టోక్యో: ఒలింపిక్స్ క్రీడలకు మరో 85 రోజులు ఉన్నాయి. కరోనా కల్లోలంలో వీటిని సజావుగా జరిపేందుకు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) బుధవారం టోక్యో ఒలింపిక్స్ ఆర్గనైజింగ్ కమిటీ, జపాన్ ప్రభుత్వంతో సమావేశం నిర్వహించింది. ఇందులో టోక్యో ఒలింపిక్స్‌ను సజావుగా ఎలా నిర్వహించాలనే అంశంపై చర్చించడంతో పాటు ఇందులో పాల్గొనే క్రీడాకారుల ఆరోగ్య భద్రతపై కూడా కొన్ని కీలక అంశాలను ఆమోదించాయి. అంతేకాకుండా కరోనా నేపథ్యంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో తయారు చేసిన రూల్‌బుక్‌లోని నిబంధనలను కూడా సవరించాయి.
కొత్త నిబంధనలు
► ఒలింపిక్స్‌లో పాల్గొనే అథ్లెట్లు, వారి సహాయక సిబ్బంది జపాన్‌కు వచ్చే ముందు తప్పనిసరిగా రెండుసార్లు కోవిడ్ పరీక్షను చేయించుకోవాలి. నెగెటివ్‌గా వస్తేనే టోక్యోలో అడుగుపెట్టాలి.
► ఒలింపిక్స్ సందర్భంగా అథ్లెట్లు, వారితో దగ్గరగా పనిచేసే కోచ్‌లు, ఫిజియోలకు ప్రతి రోజూ కోవిడ్ పరీక్షలను నిర్వహించడం జరుగుతుంది. ఇందుకు సంబంధించిన టైమ్ టేబుల్‌ను కూడా రూపొందించనున్నారు.
► ఒలింపిక్స్‌తో ప్రత్యక్షంగా సంబంధం ఉన్న వారు (అథ్లెట్లు తప్ప) ఒలింపిక్స్ విలేజ్‌లో అడుగుపెట్టగానే వారికి వరుసగా మూడు రోజుల పాటు కోవిడ్ పరీక్షలను నిర్వహిస్తారు. ఆ తర్వాత అథ్లెట్లతో వారికి ఉండే సంబంధాన్ని బట్టి రోజూ కోవిడ్ పరీక్షలు నిర్వహించాలా వద్దా అనేది నిర్ణయిస్తారు.
► ఒలింపిక్స్‌లో పాల్గొనేవారు తమకు కేటాయించిన పనులను మాత్రమే చేయాలి. అంతేకాకుండా వారంతా జపాన్ వాసులకు, జపాన్‌లో 14 రోజులకు పైగా ఉంటున్న వారితో ఒక మీటర్ కంటే తక్కువ దూరంతో ఉంటూ చేసే సంభాషణలను సాధ్యమైనంత మేర తగ్గించాలి.
► ఒలింపిక్స్‌లో పాల్గొనడానికి వచ్చిన వారు తమకు ప్రత్యేకంగా కేటాయించిన వాహనాల్లో మాత్రమే ప్రయాణం చేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజా రవాణాల్లో ప్రయాణం చేయరాదు.
► ఒలింపిక్స్‌లో పాల్గొనే వారు తమకు కేటాయించిన ప్రదేశాల్లో మాత్రమే అల్పాహారం, భోజనం వంటివి చేయాలి.
► కోవిడ్ పాజిటివ్‌గా తేలిన వ్యక్తితో 15 నిమిషాలు లేదా అంతకంటే ఎక్కువగా మాట్లాడినా, ఒక మీటర్ పరిధిలో ఉన్నా, మాస్క్ వేసుకోకుండా మాట్లాడిన వారిని క్లోజ్ కాంటాక్టులుగా భావిస్తారు. అయితే ఇవన్నీ కూడా ఒక గదిలో లేదా వాహనంలో జరగాల్సి ఉంటుంది.
► ఒలింపిక్స్, పారాలింపిక్స్‌లో జరిగే పోటీలను ప్రత్యక్షంగా చూడటానికి ఎంతమంది దేశవాళీ ప్రేక్షకులను అనుమతించాలి అనే విషయంపై జూన్‌లో నిర్ణయం తీసుకోనున్నారు. కరోనా నేపథ్యంలో ఇప్పటికే విదేశీ ప్రేక్షకులను అనుమతించకూడదనే నిర్ణయాన్ని ఐఓసీ తీసుకున్న విషయం తెలిసిందే.
అడుగడుగునా కరోనా పరీక్షలు
Published Thu, Apr 29 2021 3:59 AM | Last Updated on Thu, Apr 29 2021 3:59 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment