Health security
-
ఏపీ వైద్య విద్యలో వందేళ్ల రికార్డు
సాక్షి, అమరావతి: ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యమిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం వైద్య నియామకాల నుంచి మెడికల్ కాలేజీల నిర్మాణం వరకు అన్నింటా ఆదర్శంగా నిలుస్తోంది. ఇప్పటికే ఫ్యామిలీ డాక్టర్ విధానంతోపాటు రాష్ట్రంలో 95% కుటుంబాలను డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోకి తెచ్చి ప్రతి ఒక్కరికీ ఆరోగ్య భద్రతను కల్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఒకే రోజు ఐదు కొత్త వైద్య కళాశాలలను సీఎం వైఎస్ జగన్ శుక్రవారం ప్రారంభించనున్నారు. తద్వారా వైద్య విద్యలో సరికొత్త అధ్యాయానికి నాంది పలుకుతున్నారు. విజయనగరం, ఏలూరు, రాజమహేంద్రవరం, మచిలీపట్నం, నంద్యాలలో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచే ఎంబీబీఎస్ మొదటి ఏడాది తరగతులు అందుబాటులోకి వచ్చాయి. విజయనగరం వైద్య కళాశాల వద్ద నిర్వహించే కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొని అక్కడి నుంచే మిగిలిన నాలుగు కళాశాలలను కూడా ప్రారంభించనున్నారు. జిల్లాకు ఒకటి చొప్పున ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేసి జిల్లాకు ఒక ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకుంటామని 2019 ఎన్నికల సమయంలో వైఎస్సార్సీపీ హామీ ఇచ్చింది. అన్ని ప్రాంతాలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను చేరువ చేయడంతో పాటు మన విద్యార్థులకు వైద్య విద్య అవకాశాలను మెరుగుపరుస్తామని తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తూ ఏకంగా 17 కొత్త వైద్య కళాశాలలకు ప్రభుత్వ రంగంలో శ్రీకారం చుట్టడం ద్వారా సీఎం జగన్ నూతన అధ్యాయాన్ని లిఖించారు. 17 కొత్త కళాశాలలు.. 2,550 ఎంబీబీఎస్ సీట్లు రూ.8,480 కోట్లతో 17 కొత్త మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నారు. కొత్త కళాశాలల ఏర్పాటు ద్వారా అదనంగా 2,550 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ విద్యా సంవత్సరం నుంచి ఐదు కళాశాలలు ప్రారంభమయ్యాయి. వీటిలో ఒక్కో చోట 150 చొప్పున 750 సీట్లు ఇప్పటికే అందుబాటులోకి రాగా విద్యార్థులు అడ్మిషన్లు కూడా పొందారు. వచ్చే విద్యా సంవత్సరంలో మార్కాపురం, మదనపల్లె, పాడేరు, పులివెందుల, ఆదోని మెడికల్ కళాశాలలను ప్రారంభించనున్నారు. ఇక మిగిలిన 7 వైద్య కళాశాలలను 2025–26లో ప్రారంభించేందుకు వీలుగా ఆయా ప్రాంతాల్లోని ప్రభుత్వాస్పత్రులను 330 పడకల జిల్లా ఆస్పత్రులుగా ప్రభుత్వం నోటిఫై చేసింది. మూడేళ్లలోనే సీట్లు రెట్టింపు రాష్ట్రంలో ఆంధ్రా వైద్య కళాశాల 1923లో మొదటిసారిగా ఏర్పాటైంది. ఆ తరువాత మరో పది ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటు ద్వారా 2,185 ఎంబీబీఎస్ సీట్లు సమకూరాయి. అంటే 2,185 సీట్లు సమకూరడానికి వందేళ్ల సమయం పట్టింది. ఇప్పుడు 17 వైద్య కళాశాలలను అందుబాటులోకి తేవడం ద్వారా ఏకంగా 2,550 ఎంబీబీఎస్ సీట్లను సీఎం జగన్ మన విద్యార్థులకు అదనంగా సమకూరుస్తుండటం గమనార్హం. అంటే కేవలం మూడేళ్ల వ్యవధిలో రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్లు ప్రభుత్వ రంగంలో రెట్టింపు దాటనున్నాయి. చాలా అద్భుతంగా ఉన్నాయి అత్యాధునికంగా మెడికల్ కళాశాలను ఏర్పాటు చేశారు. ప్రైవేట్ కాలేజీ కంటే మెరుగ్గా ఉంది. అత్యాధునిక ల్యాబ్స్, టీచింగ్ హాల్స్, లెక్చర్ హాల్స్ అన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి. కొత్తగా ఏర్పాటు చేసిన కళాశాలలో తొలి బ్యాచ్‌లో చదవడం చక్కటి అనుభూతి. ప్రభుత్వం కొత్త మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయకపోయి ఉంటే మేం ప్రైవేట్ కాలేజీలకు వెళ్లాల్సి వచ్చేది. – సీహెచ్, ఢిల్లీరావు, వైద్య విద్యార్థి, ఏలూరు వైద్య కళాశాల గొప్ప వరంలా భావిస్తున్నా మాది విశాఖపట్నం. మధ్యతరగతి కుటుంబం. నీట్లో కొంత మెరుగైన ర్యాంక్ వచ్చింది. అయినప్పటికీ బీసీ ‘ఏ’ కేటగిరీలో గతంలో ఈ ర్యాంకుకు మెడిసిన్‌లో సీటు రావటం సాధ్యమయ్యేది కాదు. ఈ ఏడాది నుంచి ప్రభుత్వం కొత్త వైద్య కళాశాలలను ప్రారంభించడంతో నా ర్యాంక్‌కు సీట్ దక్కింది. లేదంటే మళ్లీ నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్‌కు వెళ్లాల్సి వచ్చేది. ఒత్తిడితోపాటు విలువైన సమయం, డబ్బు వృథా అయ్యేది. కార్పొరేట్ వైద్య కళాశాలలకు ధీటుగా మా మెడికల్ కళాశాలను ఏర్పాటు చేశారు. ప్రభుత్వం కొత్త వైద్య కళాశాలలను ఏర్పాటు చేయడం గొప్ప వరంలా నాలాంటి ఎందరో విద్యార్థులు భావిస్తున్నారు. – బమ్మిడి లక్ష్మీజ్యోత్న్స, వైద్య విద్యార్థిని, ఏలూరు ప్రభుత్వ వైద్య కళాశాల రెండు రకాల లాభాలు.. వైద్యవిద్య డిమాండ్‌కు తగ్గట్టుగా రాష్ట్రంలో కళాశాలలు లేకపోవడంతో మన విద్యార్థులు వలస వెళుతున్నారు. రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలలతో మన విద్యార్థులకు వైద్యవిద్య అవకాశాలు పెరుగుతున్నాయి. జిల్లా, ఏరియా ఆస్పత్రులున్న చోట బోధనాస్పత్రులు అందుబాటులోకి వస్తున్నాయి. వైద్య సేవలు, రోగనిర్ధారణ సేవల్లో నాణ్యత పెరుగుతుంది. ఇలా విద్య, వైద్యంలో రెండురకాలుగా లాభాలుంటాయి. – డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి, డిప్యూటీ సూపరింటెండెంట్, కర్నూలు జీజీహెచ్ ఉన్నత స్థాయి వైద్యం కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు ద్వారా వాటికి అనుబంధంగా బోధనాస్పత్రులు పని చేస్తాయి. వీటిద్వారా ప్రజలకు ఉన్నత స్థాయి వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి. సూపర్ స్పెషాలిటీ సేవలు అభివృద్ధి చెందుతాయి. ఆయా ప్రాంతాల్లో జబ్బులు, ప్రజలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలపై పరిశోధనలు పెరుగుతాయి. సేవలు రెట్టింపు అవుతాయి. అన్ని ప్రాంతాల్లో బోధనాస్పత్రులు అందుబాటులోకి వస్తే ప్రజలకు వ్యయ ప్రయాసలు తొలగి అనుభవజ్ఞులైన వైద్యుల సంరక్షణ లభిస్తుంది. రోగులు మరింత త్వరగా కోలుకోవడానికి ఇది దోహదపడుతుంది. – డాక్టర్ జి.