ఇదేం ఖర్మండీ బాబూ! | Officials are reluctant to participate in the 'Jana chitanya yatra' | Sakshi
Sakshi News home page

ఇదేం ఖర్మండీ బాబూ!

Published Wed, Dec 2 2015 10:41 AM | Last Updated on Sun, Sep 3 2017 1:23 PM

Officials are reluctant to participate in the 'Jana chitanya yatra'

 జన చైతన్య యాత్రల్లో పాల్గొనాలంటూ మంత్రుల ఒత్తిళ్లు
 నోరు మెదిపే ధైర్యం లేక సతమతమవుతున్న అధికారులు
 తొలిరోజు వివిధ జిల్లాల్లో మండల స్థాయి అధికారుల హాజరు
 సాక్షి, విజయవాడ

 అధికార టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జన చైతన్య యాత్రల్లో పాల్గొనాలంటూ పార్టీ నేతలు ప్రభుత్వ అధికారులకు హుకుం జారీ చేస్తున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రత్యేకంగా ఫోన్లు చేస్తున్నారు. 'ఏం జరిగినా మేం చూసుకుంటాం' అని భరోసా ఇస్తున్నారు. ఏం చెప్పినా నేతలు వినరన్న భావనతో మండల స్థాయిలో పనిచేసే చాలామంది అధికారులు మంగళవారం జన చైతన్య యాత్రలకు హాజరయ్యారు. 'ఇదేం ఖర్మండీ బాబూ...  ప్రశాంతంగా ఆఫీస్ పనులు చేసుకోలే కపోతున్నాం.

ఇలాగైతే ఉద్యోగాలెలా చేయాలి' అని కృష్ణా జిల్లాలోని పలువురు మండల అధికారులు ఒకరికొకరు ఫోన్లు చేసుకొని తమ గోడు వెళ్లబోసుకున్నారు. జిల్లాలోని ఇద్దరు మంత్రులు, పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు తాము పాల్గొనే మండలాలకు చెందిన ఎంపీడీఓ, తహసీల్దార్, విద్యుత్, పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈఈలు, వ్యవసాయ శాఖ ఏఓలకు ఫోన్లు చేశారు.

జన చైతన్య యాత్రలకు రావాలని రెండ్రోజుల ముందే చెప్పారు. కాదంటే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందోనన్న భయంతో కొందరు అధికారులు మంగళవారం నాటి యాత్రలకు హాజరయ్యారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం కరగ్రహారం, చినకరగ్రహారం గ్రామాల్లో జరిగిన చైతన్య యాత్రలో ఎంపీడీఓ, పంచాయతీరాజ్ ఏఈలు కూడా పాల్గొన్నారు. పెనమలూరు, మైలవరం, నూజివీడు నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.

గుంటూరు జిల్లాలోనూ అధికారులకు ఈ బాధ తప్పలేదు. జిల్లాకు చెందిన ఓ మంత్రి పదేపదే చెప్పడంతో అమరావతి మండలం లేమల్లె, యండ్రాయి గ్రామాల్లో జరిగిన సభలకు తహసీల్దార్, ఎంపీడీఓ, ఏఓ హాజరయ్యారు. విశాఖ జిల్లాలోని తగరపువలస, అనకాపల్లి, భీమిలి, చోడవరం, యలమంచిలి మండలాల్లో కొందరు అధికారులు జన చైతన్య యాత్రలకు హాజరయ్యారు.

నెల్లూరు జిల్లా కావలి మండలం ముసునూరులో జరిగిన కార్యక్రమంలో మండల అధికారులు పాల్గొన్నారు. చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లోనూ కొన్ని మండలాల్లో అధికారులు జన చైతన్య యాత్రలకు హాజరైనట్లు సమాచారం.


ప్రతి సోమవారం నరకమే: ప్రతి సోమవారం జరిగే కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్‌లతో నరకం అనుభవించాల్సి వస్తోందని పలువురు మండల అధికారులు గగ్గోలు పెడుతున్నారు. సాయంత్రం 3 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా సాగే వీడియో కాన్ఫరెన్స్ వల్ల విలువైన సమయాన్ని వృథా చేసుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement