Janachitanya trip
-
‘టీఆర్ఎస్ ప్రభుత్వంపై యుద్ధం’
సాక్షి, హైదరాబాద్ : జనచైతన్య యాత్రతో టీఆర్ఎస్ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించామని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. శనివారం జనచైతన్య యాత్ర ప్రారంభం సందర్భంగా బషీర్‌బాగ్ దుర్గామాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. యాత్రతో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని, కుటుంబ పాలనకు శుభం పలుకుతామని అన్నారు. అనంతరం జనచైతన్య రథం యాదాద్రికి బయలుదేరింది. యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించిన తర్వాత బహిరంగ సభలో పాల్గొంటారాయన. ఈ సభలో బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, బండారు దత్తాత్రేయ, ఎన్వీఎస్సెస్ ప్రభాకర్, ఎమ్మెల్సీ రాం చందర్ ఇతర పార్టీ నాయకులు పాల్గొంటారు. -
‘తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు’
సాక్షి, హైదరాబాద్ : జన చైతన్యయాత్రతో రాష్ట్రం మొత్తం పర్యటించి తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తామని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించి.. ప్రజల ముందు కాంగ్రెస్‌ను, టీఆర్ఎస్ను దోషిగా నిలబెడతామన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా టీఆర్ఎస్-బీజేపీ మధ్య రహస్య ఒప్పందం జరిగిందని విషప్రచారం చేస్తున్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్లు రెండూ కూడా మజ్లిస్‌తో అంటకాగిన పార్టీలేనని, తాము ఎవరితో రహస్య ఒప్పందం చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలకు ప్రజా క్షేత్రంలో బుద్ధి చెప్తామన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం కుటుంబ పాలనగా సాగుతోందని.. బీసీలను కాంగ్రెస్, టీఆర్ఎస్లు మోసం చేశాయని విమర్శించారు. ఈ రెండు పార్టీలు బీసీ, ఎస్సీ, ఎస్టీలను ఓటు బ్యాంకుగానే చూస్తున్నాయని, వారికి ద్రోహం చేశాయని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎస్సీ వర్గీకరణ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వర్గీకరణ చేస్తామని చెప్పడం హాస్యాస్పదమన్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ మోసపూరిత చర్యలను ప్రజల ముందు ఎండగడతామన్నారు. కేంద్రం ఇచ్చే పంచాయతీ నిధులను ఖర్చు చేయకుండా తాత్సారం చేస్తోందన్నారు. 2019 ఎన్నికలే లక్ష్యంగా తెలంగాణలో అధికారంలోకి వచ్చే విధంగా కృషి చేస్తామని తెలిపారు. శనివారం నుంచి తెలంగాణలో బీజేపీ జన చైతన్యయాత్ర ప్రారంభం కానుంది. -
ఇదేం ఖర్మండీ బాబూ!
జన చైతన్య యాత్రల్లో పాల్గొనాలంటూ మంత్రుల ఒత్తిళ్లు నోరు మెదిపే ధైర్యం లేక సతమతమవుతున్న అధికారులు తొలిరోజు వివిధ జిల్లాల్లో మండల స్థాయి అధికారుల హాజరు సాక్షి, విజయవాడ అధికార టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జన చైతన్య యాత్రల్లో పాల్గొనాలంటూ పార్టీ నేతలు ప్రభుత్వ అధికారులకు హుకుం జారీ చేస్తున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రత్యేకంగా ఫోన్లు చేస్తున్నారు. 'ఏం జరిగినా మేం చూసుకుంటాం' అని భరోసా ఇస్తున్నారు. ఏం చెప్పినా నేతలు వినరన్న భావనతో మండల స్థాయిలో పనిచేసే చాలామంది అధికారులు మంగళవారం జన చైతన్య యాత్రలకు హాజరయ్యారు. 'ఇదేం ఖర్మండీ బాబూ... ప్రశాంతంగా ఆఫీస్ పనులు చేసుకోలే కపోతున్నాం. ఇలాగైతే ఉద్యోగాలెలా చేయాలి' అని కృష్ణా జిల్లాలోని పలువురు మండల అధికారులు ఒకరికొకరు ఫోన్లు చేసుకొని తమ గోడు వెళ్లబోసుకున్నారు. జిల్లాలోని ఇద్దరు మంత్రులు, పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు తాము పాల్గొనే మండలాలకు చెందిన ఎంపీడీఓ, తహసీల్దార్, విద్యుత్, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈఈలు, వ్యవసాయ శాఖ ఏఓలకు ఫోన్లు చేశారు. జన చైతన్య యాత్రలకు రావాలని రెండ్రోజుల ముందే చెప్పారు. కాదంటే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందోనన్న భయంతో కొందరు అధికారులు మంగళవారం నాటి యాత్రలకు హాజరయ్యారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం కరగ్రహారం, చినకరగ్రహారం గ్రామాల్లో జరిగిన చైతన్య యాత్రలో ఎంపీడీఓ, పంచాయతీరాజ్ ఏఈలు కూడా పాల్గొన్నారు. పెనమలూరు, మైలవరం, నూజివీడు నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. గుంటూరు జిల్లాలోనూ అధికారులకు ఈ బాధ తప్పలేదు. జిల్లాకు చెందిన ఓ మంత్రి పదేపదే చెప్పడంతో అమరావతి మండలం లేమల్లె, యండ్రాయి గ్రామాల్లో జరిగిన సభలకు తహసీల్దార్, ఎంపీడీఓ, ఏఓ హాజరయ్యారు. విశాఖ జిల్లాలోని తగరపువలస, అనకాపల్లి, భీమిలి, చోడవరం, యలమంచిలి మండలాల్లో కొందరు అధికారులు జన చైతన్య యాత్రలకు హాజరయ్యారు. నెల్లూరు జిల్లా కావలి మండలం ముసునూరులో జరిగిన కార్యక్రమంలో మండల అధికారులు పాల్గొన్నారు. చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లోనూ కొన్ని మండలాల్లో అధికారులు జన చైతన్య యాత్రలకు హాజరైనట్లు సమాచారం. ప్రతి సోమవారం నరకమే: ప్రతి సోమవారం జరిగే కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్‌లతో నరకం అనుభవించాల్సి వస్తోందని పలువురు మండల అధికారులు గగ్గోలు పెడుతున్నారు. సాయంత్రం 3 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా సాగే వీడియో కాన్ఫరెన్స్ వల్ల విలువైన సమయాన్ని వృథా చేసుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.