Japan Industrial Partners
-
జపనీస్ కంపెనీల చేతికే తోషిబా
సుమారు 140 సంవత్సరాలకుపైగా చరిత్ర కలిగిన జపనీస్ ఇంజనీరింగ్ దిగ్గజం తోషిబా కార్పొరేషన్‌ను చేయి జారిపోకుండా చూసేందుకు ఆ దేశ సంస్థలే ఏకమయ్యాయి. ఇందుకు ప్రభుత్వం సైతం చేయూత నందించింది. వెరసి పీఈ దిగ్గజం జపాన్ ఇండస్ట్రియల్ పార్టనర్స్ ఇంక్ అధ్యక్షతన ఏర్పాటైన కన్సార్షియం 2 ట్రిలియన్ యెన్ల(15.3 బిలియన్ డాలర్లు) విలువలో కొనుగోలు చేసేందుకు బిడ్ చేశాయి. ఈ ఆఫర్‌ను తోషిబా బోర్డు అంగీకరించింది. ఇతర వివరాలు చూద్దాం.. టోక్యో: గత కొన్నేళ్లుగా పలు సంక్షోభాలను చవిచూస్తున్న ప్రయివేట్ రంగ ఇంజనీరింగ్ దిగ్గజం తోషిబా కార్ప్‌ను స్వదేశీ సంస్థలే కొనుగోలు చేయనున్నాయి. పీఈ దిగ్గజం జపాన్ ఇండస్ట్రియల్ పార్టనర్స్(జేఐపీ) ఇంక్ ఆధ్వర్యంలో గ్రూప్‌గా ఏర్పడిన 20 సంస్థలు 15.3 బిలియన్ డాలర్లకు(సుమారు రూ. 1,26,225 కోట్లు) బిడ్ చేశాయి. ఈ ఆఫర్‌కు తాజాగా తోషిబా కార్ప్ బోర్డు ఓకే చెప్పింది. బిడ్ చేసిన కన్సార్షియంలో ఓరిక్స్ కార్ప్, రోహ్ కో, చుబు ఎలక్ట్రిక్ పవర్ తదితరాలున్నాయి. తోషిబా షేరు గురువారం ముగింపు ధరతో పోలిస్తే దాదాపు 10 శాతం ప్రీమియంతో ఆఫర్ ఇచ్చాయి. కొన్నేళ్లుగా రకరకాల కుంభకోణాలు బయటపడటంతో కంపెనీ పలు సవాళ్లను ఎదుర్కొంటోంది. ఫలితంగా కంపెనీ అమ్మకపు బాటలో పడింది. తోషిబా యాజమాన్యం, జపనీస్ ప్రభుత్వం, వాటాదారులు కంపెనీ భవిష్యత్‌పట్ల ఆందోళనలు చవిచూస్తున్నారు. యాక్టివిస్ట్ ఇన్వెస్టర్లు గరిష్ట రిటర్నులు ఆశిస్తుంటే.. జపనీస్ ప్రభుత్వం మాత్రం కీలకమైన సాంకేతికతలు, బిజినెస్‌లను విదేశీ హస్తాలకు చేరకుండా పరిరక్షించే యోచనలో పడింది. తోషిబా బిజినెస్ వ్యూహాలలో పలుమార్లు మార్పులు చోటుచేసుకోవడంతో స్థిరత్వం లోపించినట్లు లైట్స్ట్రీమ రీసెర్చ్ విశ్లేషకులు మియో కటో పేర్కొన్నారు. అయినప్పటికీ కొత్త వృద్ధి అవకాశాలను అందుకునేందుకు వీలుగా వర్ధమాన బిజినెస్‌లకు అనుగుణమైన చర్యలు చేపట్టవలసి ఉన్నట్లు అభిప్రాయపడ్డారు. జాతీయ భద్రత తోషిబా అణు విద్యుత్(న్యూక్లియర్ పవర్) బిజినెస్ జాతీయ భద్రతకు చెందిన ప్రధాన అంశమని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. 2011 భూకంపం, సునామీ ధాటికి శిథిలమైన ఫకుషిమా దాయ్చీ ఆటమిక్ పవర్ ప్లాంటు మూసివేతలో కంపెనీ సేవలందించింది. ఈ నేపథ్యంలో తోషిబా యాజమాన్య నియంత్రణ విదేశీయుల చేతికి వెళ్లకుండా నిరోధించేందుకు జపనీస్ ప్రభుత్వం ప్రణాళికలు వేసింది. కాగా.. డీల్ పూర్తయితే ఈ ఏడాది ఆసియాలోనే అతిపెద్ద లావాదేవీగా నమోదుకానుంది. అంతేకాకుండా ఈ డీల్ జపాన్ చరిత్రలోనే అతిపెద్ద పీఈ పెట్టుబడుల కొనుగోలుగా రికార్డు నెలకొల్పనుంది. అయితే ప్రస్తుత ప్రతికూల ఆర్థిక పరిస్థితుల కారణంగా జేఐపీ కన్సార్షియంకు ఫైనాన్స్ అందించేందుకు బ్యాంకులు వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. కార్పొరేట్ పాలన జపాన్‌లో కార్పొరేట్ పాలనపై తోషిబా వ్యవహారాన్ని పరిశీలనాత్మక కేసుగా పరిగణించవచ్చని విశ్లేషకులు పేర్కొన్నారు. వెరసి సుప్రసిద్ధ యాక్టివిస్ట్ ఇన్వెస్టర్లు దీనికి ఒక అవకాశంగా తీసుకుని కంపెనీలో వాటాలు కొనుగోలు చేసే వీలున్నట్లు అభిప్రాయపడ్డారు. ఈ జాబితాలో బిలియనీర్ పాల్ సింగర్ సంస్థ ఇలియట్ మేనేజ్మెంట్ కార్ప్, సేథ్ ఫిషర్‌కు చెందిన ఒయాసిస్ మేనేజ్మెంట్ కో, సింగపూర్ ఫండ్స్ ఎఫిసిమో క్యాపిటల్ మేనేజ్మెంట్ పీటీఈ, 3డీ ఇన్వెస్ట్మెంట్ పార్ట్నర్స్ను పేర్కొన్నారు. కంపెనీ కొనుగోలుకి ఆఫర్లు ప్రకటించిన గ్లోబల్ పీఈ దిగ్గజాలలో బెయిన్ క్యాపిటల్, సీవీసీ క్యాపిటల్ పార్ట్నర్స్, కేకేఆర్ అండ్ కో ఉన్నట్లు వెల్లడించారు. 8 ఏళ్లుగా సవాళ్లు గత ఎనిమిదేళ్లుగా తోషిబా ఒకదాని తరువాత మరొకటిగా పలు సమస్యలను ఎదుర్కొంటోంది. 2015లో ఖాతాల కుంభకోణం బయటపడ్డాక లాభాలు ఆవిరయ్యాయి. ఇది కంపెనీ పునర్వ్యవస్థీకరణకు కారణమైంది. తదుపరి వ్యయభరితమైన యూఎస్ న్యూక్లియర్ పవర్ బిజినెస్‌లోకి ప్రవేశించడం దెబ్బతీసింది. వెరసి 6.3 బిలియన్ డాలర్లను రైట్‌డౌన్ చేయవలసి వచ్చింది. దీంతో ఒక దశలో కంపెనీ డీలిస్టింగ్వరకూ వెళ్లింది. కంపెనీకి ఎంతో విలువైన, కీలకమైన మెమొరీ చిప్ యూనిట్‌తోపాటు, విదేశీ ఇన్వెస్టర్లకు షేర్లను విక్రయించవలసి వచ్చింది. ఆపై వాటాదారులు, ఎగ్జిక్యూటివ్‌లకు కంపెనీ భవిష్యత్ విషయంలో వివాదాలు తలెత్తాయి. కంపెనీ సహవ్యవస్థాపకుల్లో ఒకరిని, ఇతరులను 2020లో తోషిబా బోర్డులో చేర్చుకోమంటూ ఎఫిసిమో ఒత్తిడి చేసింది. అయితే దీనిని వాటాదారులు వ్యతిరేకించారు. అనుమానాస్పద రీతిలో సాగిన ఓటింగ్‌పై ఎఫిసిమో స్వతంత్ర దర్యాప్తు సంస్థలను నియమించింది. ఇక కంపెనీని విక్రయించకుండా రెండుగా విడదీసేందుకు యాజమాన్యం చేసిన ప్రతిపాదనను గతేడాది వాటాదారులు తిరస్కరించారు. దీంతో కంపెనీని విక్రయించవలసిన పరిస్థితులు తలెత్తాయి. ఈ దశలో జేఐపీ రంగంలోకి దిగింది. గతేడాది అక్టోబర్‌లో ప్రాధాన్య బిడ్డర్‌గా నిలిచింది. ఇండస్ట్రియల్ బ్యాంక్ ఆఫ్ జపాన్‌లో కెరీర్ ప్రారంభించిన హిడెమీ మో 2002లో జేఐపీని ఏర్పాటు చేశారు. -
భారత్‌లో మరింత ఇన్వెస్ట్ చేయండి
టోక్యో: అపార వ్యాపార అవకాశాలు ఉన్న భారత్‌లో మరింతగా ఇన్వెస్ట్ చేయాలంటూ జపాన్ కార్పొరేట్లను ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానించారు. భారతదేశ అభివృద్ధి ప్రస్థానంలో జపాన్‌ది చాలా కీలకపాత్ర అని ఆయన పేర్కొన్నారు. దీన్ని పురస్కరించుకుని ’జపాన్ వారోత్సవాల’ను నిర్వహించడంపై ప్రధాని ప్రతిపాదన చేశారు. జపాన్ పర్యటనలో భాగంగా వ్యాపార దిగ్గజాలతో నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ప్రధాని పాల్గొన్నారు. 34 సంస్థల సీఈవోలు, టాప్ ఎగ్జిక్యూటివ్‌లు దీనికి హాజరయ్యారు. ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, ఉక్కు, టెక్నాలజీ, ట్రేడింగ్, బ్యాంకింగ్, ఫైనాన్స్ తదితర రంగాల కంపెనీల ప్రతినిధులు వీరిలో ఉన్నట్లు ప్రభుత్వం ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. జపాన్ కంపెనీలు భారత్‌లో మరింతగా ఇన్వెస్ట్ చేయాలని మోదీ ఈ సందర్భంగా ఆహ్వానించినట్లు వివరించింది. ‘టాప్ వ్యాపార సంస్థల సీఈవోలతో భేటీ అయ్యాను. భారత్‌లో పుష్కలంగా ఉన్న పెట్టుబడి అవకాశాల గురించి వివరించాను‘ అని ప్రధాని ఒక ట్వీట్లో పేర్కొన్నారు. హోండా, సుజుకీ, టయోటా వంటి ఆటోమొబైల్ సంస్థలు, సుమిటోమో కెమికల్, ఫ్యుజిత్సు, నిప్పన్ స్టీల్ కార్పొరేషన్, మిత్సుబిషి కార్పొరేషన్ తదితర సంస్థల ప్రతినిధులు ఈ భేటీలో పాల్గొన్నారు. చాలామటుకు కంపెనీలకు భారత్‌లో పెట్టుబడులు, కార్యకలాపాలు ఉన్నాయి. రికార్డు స్థాయిలో ఎఫ్‌డీఐలు.. భారత్, జపాన్ సహజమైన భాగస్వాములని సమావేశం సందర్భంగా ప్రధాని చెప్పారు. భారత్–జపాన్ సంబంధాలు బలోపేతం అయ్యేందుకు వ్యాపార వర్గాలు బ్రాండ్ అంబాసిడర్ల పాత్ర పోషిస్తున్నారని ఆయన ప్రశంసించారు. గత ఆర్థిక సంవత్సరంలో (2021–22) అంతర్జాతీయంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) మందగించినా, భారత్‌లోకి రికార్డు స్థాయిలో 84 బిలియన్ డాలర్ల ఇన్వెస్ట్మెంట్లు వచ్చాయని ప్రధాని నరేంద్ర మోదీ ఈ సందర్భంగా చెప్పారు. భారత ఆర్థిక వృద్ధి సత్తాపై ఇన్వెస్టర్లకు ఉన్న ధీమాకు ఇది నిదర్శనమని ఆయన తెలిపారు. ఈ ఏడాది మార్చిలో జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా భారత పర్యటన సందర్భంగా ద్వైపాక్షిక పెట్టుబడులను వచ్చే అయిదేళ్లలో 5 లక్షల కోట్ల ఎన్ల స్థాయికి పెంచుకోవాలని ఇరు దేశాలు నిర్దేశించుకున్నాయని ప్రధాని చెప్పారు. ఇటీవలి కాలంలో ఇండియా–జపాన్ ఇండస్ట్రియల్ కాంపిటీటివ్నెస్ పార్ట్నర్షిప్ (ఐజేఐసీపీ), క్లీన్ ఎనర్జీ పార్ట్నర్షిప్ మొదలైన ఒప్పందాలు కుదిరాయని పేర్కొన్నారు. -
‘వయో’కు సోనీ గుడ్‌బై