రవికృష్ణ,ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్న చోటే వైద్య విద్యలో చేరా.. ప్రభుత్వం మా ప్రాంతంలో కొత్త వైద్య కళాశాలను ప్రారంభించడంతో అక్కడే ఆప్షన్ ఇచ్చా. అందులోనే సీటు వచ్చింది. ఇటీవలే తరగతులు ప్రారంభం అయ్యాయి. చాలా సంతోషంగా ఉంది. మేం ఉంటున్న ప్రాంతంలోనే వైద్య విద్య అభ్యసిస్తున్నా. లేదంటే దూర ప్రాంతాలు వెళ్లాల్సి వచ్చేది. మనవద్ద మెడికల్ సీట్లు పెరగడంతో చాలా మందికి అవకాశాలు లభించాయి. – మహ్మద్ హర్సిన బేగం, వైద్య విద్యార్థిని, రాజమండ్రి వైద్య కళాశాల నాలుగేళ్లలో వైద్యం బలోపేతం ఇలా.. నాలుగేళ్లలో ఏకంగా దాదాపు 53 వేలకు పైగా వైద్య పోస్టుల భర్తీ. ఎప్పటి ఖాళీలు అప్పుడే యుద్ధప్రాతిపదికన నియామకం. ఇందుకోసమే ప్రత్యేకంగా రిక్రూట్మెంట్ బోర్డ్ ఏర్పాటు. రూ.16,852 కోట్లతో 17 కొత్త వైద్య కళాశాలలు, వివిధ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణంతో పాటు నాడు–నేడు ద్వారా ప్రభుత్వాస్పత్రులకు జవసత్వాలు. గ్రామాల్లో 10,032 వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌ల ఏర్పాటు. 12 రకాల వైద్య సేవలు, 14 రకాల పరీక్షలు, 105 రకాల మందులతో సొంత ఊళ్లలోనే ప్రజలకు వైద్య సేవలు. దేశంలోనే తొలిసారిగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అమలు. నెలకు రెండుసార్లు గ్రామాలకు పీహెచ్సీ వైద్యులు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో జీఎంపీ, డబ్ల్యూహెచ్‌వో ప్రమాణాలు కలిగిన మందులు ఉచితంగా సరఫరా. టీడీపీ హయాంలో నిర్వీర్యమైన ఆరోగ్యశ్రీ బలోపేతం. వైఎస్సార్ ఆరోగ్యశ్రీలో ప్రొసీజర్లు 1,059 నుంచి ఏకంగా 3,257కి పెంపు. 40 లక్షల మందికి ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం కోసం రూ.8 వేల కోట్ల వ్యయం. వైఎస్సార్ ఆరోగ్య ఆసరాతో విశ్రాంతి సమయంలో జీవన భృతి చెల్లింపు. ఇప్పటివరకూ 17.25 లక్షల మందికి రూ.1,074.69 కోట్లు అందించిన ప్రభుత్వం. 108 (768 వాహనాలు), 104 (936) వాహనాలతో వైద్య సేవలు బలోపేతం. మరో 500 తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలతో కలిపి మొత్తం 2,204 వాహనాలతో ప్రజలకు ఉచిత వైద్య సేవలు. టీడీపీ హయాంలో 108 అంబులెన్స్‌లు కేవలం 531 మాత్రమే ఉండగా ఇందులో కేవలం 336 మాత్రమే మనుగడలో ఉండేవి. పీజీ మెడికల్ సీట్ల సంఖ్యను నాలుగేళ్లలో 966 నుంచి 1,767కి పెంచిన రాష్ట్ర ప్రభుత్వం. జాతీయస్థాయిలో స్పెషలిస్ట్ డాక్టర్ల పోస్టులు ఖాళీలు 61 శాతం కాగా మన రాష్ట్రంలో అది కేవలం 3.96% మాత్రమే. వైఎస్సార్ పెన్షన్ కానుక కింద దీర్ఘకాలిక రోగులకు వ్యాధి తీవ్రతను బట్టి రూ.3 వేల నుంచి రూ.10 వేల వరకు ప్రతి నెలా ఇంటి వద్దే పెన్షన్లు గుంటూరు, కర్నూలు, విశాఖ, కడప, కాకినాడ, అనంతపురంలో 6 క్యాన్సర్ కేర్ సెంటర్ల ఏర్పాటు దిశగా అడుగులు. -
మహిళలు, పిల్లలకు ఆరోగ్య భద్రత
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని మహిళలు, పిల్లల్లో రక్తహీనత, పౌష్టికాహార లోపాలను నివారించి, ఆరోగ్యంగా ఉంచాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం సూక్ష్మస్థాయిలో కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తోంది. తొలి దశలో 8 అంశాల్లో గ్రామ, వార్డు సచివాలయాలు కేంద్ర బిందువుగా సుస్థిర ప్రగతి లక్ష్యాల సూచికలను సాధించడం ద్వారా దేశంలోనే మొదటి స్థానంలో నిలిచేందుకు ఈ నెల 16 నుంచి ఇంటింటి సర్వే చేపట్టింది. వలంటీర్ల ద్వారా ఇంటింటి సర్వే చేసి, రక్తహీనత, పౌష్టికాహార లోపం ఉన్న మహిళలు, పిల్లలను గుర్తించి, వారికి అవసరమైన మందులు, పౌష్టికాహారాన్ని అందించి ఆరోగ్యంగా తీర్చీదిద్దడానికి చర్యలు చేపట్టింది. వారికి ముందులు, ఆహారం సరఫరాను గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు నిరంతరం పర్యవేక్షిస్తారు. ఇప్పటికే 40 లక్షల ఇళ్లలో సర్వే పూర్తయింది. గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ఈ సర్వే కోసం వలంటీర్లకు ప్రాధాన్యత గల 8 సుస్థిర ప్రగతి లక్ష్యాల సూచికలతో ఓ అప్లికేషన్ కూడా రూపొందించింది. 2,65,979 క్లస్టర్ల వారీగా 1,59,29,858 కుటుంబాలను వీరు కలుసుకుంటున్నారు. రక్తహీనత, బరువు తక్కువ, పౌష్టికాహార లోపాలతోపాటు పిల్లల్లో స్కూల్ డ్రాపవుట్స్ పాఠశాలల్లో మహిళా టాయిలెట్ల నిర్వహణ, విద్యుత్, తాగునీటి సదుపాయాలపై సర్వే చేస్తున్నారు. ఆ వివరాలను యాప్‌లో నమోదు చేస్తున్నారు. వాటిని పరిశీలించిన అధికారులు తదనుగుణంగా చర్యలు చేపడతారు. 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు, 11, 12 తరగతుల్లో పిల్లల ఎన్రోల్మెంట్ రేషియోతోపాటు డ్రాపవుట్స్ లేకుండా ఆ ఈడు పిల్లలందరూ విద్యా సంస్థల్లో ఉండేలా సర్వే ద్వారా చర్యలు చేపడుతున్నారు. పిల్లలు ఎవ్వరైనా స్కూల్‌కు రాకపోతే ఆ విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేసి, మళ్లీ బడిలో చేర్పించేందుకు వలంటీర్లు చర్యలు తీసుకుంటారు. స్కూళ్లలో కనీస మౌలిక వసతుల వివరాలు సేకరించి, లోపాలుంటే వెంటనే సరిచేస్తారు. కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఇంటింటి సర్వే పురోగతిని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) డాక్టర్ సమీర్ శర్మ సమీక్షించారు. సర్వేను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. 