Japan Government
-
జపనీస్ కంపెనీల చేతికే తోషిబా
సుమారు 140 సంవత్సరాలకుపైగా చరిత్ర కలిగిన జపనీస్ ఇంజనీరింగ్ దిగ్గజం తోషిబా కార్పొరేషన్‌ను చేయి జారిపోకుండా చూసేందుకు ఆ దేశ సంస్థలే ఏకమయ్యాయి. ఇందుకు ప్రభుత్వం సైతం చేయూత నందించింది. వెరసి పీఈ దిగ్గజం జపాన్ ఇండస్ట్రియల్ పార్టనర్స్ ఇంక్ అధ్యక్షతన ఏర్పాటైన కన్సార్షియం 2 ట్రిలియన్ యెన్ల(15.3 బిలియన్ డాలర్లు) విలువలో కొనుగోలు చేసేందుకు బిడ్ చేశాయి. ఈ ఆఫర్‌ను తోషిబా బోర్డు అంగీకరించింది. ఇతర వివరాలు చూద్దాం.. టోక్యో: గత కొన్నేళ్లుగా పలు సంక్షోభాలను చవిచూస్తున్న ప్రయివేట్ రంగ ఇంజనీరింగ్ దిగ్గజం తోషిబా కార్ప్‌ను స్వదేశీ సంస్థలే కొనుగోలు చేయనున్నాయి. పీఈ దిగ్గజం జపాన్ ఇండస్ట్రియల్ పార్టనర్స్(జేఐపీ) ఇంక్ ఆధ్వర్యంలో గ్రూప్‌గా ఏర్పడిన 20 సంస్థలు 15.3 బిలియన్ డాలర్లకు(సుమారు రూ. 1,26,225 కోట్లు) బిడ్ చేశాయి. ఈ ఆఫర్‌కు తాజాగా తోషిబా కార్ప్ బోర్డు ఓకే చెప్పింది. బిడ్ చేసిన కన్సార్షియంలో ఓరిక్స్ కార్ప్, రోహ్ కో, చుబు ఎలక్ట్రిక్ పవర్ తదితరాలున్నాయి. తోషిబా షేరు గురువారం ముగింపు ధరతో పోలిస్తే దాదాపు 10 శాతం ప్రీమియంతో ఆఫర్ ఇచ్చాయి. కొన్నేళ్లుగా రకరకాల కుంభకోణాలు బయటపడటంతో కంపెనీ పలు సవాళ్లను ఎదుర్కొంటోంది. ఫలితంగా కంపెనీ అమ్మకపు బాటలో పడింది. తోషిబా యాజమాన్యం, జపనీస్ ప్రభుత్వం, వాటాదారులు కంపెనీ భవిష్యత్‌పట్ల ఆందోళనలు చవిచూస్తున్నారు. యాక్టివిస్ట్ ఇన్వెస్టర్లు గరిష్ట రిటర్నులు ఆశిస్తుంటే.. జపనీస్ ప్రభుత్వం మాత్రం కీలకమైన సాంకేతికతలు, బిజినెస్‌లను విదేశీ హస్తాలకు చేరకుండా పరిరక్షించే యోచనలో పడింది. తోషిబా బిజినెస్ వ్యూహాలలో పలుమార్లు మార్పులు చోటుచేసుకోవడంతో స్థిరత్వం లోపించినట్లు లైట్స్ట్రీమ రీసెర్చ్ విశ్లేషకులు మియో కటో పేర్కొన్నారు. అయినప్పటికీ కొత్త వృద్ధి అవకాశాలను అందుకునేందుకు వీలుగా వర్ధమాన బిజినెస్‌లకు అనుగుణమైన చర్యలు చేపట్టవలసి ఉన్నట్లు అభిప్రాయపడ్డారు. జాతీయ భద్రత తోషిబా అణు విద్యుత్(న్యూక్లియర్ పవర్) బిజినెస్ జాతీయ భద్రతకు చెందిన ప్రధాన అంశమని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. 