Toshiba Corporation
-
జపనీస్ కంపెనీల చేతికే తోషిబా
సుమారు 140 సంవత్సరాలకుపైగా చరిత్ర కలిగిన జపనీస్ ఇంజనీరింగ్ దిగ్గజం తోషిబా కార్పొరేషన్‌ను చేయి జారిపోకుండా చూసేందుకు ఆ దేశ సంస్థలే ఏకమయ్యాయి. ఇందుకు ప్రభుత్వం సైతం చేయూత నందించింది. వెరసి పీఈ దిగ్గజం జపాన్ ఇండస్ట్రియల్ పార్టనర్స్ ఇంక్ అధ్యక్షతన ఏర్పాటైన కన్సార్షియం 2 ట్రిలియన్ యెన్ల(15.3 బిలియన్ డాలర్లు) విలువలో కొనుగోలు చేసేందుకు బిడ్ చేశాయి. ఈ ఆఫర్‌ను తోషిబా బోర్డు అంగీకరించింది. ఇతర వివరాలు చూద్దాం.. టోక్యో: గత కొన్నేళ్లుగా పలు సంక్షోభాలను చవిచూస్తున్న ప్రయివేట్ రంగ ఇంజనీరింగ్ దిగ్గజం తోషిబా కార్ప్‌ను స్వదేశీ సంస్థలే కొనుగోలు చేయనున్నాయి. పీఈ దిగ్గజం జపాన్ ఇండస్ట్రియల్ పార్టనర్స్(జేఐపీ) ఇంక్ ఆధ్వర్యంలో గ్రూప్‌గా ఏర్పడిన 20 సంస్థలు 15.3 బిలియన్ డాలర్లకు(సుమారు రూ. 1,26,225 కోట్లు) బిడ్ చేశాయి. ఈ ఆఫర్‌కు తాజాగా తోషిబా కార్ప్ బోర్డు ఓకే చెప్పింది. బిడ్ చేసిన కన్సార్షియంలో ఓరిక్స్ కార్ప్, రోహ్ కో, చుబు ఎలక్ట్రిక్ పవర్ తదితరాలున్నాయి. తోషిబా షేరు గురువారం ముగింపు ధరతో పోలిస్తే దాదాపు 10 శాతం ప్రీమియంతో ఆఫర్ ఇచ్చాయి. కొన్నేళ్లుగా రకరకాల కుంభకోణాలు బయటపడటంతో కంపెనీ పలు సవాళ్లను ఎదుర్కొంటోంది. ఫలితంగా కంపెనీ అమ్మకపు బాటలో పడింది. తోషిబా యాజమాన్యం, జపనీస్ ప్రభుత్వం, వాటాదారులు కంపెనీ భవిష్యత్‌పట్ల ఆందోళనలు చవిచూస్తున్నారు. యాక్టివిస్ట్ ఇన్వెస్టర్లు గరిష్ట రిటర్నులు ఆశిస్తుంటే.. జపనీస్ ప్రభుత్వం మాత్రం కీలకమైన సాంకేతికతలు, బిజినెస్‌లను విదేశీ హస్తాలకు చేరకుండా పరిరక్షించే యోచనలో పడింది. తోషిబా బిజినెస్ వ్యూహాలలో పలుమార్లు మార్పులు చోటుచేసుకోవడంతో స్థిరత్వం లోపించినట్లు లైట్స్ట్రీమ రీసెర్చ్ విశ్లేషకులు మియో కటో పేర్కొన్నారు. అయినప్పటికీ కొత్త వృద్ధి అవకాశాలను అందుకునేందుకు వీలుగా వర్ధమాన బిజినెస్‌లకు అనుగుణమైన చర్యలు చేపట్టవలసి ఉన్నట్లు అభిప్రాయపడ్డారు. జాతీయ భద్రత తోషిబా అణు విద్యుత్(న్యూక్లియర్ పవర్) బిజినెస్ జాతీయ భద్రతకు చెందిన ప్రధాన అంశమని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. 2011 భూకంపం, సునామీ ధాటికి శిథిలమైన ఫకుషిమా దాయ్చీ ఆటమిక్ పవర్ ప్లాంటు మూసివేతలో కంపెనీ సేవలందించింది. ఈ నేపథ్యంలో తోషిబా యాజమాన్య నియంత్రణ విదేశీయుల చేతికి వెళ్లకుండా నిరోధించేందుకు జపనీస్ ప్రభుత్వం ప్రణాళికలు వేసింది. కాగా.. డీల్ పూర్తయితే ఈ ఏడాది ఆసియాలోనే అతిపెద్ద లావాదేవీగా నమోదుకానుంది. అంతేకాకుండా ఈ డీల్ జపాన్ చరిత్రలోనే అతిపెద్ద పీఈ పెట్టుబడుల కొనుగోలుగా రికార్డు నెలకొల్పనుంది. అయితే ప్రస్తుత ప్రతికూల ఆర్థిక పరిస్థితుల కారణంగా జేఐపీ కన్సార్షియంకు