శ్రద్ధా కేసు: అఫ్తాబ్‌కి ఆ సమయంలో రక్షణగా ఉన్న పోలీసులకు రివార్డు
న్యూఢిల్లీ: శ్రద్ధా వాకర్ హత్య కేసులోని నిందితుడు అఫ్తాబ్ అమీన్ పూనావాలాని తీసుకువెళ్తున్న వాహనంపై కొందరూ దాడికి యత్నించిన సంగతి తెలిసిందే. ఆ నేపథ్యంలో అతడికి రక్షణగా ఉన్న ఐదుగురు పోలీసులు గాల్లో కాల్పులు జరిపి పరిస్థితిని చాలా చాకచక్యంగా అదుపులోకి తీసుకువచ్చారు. దీంతో ఢిల్లీ పోలీస్ కమిషనర్ సంజయ్ కుమార్ ఆ సమయంలో సరైన విధంగా స్పందించిన ఢిల్లీ ఆర్మీ పోలీస్ బృందానికి చెందిన మూడవ బెటాలియన్ పోలీస్ కమాండ్‌కి రివార్డులు బహుకరించారు.
ఈ మేరకు సబ్ఇన్స్పెక్టర్లు ఒక్కొక్కరికి రూ.10 వేలు చొప్పున రివార్డు అందజేశారు. ఇద్దరు కానిస్టేబుళ్లకు రూ 5000/-లు మరోక కానిస్టేబుల్ రూ. 5000లు బహుకరించారు. ఇదిలా ఉండగా, ఢిల్లీ పోలీసులు అప్తాబ్‌ను పాలీగ్రఫీ టెస్ట్ నిమిత్తం సోమవారం ఎఫ్ఎస్ఎల్ ల్యాబొరేటరీకి తీసుకువెళ్లిన సంగతి తెలిసిందే. ఇక అఫ్తాబ్‌కి నిర్వహించాల్సిన టెస్ట్‌లు పూర్తి అయిన తదనతరం రక్షణగా ఉన్న ఢిల్లీ ఆర్మీ పోలీసు బృందం వ్యాన్ని పూర్తిగా తనిఖీ చేసి తీహార్ జైలుకి తరలించేందుకు సిద్ధం అయ్యారు. సరిగ్గా వ్యాన్ రోహిణి ప్రాంతంలోని కార్యాలయం నుంచి గేటు దాటుతుండగా... అకస్మాత్తుగా ఒక గుంపు జైలు వ్యాన్‌పై దాడి చేసింది.
దీంతో ఢిల్లీ ఆర్మ్డ్ పోలీస్(డీఏపీ) బృందం అద్భుతమైన తెగువను ప్రదర్శించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా రక్షించింది. ఇది చాలా ప్రశంసించదగ్గ విషయం అని ఢిల్లీ పోలీస్ డిపార్ట్మెంట్ పేర్కొంటూ వారికి రివార్డులు అందజేసింది. కాగా అప్తాబ్ పోలీస్ వాహనంపై దాడికి పాల్పడ్డ నిందితులు కుల్దీప్ ఠాకూర్, నిగమ్ గుర్జార్లను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఆ తర్వాత వారిని అక్కడి నుంచి జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. మిగిలిన నిందితులను గుర్తించి అరెస్టు చేసేందుకు తమ బృందం ప్రయత్నిస్తోందని ఢిల్లీ పోలీసులు తెలిపారు.
(చదవండి: ‘మా సోదరిని వాడు 35 ముక్కలు చేశాడు సార్.. మేం 70 ముక్కలు చేస్తాం’)