టోక్యోలో ఐటీ సంస్థలతో మంత్రి పల్లె భేటీ
సాక్షి, హైదరాబాద్: జపాన్ రాజధాని టోక్యో పర్యటనకు వెళ్లిన ఐటీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి గురువారం పలు సంస్థల ప్రతినిధులను కలిశారు. ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ సోనీ కంపెనీ ప్రతినిధి బృందం మంత్రిని కలిసింది. ఈ సందర్భంగా రాష్ర్టంలో ఐటీ పరిశ్రమ అభివృద్ధికి గల అవకాశాలను అధికారులు వివరించారు. నవ్యాంధ్రలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు అపార అవకాశాలున్నాయని పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలిపారు.
దీంతో సోనీ ప్రతినిధులు రాష్ట్రంలో తమ కార్యకలాపాలను విస్తరింపచేసేందుకు సానుకూలతను వ్యక్తం చేశారు. ఎన్టీటీ డాటా, బీపీవో, టెలికమ్యూనికేషన్ వంటి ప్రఖ్యాత సంస్థల ప్రతినిధులతోనూ ఆయన భేటీ అయ్యారు. విశాఖపట్నంలో తమ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నట్లు ఆయా సంస్థలు పేర్కొన్నాయి. టోక్యోలో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ ఐటీ వారం, ప్రదర్శనను పలు కంపెనీల ప్రతినిధులు సందర్శించినట్లు సమాచార శాఖ మంత్రి పీఆర్వో ఒక ప్రకటనలో పేర్కొన్నారు.