janasangh
-
నెహ్రూ హిందువు కాదంటారా?
నెహ్రూ నిజంగానే హిందువులకు వ్యతిరేకిగా ఉన్నారా? ఆయన జీవితాన్ని తరచి చూసిన ఏ సత్యాధ్యయనమైనా వంచనాపూరితమైన ఈ దుష్ప్రచారాన్ని బహిర్గతం చేస్తుంది. రామాయణ, మహాభారత, భగవద్గీతల పట్ల నెహ్రూకు ఉన్న ప్రీతి, గౌరవ ప్రపత్తులకు సాక్ష్యాల వెల్లువలు ఆయన రచనల్లో కనిపిస్తాయి. గుడిలో ప్రదక్షిణాలు చేసే హిందువు కాదు నెహ్రూ. కానీ హిందూ ఆధ్యాత్మికత, మార్మికతలపై ప్రగాఢమైన ఆసక్తులతో పెరిగారు. హిమాలయాలు, గంగానది భారతీయ నాగరికతకు ఉయ్యాలలు అని నెహ్రూ చేసిన అభివర్ణన మనల్ని వాటి దివ్యత్వంలో ఓలలాడిస్తుంది. దురదృష్టవశాత్తూ నెహ్రూ హిందువని సంఘ్ పరివార్, కాంగ్రెస్ రెండూ మరిచిపోయాయి. తప్పుడు సమాచారానికి విస్తృత ప్రచారం కల్పించడంలో బీజేపీలోని కేంద్రీకృత సోషల్ మీడియా కమ్యూనికేషన్ వ్యవస్థ ఎంతో సమర్థంగా పని చేస్తుంటుందని ఢిల్లీ కాలేజీలో పాఠాలు చెబుతుండే నా మిత్రుడొకరు అన్నారు. ‘‘ఢిల్లీ నుంచి పంపిన సమాచారం వేలాది వాట్సాప్ గ్రూపుల ద్వారా దేశం మొత్తానికి చేరుతుంది. ఉదాహరణకు, నేనొకసారి బిహార్‌లోని నా గ్రామస్థులు కొందరిని...‘విద్య వల్ల నేను ఆంగ్లేయుడిని, సంస్కృతి వల్ల మహమ్మదీయుడిని, యాదృచ్ఛికంగా మాత్రమే హిందువును’ అని ఒక నాయకుడు చెప్పుకున్నారని అంటారు. ఆ నాయకుడెవరో మీకు తెలుసా?’ అని అడిగాను. ఆ ప్రశ్నకు తటాలున వచ్చిన సమా ధానం: ‘నెహ్రూ’! భారతదేశ తొలి ప్రధాని నెహ్రూ అంటే గిట్టని హిందూ జాతీయవాద రాజకీయ పార్టీ ‘హిందూ మహాసభ’ 1950లో తొలి సారి, ‘‘నెహ్రూ విద్య చేత ఆంగ్లేయుడు. సంస్కృతి చేత మహమ్మ దీయుడు. యాదృచ్ఛికంగా మాత్రమే హిందువు’’ అని విమర్శించింది. తదనంతర కాలంలో ఆ మాటను నెహ్రూను ద్వేషించేవారంతా నెహ్రూకే ఆపాదించి, స్వయంగా ఆయనే తన గురించి ఆ విధంగా చెప్పుకొన్నట్లు ప్రచారంలోకి తెచ్చారు. గత ఏడాది ప్రారంభంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ, ‘‘యాదృచ్ఛికంగా మాత్రమే తాము హిందువులమని చెప్పుకున్న వారి వారసులు తమను తాము హిందువులమని చెప్పు కోకూడదు’’ అని రాహుల్ గాంధీపై చురకలు వేయడంతో ఉద్దేశ పూర్వకమైన ఆ ఆపాదింపునకు పునరుద్ధరణ జరిగినట్లయింది. సుసంపన్న భారత ఆనవాళ్లు నెహ్రూ నిజంగానే హిందువులకు వ్యతిరేకిగా ఉన్నారా? ఆయన జీవితాన్ని తరచి చూసిన ఏ సత్యాధ్యయనమైనా వంచనాపూరితమైన ఈ దుష్ప్రచారాన్ని బహిర్గతం చేస్తుంది. నెహ్రూ రాసిన ‘గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ’ (1934), ‘యాన్ ఆటోబయాగ్రఫీ’ (1936), ‘ద డిస్క వరీ ఆఫ్ ఇండియా’ (1946) మూడూ ప్రభావశీలమైనవి. డిస్కవరీ ఆఫ్ ఇండియా కారాగార వాసంలో రాసిన ఒక క్లాసిక్. (బ్రిటిష్ వాళ్లు ఆయన్ని 14 సార్లు జైలుకు పంపారు. 3,259 రోజులు కటకటాల వెనుక గడిపారు.) ఆయన ప్రసంగ సంకలనాలు, వ్యాసాలు, లేఖలు (పక్షానికొకసారి ముఖ్యమంత్రులకు ఆయన రాసిన లేఖలే ఐదు భారీ సంపుటాలు అయ్యాయి!) ... ఇవన్నీ కూడా ఇస్లాం, ఇతర బాహ్య ప్రభావాల చేత సుసంపన్నమైనదిగా నెహ్రూ భావించిన భారతదేశం తాలూకూ ప్రాచీన హిందూ నాగరికత సార్వత్రికత, సమగ్రతలతో నిండి ఉన్నవే. రామాయణ, మహాభారత, భగవద్గీతల పట్ల నెహ్రూకు ఉన్న ప్రీతి, గౌరవ ప్రపత్తులకు సాక్ష్యాల వెల్లువలు ఆయన రచనల్లో కనిపి స్తాయి. వేదాలు, ఉపనిషత్తులు, తదితర గ్రంథాలలోని మన రుషుల జ్ఞానం, భక్తియుగంలోని సాధువులు, కవులు, సంఘ సంస్కర్తలు; రామకృష్ణ పరమహంస, స్వామీ వివేకానంద, మహర్షి అరబిందో, ఆధునిక కాలంలో జాతీయతా భావం మేల్కొనేందుకు దోహదపడిన ఇతర హిందూ తాత్విక మహర్షుల గొప్పదనాన్ని నెహ్రూ రచనలు దర్శింపజేస్తాయి. ఇక తన గురువు, హిందూ మతబోధనలతో జీవిత మార్గాన్ని ఏర్పరచిన మహాత్మాగాంధీపై ఆయనకున్న గురి ఎంతటిదో తెలిసిందే. నెహ్రూ తన చివరి సంవత్సరాలలో ఉపనిషత్తులపై చర్చించడానికి తరచు తనను కలిసేందుకు వచ్చేవారని భారత రాష్ట్రపతి (1962–67), హిందూ తాత్వికతపై ప్రశంసలు పొందిన అనేక పుస్తకాలకు రచయిత అయిన ఎస్.