2011 భూకంపం, సునామీ ధాటికి శిథిలమైన ఫకుషిమా దాయ్చీ ఆటమిక్ పవర్ ప్లాంటు మూసివేతలో కంపెనీ సేవలందించింది. ఈ నేపథ్యంలో తోషిబా యాజమాన్య నియంత్రణ విదేశీయుల చేతికి వెళ్లకుండా నిరోధించేందుకు జపనీస్ ప్రభుత్వం ప్రణాళికలు వేసింది. కాగా.. డీల్ పూర్తయితే ఈ ఏడాది ఆసియాలోనే అతిపెద్ద లావాదేవీగా నమోదుకానుంది. అంతేకాకుండా ఈ డీల్ జపాన్ చరిత్రలోనే అతిపెద్ద పీఈ పెట్టుబడుల కొనుగోలుగా రికార్డు నెలకొల్పనుంది. అయితే ప్రస్తుత ప్రతికూల ఆర్థిక పరిస్థితుల కారణంగా జేఐపీ కన్సార్షియంకు ఫైనాన్స్ అందించేందుకు బ్యాంకులు వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. కార్పొరేట్ పాలన జపాన్‌లో కార్పొరేట్ పాలనపై తోషిబా వ్యవహారాన్ని పరిశీలనాత్మక కేసుగా పరిగణించవచ్చని విశ్లేషకులు పేర్కొన్నారు. వెరసి సుప్రసిద్ధ యాక్టివిస్ట్ ఇన్వెస్టర్లు దీనికి ఒక అవకాశంగా తీసుకుని కంపెనీలో వాటాలు కొనుగోలు చేసే వీలున్నట్లు అభిప్రాయపడ్డారు. ఈ జాబితాలో బిలియనీర్ పాల్ సింగర్ సంస్థ ఇలియట్ మేనేజ్మెంట్ కార్ప్, సేథ్ ఫిషర్‌కు చెందిన ఒయాసిస్ మేనేజ్మెంట్ కో, సింగపూర్ ఫండ్స్ ఎఫిసిమో క్యాపిటల్ మేనేజ్మెంట్ పీటీఈ, 3డీ ఇన్వెస్ట్మెంట్ పార్ట్నర్స్ను పేర్కొన్నారు. కంపెనీ కొనుగోలుకి ఆఫర్లు ప్రకటించిన గ్లోబల్ పీఈ దిగ్గజాలలో బెయిన్ క్యాపిటల్, సీవీసీ క్యాపిటల్ పార్ట్నర్స్, కేకేఆర్ అండ్ కో ఉన్నట్లు వెల్లడించారు. 8 ఏళ్లుగా సవాళ్లు గత ఎనిమిదేళ్లుగా తోషిబా ఒకదాని తరువాత మరొకటిగా పలు సమస్యలను ఎదుర్కొంటోంది. 2015లో ఖాతాల కుంభకోణం బయటపడ్డాక లాభాలు ఆవిరయ్యాయి. ఇది కంపెనీ పునర్వ్యవస్థీకరణకు కారణమైంది. తదుపరి వ్యయభరితమైన యూఎస్ న్యూక్లియర్ పవర్ బిజినెస్‌లోకి ప్రవేశించడం దెబ్బతీసింది. వెరసి 6.3 బిలియన్ డాలర్లను రైట్‌డౌన్ చేయవలసి వచ్చింది. దీంతో ఒక దశలో కంపెనీ డీలిస్టింగ్వరకూ వెళ్లింది. కంపెనీకి ఎంతో విలువైన, కీలకమైన మెమొరీ చిప్ యూనిట్‌తోపాటు, విదేశీ ఇన్వెస్టర్లకు షేర్లను విక్రయించవలసి వచ్చింది. ఆపై వాటాదారులు, ఎగ్జిక్యూటివ్‌లకు కంపెనీ భవిష్యత్ విషయంలో వివాదాలు తలెత్తాయి. కంపెనీ సహవ్యవస్థాపకుల్లో ఒకరిని, ఇతరులను 2020లో తోషిబా బోర్డులో చేర్చుకోమంటూ ఎఫిసిమో ఒత్తిడి చేసింది. అయితే దీనిని వాటాదారులు వ్యతిరేకించారు. అనుమానాస్పద రీతిలో సాగిన ఓటింగ్‌పై ఎఫిసిమో స్వతంత్ర దర్యాప్తు సంస్థలను నియమించింది. ఇక కంపెనీని విక్రయించకుండా రెండుగా విడదీసేందుకు యాజమాన్యం చేసిన ప్రతిపాదనను గతేడాది వాటాదారులు తిరస్కరించారు. దీంతో కంపెనీని విక్రయించవలసిన పరిస్థితులు తలెత్తాయి. ఈ దశలో జేఐపీ రంగంలోకి దిగింది. గతేడాది అక్టోబర్‌లో ప్రాధాన్య బిడ్డర్‌గా నిలిచింది. ఇండస్ట్రియల్ బ్యాంక్ ఆఫ్ జపాన్‌లో కెరీర్ ప్రారంభించిన హిడెమీ మో 2002లో జేఐపీని ఏర్పాటు చేశారు. -
రూ.4 లక్షల విస్కీ బాటిల్ ఏమైనట్లు?
