35 ఏళ్ల బీజేపీ ప్రస్థానం సాగిందిలా..
భారతీయ జనతా పార్టీ 1980 ఏప్రిల్ 6వ తేదీన ఆవిర్భవించి నేటికి 35 ఏళ్లు పూర్తి చేసుకుంది. బురదలో పుట్టిన కమలం అంటూ అప్పటి ప్రత్యర్థి నాయకులు ఈసడించారు.. అయితే రాజకీయాలనే బురదలో స్వచ్ఛమైన కమలంగా ఆవిర్భవించిన పార్టీ అని దీటుగా బదులిచ్చారు బీజేపీ నేతలు. జాతీయవాద రాజకీయ పార్టీగా, హిందుత్వ ముద్రతో ముందుకు వచ్చిన బీజేపీ ప్రస్థానం అంత తేలికగా సాగలేదు. ఎన్నో ఆటుపోట్లను చూసింది. మూడున్నర పదుల బీజేపీ ప్రస్థానం సంక్షిప్తంగా పరీశీలిద్దాం.
భారతీయ జనతా పార్టీ పూర్వ రూపం భారతీయ జన సంఘ్. దేశ విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నామ రాజకీయ పార్టీ అవసరం అని శ్యామప్రసాద్ ముఖర్జీ భావించారు. 1952లో భారతీయ జనసంఘ్ ప్రారంభించారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం(ఆర్ఎస్ఎస్)తో ప్రభావితులైన జాతీయ వాదులు ఆ పార్టీలో చేరారు. ముఖర్జీ మరణం తర్వాత దీనదయాళ్ ఉపాధ్యాయ జనసంఘ్ కు నాయకత్వం వహించారు.1952లో జరిగిన తొలి లోక్ సభ ఎన్నికల్లో జనసంఘ్ 3 సీట్లే సాధించినా, 1971 ఎన్నికల నాటికి 22 సీట్లతో దీటైన ప్రతిపక్షంగా ఎదిగింది. ప్రధాని ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించిన తర్వాత ప్రతి పక్షాలన్నీ ఒకటి కావాలని లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ పిలుపు మేరకు జనతా పార్టీలో జనసంఘ్ విలీనమైంది. 1977లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చింది జనతా ప్రభుత్వం. జనతా తరపున ఎక్కువ మంది జనసంఘీయులే గెలిచారు. అయితే ఇతర నేతల అంతర్గ కుమ్ములాటలతో ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం నిలవలేదు. జనతా పార్టీలోని ఇతర నాయకులు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తో అనుబంధం తెంచుకోవాలని జనసంఘీయులపై ఒత్తిడి తెచ్చారు. దీంతో జనసంఘ్ నాయకులంతో జనతా పార్టీని వీడి సరికొత్త పార్టీని ప్రారంభించారు.
అలా 1980లో భారతీయ జనతా పార్టీ ఏర్పడింది. దేశమంతా ఇందిరాయే ఇండియా, ఇండియాయే ఇందిర అనే భ్రమల్లో ముంచెత్తింది కాంగ్రెస్ పార్టీ.. ఇందిరా గాంధీ హత్యానంతం జరిగిన 1984 పార్టమెంట్ ఎన్నికల్లో బీజేపీకి కేవలం 2 సీట్లే వచ్చాయి.. అయినా అధైర్య పడకుండా అటల్ బిహారీ వాజ్పేయి, లాల్ కృష్ణ అడ్వానీ పార్టీని ముందుకు నడిపారు. రామ జన్మభూమి ఉద్యమ సమయంలో వచ్చిన 1989 ఎన్నికల్లో బీజేపీ ఒక్కసారిగా 85 సీట్లు సాధించింది.. నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతు ఇచ్చింది.. మళ్లీ జనతా ప్రభుత్వం కథే పునరావృత్తమై ఈ ప్రభుత్వం పతనమైంది. 1991 ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని అంతా భావించారు.. కానీ తొలివిడత పోలింగ్ పూర్తయ్యాక రాజీవ్ గాంధీ మరణిచడంతో తదుపరి పోలింగ్లో కాంగ్రెస్ పార్టీ పుంజుకొని మైనారిటీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. బీజేపీకి 120 సీట్లు వచ్చాయి..
1996లో లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక సీట్లును కైవసం చేసుకున్నా కనీస మెజారిటీ రాలేదు.. అయినా దేశంలో తొలి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు అటల్ బిహారీ వాజ్పేయి. బీజేపీకి అంటరాని పార్టీగా చూస్తున్న రోజులు అవి.. లోక్ సభలో మెజారిటీ నిరూపించుకోలేక పోవడంతో అటల్జీ ప్రభుత్వం రాజీనామా చేసింది. ఆతర్వాత అధికారం చేపట్టిన యునైటెడ్ ఫ్రంట్ ఘోరంగా వైఫల్యమైంది. 1998 ఎన్నికల్లో మరోసారి విజయం సాధించిన బీజేపీ జాతీయ ప్రజాతంత్ర కూటమి(ఎన్డీఏ)ను ఏర్పాటు చేసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అన్నాడీఎంకే అర్ధంతరంగా మద్దతు ఉపసంహరించడంతో ప్రభుత్వం ఒక్కఓటుతో పడిపోయింది. 1999 ఎన్నికల్లో మళ్లీ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది. అటల్జీ నేతృత్వంలో ఐదేళ్లు విజయవంతంగా సాగిన ఏన్డీఏ ప్రభుత్వ హయాంలో దేశం సంస్కరణల పథంలో పలు విజయాలు సాధించింది. కానీ మితిమీరిన అంఛనాల కారణంగా 2004 ఎన్నికల్లో ఓటమి పాలైంది. పదేళ్ల కాంగ్రెస్ పాలన వైఫల్యాల కారణంగా 2014 ఎన్నికల్లో బీజేపీ అఖండ మెజారిటీని సాధించి నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.