రాధాకృష్ణన్ ఒక సందర్భంలో వెల్లడించారు. ఆలోచనల ప్రతిధ్వనులు నెహ్రూ ప్రాపంచిక దృక్పథానికి, ఆయన కాలం నాటి కొందరు జనసంఘ్ హిందూ నాయకుల దృష్టి కోణానికి మధ్య స్పష్టమైన సారూప్యాన్ని కూడా మనం చూడవచ్చు. ఉదాహరణకు, బీజేపీ తన సైద్ధాంతిక మార్గదర్శిగా పరిగణించే పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రంథం ‘ఇంటెగ్రల్ హ్యూమనిజం’... పెట్టుబడిదారీ, కమ్యూనిస్టు వ్యవస్థలను విడిచిపెట్టి భారతదేశం సమగ్ర అభివృద్ధి మార్గాన్ని అనుసరించాలన్న నెహ్రూ ఆలోచనను ప్రతిధ్వనిస్తుంది. నెహ్రూ మాదిరిగానే దీన్‌దయాళ్ కూడా మన ప్రాచీన సంస్కృతిలో మంచిది ఏదో దానిని తీసుకుని, అందులోని చెడును రూపుమాపడానికి సంసి ద్ధమవడాన్ని గర్వంగా భావించాలని చెప్పారు. ఆయన ఇలా రాశారు: ‘‘మనం మన ప్రాచీన సంస్కృతిలోని ప్రత్యేకతను గుర్తించకపోలేదు. అలాగని మనం పురావస్తు శాస్త్రజ్ఞులం కాలేము. విస్తారమైన ఈ పురావస్తు మ్యూజియానికి సంరక్షకులం కావాలన్న ఉద్దేశం కూడా మనకు లేదు. మన సమాజంలో విలువలను, జాతీయ ఐక్యతను పెంపొందించడానికి అవసరమయ్యే కొన్ని సంస్కరణలైతే చేయాలి. అందుకోసం కొన్ని సంప్రదాయాలకు స్వస్తి చెప్పాలి’’. నెహ్రూకు, ఆర్ఎస్ఎస్, జనసంఘ్, మోదీ–పూర్వపు బీజేపీ లలోని నెహ్రూ విమర్శకులకు మధ్య తీవ్రమైన కొన్ని విభేదాలు ఉండొచ్చు. వాటిని దాచేయలేం. కానీ ఇప్పుడు నెహ్రూపై మనం చూస్తున్న క్రూర, విషపూరితమైన దూషణలు అప్పుడు లేవు. 1964 మేలో ఆయన మరణించినప్పుడు పార్లమెంటులో అటల్ బిహారీ వాజ్‌పేయి... ‘‘తన ముద్దుల యువరాజు దీర్ఘ నిద్రలోకి కనురెప్పలు వాల్చడంతో భరతమాత శోక సముద్రంలో మునిగిపోయింది’’ అని ఘనంగా నివాళులు అర్పించారు. నెహ్రూను శ్రీరామచంద్రుడితో పోలుస్తూ, ‘‘వాల్మీకి గాథలో కనిపించే గొప్ప భావనలు మనకు పండిట్జీ జీవితంలో లభిస్తాయి’’ అన్నారు. ‘‘రాముడిలా నెహ్రూ కూడా అసాధ్యమైన, అనూహ్యమైన వాటికి రూపకర్త. ఆయన వ్యక్తిత్వ బలం, ఆ చైతన్యం, మనోస్వేచ్ఛ; ప్రత్యర్థికి, శత్రువుకు సైతం స్నేహ హస్తం చాచే గుణం, ఆ పెద్ద తరహా, ఆ గొప్పతనం బహుశా భవి ష్యత్తులో కనిపించకపోవచ్చు’’ అని నివాళులు అర్పించారు. ఆర్ఎస్ఎస్ రెండవ చీఫ్ ‘గురూజీ’ గోల్వాల్కర్... నెహ్రూ దేశభక్తిని, మహోన్నతమైన ఆదర్శవాదాన్ని కొనియాడుతూ, ఆయనకు ‘భరత మాత గొప్ప పుత్రుడి’గా హృదయపూర్వక అంజలులు ఘటించారు. భారతదేశంలో పార్లమెంటరీ వ్యవస్థకు బలమైన పునాది వేసినందుకు ఎల్.కె. అద్వానీ తరచు నెహ్రూను ప్రశంసించేవారు. 2013లో ఆయన తన బ్లాగులో, ‘‘నెహ్రూ లౌకికవాదం హైందవ పునాదులపై ఆధార పడి ఉంది’’ అని విశ్లేషించారు. అలాగే, తీవ్ర మనో వేదనతో నెహ్రూ అకాల మరణం చెంద డానికి కారణం అయిన (1962 చైనా దురాక్రమణ యుద్ధంలో) భారత్ పరాజయం తర్వాత నెహ్రూ ఆర్ఎస్ఎస్, జనసంఘ్లను తిరిగి అంచనా వేయడం ప్రారంభించారనేందుకు కొన్ని ఆధారాలు ఉన్నాయి. తన మరణానికి కొద్ది వారాల ముందు జర్నలిస్టుల బృందంతో జరిపిన సంభాషణలో కమ్యూనిస్టు అనుకూల వార్తా పత్రిక అయిన ‘ది పేట్రియాట్’ ప్రతినిధి జనసంఘ్‌ను ‘జాతీయ వ్యతిరేక పార్టీ’ అనడంతోనే నెహ్రూ ఆ ప్రతినిధిని వారించారు. ‘‘కాదు, జనసంఘ్ దేశభక్త పార్టీ’’ అని బదులిచ్చారు. దురదృష్టవశాత్తూ నెహ్రూ హిందుత్వాన్ని జనసంఘ్, కాంగ్రెస్ రెండూ మరిచిపోయాయి. బదులుగా అవి తమ మధ్య ఉన్న వ్యత్యా సాన్ని నిరంతరంగా ఆరున్నరొక్క