వాషింగ్టన్: అగ్రరాజ్యమైన అమెరికాను ప్రసన్నం చేసుకుని తమ సొంత పనులు, సొంత దేశ పనులు విజయవంతంగా పూర్తిచేసుకోవాలని చాలా ప్రపంచ దేశాల నేతలు ఉవ్విళ్లూరుతుంటారు. ఆ ఘన కార్యంలో భాగంగానే తమ దేశాలకు పర్యటన పేరిట విచ్చేసిన అగ్రరాజ్య ముఖ్యనేతలకు జ్ఞాపికలతో సత్కరిస్తాయి. ప్రత్యేక ‘కానుక’లతో మెప్పిస్తారు. అదే తరహాలో అమెరికా విదేశాంగ మంత్రిగా ఉన్నకాలంలో మైక్ పాంపియోకు ఒక ఖరీదైన విస్కీ బాటిల్‌ను జపాన్ ప్రభుత్వం 2019 జూన్ 24న బహూకరించినట్లు అమెరికా ప్రభుత్వ రికార్డుల్లో ఉంది. ఆ విస్కీ బాటిల్ ఖరీదు దాదాపు రూ.4,32,085. ఖరీదైన బహుమానాలను ప్రభుత్వ పదవిలో ఉన్న వ్యక్తులు తమ సొంతానికి తమ వద్ద అట్టిపెట్టుకోవడానికి వీల్లేదు. అమెరికా చట్టాల ప్రకారం దాదాపు రూ.29వేలలోపు విలువైన వస్తువులనే అధికారులు/మంత్రులు తమ వద్ద ఉంచుకోవచ్చు. అంతకుమించి విలువైనవి అమెరికా ప్రభుత్వానికి చెందుతాయి. కనీసం ముట్టుకోలేదు ‘కనీసం నేను ఆ బాటిల్‌ను తాకనైనా తాకలేదు. ఎందుకంటే.. ఆ బాటిల్ సంగతే నాకు తెలియదు. నాకు ఎవరూ బహూకరించలేదు. అయినా, అంతటి ఖరీదైన బాటిల్‌ను స్వాధీనం చేసుకోవడంలో విదేశాంగ విభాగ సిబ్బంది ఎలా మిస్ చేస్తారు?’అని పాంపియో వ్యాఖ్యానించారు. వాస్తవానికి ఆ తేదీన ఆయన జపాన్‌లో లేరని, సౌదీ అరేబియాకు వెళ్తున్నారని న్యూయార్క్ టైమ్స్ ఒక కథనంలో పేర్కొంది. బాటిల్‌ను ఎవరు మాయం చేశారనే దానిపై లోతైన దర్యాప్తు కొనసాగుతోంది. -
అడుగడుగునా కరోనా పరీక్షలు
టోక్యో: ఒలింపిక్స్ క్రీడలకు మరో 85 రోజులు ఉన్నాయి. కరోనా కల్లోలంలో వీటిని సజావుగా జరిపేందుకు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) బుధవారం టోక్యో ఒలింపిక్స్ ఆర్గనైజింగ్ కమిటీ, జపాన్ ప్రభుత్వంతో సమావేశం నిర్వహించింది. ఇందులో టోక్యో ఒలింపిక్స్‌ను సజావుగా ఎలా నిర్వహించాలనే అంశంపై చర్చించడంతో పాటు ఇందులో పాల్గొనే క్రీడాకారుల ఆరోగ్య భద్రతపై కూడా కొన్ని కీలక అంశాలను ఆమోదించాయి. అంతేకాకుండా కరోనా నేపథ్యంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో తయారు చేసిన రూల్‌బుక్‌లోని