jainath
-
విషాదం: లిఫ్ట్ వైర్ తెగి ఇద్దరి కార్మికుల మృతి
సాక్షి, ఆదిలాబాద్: జిల్లాలోని జైనథ్ మండలం చనాక కొరాట బ్యారేజ్ పనుల్లో అపశృతి చోటు చేసుకుంది. పెన్ గంగా నదిపై నిర్మిస్తున్న బ్యారేజ్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో భాగంగా బ్యారేజ్ గేట్లు బిగిస్తుండగా లిఫ్ట్ వైర్ తెగిపడి ఇద్దరు కూలీలు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ బ్యారేజీకి సంబంధించి ఇంకా మూడు గేట్లు బిగించాల్సి ఉండగా ఇప్పటికే పనులు నత్తనడకన సాగుతూ ఉన్నారు. బుధవారం 16వ నంబర్ గేట్ బిగిస్తుండగా ప్రమాదవశాత్తు లిఫ్ట్‌వైర్ తెగింది. దీంతో 200 అడుగుల ఎత్తులో నుంచి వారు ఒక్కసారిగా కిందపడడంతో అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడ్డ ఇద్దరు కూలీలను చికిత్స నిమిత్తం తరలించారు. అయితే సదరు కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్లు స్థానిక కూలీలు పేర్కొంటున్నారు. -
వచ్చే వేసవిలోగా బ్యారేజీ పనులు
మంత్రి హరీశ్‌రావు జైనథ్: తెలంగాణ, మహారాష్ట్రలోని కోర్ట, చనాక గ్రామాల మధ్య పెన్‌గంగ నదిపై నిర్మించనున్న బ్యారేజీ పనులు వచ్చే వేసవికి ముందే ప్రారంభిస్తామని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. గురువారం ఆయన మంత్రులు జోగు రామన్న, ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యేలు నల్లాల ఓదేలు, రాథోడ్ బాపురావు, విఠల్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ జగన్మోహ న్‌తో కలసి మహారాష్ట్రలోని చనాక గ్రామంలో పర్యటించారు. బ్యారేజీ కోసం కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. తమ ప్రభుత్వం రైతుల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతోందని, అందులో భాగంగానే లోయర్ పెన్‌గంగ, పెన్‌గంగపై తెలంగాణ, మహారాష్ట్ర రాష్ట్రాల మధ్య మూడు బ్యారేజీల నిర్మాణానికి పూనుకుందని అన్నారు. సగ్దసాంగిడి, పింప్రడ్ బ్యారేజీలను మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మించనుండగా, కోర్ట, చనాక బ్యారేజీని తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్నట్లు తెలిపారు. రూ.300 కోట్లతో ఈ బ్యారేజీ పనులను పూర్తి చేసి ఇరు రాష్ట్రాల్లో తాగు, సాగునీరు వసతులను కల్పిస్తామని అన్నారు. కోర్ట, చనకా బ్యారేజీ ద్వారా తెలంగాణలోని జైనథ్, బేల మండలాల్లో 12,500 ఎకరాలకు, మహారాష్ట్రలో 3 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. ఈ బ్యారేజీకి సంబంధించిన డీటైల్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్)ను సిద్ధం చేశామని.. ఈ నివేదికను మహారాష్ట్ర ప్రభుత్వానికి అందించి అన్ని అనుమతులు పూర్తి చేసుకుని త్వరలోనే రిజర్వాయర్ పనులు ప్రారంభిస్తామన్నారు. కార్యక్రమంలో ఇరిగేషన్ ఎస్ఈ భగవంత్‌రావు, మహారాష్ట్ర ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడి గ్రామస్తులు తమ సమస్యలు పరిష్కరించాలని హరీశ్‌రావుకు వినతిపత్రం సమర్పించారు. -
నిరుపేద ధనికురాలు!