ఫైనాన్స్ అందించేందుకు బ్యాంకులు వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. కార్పొరేట్ పాలన జపాన్‌లో కార్పొరేట్ పాలనపై తోషిబా వ్యవహారాన్ని పరిశీలనాత్మక కేసుగా పరిగణించవచ్చని విశ్లేషకులు పేర్కొన్నారు. వెరసి సుప్రసిద్ధ యాక్టివిస్ట్ ఇన్వెస్టర్లు దీనికి ఒక అవకాశంగా తీసుకుని కంపెనీలో వాటాలు కొనుగోలు చేసే వీలున్నట్లు అభిప్రాయపడ్డారు. ఈ జాబితాలో బిలియనీర్ పాల్ సింగర్ సంస్థ ఇలియట్ మేనేజ్మెంట్ కార్ప్, సేథ్ ఫిషర్‌కు చెందిన ఒయాసిస్ మేనేజ్మెంట్ కో, సింగపూర్ ఫండ్స్ ఎఫిసిమో క్యాపిటల్ మేనేజ్మెంట్ పీటీఈ, 3డీ ఇన్వెస్ట్మెంట్ పార్ట్నర్స్ను పేర్కొన్నారు. కంపెనీ కొనుగోలుకి ఆఫర్లు ప్రకటించిన గ్లోబల్ పీఈ దిగ్గజాలలో బెయిన్ క్యాపిటల్, సీవీసీ క్యాపిటల్ పార్ట్నర్స్, కేకేఆర్ అండ్ కో ఉన్నట్లు వెల్లడించారు. 8 ఏళ్లుగా సవాళ్లు గత ఎనిమిదేళ్లుగా తోషిబా ఒకదాని తరువాత మరొకటిగా పలు సమస్యలను ఎదుర్కొంటోంది. 2015లో ఖాతాల కుంభకోణం బయటపడ్డాక లాభాలు ఆవిరయ్యాయి. ఇది కంపెనీ పునర్వ్యవస్థీకరణకు కారణమైంది. తదుపరి వ్యయభరితమైన యూఎస్ న్యూక్లియర్ పవర్ బిజినెస్‌లోకి ప్రవేశించడం దెబ్బతీసింది. వెరసి 6.3 బిలియన్ డాలర్లను రైట్‌డౌన్ చేయవలసి వచ్చింది. దీంతో ఒక దశలో కంపెనీ డీలిస్టింగ్వరకూ వెళ్లింది. కంపెనీకి ఎంతో విలువైన, కీలకమైన మెమొరీ చిప్ యూనిట్‌తోపాటు, విదేశీ ఇన్వెస్టర్లకు షేర్లను విక్రయించవలసి వచ్చింది. ఆపై వాటాదారులు, ఎగ్జిక్యూటివ్‌లకు కంపెనీ భవిష్యత్ విషయంలో వివాదాలు తలెత్తాయి. కంపెనీ సహవ్యవస్థాపకుల్లో ఒకరిని, ఇతరులను 2020లో తోషిబా బోర్డులో చేర్చుకోమంటూ ఎఫిసిమో ఒత్తిడి చేసింది. అయితే దీనిని వాటాదారులు వ్యతిరేకించారు. అనుమానాస్పద రీతిలో సాగిన ఓటింగ్‌పై ఎఫిసిమో స్వతంత్ర దర్యాప్తు సంస్థలను నియమించింది. ఇక కంపెనీని విక్రయించకుండా రెండుగా విడదీసేందుకు యాజమాన్యం చేసిన ప్రతిపాదనను గతేడాది వాటాదారులు తిరస్కరించారు. దీంతో కంపెనీని విక్రయించవలసిన పరిస్థితులు తలెత్తాయి. ఈ దశలో జేఐపీ రంగంలోకి దిగింది. గతేడాది అక్టోబర్‌లో ప్రాధాన్య బిడ్డర్‌గా నిలిచింది. ఇండస్ట్రియల్ బ్యాంక్ ఆఫ్ జపాన్‌లో కెరీర్ ప్రారంభించిన హిడెమీ మో 2002లో జేఐపీని ఏర్పాటు చేశారు. -
తోషిబా సంచలన నిర్ణయం
టోక్యో: దిగ్గజ కంపెనీ తొషిబాలో అవినీతి, కుట్రకు ఎట్టకేలకు తిరుగుబాటుతో చెక్ పెట్టారు షేర్ హోల్డర్లు. తొషిబా కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి ఒసామూ నగయమా(74)ను అర్థాంతరంగా గద్దె దించేశారు. శుక్రవారం సాయంత్రం ఒసామూ రీ ఎలక్షన్ కోసం జరిగిన ఓటింగ్.. నాటకీయ పరిణామాల మధ్య ముగిసింది. ఆపై ఒసామూను చైర్మన్ పదవి నుంచి తొలగిస్తున్నట్లు కావాలనే ఆలస్యంగా ప్రకటించింది