రాగం తీస్తున్నాయి. ఏదేమైనప్పటికీ భారతీయ నాగరికతను యుగయుగాలుగా నిలబెట్టిన ప్రత్యేక లక్షణం ‘సమన్వయాన్ని సాధించగల సామర్థ్యం’, ‘వ్యతిరేకతల్ని పరిష్కరించు కోవడం’, ‘ఒక కొత్త కలయిక’ అని వారు గుర్తుంచుకోవాలి. రెండు ధ్రువాలుగా విడిపోతున్న నేటి ప్రమాదకర కాలానికి... జాతి ప్రయోజ నాల కోసం ‘సంవాదం’ (సంభాషణ) ద్వారా ‘సమన్వయం’ సాధించిన నెహ్రూ ఆదర్శప్రాయులు. సుధీంద్ర కులకర్ణి వ్యాసకర్త మాజీ ప్రధాని వాజ్‌పేయి సహాయకులు (‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ సౌజన్యంతో) -
కాలంతో నడక
దాదాపుగా ముప్పయ్ సంవత్సరాల కిందటి నాటి ముచ్చట. ఇళ్లలోకి టెలివిజన్ సెట్లు నెమ్మదిగా చేరుకుం టున్న రోజులవి. దూరదర్శన్‌లో ‘మహాభారత్’ సీరియల్ ప్రారంభమైంది. ఆదివారం ఉదయం పూట ప్రసారమయ్యేది. ఆ సమయంలో వీధుల్లో కర్ఫ్యూ వాతావ రణం కనిపించేది. జనం టీవీలకు అతుక్కుపోయేవారు. అది హిందీలో వచ్చినా, భారతం కథ కనుక తెలుగు వాళ్లకు కూడా బాగానే అర్థమయ్యేది. హిందీయేతర ప్రాంతాల ప్రజలకు నాలుగు హిందీ ముక్కల్ని ఈ సీరి యల్ నేర్పించింది. టీవీ భారతం ఒక కొత్త పాత్రను ప్రజలకు పరిచయం చేసింది. అదే ‘కాలం’ పాత్ర. కాలం ఈ సీరియల్‌కు యాంకర్. సీరియల్ ప్రారంభం కాగానే తెరపై కాలచక్రం తిరుగుతూ వుండేది. నేపథ్యంలో హరీశ్ భిమానీ గొంతులోంచి కాలం సంభాషణ గంభీరంగా వినిపించి ప్రజలకు బాగా చేరువయ్యింది. తొలి ఎపిసోడ్లో కాలం తనను తాను పరిచయం చేసుకు న్నది. ‘‘మై సమయ్ హు!... మేరే జన్మ్ సృష్టికే నిర్మాణ్ కే సాత్ హువా థా! మై పిచ్లే యుగోంమే థా, ఇస్ యుగోంమే హు, ఔర్ ఆనేవాలే సబీ యుగోంమే రహూంగా...’’. ఆ సంభాషణలోనే తన స్వభావాన్ని కూడా కాలం చాటుకుంది. ‘‘ఈ భూమ్మీద పుట్టిన సమస్త జీవరాశిని, వాటి ఉత్థాన పతనాలను నేను చూశాను. నాతో కలిసి నడవలేక బ్రహ్మాండమైన డైనోసార్లు నశించాయి. నాతోపాటు మారలేకపోవడం వలన రోమ్ వైభవం, గ్రీకు రణతేజం, మొఘల్ ప్రాభవం నశిం చాయి. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం పతనమైంది. నాతోపాటు నడుస్తూ, నేను చేసే మార్పులను అనుసరిస్తూ వచ్చేవాడే విజయ శిఖరం మీద నిలబ డగలుగుతాడు’’. ఇది టీవీ సీరియల్ సంభాషణే అయిన ప్పటికీ, నిజంగా కాలం లక్షణం అదే. కాలం మానవా తీతమైనది. అందువల్ల దానికి జాలి, దయ, క్రోధం, ప్రేమ వగైరా మానవ వికారాలేమీ వుండవు. కదిలిపోవ డమే దాని కర్తవ్యం. ఎవరికోసమూ ఆగదు. ‘కదిలే కాలమా... కాసేపు ఆగవమ్మా, జరిగే వేడుకా... కళ్లార చూడవమ్మా’ అని కమ్మని కంఠంతో యేసుదాసు వేడు కున్నా అది ఆగదు. అనంత కాలగమనంలో డెబ్బయ్ ఒక్క సంవత్స రాల క్రితంనాటి ఒకానొక తారీఖు గురించీ, దాని చుట్టూ ముసురుకుంటున్న తత్వాల గురించే ఈ ఉపోద్ఘాతం. ఆ తారీఖు సెప్టెంబర్ 17. ఆ సంవత్సరం 1948. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అప్పటివరకూ బ్రిటిష్ ఇండియాలో భాగం కాకుండా విడిగా వున్న స్వదేశీ సంస్థానాలను భారత యూనియన్‌లో విలీనం చేసే ప్రక్రియను ప్రారంభించారు. అన్ని సంస్థానాల్లోకీ పెద్దది హైదరాబాద్. ఇది నిజాం రాజ్యం. హైదరా బాద్‌తోపాటు కశ్మీర్, జునాగఢ్ రాజ్యాలు విలీనానికి కొద్దిరోజులు మొరాయించాయి. ఆ తర్వాత విలీనమ య్యాయి. సెప్టెంబర్ 17వ తేదీనాడు అధికారికంగా హైదరాబాద్ రాష్ట్రం భారత యూనియన్‌లో విలీన మైంది. నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఎయిర్ పోర్ట్‌లో సర్దార్ పటేల్‌కు ఎదురువెళ్లి స్వాగతం పలికారు. భారత ప్రభుత్వం కూడా నవాబును హైదరాబాద్ రాష్ట్రా నికి రాజ్ ప్రముఖ్‌గా ప్రకటించింది. ఏటా యాభై లక్షల రూపాయల రాజభరణం చెల్లించేందుకు అంగీకరిం చింది. ఆయన ఎక్కడికి