తల్లిదండ్రులు కష్టపడి సంపాదించి పెడితే, విలాసంగా ఖర్చుపెట్టే కొడుకులనెందరినో చూశాం. చేతికి అంది వచ్చిన కొడుకులు వృద్ధాప్యంలో చక్కగా చూసుకుంటుంటే, నిశ్చింతగా గడిపే తల్లిదండ్రులూ మనకు తెలుసు. అయితే, అండగా ఉంటాడనుకున్న కొడుకు కాస్తా అకస్మాత్తుగా చనిపోతే అతని సంపాదనను అనుభవించకుండా, దానితో ఒక ధర్మసత్రం కట్టించి, తాను మాత్రం ఎప్పటిలా కూరగాయలమ్ముకుంటూ పొట్టపోసుకుంటోంది ఓ వృద్ధమాత. ఈ తల్లి గుండెచప్పుళ్లు విందాం... ‘ముప్పైఏళ్ల నాటి మాట.. కట్టుబట్టలతో బేల నుంచి జైనథ్‌కు వచ్చినం... నీడలేక పశువుల కొట్టంలో బతికినం.. వెంకటి పుట్టిన సంది దేవుడు ఎత్తుకున్నడు.. కూరగాయలమ్మి చదివిపిచ్చినం.. బయట దేశం (కెనడా)ల కొలువన్నడు.. నీ ఇష్టం బిడ్డా అన్నం.. కానీ దేవుడు ఇంత పని చేస్తడనుకోలేదు.. కొడుకే పోయిండు.. ఆ లక్షలు నా కెందుకు.. మా పేరు నిలబెట్టినందుకు.. వాని పేరు నిలబెట్టాలనుకున్నా...’ అని చెప్పుకొచ్చింది ఈ మాతృమూర్తి తానుబాయి. ఆరుపదులకు పైబడ్డా, కొడుకు సంపాదించిన దాంతో కృష్ణా రామా అని కాలక్షేపం చేయకుండా, కొడుకు సంపాదన అంతటినీ వెచ్చించి, జైనథ్ లక్షీ్ష్మనారాయణ స్వామి దేవాలయం ఆవరణలో సత్రం కట్టించి అందరికీ ఆదర్శంగా నిలిచింది తానుబాయి. అసలు తానుబాయి అంటే చుట్టుపక్కల తెలియని వారుండరు. దాయాదుల పోరు భరించలేక బేల మండలానికి చెందిన తానుబాయి తన భర్త మారుతితో కలిసి 30 ఏళ్ల క్రితం పొట్ట చేతపట్టుకుని జైనథ్‌కు వలస వచ్చింది. మారుతి ఓ రైతు వద్ద పాలేరుగా చేరగా, తాను మాత్రం గ్రామంలో కూరగాయలమ్ముతూ కుటుంబ పోషణలో భర్తకు తోడుగా నిలిచింది. ఉండటానికి గూడు లేకపోవడంతో ఓ పశువుల కొట్టంలో నివసిస్తూ కాలం వెళ్లబుచ్చింది. ఈ దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు పుట్టారు. వెంకటేశ్వర స్వామికి మొక్కుకోగా పుట్టిన మగనలుసుకు వెంకటి అని పేరు పెట్టుకుని ఆశలన్నీ అతని మీదే పెట్టుకుని పెంచి పెద్ద చేసింది. కూరగాయలమ్ముతూ భర్తకు చేదోడువాదోడుగా ఉంటూ ముగ్గురు ఆడపిల్లలకూ పెళ్లిళ్లు చేసింది. రెక్కలు ముక్కలు చేసుకుని మరీ కొడుకును పెద్ద చదువులు చదివించింది. జిల్లా కేంద్రమైన ఆదిలాబాద్‌లో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ చదివిన వెంకటి ఎంతో కష్టపడి ఎంబీఏ పూర్తి చేశాడు. హైదరాబాద్‌లో ఐసీఐసీఐ బ్యాంకులో చేరాడు. ఈ విషయం తెలిసిన ఆ నిరుపేద దంపతులు