బోర్డు. జపాన్ ప్రభుత్వంతో కుమ్మక్కై.. ప్రైవేట్ ఇన్వెస్టర్ల ఆసక్తిని దెబ్బతీస్తున్నాడని, అధికారులతో కిందటి ఏడాది బోర్డు నామినీల ఓటింగ్‌పై ప్రభావం చూపెట్టాడనేది ఒసామూ మీద ఉన్న ప్రధాన ఆరోపణలు. ఈ కుంభకోణం బయటపడ్డప్పటికీ ఆయన్నే కొనసాగించాలని పలువురు ఇన్వెస్టర్లు మద్దతు చెబుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తొలగింపుపై బోర్డు తొందరపాటు ప్రదర్శించలేదు. అయితే శుక్రవారం సాధారణ సమావేశాల సందర్భంగా ఉన్నపళంగా ఓటింగ్ నిర్వహించారు. ఈ క్రమంలోనే ఒసామూను గద్దె దించుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇక ఒసామూ మద్దతుదారులు మాత్రం.. సంక్షోభ సమయంలో ఆయన పనితీరును చూసైనా మరో అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ, ఇలాంటి విషయాల్లో కఠినంగా వ్యవహారిస్తామనే సంకేతాల్ని బయటి ఇన్వెస్టర్లకు తోషిబా పంపినట్లయ్యింది. ఇక సంస్కరణలేనా? జపాన్ కార్పొరేట్ గవర్నెన్స్‌లో ఈ నిర్ణయం ఒక మైలు రాయి అని, ముందు ముందు ఇది విప్లవాత్మక మార్పులకు దారితీస్తుందని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. కాగా, గతంలో ఒసామూ రాజీనామాను డిమాండ్ చేసిన తొషిబా అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్ భాగస్వామి 3డీ కంపెనీ తాజా పరిణామాలను స్వాగతించింది. ఇక చైర్మన్ పదవికి ప్రతిపాదించిన పేర్లను పక్కనపెట్టిన బోర్డు.. తాత్కాలిక చైర్మన్‌గా తొషిబా సీఈవో సతోషి సునాకవా కొనసాగనున్నారు. సతోషి ఆధ్వర్యంలో త్వరలో మరిన్ని సంస్కరణలతో కంపెనీని అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలని బోర్డు తీర్మానం చేసుకుంది. కాగా, ఇంతకు ముందు చైర్మన్‌గా ఉన్న నోబువాకి కురుమటాని కూడా అవినీతి ఆరోపణల విమర్శల నేపథ్యంలో రాజీనామా చేశాడు. జపాన్‌తో పాటు ప్రపంచ దేశాలకు తోషిబా బ్రాండ్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. హోం ఎలక్ట్రికల్స్ గూడ్స్ నుంచి న్యూక్లియర్ పవర్ స్టేషన్ రంగంలోనూ తోషిబా ఒకప్పుడు రారాజుగా ఉండేది. అయితే మేనేజ్మెంట్ తప్పిదాలు, సరైన పాలనా-పర్యవేక్షణ లేకపోవడమనే కారణాలు.. మార్కెట్‌ను కోల్పోతూ వస్తోంది. చదవండి: దెబ్బకు 32 కోట్ల డాలర్ల నష్టం -
హైదరాబాద్ లో తోషిబా విస్తరణ
రైల్వే పరికరాల తయారీ కేంద్రం ఏర్పాటు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విద్యుత్ పరికరాల తయారీలో ఉన్న జపాన్‌కు చెందిన తోషిబా కార్పొరేషన్ హైదరాబాద్‌లో రైల్వే పరికరాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. 2017 ఏప్రిల్‌లో ఈ ఫెసిలిటీలో ఉత్పత్తి ప్రారంభం కానుంది. పవర్ కన్వర్షన్ సిస్టమ్స్, ట్రైన్ కంట్రోల్ సిస్టమ్స్ ఇక్కడ తయారు చేస్తారు. భారత్‌తో పాటు మధ్యప్రాచ్య, ఆఫ్రికా దేశాలకు ఎగుమతి చేస్తారు. 2020 నాటికి కొత్త ఫెసిలిటీ కోసం 100 మందిని నియమించుకునే అవకాశం ఉందని కంపెనీ తెలిపింది. తోషిబా కార్పొరేషన్ అనుబంధ కంపెనీ అయిన తోషిబా ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ ఇండియాకు (టీటీడీఐ) హైదరాబాద్ సమీపంలోని రుద్రారం వద్ద ట్రాన్స్ఫార్మర్ల తయారీ ప్లాంటు ఉంది. ఈ ప్లాంటును అంతర్జాతీయ తయారీ కేంద్రంగా తీర్చిదిద్దనున్నట్టు టీటీడీఐ సీఎండీ కట్సుటోషి టోడ ఇటీవల వెల్లడించారు. 2017 నాటికి మరో రూ.200 కోట్లను వెచ్చించనున్నట్టు పేర్కొన్నారు. -
హైదరాబాద్‌లో తోషిబా 185 కోట్ల పెట్టుబడులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: తోషిబా కార్పొరేషన్ రూ. 185 కోట్ల పెట్టుబడులతో హైదరాబాద్ యూని ట్ను విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్‌లోని తోషిబా ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ ఇండియా(టీటీడీఐ) సామర్థ్యాన్ని మరింత పెంచుతున్నామని, ఇందుకోసం రూ. 185 కోట్లు (30 మిలియన్ డాలర్లు) ఇన్వెస్ట్ చేస్తున్నట్లు కంపెనీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. విజయ ఎలక్ట్రికల్స్‌ను గతేడాది రూ. 1,230 కోట్లకు తోషిబా కార్పొరేషన్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. రెండేళ్లలో రూ.615 కోట్ల ఇన్వెస్ట్మెంట్... దేశీయ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ వ్యాపారంలో 2016లోగా రూ.615 కోట్ల పెట్టుబడులు పెట్టాలన్న నిర్ణయంలో భాగంగా ఈ పెట్టుబడులను చేస్తున్నట్లు టీటీడీఐ కత్సుతోషి తొదా ఆ ప్రకటనలో తెలిపారు. దేశీయ విద్యుత్ రంగంలో ఉన్న భారీ అవకాశాలను అందిపుచ్చుకోవడంపై దృష్టిసారించామని, ఈ పెట్టుబడులతో పెద్ద ట్రాన్స్ఫార్మర్స్తోపాటు కొత్త తరహా స్విచ్గేర్స్ను తయారు చేయనున్నట్లు తెలిపారు. 500 ఎంవీఏ సామర్థ్యం గల ఈ ట్రాన్స్ఫార్మర్స్ 765కేవీ విద్యుత్ ఉత్పత్తిని తట్టుకుంటాయన్నారు. కొత్తగా తయారు చేసే స్విచ్గేర్స్ హైవోల్టేజ్ ప్రోడక్ట్స్‌ను ఉత్పత్తి చేస్తాయన్నారు. దేశీయ విద్యుత్ సరఫరా, పంపిణీ మార్కెట్లో 2016 నాటికి 20 శాతం మార్కెట్ వాటాను చేజిక్కించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కుత్సతోషి తెలిపారు. 2017 నాటికి ప్రస్తుత విద్యుత్ పంపిణీ వ్యవస్థను ఐదు రెట్లు పెంచే విధంగా 765కేవీ ట్రాన్స్ఫార్మర్స్ ఏర్పాటును ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోందన్నారు. ఈ నేపథ్యంలో భారీ సామర్థ్యం గల ట్రాన్స్ఫార్మర్స్, స్విచ్గేర్స్కు డిమాండ్ బాగుంటుందని అంచనా వేస్తున్నట్లు ఆయన తెలిపారు. యూరప్, ఏషియన్, ఆఫ్రికా దేశాలకు ఇక్కడ నుంచే ఎగుమతులు చేసే విధంగా బారీ స్థాయిలో పెట్టుబడులు పెడుతున్నట్లు కుత్సతోషి తెలిపారు.