రారంభమైన కొన్ని నిమిషాల వరకు కేంద్రంలోనికి అనుమతిస్తాం. –పి.శైలజ, జిల్లా విద్యాశాఖాధికారి -
జంబ్లింగ్ వద్దు
అవనిగడ్డ : జబ్లింగ్ విధానాన్ని నిరసిస్తూ దివిసీమలో విద్యార్థిలోకం కదంతొక్కింది. ర్యాలీలు నిర్వహించారు. తహశీల్దార్ కార్యాల యాల ముందు ఆందోళనలు చేశారు. అవనిగడ్డలో ఎస్వీఎల్ క్రాంతి జూనియర్ కళాశాల సైన్స్ విద్యార్థులు సోమవారం ప్రధాన రహదారిలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయం ముందు ఆందోళన చేశారు. జంబ్లింగ్ విధానాన్ని రద్దు చేయాలని, విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దని నినాదాలు చేశారు. కళాశాల కరస్పాండెంట్ దుట్టా ఉమామహేశ్వరరావు, పలువురు విద్యార్థులు మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా మన రాష్ట్రంలోనే ప్రాక్టికల్స్‌లో జంబ్లింగ్ విధానాన్ని ఎందుకు అమలు చేస్తున్నారని ప్రశ్నించారు. మెడిసిన్, ఇంజినీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ వంటి ఏ కోర్సులోనూ లేని జంబ్లిం గ్ ఇంటర్ సైన్స్‌లోనే ప్రవేశపెట్టడం దురదృష్టకరమన్నారు.పరీక్షల సమయంలో జంబ్లింగ్ విధానాన్ని ప్రకటించి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం తహశీల్దార్ వెన్నెల శ్రీనుకు వినతి పత్రం అందజేశా రు. కళాశాల ప్రిన్సిపాల్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. చల్లపల్లిలో జంబ్లింగ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ చల్లపల్లిలో అన్ని జూనియర్ కళాశాలల విద్యార్థులూ ఆందోళన నిర్వహించారు. శ్రీశారదా సన్‌ఫ్లవర్, విజయా జూనియర్, శ్రీవిజయక్రాంతి జూనియర్ కళాశాలల విద్యార్థులు ముందుగా ఆయా కళాశాలల నుంచి ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయా కళాశాలల కరస్పాండెంట్స్, ప్రిన్సిపాల్స్ యార్లగడ్డ శివప్రసాద్, ఎ. కోటేశ్వరరావు, అబ్దుల్ రహీం, కె. పూర్ణానందదాస్, దుట్టా శివరాంప్రసాద్ మాట్లాడుతూ సైన్స్ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడే జంబ్లింగ్ విధానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నెల 4న నుంచి ప్రాక్టికల్స్ జరుగనున్న నేపథ్యంలో విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు. అనంతరం తహశీల్దార్‌కు వినతి పత్రం సమర్పించారు. కోడూరులోఇంటర్మీడియట్ బోర్డు పరీక్షల విధానంలో నూతనంగా ప్రవేశపెట్టిన జంబ్లింగ్ పద్ధతిని రద్దు చేయాలంటూ స్థానిక మారుతీ జూనియర్ కళాశాల విద్యార్థులు సోమవారం ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం స్పందించి వెంటనే ఆ విధానాన్ని రద్దు చేయకపోతే ఆందోళన ఉధృతం చేయాల్సి వస్తుందని పలువురు విద్యార్థులు హెచ్చరించారు. కోడూరు ప్రధాన రహదారుల వెంట ర్యాలీ నిర్వహించి తరగతులను బహిష్కరించారు. కళశాల అధినేత దుట్టా శివరామప్రసాద్, అధ్యాపకులు ఓంవీరాంజనేయులు, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.