ఉబ్బితబ్బిబ్బయ్యారు. అయితే ఈ సంతోషం తానుబాయికి ఎక్కువ రోజులు మిగలలేదు. కొడుకు చేతికందిన కొద్దిరోజులకే భర్త హఠాన్మరణం ఆమెకు తీరని శోకాన్ని మిగిల్చింది. ఆ తర్వాత కొడుకు వెంకటి ఉద్యోగ రీత్యా ముంబాయిలో పనిచేయాల్సి వచ్చింది. అక్కడి నుంచి ఉన్నతోద్యోగం కోసం కెనడా వెళ్లాడు. కొడుకు ఉన్నతిని చూసి ఎంతో సంతోషపడింది తానుబాయి. అయితే ఇంతలోనే ప్రమాద రూపంలో వచ్చిన మృత్యువు ఆ తల్లి సంతోషాన్ని తుడిచేసింది. కెనడాలో జరిగిన ఓ ప్రమాదంలో వెంకట్ మృత్యువాత పడటంతో ఈ తల్లికి కడుపుకోత మిగిలింది. భర్త మరణించిన కొద్ది కాలానికే కొడుకు కూడా దూరమవడంతో ఆమె శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ విషాదం నుంచి కోలుకోవడానికి ఆమెకు ఏడాది పట్టింది. కొడుకు పేరు కలకాలం గుర్తుండేలా చేయాలనుకుంది ఆ తల్లి. తాను రెండు గదులున్న పెంకుటింటిలో తలదాచుకుంటూ, తన కొడుకు సంపాదన అంతటినీ కూడగట్టి ఆలయ ఆవరణలో ధర్మసత్రాన్ని నిర్మించాలని తలపెట్టింది. తల్లి నిర్ణయాన్ని వెంకట్ తోబుట్టువులు మనస్పూర్తిగా స్వాగతించారు. అవసరమైతే తాము కూడా ఆర్థిక సహాయం చేసేందుకు సిద్ధమన్నారు. ఆడపిల్లల మాటల ఆసరాతో కొండంత బలం వచ్చిన తానుబాయి ఆ డబ్బును ఆలయానికి విరాళంగా ఇచ్చి ఊరుకోలేదు. దగ్గరుండి మరీ రెండంతస్తుల ధర్మసత్రాన్ని కట్టించింది. లక్ష్మినారాయణస్వామి ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఈ భవనాన్ని ఆలయానికి అంకితం చేసింది. ఆమె కట్టించిన ఈ ధర్మసత్రం వ్రతాలు, పూజలు చేసుకునేందుకు వచ్చే తమలాంటి ఎందరో భక్తులకు ఎంతో సౌకర్యంగా ఉంటోందని భక్తులు పేర్కొంటున్నారు. ఆలయం పక్కనకూరగాయలమ్ముతూ జీవనం కొనసాగిస్తున్న ఈ నిరుపేదరాలు ఆశయంలో మాత్రం అదనంత ధనికురాలే! అందరికీ ఆదర్శనీయురాలే! - పాత బాలప్రసాద్, సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ -
ఆదిలోనే హంసపాదు
జైనథ్, న్యూస్‌లైన్ : మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో శుక్రవారం పత్తి కొనుగోళ్లు ఆరంభంలోనే రసాభాసగా మారాయి. జైనథ్ మార్కెట్ యార్డులో కొనుగోలు చేసిన పత్తిని రైతులే తమ సొంత ఖర్చుతో బేల మండల కేంద్రంలోని జిన్నింగ్ మిల్లుకు తరలించాలని, లేని పక్షంలో మార్కెట్ కమిటీ రవాణ భరించాలని కొనుగోలుదారులు పేర్కొనడంతో ఆదిలోనే కొనుగోళ్లు నిలిచాయి. కలెక్టర్ ఆదేశాల మేరకు హడావుడిగా కొనుగోళ్లు ప్రారంభిస్తున్నామని