8 సుస్థిర ప్రగతి సూచికల లక్ష్యాల సాధనకు సర్వే అంశాలు ఇవే ► కౌమారదశలో ఉన్న 10 ఏళ్ల నుంచి 19 ఏళ్లలోపు మహిళల్లో రక్తహీనత కలిగిన వారు ఎంత శాతం ఉన్నారు? ► 15 ఏళ్ల నుంచి 49 ఏళ్ల గర్భిణుల్లో రక్తహీనత కలిగిన వారు ఎంత శాతం ఉన్నారు? ► ఎదుగుదల లేక కుచించుకపోయిన ఐదేళ్ల లోపు పిల్లలు ఎంత మంది ఉన్నారు? ► తక్కువ బరువుగల ఐదేళ్లలోపు పిల్లలు ఎంత మంది ఉన్నారు? ► ఎలిమెంటరీ స్కూల్స్‌లో 1 నంచి 10వ తరగతి వరకు ఎన్రోల్మెంట్ రేషియో ► ఉన్నత విద్యలో 11, 12 తరగతుల్లో స్థూల నమోదు నిష్పత్తి ► స్కూళ్లలో విద్యుత్, తాగునీరు అందుబాటు ఎంత శాతం ఉన్నాయి? ► స్కూళ్లలో ప్రధానంగా బాలికల టాయిలెట్ల నిర్వహణ, స్థితి ఎలా ఉంది? ఈ నెల 25లోగా సర్వే పూర్తి మహిళలు, పిల్లల ఆరోగ్యం.. ప్రధానంగా రక్తహీనత, పౌష్టికాహార లోపాలను గుర్తించేందుకు రాష్ట్రం అంతటా తొలిసారిగా పెద్ద ఎత్తున ఇంటింటి సర్వే చేపట్టాం. ఈ నెల 25కి సర్వే పూర్తవుతుంది. సర్వే కోసం ప్రత్యేకంగా నమూనా ఫారమ్‌ను రూపొందించాం. సర్వేలో వివరాల ఆధారంగా రక్త హీనత, పౌష్టికాహార లోపాలు గల, ఇతర ఆరోగ్య సమస్యలున్న వారిపై దృష్టి సారించి, వ్యాధుల నివారణకు చర్యలు తీసుకుంంటాం. తద్వారా 8 అంశాల్లో సుస్థిర ప్రగతి సూచికల లక్ష్యాలను పూర్తి స్థాయిలో సాధించడమే ధ్యేయం. – గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ -
ఈ–శ్రమ్‌తో కార్మికులకు ఆర్థిక భద్రత
కవాడిగూడ: అసంఘటిత కార్మికులకు ఆర్యోగ భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ–శ్రమ్ కార్డులను ప్రవేశపెట్టిందని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బుధవారం భోలక్‌పూర్ డివిజన్ రంగానగర్‌లో డివిజన్ ఓబీసీ మోర్చా కమిటీ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు ఈ–శ్రమ్ కార్డులను పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన లక్ష్మణ్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం పేదలకు మెరుగైన వైద్యం, విద్య కల్పించేందుకు అంకితభావంతో పనిచేస్తుందన్నారు. ఆయూష్మాన్ భారత్ పథకం ప్రపంచంలోనే అతి పెద్ద ఆరోగ్య బీమా పథకం అని, దీనితో రూ.5లక్షల బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు.పేదలకు ఆరోగ్య బీమా పథకాల అమలులో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని మండిపడ్డారు. కార్యక్రమంలో ఓబీసీ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు పూసరాజు, ముషీరాబాద్ నియోజకవర్గం కన్వీనియర్ ఉమేష్, డివిజన్ బీజేపీ అధ్యక్షుడు రవి, బిజ్జి కనకేష్ కుమార్, నిత్యానంద్, మహేష్ సుందరి నర్సింహా, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
ప్రతీ కార్మికుడికి హెల్త్ ప్రొఫైల్
సాక్షి, హైదరాబాద్: ఈఎస్ఐ చందాదారుల ఆరోగ్య భద్రత విషయంలో కార్మిక రాజ్య బీమా సంస్థ (ఈఎస్ఐసీ) బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈఎస్ఐ పరిధిలో ఉన్న ప్రతీ కార్మికుడి హెల్త్ ప్రొఫైల్‌ను నిర్వహించాలని నిర్ణయించింది. ప్రస్తుతం అనారోగ్యం బారిన పడ్డ కార్మికులకు వైద్య చికిత్స, మందుల పంపిణీ వరకు పరిమితమైన ఈఎస్ఐసీ... ఇకపై కార్మికుడి ఆరోగ్య చిట్టా మొత్తాన్ని నిక్షిప్తం చేయనుంది. అంతేకాకుండా క్రమం తప్పకుండా ఏటా ఆరోగ్య పరీక్షలు నిర్వహించి సదరు కార్మికుడికి హెచ్చరికలు సైతం ఇవ్వనుంది. దీంతో భవిష్యత్ ఆరోగ్య పరిస్థితిపై కొంత అంచనా వస్తుందని, సకాలంలో జాగ్రత్తలు తీసుకుంటే కార్మికుడికి ఆరోగ్యకర జీవితం అందుతుందని సంస్థ చెబుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 63వేల సంస్థలు, పరిశ్రమలు, వాణిజ్య సముదాయాలున్నాయి. వీటి పరిధిలో 21 లక్షల మంది చందాదారులున్నారు. వీరి కుటుంబ సభ్యులను కలుపుకుంటే దాదాపు 80 లక్షలు అవుతారు. ప్రస్తుతం రాష్ట్రంలోని ఈఎస్ఐ ఆస్పత్రుల్లో ఏటా సగటున 3.5 లక్షల మంది ఐపీ (ఇన్‌పేషెంట్) కేటగిరీలో వైద్య చికిత్సలు పొందుతున్నారు. వీటికి అదనంగా మరో 20 శాతం మంది ఓపీ సేవలు కూడా పొందేవారున్నట్లు ఈఎస్ఐసీ చెబుతోంది. ఆరోగ్య పరీక్షలు కీలకం కార్మికుల హెల్త్ ప్రొఫైల్ నిర్వహణలో ఆరోగ్య పరీక్షల ప్రాత కీలకం. దీంతో ఏడాదికోసారి కార్మికులకు పూర్తిస్థాయి ఆరోగ్య పరీక్షలు నిర్వహించేందుకు ఈఎస్ఐసీ కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం అనారోగ్య సమస్యలు తలెత్తిన వారు మాత్రమే పరీక్షలు చేయించుకుని చికిత్స పొందుతున్నారు. ఇకపై హెల్త్ ప్రొఫైల్ నిర్వహణలో భాగంగా తప్పనిసరిగా వైద్య పరీక్షలు చేయించుకోవాలి. అనంతరం ఫలితాలను ఈఎస్ఐసీ వెబ్సైట్లో కార్మికుడి డేటాలో నిక్షిప్తం చేసి, ప్రతి సంవత్సరం ఈ వివరాలను అప్డేట్ చేస్తారు. పరీక్షల్లో ఏవైనా అనారోగ్య సంబంధిత లక్షణాలు, దీర్ఘకాల వ్యాధులు ఉన్నట్లు గుర్తిస్తే వెంటనే సంబంధిత ఆస్పత్రికి రిఫర్ చేసి చికిత్సను అందిస్తారు. ప్రస్తుతం ఆరోగ్య పరీక్షలను అన్ని ఈఎస్ఐ ఆస్పత్రుల్లో చేపట్టేలా చర్యలు మొదలు పెట్టారు. గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాల పనితీరుతోపాటు రక్త, మూత్ర పరీక్షలు నిర్వహిస్తారు. మరోవైపు చందాదారులందరికీ స్మార్ట్ కార్డులు ఇవ్వాలని కూడా సంస్థ నిర్ణయించింది. ఏప్రిల్ నాటికి ఈ ప్రక్రియ పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. -
Hyderabad Real Estate: శివారు జోరు!