వెళ్లినా గౌరవ మర్యాదలకు భంగం కలగకుండా చూసుకుంది. విలీన కార్యక్రమానికి ముందు మొరాయించిన మూడు సంస్థానాలను లొంగ దీసుకోవడానికి మూడు రకాల వ్యూహాలను భారత ప్రభుత్వం అమలుచేసింది. హైదరాబాద్‌కోసం ‘ఆపరేషన్ పోలో’ అనే యుద్ధవ్యూహాన్ని రచించారు. ఆంధ్ర సరి హద్దు ప్రాంతంలో ఒకటి, బొంబాయి సరిహద్దు ప్రాంతంలో ఒకటి చొప్పున జనసంచారం లేని గుట్టల్లో రెండు బాగా చప్పుడయ్యే బాంబుల్ని వదిలారు. యాభై వేల మందితో కూడిన యూనియన్ మిలిటరీ దిగింది. నిజాం ఆదేశాల మేరకు నిజాం సైన్యం వెంటనే లొంగి పోయింది. పారా మిలిటరీ దళంలాగ వ్యవహరిస్తూ ప్రజ లను పీడిస్తున్న రజాకార్లు గ్రామాల నుంచి నెమ్మదిగా పలాయనం చిత్తగించారు. అయితే విలీన ప్రక్రియ ముగిసిన తర్వాత కూడా యూనియన్ సైన్యాలు మూడేళ్ల పాటు తెలంగాణలోనే తిష్టవేసి, చెమటోడ్చవలసి వచ్చింది. ఎందుకోసం? ఆరోజుల్లో హైదరాబాద్ రాష్ట్రంలో ఆంధ్ర మహాసభలో భాగంగానూ, స్టేట్ కాంగ్రెస్ పేరుతోనూ క్రియాశీలకంగా వ్యవహరించిన కాంగ్రెస్ పార్టీ గానీ, తెలంగాణ ప్రాంతంలో సాయుధ పోరును నడిపిన కమ్యూనిస్టులు గానీ ఈ సెప్టెంబర్ 17 నాడు పెద్దగా హడావుడి చేయక పోవడానికి కార ణమేమిటి? ‘ఊరూరా పండుగ చేద్దాం, ఊరినిండా జాతీయ జెండాను ఎగురవేద్దాం’ అంటూ హడావుడి చేస్తున్న భారతీయ జనతా పార్టీ కానీ, దానికి పూర్వ రూపమైన భారతీయ జనసంఘ్ కానీ అప్పటికి పుట్టనే లేదు. మరి ఎందుకని ఇంత ఉత్సాహం చూపుతు న్నట్టు? ఈ డెబ్బయ్యేళ్ల కాలగతిలోనే ఈ ప్రశ్నలకు సమా ధానాలున్నాయి. ఆనాటి నిజాం రాజ్యమైన హైదరాబాద్ రాష్ట్రంలో పదహారు జిల్లాలున్నాయి. ఎనిమిది జిల్లాలు తెలుగు మాట్లాడే ప్రజలున్న తెలంగాణ ప్రాంతం. ఐదు జిల్లాల్లో మరాఠీ మాతృభాష, మూడు జిల్లాలు కన్నడ ప్రాంతాలు. మాతృభాషలో విద్యాబోధన వుండేది కాదు. ఉర్దూ మీడియం స్కూళ్లు కూడా స్వల్పంగానే వుండేవి. వ్యవసాయ భూమిలో 70 శాతానికి పైగా దొరలు, జాగిర్దార్లు, దేశ్‌ముఖ్‌ల చేతుల్లో వుండేది. రైతు లందరూ దాదాపుగా కౌలుదార్లే. ఏ కొద్దిమంది రైతులకో సొంత భూమి వుండేది. గ్రామాల్లో పరిపాలనంతా దొరలూ, దేశ్‌ముఖ్‌లదే. ఇష్టానుసారం రైతులను భూముల నుంచి బేదఖల్ (కౌలు తొలగింపు) చేసేవారు. కింది కులాల ప్రజలు దొరలకు, అధికారులకు వెట్టిచాకిరీ చేయాల్సి వచ్చేది. ఇటువంటి పరిస్థితుల్లో తెలంగాణ ప్రాంతంలో ఆంధ్ర మహాసభ ఏర్పడింది. మరాఠీ, కన్నడ ప్రాంతాల్లో కూడా ఇదేవిధమైన సంస్థలు ఏర్ప డ్డాయి. తొలిరోజుల్లో చిన్నచిన్న రాయితీలకోసం, కనీస మైన ప్రజాస్వామిక హక్కులకోసం (సభలు జరుపుకో వడం వంటివి) మహజర్లు సమర్పించుకోవడానికి ఆంధ్ర మహాసభ పరిమితమైంది. గ్రామ ప్రాంతాల నుంచి వచ్చి చదువుకున్న ధనిక రైతు కుటుంబాల వారి సంఖ్య ఆంధ్ర మహాసభలో పెరగసాగింది. కొండా వెంకట రంగారెడ్డి, బూర్గుల రామకృష్ణారావు, మాడ పాటి హనుమంతరావు, మందుముల నర్సింహారావు వగైరాలు జాతీయవాదాన్ని బలంగా వినిపించేవారు. అంటే భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీకి పూర్వరూపంలా వీరు వ్యవహరించారు. మహాసభలో చురుగ్గా వుంటున్న రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, ఆరుట్ల లక్ష్మీనరసింహా రెడ్డి మొదలైన వారిపై కమ్యూనిస్టు భావాల ప్రభావం పడింది. వారి నాయకత్వంలో ఆంధ్ర మహాసభ సమర శీల స్వభావాన్ని సంతరించుకోసాగింది. వెట్టిచాకిరీని, బలవంతపు లెవీ వసూళ్లను నిషేధిస్తూ నిజాం జారీచేసిన ఫర్మానాలను అమలు చేయించుకోవడం కోసం కూడా న్యాయపోరాటాలు చేయవలసి వచ్చేది. అప్పటి నల్ల గొండ జిల్లాలో సూర్యాపేట, జనగామ తాలూకాలు భౌగోళికంగా దగ్గరగా వుండేవి. ఈ ప్రాంత నాయకులైన దేవులపల్లి వేంకటేశ్వరరావు, భీమిరెడ్డి