నిబంధనలను కూడా సవరించాయి. కొత్త నిబంధనలు ► ఒలింపిక్స్‌లో పాల్గొనే అథ్లెట్లు, వారి సహాయక సిబ్బంది జపాన్‌కు వచ్చే ముందు తప్పనిసరిగా రెండుసార్లు కోవిడ్ పరీక్షను చేయించుకోవాలి. నెగెటివ్‌గా వస్తేనే టోక్యోలో అడుగుపెట్టాలి. ► ఒలింపిక్స్ సందర్భంగా అథ్లెట్లు, వారితో దగ్గరగా పనిచేసే కోచ్‌లు, ఫిజియోలకు ప్రతి రోజూ కోవిడ్ పరీక్షలను నిర్వహించడం జరుగుతుంది. ఇందుకు సంబంధించిన టైమ్ టేబుల్‌ను కూడా రూపొందించనున్నారు. ► ఒలింపిక్స్‌తో ప్రత్యక్షంగా సంబంధం ఉన్న వారు (అథ్లెట్లు తప్ప) ఒలింపిక్స్ విలేజ్‌లో అడుగుపెట్టగానే వారికి వరుసగా మూడు రోజుల పాటు కోవిడ్ పరీక్షలను నిర్వహిస్తారు. ఆ తర్వాత అథ్లెట్లతో వారికి ఉండే సంబంధాన్ని బట్టి రోజూ కోవిడ్ పరీక్షలు నిర్వహించాలా వద్దా అనేది నిర్ణయిస్తారు. ► ఒలింపిక్స్‌లో పాల్గొనేవారు తమకు కేటాయించిన పనులను మాత్రమే చేయాలి. అంతేకాకుండా వారంతా జపాన్ వాసులకు, జపాన్‌లో 14 రోజులకు పైగా ఉంటున్న వారితో ఒక మీటర్ కంటే తక్కువ దూరంతో ఉంటూ చేసే సంభాషణలను సాధ్యమైనంత మేర తగ్గించాలి. ► ఒలింపిక్స్‌లో పాల్గొనడానికి వచ్చిన వారు తమకు ప్రత్యేకంగా కేటాయించిన వాహనాల్లో మాత్రమే ప్రయాణం చేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజా రవాణాల్లో ప్రయాణం చేయరాదు. ► ఒలింపిక్స్‌లో పాల్గొనే వారు తమకు కేటాయించిన ప్రదేశాల్లో మాత్రమే అల్పాహారం, భోజనం వంటివి చేయాలి. ► కోవిడ్ పాజిటివ్‌గా తేలిన వ్యక్తితో 15 నిమిషాలు లేదా అంతకంటే ఎక్కువగా మాట్లాడినా, ఒక మీటర్ పరిధిలో ఉన్నా, మాస్క్ వేసుకోకుండా మాట్లాడిన వారిని క్లోజ్ కాంటాక్టులుగా భావిస్తారు. అయితే ఇవన్నీ కూడా ఒక గదిలో లేదా వాహనంలో జరగాల్సి ఉంటుంది. ► ఒలింపిక్స్, పారాలింపిక్స్‌లో జరిగే పోటీలను ప్రత్యక్షంగా చూడటానికి ఎంతమంది దేశవాళీ ప్రేక్షకులను అనుమతించాలి అనే విషయంపై జూన్‌లో నిర్ణయం తీసుకోనున్నారు. కరోనా నేపథ్యంలో ఇప్పటికే విదేశీ ప్రేక్షకులను అనుమతించకూడదనే నిర్ణయాన్ని ఐఓసీ తీసుకున్న విషయం తెలిసిందే. -
అమరావతికి అనువైన ప్రాజెక్టులు ఇవే..