సాక్షి, హైదరాబాద్: శివారు ప్రాంతాలలో రియల్టీ జోరు కొనసాగుతుంది. పరిధిలోనే కాదు.. కొత్త గృహాల ప్రారంభాల్లోనూ శివారు ప్రాంతాలు ప్రధాన నగరాన్ని దాటేశాయి. 2021 ఆర్థిక సంవత్సరంలో హైదరాబాద్‌లో 30,340 గృహాలు లాంచింగ్ కాగా.. ఇందులో 45 శాతం ఔటర్ ప్రాంతాల్లోనే ప్రారంభమయ్యాయి. మేడ్చల్, మియాపూర్, నిజాంపేట, శంషాబాద్, కోకాపేట, పటాన్చెరు, తెల్లాపూర్ శివార్లలోనే కేంద్రీకృతమయ్యాయి. ఎఫ్వై 19లోని మొత్తం 18,460 యూనిట్లలో 35 శాతం శివారుల్లోనే లాంచింగ్ అయ్యాయని అనరాక్ ప్రాపర్టీ కన్సల్టెంట్ తెలిపింది. పుణే ఫస్ట్, కోల్‌కతా లాస్ట్.. దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో 2021 ఆర్థిక సంవత్సరంలో (ఏప్రిల్ 2020 నుంచి మార్చి 2021) 1.49 లక్షల గృహాలు లాంచింగ్ కాగా.. ఇందులో 58 శాతం శివారు ప్రాంతాలలోనే ప్రారంభమయ్యాయి. ఎఫ్వై 20లో 2.07 లక్షల యూనిట్లు ప్రారంభం కాగా.. ఇందులో 53 శాతం, అలాగే ఎఫ్వై 19లో 2.29 లక్షల ఇళ్లు ప్రారంభం కాగా.. ఇందులో 51 శాతం గృహాలు శివారు ప్రాంతాల్లోనే లాంచింగ్ అయ్యాయి. శివారు ప్రాంతాలలో ప్రాజెక్ట్స్ల లాంచింగ్స్‌లో పుణే ప్రథమ స్థానంలో నిలవగా.. కోల్‌కతా చివరి స్థానంలో నిలిచింది. ఎఫ్వై 21లో పుణేలో 29,950 గృహాలు ప్రారంభం కాగా.. ఇందులో 76 శాతం ముల్శీ, పిరంగట్, దౌండ్, కంషేట్, రావేట్, చకాన్, చికాళీ, వాడ్గావ్ బుద్రక్, తలేగావ్ దభాడే, ఉంద్రీ శివారుల్లోనే ఉన్నాయి. ఎఫ్వై 19లోని 39,210 హౌసింగ్‌లో ఔటర్ వాటా 67 శాతం. కోల్‌కతాలో 4,250 గృహాలు లాంచింగ్ కాగా.. కేవలం 26 శాతం యూనిట్లు బరాసత్, బరాక్‌పూర్, సెరాంపూర్, గారియా, హౌరాల్లోనే ప్రారంభమయ్యాయి. ఇతర నగరాల్లో.. ► ఎఫ్వై 21లో ముంబైలో 34,620 యూనిట్లు లాంచింగ్ కాగా.. 67 శాతం గృహాలు పన్వేల్, పాల్ఘర్, వాసాయి, విరార్, బద్లాపూర్, భీవండి, డొంబివ్లీ ప్రాంతాలలోనే ప్రారంభమయ్యాయి. ఎఫ్వై 19లో వీటి వాటా 60 శాతంగా ఉంది. ► ఎన్సీఆర్లోని 19,090 గృహాలలో 57 శాతం సోహ్నా, గ్రేటర్ నోయిడా వెస్ట్, యమునా ఎక్స్‌ప్రెస్ వేలో ఉన్నాయి. ఎఫ్వై 19లోని మొత్తం 29,500 యూనిట్లలో ఔటర్ వాటా 49 శాతం. ► చెన్నైలోని 10,110 యూనిట్లలో 54 శాతం పూనమల్లె, అవడి, వండలూర్, షోలినాగ్నలూర్, గుడువాంచెరి, చెంగల్పట్టు ప్రాంతాలలో జరిగాయి. ఎఫ్వై 19లోని 16,130 యూనిట్లలో 44 శాతం వాటా శివారుదే. ► బెంగళూరులోని 20,520 గృహాలలో 46 శాతం చందపుర–అనెకల్ రోడ్, సర్జాపుర, యలహనక, దేవనహళ్లి, సర్జాపూర్–అట్టిబెల్ రోడ్లో ప్రారంభమయ్యాయి. ఎఫ్వై 19లోని 36,620 గృహాలలో శివారుల వాటా 37 శాతంగా ఉంది. డిమాండ్ ఎందుకంటే? కరోనా తర్వాతి నుంచి గృహ కొనుగోలుదారుల ప్రాధాన్యతలు మారిపోయాయి. గతంలో వాక్–టు–వర్క్ కల్చర్ ప్రాజెక్ట్‌లకు పరుగులు పెట్టిన కస్టమర్లు ప్రస్తుతం విశాలమైన, గ్రీనరీ ఎక్కువగా ఉండే నివాసాలు, వాయు, శబ్ధ కాలుష్యం తక్కు వగా ఉండే ప్రాంతాలలో అఫర్డబుల్ గృహాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. వర్క్ ఫ్రం హోమ్, ఈ–స్కూల్, ఆరోగ్య భద్రత వంటి వసతులున్న ప్రాజెక్ట్‌లకు ప్రాధాన్యత ఇస్తున్నారని అనరాక్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్ చైర్మన్ అనూజ్ పూరి తెలిపారు. శివారు ప్రాంతాలలో ల్యాండ్‌బ్యాంక్ ఉన్న డెవలపర్లు కొత్త ప్రాజెక్ట్‌లు ప్రారంభించడానికి ఇదే సరైన సమయం అని సూచించారు. అంతేకాకండా శివారు, కొత్త ప్రాంతాలలో నివాస సముదాయాల నిర్మాణాలతో ప్రధాన నగరంపై ఒత్తిడి తగ్గుతుంది. మెట్రో రైలు, ఔటర్ రింగ్ రోడ్ వంటి మౌలిక వసతులతో ప్రధాన నగరం, శివారు ప్రాంతాల మధ్య కనెక్టివిటీ పెరుగుతుంది. -
ఆరోగ్య సంరక్షణ ఖైదీలకు వద్దా?