టోక్యో/న్యూయార్క్: సోనీ... ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రానిక్స్ రంగంలో ఒకప్పుడు రారాజుగా నిలిచిన ఈ రెండక్షరాల కంపెనీ ఇప్పుడు పుట్టెడు కష్టాలతో నెట్టుకొస్తోంది. వ్యాపారంలో అంతకంతకూ నష్టాలు పేరుకుపోతుండటంతో గట్టెక్కే ప్రయత్నాల్లో పడింది. ఇందులోభాగంగా పర్సనల్ కంప్యూటర్ల(పీసీ) వ్యాపారం(వయో బ్రాండ్‌తో ల్యాప్‌టాప్‌లు, నోట్‌బుక్‌లను విక్రయిస్తోంది) నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించింది. అంతేకాదు నష్టాలు తగ్గించుకోవడం కోసం ప్రపంచవ్యాప్తంగా 5,000 మంది సిబ్బందికి ఉద్వాసన చెబుతున్నట్లు కూడా వెల్లడించింది. వయో బ్రాండ్ పీసీ బిజినెస్‌ను టోక్యోకు చెందిన ఇన్వెస్ట్మెంట్ ఫండ్.. జపాన్ ఇండస్ట్రియల్ పార్ట్నర్స్(జేఐపీ)కు అమ్మేస్తున్నామని, ఈ మేరకు ఇరు సంస్థలు గురువారం ఒప్పందం(ఎంఓయూ) కుదుర్చుకున్నట్లు సోనీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ డీల్ విలువ 40 కోట్ల డాలర్లుగా ఉండొచ్చని అంచనా. సోనీ మాత్రం వివరాలను వెల్ల డించలేదు. అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ కంపెనీ రుణపరపతి రేటింగ్‌ను జంక్(పెట్టుబడులకు అత్యంత ప్రతికూలం) స్థాయికి డౌన్‌గ్రేడ్ చేసిన వారం రోజుల తర్వాత ఈ షాకింగ్ వార్తను సోనీ ప్రకటించడం గమనార్హం. కాగా, ఈ ఏడాది వయోలో కొత్త శ్రేణిని విడుదల చేశాక... ఇక పీసీల డిజైన్, ఉత్పత్తి, అమ్మకాలు అన్నింటినుంచీ తాము తప్పుకుంటామని సోనీ పేర్కొంది. అయితే, జేఐపీ ఏర్పాటు చేయనున్న కొత్త కంపెనీకి తమ సంస్థ నుంచి దాదాపు 250-300 మంది పీసీ విభాగం ఉద్యోగులు వెళ్లే అవకాశం ఉందని... దీంతో వయో కస్టమర్లకు సర్వీసులు యథాతథంగా కొనసాగుతాయని పేర్కొంది. టీవీ బిజినెస్ ఇక సబ్సిడరీ... టెలివిజన్ వ్యాపారాన్ని విభజించి పూర్తిస్థాయి అనుబంధ సంస్థ(సబ్సిడరీ)గా నిర్వహించనున్నట్లు కూడా సోనీ ప్రకటించింది. కంప్యూటర్ల మార్కెట్లో అనూహ్య మార్పులను ప్రస్తావిస్తూ... ఇకపై తాము స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లెట్ పీసీలపైనే ఎక్కువగా దృష్టిపెడతామని చెబుతోంది. గ్లోబల్ పీసీ వ్యాపారంలో తమ వాటా చాలా తక్కువేనని అందుకే దీన్ని వదిలించుకొని ఎలక్ట్రానిక్స్ బిజినెస్ వృద్ధిని పెంచేలా చర్యలు తీసుకుంటున్నట్లు సోనీ కార్పొరేషన్ సీఈఓ కజువో హిరాయ్ పేర్కొన్నారు. ఈ ఏడాది టీవీ వ్యాపార విభాగం కూడా లాభాల్లో ఉండకపోవచ్చన్నారు. అయితే, దీన్ని వదిలించుకునే ప్రశ్నేలేదని, హైఎండ్ టెలివిజన్లపై దృష్టిసారిస్తామని చెప్పారు. డిజిటల్ ఇమేజింగ్(కెమేరాలు ఇతరత్రా), వీడియో గేమ్స్, మొబైల్స్‌లో మరింత దూకుడు ప్రదర్శించడం ద్వారా కీలకమైన ఎలక్ట్రానిక్స్ వ్యాపారంలో