సుమారు 140 సంవత్సరాలకుపైగా చరిత్ర కలిగిన జపనీస్ ఇంజనీరింగ్ దిగ్గజం తోషిబా కార్పొరేషన్‌ను చేయి జారిపోకుండా చూసేందుకు ఆ దేశ సంస్థలే ఏకమయ్యాయి. ఇందుకు ప్రభుత్వం సైతం చేయూత నందించింది. వెరసి పీఈ దిగ్గజం జపాన్ ఇండస్ట్రియల్ పార్టనర్స్ ఇంక్ అధ్యక్షతన ఏర్పాటైన కన్సార్షియం 2 ట్రిలియన్ యెన్‌ల(15.3 బిలియన్ డాలర్లు) విలువలో కొనుగోలు చేసేందుకు బిడ్ చేశాయి. ఈ ఆఫర్‌ను తోషిబా బోర్డు అంగీకరించింది. ఇతర వివరాలు చూద్దాం..
టోక్యో: గత కొన్నేళ్లుగా పలు సంక్షోభాలను చవిచూస్తున్న ప్రయివేట్ రంగ ఇంజనీరింగ్ దిగ్గజం తోషిబా కార్ప్‌ను స్వదేశీ సంస్థలే కొనుగోలు చేయనున్నాయి. పీఈ దిగ్గజం జపాన్ ఇండస్ట్రియల్ పార్టనర్స్(జేఐపీ) ఇంక్ ఆధ్వర్యంలో గ్రూప్‌గా ఏర్పడిన 20 సంస్థలు 15.3 బిలియన్ డాలర్లకు(సుమారు రూ. 1,26,225 కోట్లు) బిడ్ చేశాయి. ఈ ఆఫర్‌కు తాజాగా తోషిబా కార్ప్ బోర్డు ఓకే చెప్పింది. బిడ్ చేసిన కన్సార్షియంలో ఓరిక్స్ కార్ప్, రోహ్ కో, చుబు ఎలక్ట్రిక్ పవర్ తదితరాలున్నాయి. తోషిబా షేరు గురువారం ముగింపు ధరతో పోలిస్తే దాదాపు 10 శాతం ప్రీమియంతో ఆఫర్ ఇచ్చాయి. కొన్నేళ్లుగా రకరకాల కుంభకోణాలు బయటపడటంతో కంపెనీ పలు సవాళ్లను ఎదుర్కొంటోంది.
ఫలితంగా కంపెనీ అమ్మకపు బాటలో పడింది. తోషిబా యాజమాన్యం, జపనీస్ ప్రభుత్వం, వాటాదారులు కంపెనీ భవిష్యత్‌పట్ల ఆందోళనలు చవిచూస్తున్నారు. యాక్టివిస్ట్ ఇన్వెస్టర్లు గరిష్ట రిటర్నులు ఆశిస్తుంటే.. జపనీస్ ప్రభుత్వం మాత్రం కీలకమైన సాంకేతికతలు, బిజినెస్‌లను విదేశీ హస్తాలకు చేరకుండా పరిరక్షించే యోచనలో పడింది. తోషిబా బిజినెస్ వ్యూహాలలో పలుమార్లు మార్పులు చోటుచేసుకోవడంతో స్థిరత్వం లోపించినట్లు లైట్‌స్ట్రీమ రీసెర్చ్ విశ్లేషకులు మియో కటో పేర్కొన్నారు. అయినప్పటికీ కొత్త వృద్ధి అవకాశాలను అందుకునేందుకు వీలుగా వర్ధమాన బిజినెస్‌లకు అనుగుణమైన చర్యలు చేపట్టవలసి ఉన్నట్లు అభిప్రాయపడ్డారు.
జాతీయ భద్రత
తోషిబా అణు విద్యుత్(న్యూక్లియర్ పవర్) బిజినెస్ జాతీయ భద్రతకు చెందిన ప్రధాన అంశమని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. 2011 భూకంపం, సునామీ ధాటికి శిథిలమైన ఫకుషిమా దాయ్‌చీ ఆటమిక్ పవర్ ప్లాంటు మూసివేతలో కంపెనీ సేవలందించింది. ఈ నేపథ్యంలో తోషిబా యాజమాన్య నియంత్రణ విదేశీయుల చేతికి వెళ్లకుండా నిరోధించేందుకు జపనీస్ ప్రభుత్వం ప్రణాళికలు వేసింది. కాగా.. డీల్ పూర్తయితే ఈ ఏడాది ఆసియాలోనే అతిపెద్ద లావాదేవీగా నమోదుకానుంది. అంతేకాకుండా ఈ డీల్ జపాన్ చరిత్రలోనే అతిపెద్ద పీఈ పెట్టుబడుల కొనుగోలుగా రికార్డు నెలకొల్పనుంది. అయితే ప్రస్తుత ప్రతికూల ఆర్థిక పరిస్థితుల కారణంగా జేఐపీ కన్సార్షియంకు ఫైనాన్స్ అందించేందుకు బ్యాంకులు వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది.
