జంబ్లింగ్ వద్దు
అవనిగడ్డ : జబ్లింగ్ విధానాన్ని నిరసిస్తూ దివిసీమలో విద్యార్థిలోకం కదంతొక్కింది. ర్యాలీలు నిర్వహించారు. తహశీల్దార్ కార్యాల యాల ముందు ఆందోళనలు చేశారు. అవనిగడ్డలో ఎస్‌వీఎల్ క్రాంతి జూనియర్ కళాశాల సైన్స్ విద్యార్థులు సోమవారం ప్రధాన రహదారిలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయం ముందు ఆందోళన చేశారు.
జంబ్లింగ్ విధానాన్ని రద్దు చేయాలని, విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దని నినాదాలు చేశారు. కళాశాల కరస్పాండెంట్ దుట్టా ఉమామహేశ్వరరావు, పలువురు విద్యార్థులు మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా మన రాష్ట్రంలోనే ప్రాక్టికల్స్‌లో జంబ్లింగ్ విధానాన్ని ఎందుకు అమలు చేస్తున్నారని ప్రశ్నించారు. మెడిసిన్, ఇంజినీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ వంటి ఏ కోర్సులోనూ లేని జంబ్లిం గ్ ఇంటర్ సైన్స్‌లోనే ప్రవేశపెట్టడం దురదృష్టకరమన్నారు.పరీక్షల సమయంలో జంబ్లింగ్ విధానాన్ని ప్రకటించి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం తహశీల్దార్ వెన్నెల శ్రీనుకు వినతి పత్రం అందజేశా రు. కళాశాల ప్రిన్సిపాల్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
చల్లపల్లిలో జంబ్లింగ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ చల్లపల్లిలో అన్ని జూనియర్ కళాశాలల విద్యార్థులూ ఆందోళన నిర్వహించారు. శ్రీశారదా సన్‌ఫ్లవర్, విజయా జూనియర్, శ్రీవిజయక్రాంతి జూనియర్ కళాశాలల విద్యార్థులు ముందుగా ఆయా కళాశాలల నుంచి ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయా కళాశాలల కరస్పాండెంట్స్, ప్రిన్సిపాల్స్ యార్లగడ్డ శివప్రసాద్, ఎ. కోటేశ్వరరావు, అబ్దుల్ రహీం, కె. పూర్ణానందదాస్, దుట్టా శివరాంప్రసాద్ మాట్లాడుతూ సైన్స్ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడే జంబ్లింగ్ విధానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నెల 4న నుంచి ప్రాక్టికల్స్ జరుగనున్న నేపథ్యంలో విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు. అనంతరం తహశీల్దార్‌కు వినతి పత్రం సమర్పించారు.
కోడూరులోఇంటర్మీడియట్ బోర్డు పరీక్షల విధానంలో నూతనంగా ప్రవేశపెట్టిన జంబ్లింగ్ పద్ధతిని రద్దు చేయాలంటూ స్థానిక మారుతీ జూనియర్ కళాశాల విద్యార్థులు సోమవారం ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం స్పందించి వెంటనే ఆ విధానాన్ని రద్దు చేయకపోతే ఆందోళన ఉధృతం చేయాల్సి వస్తుందని పలువురు విద్యార్థులు హెచ్చరించారు. కోడూరు ప్రధాన రహదారుల వెంట ర్యాలీ నిర్వహించి తరగతులను బహిష్కరించారు. కళశాల అధినేత దుట్టా శివరామప్రసాద్, అధ్యాపకులు ఓంవీరాంజనేయులు, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.