ఆరోగ్య సంరక్షణను పొందడంలో ఖైదీలకు ఎదురవుతున్న అంతరాలను పూడ్చటానికి కోవిడ్–19 మహమ్మారి గొప్ప అవకాశాన్ని అందించింది. కటకటాల్లో ఉన్నవారితో సహా దేశంలోని పౌరులందరికీ వైద్య చికిత్సల విషయమై ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యతనివ్వాలి. 2020–21 సంవత్సరంలో మన స్థూల దేశీయోత్పత్తిలో ప్రజారోగ్య సంరక్షణకు పెట్టిన ఖర్చు 1.8 శాతం మాత్రమే. 2025 నాటికి ఆరోగ్యరంగ వ్యయాన్ని జీడీపీలో 2.5 శాతానికి పెంచాలని జాతీయ ఆరోగ్య విధానం –2017 సిఫార్సు చేసింది. దీంతోపాటు వైద్యరంగంలో ఖాళీలన్నింటినీ పూరించాలి. కనీసం 300 మంది ఖైదీలకు ఒక డాక్టర్ ఉండేలా వైద్య వ్యవస్థను సంస్కరించాలి. గత నెలలో బాంబే హైకోర్టు రాష్ట్రంలోని 47 కారాగారాల్లో డాక్టర్ పోస్టుల్లో ఎన్ని ఖాళీలున్నాయని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మహారాష్ట్ర లోని జైళ్లలో ప్రభుత్వం మంజూరు చేసిన వైద్యుల పోస్టుల్లో కనీసం మూడింట ఒకవంతు ఇప్పటికీ ఖాళీగా ఉండటమే. రాష్ట్రంలోని 30 వేలకు పైగా ఉన్న ఖైదీల బాగోగులను చూడటం కోసం 32 మంది డాక్టర్లు మాత్రమే ఉన్నారని ఈ వ్యవహారంపై విచారణ చేస్తున్న ధర్మాసనం పేర్కొంది. జైళ్లలో వైద్యుల సంఖ్యను పెంచమని మేం కోరడం లేదు. కనీసం ఇప్పటికే మంజూరు చేసిన పోస్టులనైనా పూరించమని మాత్రమే కోరుతున్నాం. ఒకసారి పోస్టులను మంజూరు చేశాక, వాటిని పూరించడం మీ బాధ్యత కాదా అంటూ బాంబే హైకోర్టు ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. కోవిడ్–19 మహమ్మారి సెకండ్ వేవ్‌లో దేశం మొత్తంగా చిక్కుకుని ఉన్న సమయంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వైరస్ వ్యాప్తికి కారాగారాలు ప్రమాదరకమైన కేంద్రాలుగా కొనసాగుతూ వస్తున్నాయి. గత సంవత్సరం కారాగారాల్లో కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదైన విషయం బయటపడ్డాక కూడా జైళ్లలో ఆరోగ్య సంరక్షణ పరిస్థితి ఏమాత్రం మారకపోవడం గమనార్హం. కారాగారాల్లో వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి గత సంవత్సరం చివరలో నిర్దిష్ట చర్యలు చేపట్టినప్పటికీ అప్పటికే ఆలస్యం జరిగింది. 2020 మే నెల నుంచి డిసెంబర్ వరకు దేశంలోని కారాగారాల్లో 18 వేలమంది ఖైదీలకు, జైలు సిబ్బందికి పరీక్షల్లో పాజిటివ్ అని తేలిందని వీరిలో 17 మంది తమ ప్రాణాలు కోల్పోయారని కామన్వెల్త్ హ్యూమన్ రైట్స్ ఇనిషియేటివ్ పొందుపర్చిన డేటా తెలుపుతోంది. ఖైదీలు, జైలు అధికారుల అవసరాలను తీర్చగలిగే స్థాయిలో జైళ్లలోని ఆరోగ్య సంరక్షణలు లేవన్నది తెలిసిందే. కానీ కరోనా మహమ్మారితో వ్యవహరించడానికి ఉన్నట్లుండి ఇవి ముందుపీఠికి రావలసిన అవసరం తన్నుకొచ్చింది. మహమ్మారి సెకండ్ వేవ్ సమయంలోనూ కారాగారాల్లోని ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలపై నిర్లక్ష్య వైఖరి కొనసాగుతోంది. 2021 సంవత్సరంలో ఇప్పటికే మన జైళ్లలో 4 వేల పాజిటివ్ కేసులు, 18 మంది మరణాలు నమోదయ్యాయి. ఖైదీలు, జైలుసిబ్బంది కూడా మహమ్మారి బారిన పడ్డారు. జైళ్లలో తగిన స్థాయిలో వైద్య మౌలిక సేవల కల్పన లేకపోవడం, వైద్య నియామకాల్లో ఖాళీలపై నిర్లక్ష్యం వంటివి సాధారణ ప్రజానీకం దృష్టికి చాలావరకు రావు. ఈ నేపథ్యంలో కారాగారాలకు ప్రాధాన్యమిచ్చి, వైరస్ వ్యాప్తిని అరికట్టే చర్యలను ప్రభుత్వాలు చేపట్టాల్సి ఉందని అంతర్జాతీయ హక్కుల సంస్థలు నొక్కి చెబుతున్నాయి. భౌతిక దూరం పాటించడం, స్వీయ ఏకాంతం పాటించడం అనేది జైళ్లలోపల దాదాపుగా అసాధ్యం అని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల హై కమిషనర్ మిచెల్లె బ్యాక్లెట్ అభిప్రాయం. జైళ్లలోని ఖైదీలను కరోనా కాలంలో విడుదల చేయడానికి, ప్రత్యేకించి వైరస్ ఇన్ఫెక్షన్కి గురవుతున్న ఖైదీల విడుదలకు ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుందని ఆమె నొక్కి చెప్పారు. జాతీయ నేర రికార్డుల బ్యూరో భారతీయ కారాగార గణాంకాలపై 2019 డిసెంబర్లో విడుదల చేసిన తన వార్షిక నివేదిక ప్రకారం దేశంలోని 4.78 లక్షలమంది ఖైదీలకు చెందిన వైద్య అవసరాలను 1,962 మంది వైద్య సిబ్బంది మాత్రమే రోజువారీగా పర్యవేక్షిస్తున్నారని తెలుస్తోంది. ఈ కాలానికి గానూ, జైళ్లలోని ఆరోగ్య సంరక్షణ అవసరాల కోసం రోజుకు సగటున అయిదు రూపాయలు మాత్రమే ఖర్చుపెట్టడం గమనార్హం. ఈ నేపథ్యంలో కారాగారాల్లో ఆరోగ్య సంరక్షణ విషయంలో నెలకొంటున్న విషాదస్థితికి పలు ఇతర కారణాలు కూడా తోడవుతున్నాయి. 