మళ్లీ టర్న్‌అరౌండ్‌కు వీలవుతుందనేది సోనీ ప్రణాళిక. ఎక్స్‌పీరియా సిరీస్ స్మార్ట్ఫోన్ల అమ్మకాలు పుంజుకుంటుండటం, గత నవంబర్‌లో ప్రవేశపెట్టిన ప్లేస్టేషన్ 4 గేమింగ్ కన్సోల్కు అనూహ్య స్పందన (42 లక్షల యూనిట్ల విక్రయం) లభించడం దీనికి కారణం. భారీ నష్టాల్లోకి..! రెండేళ్ల తర్వాత మళ్లీ సోనీ ఘోరమైన నష్టాలను చవిచూడనుంది. మార్చితో ముగియనున్న ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 100 కోట్ల డాలర్లకుపైగా(11,000 కోట్ల యెన్లు) నష్టం రావచ్చనేది కంపెనీ తాజా అంచనా. మూడు నెలల క్రితం 3,000 కోట్ల యెన్ల లాభాలు రావచ్చని సోనీ అంచనా వేయడం గమనార్హం. ఆపరేటింగ్ లాభాలను కూడా సగానికిపైగా తగ్గించడం(అక్టోబర్ అంచనా 17,000 కోట్ల యెన్లు.. ప్రస్తుత అంచనా 8,000 కోట్ల యెన్లు) విశేషం. కాగా, నష్టాల్లో అధికభాగం పునర్వ్యవస్థీకరణ వ్యయాలేని సోనీ పేర్కొంది. భారత్‌లోనూ వేటు... కంపెనీ పునర్వ్యవస్థీకరణ, వ్యయాల తగ్గింపులో భాగంగా వచ్చే ఏడాది మార్చి నాటికి ఈ ఉద్యోగాల కోతను అమలుచేయనుంది. ఇందులో 1,500 ఉద్యోగాలు జపాన్లోనివి కాగా, విదేశాల్లోని(భారత్‌తో పాటు) 3,500 మంది సిబ్బందిపై వేటు వేయనుంది. ఈ చర్యలతో 2015 నుంచి ఏటా 100 కోట్ల డాలర్ల మేర ఆదా చేసేందుకు వీలవుతందని కంపెనీ పేర్కొంది. ఎందుకీ దుస్థితి... {బావియా(బ్రాండ్) టెలివిజన్లు, వయో ల్యాప్‌టాప్‌లు, ప్లేస్టేషన్ గేమింగ్ కన్సోల్స్, మొబైల్స్ ఇతరత్రా ఉత్పత్తులతో దూసుకుపోయిన సోనీ... క్రమంగా ప్రత్యర్థి కంపెనీలతో పోటీలో ఘోరంగా వెనుకపడింది. {పధానంగా అమెరికా దిగ్గజం యాపిల్, దక్షిణకొరియా అగ్రగామి శామ్సంగ్ దెబ్బకు సోనీ విలవిల్లాడుతోంది. స్మార్ట్ఫోన్లు, టెలివిజన్(ఎల్సీడీ, ఎల్ఈడీ) మార్కెట్లో సోనీని వెనక్కినెట్టి ఈ రెండు కంపెనీలూ దూసుకుపోతున్నాయి. తక్కువ మార్జిన్స్ ఉండే టెలివిజన్ వ్యాపారంలో శామ్సంగ్, ఎల్జీ తదితర కంపెనీలు వినూత్న ఉత్పత్తులు, చౌక ధరలతో సోనీని ఖంగుతినిపించాయి. ఆమాటకొస్తే... జపాన్‌కు చెందిన షార్ప్, పానాసోనిక్ ఇతరత్రా ఎలక్ట్రానిక్స్ దిగ్గజాలు కూడా శామ్సంగ్ ఇతరత్రా విదేశీ కంపెనీల ధాటికి తట్టుకోలేని పరిస్థితి. ఈ పోటీ కంపెనీల సవాళ్లను ఎదుర్కొని సోనీ తన బ్యాలన్స్‌షీట్‌ను మెరుగుపరచుకోవాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుందని, మరిన్ని మార్పులు, చర్యలు తప్పనిసరి అని మూడీస్ వ్యాఖ్యానించడం గమనార్హం. కాగా, ప్రపంచవ్యాప్తంగా పీసీ మార్కెట్ అంతకంతకూ పడిపోతున్న నేపథ్యంలో సోనీ నిర్ణయం సబబేనని పరిశ్రమ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.