పచ్చని ఆకులు తోడుంటే...
బ్యూటిప్స్
పచ్చని ఆకులు ఆరోగ్యాన్ని పదికాలాలు పచ్చగా ఉంచుతాయి. శిరోజాల అందాన్ని కాపాడటంలోనూ ఆకులు ముందున్నాయి. రసాయనాల వాడకం లేకుండా సహజసిద్ధమైన వాటితో కేశసౌందర్యాన్ని కాపాడుకోవడం ఎలాగో తెలుసుకుందాం.
జామకాయల రుచి గురించి మనందరికీ తెలిసిందే. జామ ఆకు గొప్పతనం గురించి ఎంత మందికి తెలుసు. కురుల కుదుళ్లను బలపరచడమే కాదు, నిగనిగలనూ పెంచుతుంది జామ ఆకు. లీటర్ నీటిలో గుప్పెడు జామ ఆకులను వేసి అరగంట సేపు అలాగే ఉంచాలి. ఆ తర్వాత ఆ నీటిని మరిగించి, పూర్తి వేడి తగ్గేంతవరకు ఉంచాలి. ఆ తర్వాత వడకట్టి, ఆకులను తీసేయాలి. ఇప్పుడు ఈ నీటిని జుట్టు కుదుళ్లకు పట్టించాలి. జామ ఆకులో ఉండే ఔషధగుణాలు మరిగించడంతో నీటిలోకి వ చ్చేస్తాయి. ఆ నీటిని తలకు వాడటం వల్ల కుదుళ్లు బలపడి, జుట్టు రాలడం తగ్గుతుంది. షాంపూలలో ఉండే గాఢమైన రసాయనాల ప్రభావం కూడా జామ ఆకులతో తయారుచేసుకున్న నీటిని వాడటం వల్ల తగ్గుతుంది.
కొబ్బరినూనెలో తగినన్ని కరివేప ఆకులను వేసి మరిగించి, చల్లారనివ్వాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకుదుళ్లకు పట్టించి, మసాజ్చేసుకోవాలి. వారానికి రెండుసార్లు ఈ విధంగా చేయడం వల్ల జుట్టు రాలడం, తెల్లబడటం వంటి సమస్యలు తగ్గుతాయి. కొబ్బరినూనెలోని ప్రొటీన్లు జుట్టుకుదుళ్లకు బలాన్ని ఇస్తాయి. కరివేపాకు కేశాలు చిట్లకుండా మాయిశ్చరైజర్లా ఉపయోగపడుతుంది.
లీటర్ నీటిలో గుప్పెడు వేప ఆకులు వేసి మరిగించాలి. ఈ నీళ్లు చల్లారాక తలకు పట్టించాలి. పది-ఇరవై నిమిషాలు అలాగే ఉంచి, తర్వాత శుభ్రపరచుకోవాలి. వారానికి నాలుగుసార్లు ఈ విధంగా చేస్తూ ఉంటే జుట్టు రాలడం తగ్గుముఖం పడుతుంది.
తులసి ఆకులో మెగ్నీషియం అధికంగా ఉంటుంది. అలాగే మన ఆరోగ్యానికి ఉపయోగపడే వందల రకాల ఓషధులు తులసిలో ఉన్నాయి. గుప్పెడు తులసి ఆకులను ముద్దగా నూరి, అర లీటర్ నీటిలో వేసి మరిగించాలి. ఈ నీరు చల్లారిన తర్వాత తలకు పట్టించి, పది నుంచి పదిహేను నిమిషాలు ఉంచి కడిగేయాలి. వెంట్రుక చిట్లడం తగ్గుతుంది. రక్తప్రసరణ మెరుగవుతుంది. కుదుళ్లు బలపడి వెంట్రుకల ఎదుగుదల బాగుంటుంది. వారానికి ఒకసారైనా తులసి చికిత్స శిరోజాలకు ఎంతో మేలు చేస్తుంది.