1. వైద్య నిపుణులు కారాగారాలను సందర్శించడం లేదు. 2. జైలు ఆవరణకు వెలుపల ఉన్న ఆసుపత్రులకు జైలుఖైదీలను తరలించేందుకు తగిన రక్షణ సిబ్బంది లేకపోవడం. 3. మందుల సేకరణకు విషయంలో సవాళ్లు ఎదురుకావడం. 4. ఖైదీల్లో క్షయ, హెచ్ఐవీ ఎయిడ్స్, హెపటైటిస్ సి, స్కిన్ అలర్జీ వంటి వ్యాధులు అధికంగా ఉండటం. 5. జైళ్లలోపల ఖైదీలు ఆత్మహత్యలు చేసుకోవడం, మరణాల రేటు అధిక స్థాయిలో ఉండటం. ఖైదీలకు మానసిక కౌన్సెలింగ్, చికిత్స, ఇవ్వడం గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది. 2019లో లక్షమంది ఖైదీలకు గాను ఆత్మహత్యల ద్వారా చనిపోతున్న ఖైదీల సంఖ్య 24.24 శాతంగా నమోదైంది. సాధారణ ప్రజానీకంతో పోలిస్తే ఈ రేటు రెట్టింపు కావడం గమనార్హం. ఇరుకైన స్థలంలో ఒకరికొకరు సన్నిహితంగా మెలిగే పరిస్థితుల్లో అత్యధికంగా ఖైదీలను నిర్బంధించే వ్యవస్థ విశిష్ట స్వభావం కారణంగా ఆరోగ్య సంరక్షణ నిర్వహణ, వైద్యపరమైన మౌలిక వసతుల కల్పన అనేవి కారాగారాల నిర్వహణలో అత్యంత కీలకమైన అంశాలుగా ఉంటున్నాయి. పైగా తరచుగా మన జైళ్లు ఖైదీలతో కిక్కిరిసి పోవడం కూడా కద్దు. దీని ఫలితంగా కారాగారాలు నిత్యం ఆరోగ్య సమస్యల బారిన పడుతున్నాయి. దీంతోపాటు వైద్య అవసరాలు కూడా జైళ్లలో నిరవధికంగా సమస్యాత్మకంగా ఉంటున్నాయి. తగినంత స్థాయిలో నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ అనేది పౌరుల ప్రాథమిక హక్కు. ప్రజలను నిర్బంధించి ఉంచే ప్రదేశాల్లో ఇది మరింత కీలకమైన అంశం. ఏ వ్యక్తి విషయంలోనూ ఈ హక్కును తోసిపుచ్చరాదు. నేర విధాన పరిశోధన సంస్థ (ఐసీపీఆర్) పరిశీలన ప్రకారం, వ్యక్తిని నిర్బంధించాలంటూ ఇచ్చే తీర్పు, కేవలం ఆరోగ్యానికి నష్టం కలిగించేదే కాదు, వ్యక్తి స్వేచ్ఛను హరించేది కూడా. మెరుగైన ప్రజావైద్యానికి సంబంధించిన సమాచారం, ప్రియమైన వారి సంరక్షణ, సావధానత అనేవి చాలా అవసరం అయిన కరోనా సమయంలో ఖైదీలను బయటి ప్రపంచానికి దూరంగా ఉంచడం అనేది చాలా దుర్భరమైనది. కరోనా సమయంలో ఖైదీలపై అనేక ఆంక్షలు విధిస్తున్నారు. బంధువులను కలిసే ములాఖత్‌లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నారు. ఖైదీల విచారణలోనూ జాప్యం చేస్తున్నారు. దానికితోడుగా కరోనా మహమ్మారి న్యాయస్థానాల పనితీరును కూడా దెబ్బతీస్తోంది. గత సంవత్సరం కాలంగా విపరీతంగా పెరిగిపోతున్న కేసులు దీని ఫలితమే. 2019, 2020 మధ్య కాలంలో జిల్లా కోర్టుల్లో 18.2 శాతం, హైకోర్టుల్లో 20.4 శాతం, సుప్రీంకోర్టులో 10.35 శాతం దాకా కేసుల విచారణ నిలిచిపోయిందని నేషనల్ జ్యుడిషియల్ గ్రిడ్ గణాంకాలు చెబుతున్నాయి. నిర్బంధంలో ఉన్న ముద్దాయిల విచారణ కూడా నిలిచిపోవడంతో జైళ్లలో ఉంటూ విచారణకోసం ఎదురుచూస్తున్న వారిపై ఇది తీవ్ర ప్రభావం కలిగిస్తోంది. ఇప్పటికే ఆర్థికపరంగా, మానవ వనరుల పరంగా నీరసించిపోయిన జైళ్ల వ్యవస్థపై కరోనా మహమ్మారి అలవిమాలిన భారం మోపింది. తగినంతగా నిధుల పెంపుదల ద్వారా దేశవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలను మెరుగుపర్చినప్పుడు మాత్రమే జైళ్లలోని దుర్భర పరిస్థితులు కూడా మెరుగుపడటం మొదలవుతుంది.జైళ్లలో ఆరోగ్య సంరక్షణ మెరుగుపర్చాలంటే తక్షణం కారాగారాల్లో వైద్య పోస్టుల ఖాళీలను పూరించాలి. మోడల్ ప్రిజన్ మాన్యువల్ 2016 ప్రకారం కనీసం 300మంది ఖైదీలకు ఒక డాక్టర్నయినా ఏర్పర్చాలి. జైళ్లలో ఖైదీలను పరిమితికి మించి కుక్కడమే ఆరోగ్య ప్రమాణాలు పడిపోవడానికి పారిశుధ్య సమస్యలకు కారణమవుతున్నాయి. జైలు ఆసుపత్రుల్లో స్త్రీపురుషులకు సమాన అవకాశం కల్పించడం, నాణ్యమైన ఆహారం అందించడం, జైలు బయట స్పెషలిస్టు ఆసుపత్రులకు ఖైదీలను సకాలంలో పంపడం, మానసిక శాస్త్రజ్ఞులు, శస్త్రచికిత్సా నిపుణులు, దంత వైద్యులు, గైనకాలజిస్టులు, ఇతర వైద్య నిపుణులను క్రమం తప్పకుండా ఖైదీలను సందర్శించే ఏర్పాట్లు చేయడం జైళ్ల శాఖ, రాష్ట్ర ఆరోగ్య శాఖ విధిగా ఉండాలి. వ్యాసకర్త: సబికా అబ్బాస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ కామన్వెల్త్ హ్యూమన్ రైట్స్ ఇనిషియేటివ్ (ట్రిబ్యూన్ సౌజన్యంతో) -
వ్యాక్సిన్ కూడా సరుకేనా?
