‘కాపుల కోసం ఆయన ఒక పని కూడా చేయలేదు’
సాక్షి, విజయవాడ: గత టీడీపీ ప్రభుత్వం కాపులకు వెయ్యి కోట్లు ఇస్తామని చెప్పి..ఐదేళ్లలో రెండు వేల కోట్లు కూడా ఖర్చుచేయలేదని మంత్రి కురసాల కన్నబాబు విమర్శించారు. ఆదివారం కాపు ఛైర్మన్ జక్కంపూడి రాజా ప్రమాణా స్వీకారోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ..ఢిల్లీ పర్యటనలు తప్ప..చంద్రబాబు కాపుల కోసం ఒక పని కూడా చేయలేదన్నారు. కాపులు ఓసినో, బీసీనో చెప్పలేని విధంగా కాపులను చంద్రబాబు మోసం చేశారని ధ్వజమెత్తారు. సీఎం వైఎస్ జగన్ కాపులకు ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా పాటిస్తున్నారన్నారు. జక్కంపూడి రాజాను కాపు కార్పొరేషన్ ఛైర్మన్‌గా నియమించడం సీఎం జగన్ ఖచ్చితమైన నిర్ణయాలకు నిదర్శమని తెలిపారు.రాజకీయ,సామాజిక,విద్య,ఆర్థిక పరంగా కాపులను ఎదిగేలా చేస్తే కాపులు అన్ని రంగాల్లోనూ ముందుంటారని తెలిపారు. ఐక్యంగా ఉంటే అన్నీ సాధించుకోగలుగుతామన్నారు.
చంద్రబాబులా కాపులను మోసం చేయం: అబంటి
కాపు కార్పొరేషన్‌కు పదివేల కోట్లు ఖర్చు చేయడానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఎమ్మెల్యే అబంటి రాంబాబు అన్నారు. అన్నికార్పొరేషన్ల కన్నా కాపు కార్పొరేషన్ ఆర్థిక పరిపుష్టి సంతరించుకుందన్నారు. కాపులను బీసీల్లోకి చేరుస్తానని చెప్పిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేశారన్నారు. దీంతో కాపులకు తీరని నష్టం కలిగిందన్నారు. మంజునాధ కమిషన్ నివేదిక వ్యతిరేకంగా ఉండటంతో .. కమిషన్ సభ్యుల రిపోర్టు కేంద్రానికి ఇచ్చేలా చంద్రబాబు చేశారని మండిపడ్డారు. రెండు రిపోర్టులపై కేంద్రం అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు ప్రభుత్వం సమాధానమే ఇవ్వలేదన్నారు. చంద్రబాబు కాపులను నమ్మించి మోసం చేశారని..మా ప్రభుత్వం కాపులను మోసం చేయదన్నారు. కాపు సంక్షేమానికి ఏమి చేయడానికైనా సిద్ధంగా ఉన్నామన్నారు.