జన్మభూమికి హైరానా!
విజయవాడ : ‘జన్మభూమి-మా ఊరు’ కార్యక్రమం ప్రారంభం కాకముందే అధికారులను ఉక్కిరిబిక్కిరి చేసింది. సభాస్థలి ఎంపికపై అధికారులు హైరానా పడ్డారు. అక్టోబర్ 2వ తేదీ (గురువారం) రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించనున్న ‘జన్మభూమి-మా ఊరు’ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు విజయవాడలో ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో గత రెండు రోజులుగా సభాస్థలి కోసం నగరపాలక సంస్థ, పోలీస్, రెవెన్యూ అధికారులు ఉరుకులు, పరుగులు పెట్టారు.
తొలుత సింగ్‌నగర్‌లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో సభను ఏర్పాటు చేయాలని భావించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు, నగరపాలక సంస్థ కమిషనర్ సి.హరికిరణ్‌లు సోమవారం స్టేడియాన్ని పరిశీలించారు. సుమారు 50 వేల మంది పట్టే సువిశాల ప్రాంగణం కావడంతో జనం పలుచగా వస్తే పరిస్థితి ఏమిటన్న ప్రశ్న తెలుగుదేశం ప్రజాప్రతినిధుల మదిలో మెదిలింది. సార్వత్రిక ఎన్నికల సమయంలో ‘మహిళాగర్జన’ పేరుతో అక్కడ ఏర్పాటు చేసిన సభ అట్టర్ ప్లాప్ కావడంతో అక్కడ సభ ఏర్పాటుకు టీడీపీ ప్రజాప్రతినిధులు ససేమిరా అన్నారు.
దీంతో అక్కడ నుంచి వేదిక గాంధీనగర్‌లోని జింఖానా గ్రౌండ్‌కు మార్చాలని భావించారు. దీనిపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీంతో భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మంగళవారం స్వయంగా రంగంలోకి దిగారు. జిల్లా కలెక్టర్, నగరపాలక సంస్థ కమిషనర్‌ను వెంట పెట్టుకొని సింగ్‌నగర్, అదే ప్రాంతంలోని పైపులరోడ్డు ఏరియాల్లో విస్తృతంగా పర్యటించారు. పైపుల రోడ్డులోని ఐబీఎం కళాశాల వెనుక ఖాళీ స్థలంలో సభను ఏర్పాటు చేయాలని జిల్లా యంత్రాంగానికి మంత్రి సూచించారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అధికారులు పనులు ప్రారంభించాలనుకునేలోపే మళ్లీ సీన్ మారింది.