ప్రజలందరికీ ఉచితంగా కోవిడ్ వ్యాక్సిన్ అందించడం ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రప్రభుత్వం కనీసంగా చేయవలసిన పని. కానీ కోట్లాదిమంది ప్రజలకు సార్వత్రిక ప్రయోజనం కలిగించే అంశం కూడా మార్కెట్ సరకుగా మారిపోవడాన్ని అర్థం చేసుకోవడం కష్టసాధ్యమే. విస్తృత ప్రజానీకం ప్రాణాలు కాపాడి భారత్‌ను ప్రస్తుత దుర్భర పరిస్థితుల నుంచి కాపాడటం కంటే స్వేచ్ఛా మార్కెట్ భావజాలంపై కేంద్రప్రభుత్వానికి ఉన్న సానుకూల అభిప్రాయమే పైచేయి సాధించినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ క్షణంలో దేశ ఆరోగ్య భద్రతకు అత్యంత కీలకమైన ఒక ఉత్పత్తిపై వేరువేరు ధరల వ్యూహాలను అమలు చేయడాన్ని మరోలా ఆర్థం చేసుకోలేం. టీకాలు వేసే ప్రక్రియ ఉమ్మడిగా ప్రజలకు ప్రయోజనం కలిగించే అంశం. పైగా సాంక్రమిక వ్యాధులు ప్రబలిపోయినప్పుడు మరణాలు, బహుముఖ వ్యాధులను తగ్గించడానికి కారుచౌక మార్గం వ్యాక్సినేషన్ మాత్రమే. అందుకే పాశ్చాత్య దేశాలన్నీ తమ జనాభాకు ఉచితంగానే వ్యాక్సిన్ అందిస్తూ వస్తున్నాయి. ఈ దేశాల్లో సోషలిస్టు ప్రభుత్వాలు లేవు. అమెరికాలో వలే పశ్చిమదేశాలన్నీ పూర్తిగా మార్కెట్ ఆధారితంగా నడుస్తుం టాయి. ఈ దేశాల్లోని మెజారిటీ ప్రజలకు ఒక కరోనా టీకాపై 20 డాలర్లు పెట్టగలగేటంత తలసరి ఆదాయం ఉంటున్నప్పటికీ జనాభా మొత్తానికి ఇవి ఉచిత టీకాను అందిస్తున్నాయి. కానీ భారత రాజకీయ నాయకత్వం దీనికి పూర్తి భిన్నంగా ఎలా ఆలోచిస్తోంది? పూర్తిగా లోపభూయిష్టంగా ఉన్న వ్యాక్సిన్ సేకరణ విధానాన్ని భారత ప్రభుత్వం ఎందుకు తీసుకొచ్చిందో అర్థం చేసుకోవడం అసాధ్యం. అంతకుమించి సామూహిక ప్రజాప్రయోజనానికి సంబంధించిన అంశం మన దేశంలో మార్కెట్ సరకుగా ఎలా మారిపోయింది? కోట్లాదిమంది ప్రజల ప్రాణాలు కాపాడి భారత్‌ను ప్రస్తుత దుర్భర పరిస్థితుల నుంచి కాపాడటం కంటే స్వేచ్ఛా మార్కెట్ భావజాలంపై కేంద్ర ప్రభుత్వానికి ఉన్న సానుకూల అభిప్రాయమే పైచేయి సాధించినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ క్షణంలో దేశ ఆరోగ్య భద్రతకు అత్యంత కీలకమైన ఒక ఉత్పత్తిపై వేరువేరు ధరల వ్యూహాలను అమలు చేయడాన్ని మరోలా ఆర్థం చేసుకోలేం. అపారమైన లాభాలపై దృష్టి ఉండే మార్కెట్ అనుకూలవాదులకు ప్రజాహితం అనే భావనే రుచించకపోవచ్చు. అలాంటి సందర్భంలో ప్రభుత్వం కనీసం ఆర్థిక సమర్థత, వనరుల హేతుపూర్వక వినియోగం విషయంలో అయినా దాపరికం లేకుండా వ్యవహరిం చాల్సి ఉంటుంది. భారత ఆర్థిక వ్యవస్థ కనీవినీ ఎరుగనంత స్థాయికి పతనమైపోయింది. ఆదాయాలు కుదించుకుపోవడం, కుటుంబాల స్థాయిలో ఆహారం, కనీసం ఆదాయం వంటి ప్రాథమిక అవసరాలు కూడా తీరని పరిస్థితుల్లో కోవిడ్–19 ఆర్థిక వ్యవస్థపై కలిగిస్తున్న ప్రభావం సూక్ష్మస్థాయిలో విధ్వంసకరంగా మారింది. దీనికి తోడుగా కునారిల్లిపోయిన ఆరోగ్య మౌలిక వ్యవస్థను, చిన్నాభిన్నమైపోయిన జీవితాలను పునర్నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకనే మన వ్యాక్సిన్ కంపెనీలు కనీస ఉత్పత్తి ధర వద్ద లేక ఉత్పత్తి ఖర్చుపై 10 శాతం కనీస లాభంతో వ్యాక్సిన్‌ని అందిస్తున్నాయి. కానీ కొన్ని నెలల్లోపే వ్యాక్సిన్ ధర పెరగనుండటం గమనార్హం. టీకాల కొరత అసలు కారణం ముందస్తుగా వ్యాక్సిన్ కొనుగోలు ఒప్పందాలు లేకపోవడం లేక వ్యాక్సిన్ ఉత్పత్తికి సంబంధించిన అన్ని అంశాలను పొందుపర్చి సమగ్రమైన వ్యూహాన్ని అమలు చేసే జాతీయ వ్యాక్సినేషన్ ప్లాన్ లేకపోవడం వల్లే ఇప్పుడు ఉన్నట్లుండి కోవిడ్–19 టీకాల కొరత ముంచుకొచ్చింది. వ్యాక్సిన్ ఉత్పత్తి స్థాయిని పెంచడానికి మనం మొదట్లోనే యుద్ధప్రాతిపదికన డజనుకు పైగా బీఎస్ఎల్–3 స్థాయి అత్యుత్తమ సంస్థలను నెలకొల్పి ఉండాలి. దేశంలో టీకాలకు ఏర్పడుతున్న విస్తృతమైన డిమాండ్‌ని తీర్చేందుకు ఇతర మందుల కంపెనీలను కూడా భాగస్యామ్యం చేయడం ద్వారా మొత్తం టీకాల సరఫరా వ్యవస్థను ముందుకు తీసుకుపోయి ఉండవచ్చు. దీనికి భిన్నంగా కేంద్ర ప్రభుత్వ వ్యూహం మొత్తం రెండు కంపెనీలపైనే ఆధారపడటమే ప్రస్తుత ప్రతి ష్టంభనకు కారణమైంది. అలాగే జనాభాలోని అధిక శాతానికి టీకాలు వేయగలిగేలా వ్యాక్సినేషన్ కేంద్రాలను మరింతగా ఏర్పర్చేలా రాష్ట్రప్రభుత్వాలను ప్రోత్సహించే ముందు చూపు కూడా కరువైపోయింది. ప్రస్తుతం సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా నెలకు 6 కోట్ల డోసులను మాత్రమే ఉత్పత్తి చేస్తోంది. జూలై నాటికి నెలకు 19 కోట్ల వ్యాక్సిన్లను ఉత్పత్తి చేసేలా తన సామర్థ్యాన్ని విస్తరింపజేస్తోంది. కేంద్రప్రభుత్వం, జీఏవీఐ అందించిన రూ. 4,200 కోట్ల ఆర్థిక సహాయం కారణంగానే ఇది సాధ్యపడనుంది. మే 1 నుంచి జూలై నాటికి సీరమ్ ఏడాదికి 120 కోట్ల డోసులను ఉత్పత్తి సామర్థ్యానికి చేరుకోనుంది. ఇకపోతే భారత్ బయోటెక్ ప్రస్తుతం నెలకు కోటి టీకాలు ఉత్పత్తి చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న రూ. 