సీఆర్డీఏ అధికారులకు జపాన్ బృందం సలహాలు సాక్షి, విజయవాడ : రాజధాని అమరావతి ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలతో పాటు ఆదాయం సమకూర్చుకునేందుకు ఉపయోగపడే పలు ప్రాజెక్టుల గురించి సీఆర్డీఏ అధికారులకు జపాన్ బృందం వివరించారు. జపాన్ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య 2015 అక్టోబర్ 22న జరిగిన ఒప్పందంలో భాగంగా రాజధాని ప్రాంతంలో ఏయే పరిశ్రమలు పెట్టవచ్చనే అంశంపై పరిశీలించింది. దీనికి సంబంధించిన నివేదికను జపాన్ బృందం తయారు చేసి శనివారం సీఆర్డీఏ అధికారులకు అందజేశారు. సీఆర్డీఏ కార్యాలయంలో జరిగిన సమావేశంలో జపాన్ బృందం ఆయా ప్రాజెక్టులపై సీఆర్డీఏ, అమరావతి డవలప్మెంట్ కార్పొరేషన్ (ఏడీసీ), పోలీసుశాఖ అధికారులకు వివరించారు. సీఆర్డీఏ అడిషనల్ కమిషనర్ రామమోహనరావు, డీసీపీ రాణా, ఇతర సీఆర్డీఏ అధికారులు పాల్గొన్నారు. రాజధాని ప్రాంతంలో ఏర్పాటు చేయడానికి వీలుగా వుండే ప్రాజెక్టుల గురించి జాపాన్ బృందం చెప్పిన వివరాలు.. డేటా సెంటర్. క్రౌడ్ కంప్యూటింగ్ ఇన్ఫ్రాస్టక్చర్ రాష్ట్రమంతంటికీ తక్కువ ఇంధన ఖర్చుతో అత్యుత్తమంగా ఇంటర్ నెట్ సేవలు అందించే స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ మాడ్యూలర్ డేటా సెంటర్‌ను అమరావతిలో ఏర్పాటు చేయాలని సూచిం చారు. క్రౌడ్ కంప్యూటింగ్‌తో పాటు తక్కువ వ్యవధిలో పౌరులకు ఉపయోగపడే దరఖాస్తులకు పరిశీలించేందుకు ఈ మాడ్యులర్ డేటా సెంటర్‌ను ఉపయోగించవచ్చన్నారు. వాతావరణ రాడార్ సిస్టమ్స్ ప్రకృతి వైపరీత్యాల గురించి ముందుగానే తెలుసుకుని, కాపాడేందుకు ఉపయోగపడే వాతావరణ రాడార్ సిస్టమ్‌ను అమరావతిలో ఏర్పాటు చేయాలని జపాన్ బృందం సూచించింది. ఈ రాడార్ సిస్టమ్ రాజ« దాని ప్రాంతంలోని కాల్వలు, నది, మురికి కాల్వలు, రవా ణా రంగాలకు అనుసంధానం చేస్తారు. దీనివల్ల ముందుగా వచ్చే ప్రమాదాలను పసిగట్టే వీలుంటుంది. తద్వారా ప్రాణ, భారీగా ఆస్తినష్టం జరగకుండా చూసుకోవచ్చు. మంచినీటి సదుపాయం అతి తక్కువ ఖర్చుతో అతి పరిశుభ్రమైన నీటిని ప్రతి ఇంటికి ఇచ్చేం దుకు వీలుగా ఒక ప్రాజెక్టును జపాన్ బృందం సీ ఆర్డీఏ అధికారు లకు వివరించింది. ప్రపంచంలో కొన్ని ముఖ్యమైన నగరాల్లో తాగునీటి కోసం ఏ విధానాలను అవలంబిస్తున్నారో వివరించి రాజధాని లో మంచినీటి ఇబ్బంది రాకుండా తీసుకోవాల్సిన చర్యలను వివరించింది. పర్యావరణ ఇబ్బందులు రాకుండా ఇంధనం కూడా ఉత్పత్తి చేసే సీవియేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ వివరాలను బృందం వివరించింది. రాజధాని ప్రాంతంలో ట్రాఫిక్ జామ్‌లు లేకుండా సిగ్నల్స్ ఏర్పాటు గురించి వివరించారు. ఇదే సమయంలో డీసీపీ రాణా విజయవాడలో ట్రాఫిక్ సమస్యలు గురించి వారికి వివరించారు. నగరంలో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరణకు ఒక ప్రణాళిక ఇస్తామని జపాన్ బృందం హామీ ఇచ్చింది. భూకంపాలు తట్టుకునేలా నిర్మాణాలు ప్రొఫెసర్ ఎంవీఎస్ రాజు రామవరప్పాడు : భూకంప తీవ్రతను తట్టుకునేలా నిర్మాణాలు చేపట్టేలా ప్రణాళిక సిద్ధమవుతున్నాయని ప్రొఫెసర్ ఎంవీఎస్ రాజు తెలిపారు. ఎనికేపాడులోని ఎస్సార్కే ఇంజినీరింగ్ కళాశాలలో సివిల్ విభాగం ఆధ్వర్యంలో ‘నిర్మాణ రంగంలో వస్తున్న మార్పులు– మారుతున్న సాంకేతికత’ అంశంపై రెండు రోజులుగా నిర్వహిస్తున్న జాతీయ స్థాయి సదస్సు శనివారం ముగిసింది. రాజు మాట్లాడారు. -
ఇల్లు తిరగేస్తే...!