నర్సింహారెడ్డి, నల్లా నర్సింహులు తదితరులు మిలిటెంట్ పోరాటా లతో భూస్వాములను హడలెత్తించారు. సూర్యాపేట తాలూకాను ఆనుకుని వున్న మునగాల పరగణా అప్పుడు బ్రిటిష్ ఇండియాలో భాగం. పరగణాలో జమీందారీ వ్యతిరేక పోరాటాలను పర్యవేక్షించడానికి వచ్చే ఆంధ్ర ప్రాంత కమ్యూనిస్టు నాయకులైన పుచ్చలపల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వరరావుల ప్రభావం ఈ నాయకులపై పడింది. పాలకుర్తి, కడవెండి గ్రామాల్లో భూస్వాముల ప్రైవేట్ సైన్యాలకు వ్యతిరేకంగా వేలాదిమంది ప్రజలను సమీకరించి వడిసెల రాళ్లతో యుద్ధం చేసే వ్యూహాన్ని కమ్యూనిస్టులు అమలు చేసి విజయం సాధించారు. పాలకుర్తి పోరాటానికి చాకలి ఐలమ్మ స్ఫూర్తి. కడవెండి పోరులో దొడ్డి కొమరయ్య తుపాకీ కాల్పులకు నేలకొరి గిన తొలి అమరుడిగా నిలిచిపోయాడు. ఆ వెంటనే బాలెంల, పాతసూర్యాపేట గ్రామాల్లో ఇదే తరహా ప్రజా యుద్ధం. ఈసారి నిజాం సేనలనూ ప్రజలు తరిమికొ ట్టారు. ఈ దశలోనే రైతాంగ సాయుధ పోరాటంలోని తొలి తుపాకీని భీమిరెడ్డి నర్సింహారెడ్డి చేతబూనాడు. సాయుధ దళాలు ఏర్పడి రైతులకు భూస్వాముల భూములను పంచడం ప్రారంభించాయి. దొరలు గడీ లను వదిలి పారిపోయారు. మూడువేల గ్రామాల్లో కమ్యూనిస్టులు గ్రామ రాజ్యాలను ఏర్పాటు చేశారు. ప్రతి ఊరిలో సాయుధ రక్షణ దళాలను ఏర్పాటు చేశారు. కమ్యూనిస్టు గెరిల్లా దళాలకు, నిజాం సేనలకు ప్రత్యక్ష యుద్ధం ప్రారంభమైంది. గ్రామాల మీద రజాకార్లు, నిజాం సేనలూ దాడిచేసి బీభత్సం సృíష్టించేవారు. ఒక్క భైరాన్‌పల్లి గ్రామంలోనే వందమందికి పైగా కమ్యూని స్టులను ఊచకోత కోశారు. ఎంత బీభత్సం జరిగినా రైతులు తమకు కమ్యూనిస్టులు పంచిన భూములను సాయుధులై రక్షించుకున్నారు. మూడువేల గ్రామాల్లో నిజాం పాలన దాదాపుగా అంతమైంది. ఈ దశలోనే నిజాంరాజుకు, ఢిల్లీ సర్కార్‌కు మధ్య ఉత్తర ప్రత్యుత్త రాలు జరిగాయి. విలీనఘట్టం పూర్తయింది. యూని యన్ మిలిటరీ కమ్యూనిస్టుల వేట మొదలుపెట్టింది. ‘విముక్త’ గ్రామాల నుంచి పారిపోయిన భూస్వాములు, షేర్వాణి, రూమీటోపీలను పడేసి, ఖద్దరు బట్టలు, గాంధీ టోపీలు ధరించి మళ్లీ గ్రామాల్లోకి ప్రవేశించారు. రావి నారాయణరెడ్డి తదితర కమ్యూనిస్టులు ఇక సాయుధ పోరాటం అనవసరమని వాదించారు. కొందరు కొన సాగించాలని పట్టుపట్టారు. విలీనం తర్వాత కూడా మూడేళ్ల పాటు యూనియన్ సైన్యాలతో పోరాటం సాగింది. నిజాంసేనలు – రజాకార్ల దాడుల్లో మరణిం చిన వారికంటే భారతసైన్యం దాడుల్లోనే ఎక్కువమంది కమ్యూనిస్టులు, వారి సానుభూతిపరులు చనిపోయారు. ఈ పోరాటాల్లో ఐదువేల మంది చనిపోయారు. 1951 చివర్లో సాయుధపోరును విరమిస్తున్నట్టు కమ్యూనిస్టు పార్టీ ప్రకటించింది. యాదృచ్ఛికమే అయినా, ఈ పోరా టంలో తొలి తుపాకీని అందుకున్న భీమిరెడ్డి నర్సింహా రెడ్డే విరమణ తర్వాత తుపాకీ దించిన ఆఖరివాడుగా మిగలడం విశేషం. పోరాట విరమణ జరిగిన కొద్ది రోజులకే దేశంలో మొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. హైదరాబాద్ రాష్ట్రంలో 175 అసెంబ్లీ సీట్లున్నాయి. అందులో తెలంగాణ ప్రాంతం సీట్లు 95. అప్పటికింకా కమ్యూనిస్టు పార్టీపై నిషేధం కొనసాగుతున్నది. పీడీఎఫ్ పేరుమీద ఆ పార్టీ అభ్యర్థులు పోటీ చేశారు. మిలిటెంట్ నాయకత్వ మంతా అజ్ఞాతంలోనే ఉంది. ఎన్నికల సన్నద్ధత లేకుం డానే పోటీ చేసి తెలంగాణ ప్రాంతంలో 36 సీట్లలో గెలిచారు. ఈ ప్రాంతంలో కాంగ్రెస్ గెలిచింది 38 సీట్లు. పూర్తి సామర్థ్యంతో ఎన్నికల్లో పాల్గొని వున్నట్లయితే ఆ రోజున తెలంగాణలో నెంబర్ వన్ స్థాయిలో కమ్యూని స్టులే వుండేవారు. ఆ స్థాయి నుంచి జారుకుంటూ దాదాపు ఉనికిలేని స్థాయికి కామ్రేడ్స్ చేరుకున్నారు. ఈ పరిస్థితికి చీలికలు పేలికలు