ఇది ఒకప్పటి జైలు
స్వాతంత్రో్యద్యమంలో పాలుపంచుకున్న జిల్లాకు చెందిన పలువురు జైలు జీవితం గడిపిన కట్టడం నేటికీ చెక్కుచెదరకుండా ఉంది. ప్రస్తుతం ఆ కట్టడంలో ప్రభుత్వ పాఠశాలను నిర్వహిస్తున్నారు. ఇంతకు ఆ కట్టడం ఎక్కడుందని అనుకుంటున్నారా? అయితే మీరు అనంతపురంలోని పాతూరు నంబర్ వన్ పాఠశాలను ఒకసారి సందర్శించి తీరాల్సిందే.
- అనంతపురం కల్చరల్
రెండు శతాబ్ధాల క్రితం బళ్లారి జిల్లాలో అంతర్భాగంగా ఉన్న దత్త మండలాల్లో అనంతపురం ఒకటి. ఆ సమయంలో పాలనాపరమైన వ్యవహారాలు చూసేందుకు పాతూరులో ఓ కట్టడాన్ని నిర్మించారు. 1882లో అనంతపురం జిల్లా ఏర్పడిన తర్వాత తొలి కలెక్టర్ కార్యాలయాన్ని ఈ భవనంలోనే ఏర్పాటు చేశారు. అంతేకాదు కొన్నాళ్లు ప్రభుత్వ ఖజానాగా కూడా ఉండేదని రికార్డుల ద్వారా తెలుస్తోంది. ప్రధానంగా అప్పట్లో కలెక్టర్ కార్యాలయంలోనే జైలు కూడా ఉండేదని చరిత్రకారులు చెబుతున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికీ ఆ భవనంలో చెరశాల రూపురేఖలు కనిపిస్తున్నాయి. ఈ భవనం వెనుక శిక్షలు విధించేవారని, ఆఖరుకు న్యాయస్థానం ఆదేశాల మేరకు ఉరి కూడా తీసేవారని చెబుతున్నారు.
స్వాతంత్ర్యోద్యమ కాలంలో బాలిక విద్య కోసం ఉద్యమించిన దుర్గాబాయి దేశ్‌ముఖ్ పోరాట ఫలితంగా ఇదే కట్టడం కొన్ని సంవత్సరాల పాటు బాలికల హాస్టల్‌గా నడిచింది. కాలక్రమంలో పాతూరులో ఉన్న సత్రం బడిని ఇక్కడకు మార్చడంతో రాజేంద్ర మున్సిపల్ హైస్కూల్‌గాను, అదే పేరుతో మరో చోట నూతన భవనం నిర్మించడంతో నంబర్ 1 స్కూల్‌గా స్థిరపడిపోయింది. ఈ పాఠశాల లోపలకు వెళ్లి చూస్తే ఆశ్చర్యంతో పులకించని వారుండరంటే అతిశయోక్తి కాదు.