కార్పొరేట్ పాలన
జపాన్‌లో కార్పొరేట్ పాలనపై తోషిబా వ్యవహారాన్ని పరిశీలనాత్మక కేసుగా పరిగణించవచ్చని విశ్లేషకులు పేర్కొన్నారు. వెరసి సుప్రసిద్ధ యాక్టివిస్ట్ ఇన్వెస్టర్లు దీనికి ఒక అవకాశంగా తీసుకుని కంపెనీలో వాటాలు కొనుగోలు చేసే వీలున్నట్లు అభిప్రాయపడ్డారు. ఈ జాబితాలో బిలియనీర్ పాల్ సింగర్ సంస్థ ఇలియట్ మేనేజ్‌మెంట్ కార్ప్, సేథ్ ఫిషర్‌కు చెందిన ఒయాసిస్ మేనేజ్‌మెంట్ కో, సింగపూర్ ఫండ్స్ ఎఫిసిమో క్యాపిటల్ మేనేజ్‌మెంట్ పీటీఈ, 3డీ ఇన్వెస్ట్‌మెంట్ పార్ట్‌నర్స్‌ను పేర్కొన్నారు. కంపెనీ కొనుగోలుకి ఆఫర్లు ప్రకటించిన గ్లోబల్ పీఈ దిగ్గజాలలో బెయిన్ క్యాపిటల్, సీవీసీ క్యాపిటల్ పార్ట్‌నర్స్, కేకేఆర్ అండ్ కో ఉన్నట్లు వెల్లడించారు.
8 ఏళ్లుగా సవాళ్లు
గత ఎనిమిదేళ్లుగా తోషిబా ఒకదాని తరువాత మరొకటిగా పలు సమస్యలను ఎదుర్కొంటోంది. 2015లో ఖాతాల కుంభకోణం బయటపడ్డాక లాభాలు ఆవిరయ్యాయి. ఇది కంపెనీ పునర్వ్యవస్థీకరణకు కారణమైంది. తదుపరి వ్యయభరితమైన యూఎస్ న్యూక్లియర్ పవర్ బిజినెస్‌లోకి ప్రవేశించడం దెబ్బతీసింది. వెరసి 6.3 బిలియన్ డాలర్లను రైట్‌డౌన్ చేయవలసి వచ్చింది. దీంతో ఒక దశలో కంపెనీ డీలిస్టింగ్‌వరకూ వెళ్లింది. కంపెనీకి ఎంతో విలువైన, కీలకమైన మెమొరీ చిప్ యూనిట్‌తోపాటు, విదేశీ ఇన్వెస్టర్లకు షేర్లను విక్రయించవలసి వచ్చింది. ఆపై వాటాదారులు, ఎగ్జిక్యూటివ్‌లకు కంపెనీ భవిష్యత్ విషయంలో వివాదాలు తలెత్తాయి.
కంపెనీ సహవ్యవస్థాపకుల్లో ఒకరిని, ఇతరులను 2020లో తోషిబా బోర్డులో చేర్చుకోమంటూ ఎఫిసిమో ఒత్తిడి చేసింది. అయితే దీనిని వాటాదారులు వ్యతిరేకించారు. అనుమానాస్పద రీతిలో సాగిన ఓటింగ్‌పై ఎఫిసిమో స్వతంత్ర దర్యాప్తు సంస్థలను నియమించింది. ఇక కంపెనీని విక్రయించకుండా రెండుగా విడదీసేందుకు యాజమాన్యం చేసిన ప్రతిపాదనను గతేడాది వాటాదారులు తిరస్కరించారు. దీంతో కంపెనీని విక్రయించవలసిన పరిస్థితులు తలెత్తాయి. ఈ దశలో జేఐపీ రంగంలోకి దిగింది. గతేడాది అక్టోబర్‌లో ప్రాధాన్య బిడ్డర్‌గా నిలిచింది. ఇండస్ట్రియల్ బ్యాంక్ ఆఫ్ జపాన్‌లో కెరీర్ ప్రారంభించిన హిడెమీ మో 2002లో జేఐపీని ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment