ఇంటర్ పేపర్ లీక్..భారత్‌పైన ఆరోపణలు
కరాచీ: పాకిస్థాన్‌లో ఏ సంఘటన జరిగినా భారత్ వైపే వేలెత్తి చూపటం పరిపాటిగా మారింది. ఇందుకు తాజాగా మరో ఉదంతం వచ్చి చేరింది. సింధ్ ప్రావిన్సులో ప్రస్తుతం జరుగుతున్న ఇంటర్ పరీక్షల్లో ప్రశ్నాపత్రం లీకయింది. అయితే, ఇందుకు పాక్ అధికారులు ఇండియాను తప్పుపడుతున్నారు. ఇండియన్ సిమ్ కార్డుల ద్వారానే ఇంటర్ పరీక్ష ప్రశ్నలు సోషల్ మీడియాలో వచ్చాయని ఆరోపిస్తున్నారు. ఫిజిక్స్ ప్రశ్నపత్రం పరీక్ష ప్రారంభానికి నలబై నిమిషాల ముందే సోషల్ మీడియాలో అందరికీ చేరిపోయింది. ఇందుకు కారణం ఇండియన్ ఫోన్ సిమ్ కార్డులే కారణమని సింధ్ ప్రావిన్సు విద్యాశాఖ మంత్రి జామ్ మెహ్తాబ్ దేహార్ తేల్చారు.
దీనిపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించామన్నారు. భారత్‌తో ప్రస్తుతం సంబంధాలు దిగజారిన నేపథ్యంలో ఇటువంటి సంఘటన జరగటంపై ఆందోళన వ్యక్తం చేశారు. రెండు దేశాల సరిహద్దుల్లోని థార్పర్కార్ జిల్లాలో ఇండియా సిమ్ కార్డులను ఉపయోగిస్తుంటారని అక్కడి అధికారులే ఒప్పుకుంటున్నారు. దీనిపై దర్యాప్తులేవీ అక్కర్లేదని చెబుతున్నారు. ఇలా ఉండగా ఇప్పటి వరకు ఇక్కడ ఇంటర్‌కు సంబంధించి ఐదు సబ్జెక్టుల ప్రశ్నాపత్రాలు వాట్సాప్‌లో లీకయ్యాయని తెలుస్తోంది. సింధ్ ప్రావిన్సులో పరీక్షల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బహిరంగంగానే కాపీయింగ్ జరుగుతోందని ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై ఇటీవల మీడియాలోనూ పలు కథనాలు వచ్చాయి.