కావడం ఒక కారణమైతే, మారుతున్న దేశ కాల పరిస్థితులను అవగతం చేసుకోవ డంలో వైఫల్యం, మారుతున్న ప్రజల ఆకాంక్షలను, అవసరాలను చదవడంలో దారుణ వైఫల్యం ఇతర ప్రధాన కారణాలు. ప్రజలకోసం పోరాడినవాళ్లు, త్యాగాలు చేసినవాళ్లు కాబట్టి, నిజాయితీపరులూ, నిరాడంబరులు కాబట్టి చాలాకాలం పాటు కమ్యూనిస్టులను ప్రజలు ఆదరించినప్పటికీ, ఆ పార్టీ నాయకుల ఉపన్యాసాల్లో వాడే యాంత్రిక భాషతో వారు కనెక్ట్ అయ్యేవారు కాదు. కాలం అనేక అవకాశాలను వారికి కల్పించింది. అందిపుచ్చుకోవడంలో వారి వైఫల్యం కారణంగా ప్రత్యా మ్నాయాలను కాలం సృష్టించుకున్నది. తెలంగాణ కాంగ్రెస్ దృష్టిలో సెప్టెంబర్ 17 అంటే తలమీద రూమీ టోపీకి బదులు గాంధీ టోపీ వచ్చిన రోజు. కమ్యూనిస్టుల దృష్టిలో మరింత కడగండ్లపాల్జేసిన రోజు. కనుక వారి దృష్టిలో ఈ తారీఖుకు ప్రాధాన్యత లేదు. మరి అప్పుడు ఉనికేలేని బీజేపీకి ఎందుకింత ఉబలాటం? తెలంగాణ భావోద్వేగ కెరటాల్లో తేలిపోయి అధికారాన్ని అందుకోగల ఒక అవకాశంగా సెప్టెంబర్ 17ను ఆ పార్టీ భావిస్తున్నది. బీజేపీతో పోల్చదగిన విజయగాధ ఈ దేశంలో మరో పార్టీకి లేదు. 1951లో జనసంఘ్ పేరుతో దాని పుట్టుక. తొలి ఎన్నికల్లో పార్లమెంట్లో వచ్చిన సీట్లు మూడు. 1977లో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా జనతా పార్టీగా విలీనమయ్యే వరకు జనసంఘ్ పేరుతో పార్ల మెంట్లో సాధించిన అత్యధిక సీట్ల సంఖ్య 35. జనతా పార్టీ నుంచి బయటికి వచ్చిన అనంతరం బీజేపీ ఏర్పడి తొలి ఎన్నికల్లో రెండు సీట్లు మాత్రమే గెలుచుకుంది. ఆ తర్వాత కాలానుగుణమైన వ్యూహాలతో ప్రజల భావోద్వే గాలను ఆసరా చేసుకొని అనూహ్యస్థాయి విజయశిఖరా లకు చేరుకున్నది. ఇప్పుడు తెలంగాణలో గద్దెనెక్కడానికి పనికొచ్చే అస్త్రాల్లో సెప్టెంబర్ 17 ఒక దివ్యాస్త్రంగా ఆ పార్టీకి కనిపిస్తున్నది. ఇప్పటికిప్పుడు ప్రజాభిప్రాయాలను గమనంలోకి తీసుకుంటే మరో రెండు మూడేళ్లలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని మూడో స్థానంలోకి నెట్టి వేసి ఆ స్థానాన్ని బీజేపీ ఆక్రమించవచ్చని అనిపిస్తు న్నది. బీజేపీ కలలు ఫలించి ఒక రోజున ఇక్కడ కూడా అధికారంలోకి వస్తే తెలంగాణలో సెప్టెంబర్ 17 ప్రభుత్వ సెలవు దినంగా మారుతుంది. లేకుంటే మీడి యాలో ‘చరిత్రలో ఈ రోజు’ శీర్షిక కింద ఒక అంశంగా మిగులుతుంది. వర్ధెల్లి మురళి muralivardelli@yahoo.co.in -
జాతీయతా నిర్దేశకుడు
దేశంలో కాంగ్రెస్ పార్టీ ఏకఛ్ఛత్రాధిపత్యానికి రోజులు దగ్గరపడ్డాయని, సంకీర్ణ శకం మొదలు కాబోతోందని పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ చెప్పారు. ఆయన అంచనా తర్వాత అక్షరాలా నిజమైంది కూడా. దాదాపు ఐదు దశాబ్దాల కిందట 1967 డిసెం బర్లో కాలికట్లో 14వ జాతీయ జనసంఘ్ సమావేశాలు జరిగాయి. అక్కడే భారతీయ జనసంఘ్ అధ్యక్షుడిగా దీన్‌దయాళ్ ఉపాధ్యాయ ఎన్నిక య్యారు. కార్యకర్తలు నిర్మించిన జనసంఘ్‌ను పురోగమింపజేసేందుకు మనమంతా కలిసి ఒకే లక్ష్యంతో, ఏకాగ్రతతో పని చేద్దామని ఆ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. అంతకుముందు 15 ఏళ్లుగా ఆయన జనసంఘ్ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. అధ్యక్షుడిగా కేవలం 43 రోజులు మాత్రమే ఆయన పనిచేశారు. 