వర్ణం ఇల్లు తిరగేసి ఉండటం ఎప్పుడైనా చూశారా... ఏంటా ఆశ్చర్యం. ఇపుడు చూస్తారు ! ఈ ఫొటో చూడండి. ఆ ఇంట్లో అడుగుపెడితే కిందుండాల్సినవన్నీ పైకప్పుకు వేళ్లాడుతుంటాయి. పైనుంచి టీ పాయ్ వేలాడుతూ ఉంటుంది. కానీ దానిమీద పెట్టిన ఫోను కిందపడదు. కిచెన్‌లో అన్ని వస్తువులు ఉంటాయి. కానీ వంట మాత్రం చేయలేరు. బాత్రూమ్ కమోడ్ తలెత్తి చూస్తే కానీ కనిపించదు... ఏంటీ వింత అనిపిస్తుంది కదా. పర్యాటకులకు కొత్త అనుభూతిని ఇవ్వడానికి రష్యా ప్రభుత్వం చేసిన ప్రయోగం ఇది. మాస్కోలోని ‘ఆల్-రష్యా ఎగ్జిబిషన్ సెంటర్లో’ ఇలాంటి తలకిందుల ఇళ్లు కనిపిస్తాయి. అక్కడ కేవలం ఇల్లు మాత్రమే ఉండదు... ఇంట్లో ఉండాల్సిన అన్ని వస్తువులు ఇంటితో పాటు తలకిందులుగా ఉంటాయి. రండి వెళదాం రష్యాకి! 20 ఏళ్ల పడుచుల ఆనందకేళి ! గాల్లో తేలియాడుతున్న ఈ అమ్మాయిలు ఇరవై ఏళ్లు నిండిన జపాన్ పడుచులు. ప్రతి సంవత్సరం జపాన్ ప్రభుత్వం అధికారికంగా జరిపే ఉత్సవం ఇది. గత ఏప్రిల్ నుంచి రాబోయే ఏప్రిల్ వరకు ఎవరికైతే ఇరవై ఏళ్లు నిండుతాయో వారంతా ఎవరి టౌన్లో వారు గవర్నమెంటు ఆఫీసుకు జపాన్ సంప్రదాయ వస్త్రాలు కిమోనో (ఫొటోలో వేసుకున్నవి) ధరించి వెళ్లాలి. వారందరినీ ఉద్దేశించి అధికారులు జపాన్ ప్రభుత్వ చట్టాల ప్రకారం ఇక నుంచి మీరు పెద్దలు. మీపై బాధ్యతలు కూడా పెరుగుతాయి అంటూ కాస్త మంచి మాటలు చెప్పి చిన్న జ్ఞాపిక వంటి బహుమతులు ఇచ్చి పంపుతారు. ప్రపంచంలో ఇంత పద్ధతిగా పిల్లలకు బాధ్యతల గురించి తెలపడం ఇక్కడే ఉంటుంది. ఈసారి 12 లక్షల మంది ఇరవై ఏళ్లు పూర్తిచేసుకున్నారక్కడ.