జన్‌థన్ ఖాతాలతో వాటికి దూరం
సాక్షి,న్యూఢిల్లీ: జన్‌ధన్ బ్యాంక్ ఖాతాలు గ్రామీణ భారతంలో పెను ప్రభావం చూపినట్టు ఎస్బీఐకి చెందిన ఆర్థిక పరిశోధన విభాగం వెల్లడించింది. ఈ ఖాతాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రజలు పొగాకు, మద్యం సేవించడానికి స్వస్తిపలికి పొదుపుకు అలవాటు పడినట్టు తెలిపింది. జన్‌థన్ ఖాతాలు 50 శాతంపైగా ఉన్న గ్రామాల్లో ధరల పెరుగుదల ఆశాజనకంగా తగ్గినట్టు వెల్లడైంది. ఈ ఖాతాలు అధికంగా ఉన్న రాష్ర్టాల్లో ఆల్కహాల్, పొగాకు, ఇతర మత్తుపదార్ధాల వాడకం గణనీయంగా తగ్గినట్టు అథ్యయనంలో తేలిందని ఎస్బీఐ గ్రూప్ ఎకనమిక్ చీఫ్ అడ్వయిజర్ సౌమ్య కాంతి ఘోష్ తెలిపారు.
నోట్ల రద్దు అనంతరం తక్కువ ఖర్చు చేసే ధోరణి అలవడటంతో కూడా ఇలా జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నామన్నారు. జన్‌థన్ ఖాతాలతో పొదుపు సంస్కృతి పెరగడం, ఆల్కహాల్ వంటి పదార్ధాలపై వెచ్చించే ఖర్చు తగ్గడం స్వాగతించదగ్గ పరిణామమని ఆర్థిక విశ్లేషకులు ప్రొఫెసర్ ఎన్ఆర్ భానుమూర్తి పేర్కొన్నారు.ఇక దేశవ్యాప్తంగా ఉన్న 30 కోట్ల జన్‌థన్ ఖాతాల్లో ఎక్కువ శాతం నోట్ల రద్దు తర్వాత తెరిచినవి కావడం గమనార్హం. కేవలం పదిరాష్ర్టాల్లోనే 23 కోట్ల జన్‌థన్ ఖాతాలున్నాయి. జన్‌థన్ ఖాతాలు గ్రామీణ, పట్టణ వినియోగదారుల ధరల సూచీపై ఎలాంటి ప్రభావం చూపాయనే దానిపై ఎస్బీఐ రాష్ర్టాల వారీగా విశ్లేషించింది.జన్‌ధన్ ఖాతాలతో ఆర్థిక సమ్మిళిత వృద్ధి ద్వారా ద్రవ్యోల్బణం దిగివచ్చిందని ఈ విశ్లేషణలో వెల్లడైంది.