1968 ఫిబ్రవరి 11వ తేదీన మొఘల్ సరాయ్ రైల్వే స్టేషన్ దగ్గర అర్ధరాత్రి దుండగుల చేతిలో ఆయన హత్యకు గురయ్యారు. జన సంఘ్‌ను తీర్చిదిద్దటంలోనూ, భారతదేశానికి సరైన పునాదు లను ప్రతిపాదించడంలోనూ ఆయన కృషి అసమానం. విజయవాడలో 1965 జన వరిలో జరిగిన జనసంఘ్ సమా వేశాల్లో ప్రిన్సిపల్స్ అండ్ పాలి టిక్స్, ఏకాత్మతా మానవవాదం అనే భావనలను ఉపాధ్యాయ ప్రవేశపెట్టారు. ఏ దేశమైనా జాతీయతా భావం లేకుంటే మనుగడ సాధించడం అసాధ్యమని, భారతీయతే మన సమాజానికి మూలస్తంభమని, కులం, మతం, ప్రాంతంతో సంబంధం లేకుండా భారతీయులంతా ఒక్కటేనని ఆయన సూత్రీకరించారు. కుల, మత ప్రాతిపదికగా సమాజం విడిపోరాదని, అంటరానితనాన్ని నిర్మూ లించాలని కాంక్షించారు. పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ 1916 సెప్టెంబర్ 25వ తేదీన మధుర జిల్లాలో నగ్ల చంద్రబన్ అనే గ్రామంలో జన్మించారు. 1937వ సంవత్సరంలో ఆర్.ఎస్.ఎస్.లో చేరారు. 1952లో జరిగిన మొదటి పార్లమెంటు ఎన్నికల్లో 3.06 ఓట్ల శాతంతో మూడు స్థానాలతో ప్రారంభమై ఇప్పుడు 283 స్థానాల్లో.. సొంత మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయికి ఎదగడానికి దీన్‌దయాళ్ చేసిన మార్గదర్శనాన్ని మరువలేం. దేశ రాజకీయ ముఖచిత్రాన్ని ఆయన దశా బ్దాల కిందటే ఊహించగలిగారు. 1967 సాధారణ ఎన్నికల తర్వాత పండిట్జీ మాట్లాడుతూ, దేశంలో కాంగ్రెస్ పార్టీ ఏకఛ్ఛత్రాధిపత్యానికి ఇక రోజులు దగ్గర పడ్డాయని, సంకీర్ణ శకం మొదలు కాబో తోందని అన్నారు. ఆయన చెప్పినట్లే తర్వాత మూడు దశాబ్దాల పాటు మన దేశంలో సంకీర్ణ ప్రభుత్వాలు నడిచాయి. పార్టీ ఫిరాయింపులపై ఆయన సిద్ధాంతం ఇప్ప టికీ ఆచరణీయం. చట్టం ఏం చెబుతోంది అనేదాని కంటే ప్రజల అభిప్రాయానికే రాజకీయ నాయకులు కట్టుబడి ఉండాలని, రాజకీయ పార్టీలకు నైతిక విలు వలు ఉండాలని, అప్పుడే ఫిరాయింపుల్ని అరిక ట్టడం సాధ్యమవుతుందని ఉపాధ్యాయ సెలవి చ్చారు. పన్నుల విధానంలో సమూల ప్రక్షాళన చేయాలని, ఏకపన్ను విధానం ఉండాలన్నారు. రిటైర్డ్ ఉన్నతాధికారులను, రాజకీయ నాయకులను కాకుండా విశ్రాంత న్యాయమూర్తులను గవర్నర్లుగా నియమించాలని, గవర్నర్లు కేంద్ర ప్రభుత్వ స్టాంపు లుగా ఉండరాదని అభిప్రాయపడ్డారు. పాశ్చాత్య సెక్యులరిజాన్ని, ప్రజాస్వామ్యాన్ని, సిద్ధాంతాలను ఆయన అంగీకరించలేదు. భారతీయ సిద్ధాంతాలు, విలువలన్నీ భారతీయతపై ఆధారప డినవి, మన సొంత సమాజంలోనుంచి పుట్టుకొచ్చి నవి, స్వాభావికమైనవి కావాలని ఆయన కాంక్షించారు. గొప్ప ఆర్గనైజర్ అయిన దీన్ దయాళ్ జాతీయతా భావ ప్రచారం కోసం 1940లో ‘రాష్ట్ర ధర్మ’ అనే మాసపత్రికను ప్రారం భించారు. ఆర్ఎస్ఎస్ పత్రిక ‘ఆర్గనైజర్’లో ‘పొలిటికల్ డైరీ’ పేరుతో కాలమ్ రాసేవారు. తర్వాత ‘పాంచజన్య’ ఎడిటర్ గానూ పనిచేశారు. సామ్రాట్ చంద్రగుప్త, జగద్గురు శంకరాచార్య అఖండ భారతం, రాష్ట్ర చింతన, ఏకాత్మతా మానవవాదం, రాష్ట్ర జీవన్కీ దిశా మొదలైన పుస్తకాలు రచించారు. భారతీయ వారసత్వాన్ని గురించి తెలుసుకుని దాని ఆధారం గానే జాతి పునర్నిర్మాణం జరగాలని ఉపా ధ్యాయ స్పష్టం చేశారు. జనసంఘ్‌తో పాటు దేశ నిర్మాణానికీ సరైన పునాదులు కల్పించారు. ప్రజాస్వామ్యంలో సామాన్యుడి అవసరాలు, ప్రయోజనాల ప్రాతిపదికగా ప్రభుత్వాలు పనిచే యాలని ఆయన సూచించారు. ఆయన అడుగు జాడల్లో అటల్ బిహారీ వాజ్‌పేయి, అద్వానీ, కుష భావ్ ఠాక్రే, గోవిందాచార్య, శివరాజ్‌సింగ్ చౌహాన్, నరేంద్ర మోదీ తదితరులు జాతి నిర్మాణంలో ఎన లేని కృషి చేశారు. నిరాడంబర జీవితం, నైతికత, నిజాయితీ, జాతీయభావాన్ని ప్రజాజీవితంలో ఆచ రించి చూపించిన మార్గదర్శి ఉపాధ్యాయ. మోదీ ప్రభుత్వం సాగిస్తున్న అనేక సంస్కరణలకు స్ఫూర్తి దీన్దయాళ్జీయే. ఆయన కలలు కన్నట్లుగానే పేద రికం లేని దేశాన్ని మనం చూడబోతున్నాం. (పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ శత జయంతి ఉత్సవాల సందర్భంగా) వ్యాసకర్త ఏపీ బీజేపీ సమన్వయకర్త - పురిఘళ్ల రఘురాం పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఈమెయిల్ : raghuram.delhi@gmail.com -
35 ఏళ్ల బీజేపీ ప్రస్థానం సాగిందిలా..