ప్రకటించిన మార్కెట్ అధికారులు, పత్తి బండ్లను ఎక్కడ అన్లోడ్ చేయాలనే విషయంలో కొనుగోలుదారులకు, రైతులకు స్పష్టత ఇవ్వకపోవడం సమస్యకు దారితీసింది. లొల్లి ఇలా మొదలు.. జైనథ్ మార్కెట్ యార్డులో శుక్రవారం మార్కెట్ కమిటీ చైర్మన్ మునిగెల విఠల్, ఎమ్మెల్యే జోగు రామన్న, ఆర్డీవో సుధాకర్‌రెడ్డి ఎలక్ట్రానిక్ కాంటాల వద్ద పూజలు చేశారు. కాంటాల కోసం ఏర్పాటు చేసిన కంప్యూటర్ల గదులను ప్రారంభించారు. అనంతరం సీసీఐ, వ్యాపారులు కొనుగోలు చేయడానికి సిద్ధమయ్యారు. ఇంతలోనే కొందరు రైతులు కొనుగోళ్లు సరే, పత్తిబండ్లను ఎక్కడ అన్లోడ్ చేయాలో చెప్పాలని అధికారులను ప్రశ్నించారు. మార్కెట్ అధికారులు, ఆర్డీవో కలుగజేసుకుని రైతులకు నచ్చజెప్పడానికి ప్రయత్నించారు. ఇది ఒక్కరోజు సమస్య కాదని శాశ్వతంగా జైనథ్‌లోనే కొనుగోలు చేయడానికి చర్యలు తీసుకోవాలని రైతులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. వ్యాపారుల అడ్డుపుల్ల రైతులు అమ్మిన పత్తి బండ్లను జైనథ్ మార్కెట్ యార్డులోనే అన్లోడ్ చేయాలని పేర్కొనడంతో వ్యాపారులు అడ్డుపడ్డారు. ఇక్కడే అన్లోడింగ్ చేస్తే, పత్తి బండ్లను జిన్నింగ్కి తరలించుటకు అయ్యే రవాణ ఖర్చులు తాము భరించలేమని, రైతులు లేదా మార్కెట్ కమిటీ వారే భరించాలని తెల్చిచెప్పారు. జైనథ్‌లో పత్తి నిల్వకు వసతులు లేవని, ముఖ్యంగా ఫైర్‌సేఫ్టీ లేదని వారు అధికారులకు వివరించారు. దీంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కొనుగోళ్లు నిలిచాయి. ఎమ్మెల్యే రామన్న కలుగజేసుకుని కొనుగోలు దారులు, కలెక్టర్‌తో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడితే సమస్య పరిష్కారం అవుతుందని తేల్చిచెప్పారు. అధికారుల ఆదేశా లు పెడచెవిన పెట్టి మొండిగా వ్యవహరిస్తున్న కొనుగోలుదారులపై చర్యలు తీసుకుంటామని, కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని ఆర్డీవో అన్నారు. ఈకార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి పుల్లయ్య, తహశీల్దార్ జ్యోతి, ఎంపీడీవో రామకృష్ణ, మార్కెట్ కార్యదర్శి ఫయాజోద్దీన్, జైనథ్ సర్పంచ్ ప్రమీలా పోతారెడ్డి, ఉపసర్పంచ్ గణేశ్ యాదవ్, మాజీ మండల ఉపాధ్యక్షుడు కల్చాప్ రెడ్డి, ఏఎంసీ మాజీ అధ్యక్షుడు యాసం నర్సింగ్, ఏఎంసీ మాజీ ఉపాధ్యాక్షుడు భీమ్‌రెడ్డి, రైతులు కిష్టారెడ్డి, లస్మన్న, అశోక్‌రెడ్డి, అశోక్ యాదవ్ పాల్గొన్నారు.