భారతీయ జనతా పార్టీ 1980 ఏప్రిల్ 6వ తేదీన ఆవిర్భవించి నేటికి 35 ఏళ్లు పూర్తి చేసుకుంది. బురదలో పుట్టిన కమలం అంటూ అప్పటి ప్రత్యర్థి నాయకులు ఈసడించారు.. అయితే రాజకీయాలనే బురదలో స్వచ్ఛమైన కమలంగా ఆవిర్భవించిన పార్టీ అని దీటుగా బదులిచ్చారు బీజేపీ నేతలు. జాతీయవాద రాజకీయ పార్టీగా, హిందుత్వ ముద్రతో ముందుకు వచ్చిన బీజేపీ ప్రస్థానం అంత తేలికగా సాగలేదు. ఎన్నో ఆటుపోట్లను చూసింది. మూడున్నర పదుల బీజేపీ ప్రస్థానం సంక్షిప్తంగా పరీశీలిద్దాం. భారతీయ జనతా పార్టీ పూర్వ రూపం భారతీయ జన సంఘ్. దేశ విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నామ రాజకీయ పార్టీ అవసరం అని శ్యామప్రసాద్ ముఖర్జీ భావించారు. 1952లో భారతీయ జనసంఘ్ ప్రారంభించారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం(ఆర్ఎస్ఎస్)తో ప్రభావితులైన జాతీయ వాదులు ఆ పార్టీలో చేరారు. ముఖర్జీ మరణం తర్వాత దీనదయాళ్ ఉపాధ్యాయ జనసంఘ్ కు నాయకత్వం వహించారు.1952లో జరిగిన తొలి లోక్ సభ ఎన్నికల్లో జనసంఘ్ 3 సీట్లే సాధించినా, 1971 ఎన్నికల నాటికి 22 సీట్లతో దీటైన ప్రతిపక్షంగా ఎదిగింది. ప్రధాని ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించిన తర్వాత ప్రతి పక్షాలన్నీ ఒకటి కావాలని లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ పిలుపు మేరకు జనతా పార్టీలో జనసంఘ్ విలీనమైంది. 1977లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చింది జనతా ప్రభుత్వం. జనతా తరపున ఎక్కువ మంది జనసంఘీయులే గెలిచారు. అయితే ఇతర నేతల అంతర్గ కుమ్ములాటలతో ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం నిలవలేదు. జనతా పార్టీలోని ఇతర నాయకులు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తో అనుబంధం తెంచుకోవాలని జనసంఘీయులపై ఒత్తిడి తెచ్చారు. దీంతో జనసంఘ్ నాయకులంతో జనతా పార్టీని వీడి సరికొత్త పార్టీని ప్రారంభించారు. అలా 1980లో భారతీయ జనతా పార్టీ ఏర్పడింది. దేశమంతా ఇందిరాయే ఇండియా, ఇండియాయే ఇందిర అనే భ్రమల్లో ముంచెత్తింది కాంగ్రెస్ పార్టీ.. ఇందిరా గాంధీ హత్యానంతం జరిగిన 1984 పార్టమెంట్ ఎన్నికల్లో బీజేపీకి కేవలం 2 సీట్లే వచ్చాయి.. అయినా అధైర్య పడకుండా అటల్ బిహారీ వాజ్‌పేయి, లాల్ కృష్ణ అడ్వానీ పార్టీని ముందుకు నడిపారు. రామ జన్మభూమి ఉద్యమ సమయంలో వచ్చిన 1989 ఎన్నికల్లో బీజేపీ ఒక్కసారిగా 85 సీట్లు సాధించింది.. నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతు ఇచ్చింది.. మళ్లీ జనతా ప్రభుత్వం కథే పునరావృత్తమై ఈ ప్రభుత్వం పతనమైంది. 1991 ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని అంతా భావించారు.. కానీ తొలివిడత పోలింగ్ పూర్తయ్యాక రాజీవ్ గాంధీ మరణిచడంతో తదుపరి పోలింగ్‌లో కాంగ్రెస్ పార్టీ పుంజుకొని మైనారిటీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. బీజేపీకి 120 సీట్లు వచ్చాయి.. 1996లో లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక సీట్లును కైవసం చేసుకున్నా కనీస మెజారిటీ రాలేదు.. అయినా దేశంలో తొలి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు అటల్ బిహారీ వాజ్‌పేయి. బీజేపీకి అంటరాని పార్టీగా చూస్తున్న రోజులు అవి.. లోక్ సభలో మెజారిటీ నిరూపించుకోలేక పోవడంతో అటల్జీ ప్రభుత్వం రాజీనామా చేసింది. ఆతర్వాత అధికారం చేపట్టిన యునైటెడ్ ఫ్రంట్ ఘోరంగా వైఫల్యమైంది. 1998 ఎన్నికల్లో మరోసారి విజయం సాధించిన బీజేపీ జాతీయ ప్రజాతంత్ర కూటమి(ఎన్డీఏ)ను ఏర్పాటు చేసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అన్నాడీఎంకే అర్ధంతరంగా మద్దతు ఉపసంహరించడంతో ప్రభుత్వం ఒక్కఓటుతో పడిపోయింది. 1999 ఎన్నికల్లో మళ్లీ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది. అటల్జీ నేతృత్వంలో ఐదేళ్లు విజయవంతంగా సాగిన ఏన్డీఏ ప్రభుత్వ హయాంలో దేశం సంస్కరణల పథంలో పలు విజయాలు సాధించింది. కానీ మితిమీరిన అంఛనాల కారణంగా 2004 ఎన్నికల్లో ఓటమి పాలైంది. పదేళ్ల కాంగ్రెస్ పాలన వైఫల్యాల కారణంగా 2014 ఎన్నికల్లో బీజేపీ అఖండ మెజారిటీని సాధించి నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.