1,500 కోట్ల ఆర్థిక సహాయంతో ఈ సంస్థ సామర్థ్యం కూడా గణనీయంగా పెరగనుంది. ఇతర కంపెనీలతో ఒప్పందాల మేరకు జూలై 22 నాటికి 70 కోట్ల డోసులు అందుబాటులో ఉంటాయని భావిస్తున్నారు. బహిరంగ ప్రకటనల మేరకు జూలై 22 నాటికే భారత్ తనకు అవసరమైన డోసులను పొందే అవకాశముందని స్పష్టమవుతోంది. ఇప్పటినుంచి వచ్చే రెండు నెలలలోపు భారత్ విదేశాలకు పంపపలసిన బాధ్యతను నెరవేర్చడానికి, దేశీయ డిమాండును తట్టుకోవడానికి 12 కోట్ల డోసులను ఉత్పత్తి చేసి పంపిణీ చేయగలగాలి. వీటన్నింటితోపాటు ప్రభుత్వం టీకాకు అర్హులైన వారి సంఖ్యను వేగంగా పెంచాల్సిన అవసరం కూడా ఉంది. ఇప్పటికైతే ప్రభుత్వం 96 కోట్ల వయోజనులందరినీ టీకాల పరిధిలోకి తీసుకొస్తోంది. వీరిలో 30 కోట్లమంది ఆరోగ్య సిబ్బందికి, ప్రంట్ లైన్ కార్మికులకు, సాయుధబలగాలు వంటి అత్యవసర సర్వీసులకు, 45 ఏళ్లకు పైబడిన వయసు కలవారికి ప్రాధాన్యమిస్తున్నట్లు కనిపిస్తోంది. మొత్తం 60 కోట్ల డోసులు అవసరం కాగా, ఇప్పటివరకు ప్రభుత్వం 12 కోట్లమందికి టీకాలువేసింది. ఇప్పుడు టీకా నిల్వలు లేవు. దీంతో 50 కోట్ల మంది ప్రజల డిమాండ్ నెరవేరడం కష్టమైపోతోంది. ఏప్రిల్ 20న 18–45 ఏళ్లలోపు వయసు ఉన్న మరో 63 కోట్లమందికి టీకాలు వేయాలని ప్రభుత్వం సంకల్పించింది. వీరిలో 70 శాతం మంది వ్యాక్సిన్ తీసుకున్నట్లయితే సామూహిక రోగ నిరోధక శక్తి సాధ్యపడుతుంది. ముందుగా 44 కోట్ల మందికి వ్యాక్సిన్ వేయాలంటే వ్యర్థాలతో సహా వంద కోట్ల డోసులు అవసరం అవుతాయి. వీటిలో 20 శాతం వ్యాక్సిన్‌ను ప్రైవేటుగా మార్కెట్ చేస్తారనుకుంటే, రాష్ట్ర ప్రభుత్వాలకు ఇంకా 80 కోట్ల డోసులు అవసరం అవుతాయి. అంటే 45 ఏళ్ల పైబడిన వారికి 100 శాతం టీకాలు వేయాలన్నా, 18–45 ఏళ్లలోపు వారికి 70 శాతం టీకాలు వేయాలన్నా దానికి కేంద్రప్రభుత్వానికి 100 కోట్ల పైబడిన డోసులు అవసరం అవుతాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య టీకా ధరవరల్లో తేడాను పాటిం చడం ద్వారా, ప్రభుత్వాలను మార్కెట్లో టీకాలు కొనుగోలు చేసేలా విధానాన్ని మార్చడం ద్వారా తక్షణం జరిగేదేమిటంటే. దేశంలోని పేద రాష్ట్రాలు మరింత మొత్తాన్ని కోవిడ్–19 టీకాలకోసం చెల్లిం చాల్సి ఉంటుంది. అంటే మౌలికంగా చూస్తే రాష్ట్ర ప్రభుత్వాలకు టీకా ధరలు జరిమానా అవుతుండగా మందుల కంపెనీలు లాభాల బాట పట్టనున్నాయి. రాష్ట్రాలమధ్య వ్యత్యాసాలతోపాటు టీకాలకు ఖర్చు పెట్టే స్తోమత ఉన్న, లేని రాష్ట్రాల మధ్య అగాథం పెరిగిపోతుంది. అలాగే వ్యాక్సిన్లను కొనుగోలు చేయడానికి పలు నిరుపేద రాష్ట్రాలు తమ అత్యవసరాలను పణంగా పెట్టి తమ సొంత వనరులను టీకాల కోసం వెచ్చించాల్సి ఉంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే కేంద్రం అనుసరిస్తున్న వ్యాక్సినేషన్ విధానం అసమానత్వంతోనూ, కఠినంగాను ఉంటోందన్నది స్పష్టం. అదే సమయంలో వైరస్‌కు హద్దులు లేవు. నిరుపేదలను ప్రస్తుత కేంద్ర విధానం గాలికి వదిలేస్తున్నందున వైరస్ మళ్లీ కమ్ముకు రావడం ఖాయం. ఇలాంటి లోపభూయిష్టమైన, ప్రమాదకరమైన వ్యాక్సినేషన్ విధానాన్ని సవరించవలసిన అవసరం ఉంది. అత్యవసరమైన వ్యాక్సిన్లను సేకరించడానికి కేంద్ర ప్రభుత్వం తన మార్కెట్ శక్తిని ఉపయోగించి, అందరికీ ఉచితంగా టీకాలు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికే కరోనా బారిన పడి విధ్వంసానికి గురైన ప్రజారాశులకు జీవితంపై భరోసా కల్పించాలంటే కేంద్ర ప్రభుత్వం కనీసంగా చేయవలసిన పని ఇదే మరి. కె. సుజాతారావు వ్యాసకర్త మాజీ కార్యదర్శి, కేంద్ర ఆరోగ్య శాఖ (ది వైర్ సౌజన్యంతో) -
అడుగడుగునా కరోనా పరీక్షలు
టోక్యో: ఒలింపిక్స్ క్రీడలకు మరో 85 రోజులు ఉన్నాయి. కరోనా కల్లోలంలో వీటిని సజావుగా జరిపేందుకు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) బుధవారం టోక్యో ఒలింపిక్స్ ఆర్గనైజింగ్ కమిటీ, జపాన్ ప్రభుత్వంతో సమావేశం నిర్వహించింది. ఇందులో టోక్యో ఒలింపిక్స్‌ను సజావుగా ఎలా నిర్వహించాలనే అంశంపై చర్చించడంతో పాటు ఇందులో పాల్గొనే క్రీడాకారుల ఆరోగ్య భద్రతపై కూడా కొన్ని కీలక అంశాలను ఆమోదించాయి. అంతేకాకుండా కరోనా నేపథ్యంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో తయారు చేసిన రూల్‌బుక్‌లోని నిబంధనలను కూడా సవరించాయి. కొత్త నిబంధనలు ► ఒలింపిక్స్‌లో పాల్గొనే అథ్లెట్లు, వారి సహాయక సిబ్బంది జపాన్‌కు వచ్చే ముందు తప్పనిసరిగా రెండుసార్లు కోవిడ్ పరీక్షను చేయించుకోవాలి. నెగెటివ్‌గా వస్తేనే టోక్యోలో అడుగుపెట్టాలి. ► ఒలింపిక్స్ సందర్భంగా అథ్లెట్లు, వారితో దగ్గరగా పనిచేసే కోచ్‌లు, ఫిజియోలకు ప్రతి రోజూ కోవిడ్ పరీక్షలను నిర్వహించడం జరుగుతుంది. ఇందుకు సంబంధించిన టైమ్ టేబుల్‌ను కూడా రూపొందించనున్నారు. ► ఒలింపిక్స్‌తో ప్రత్యక్షంగా సంబంధం ఉన్న వారు (అథ్లెట్లు తప్ప) ఒలింపిక్స్ విలేజ్‌లో అడుగుపెట్టగానే వారికి వరుసగా మూడు రోజుల పాటు కోవిడ్ పరీక్షలను నిర్వహిస్తారు. ఆ తర్వాత అథ్లెట్లతో వారికి ఉండే సంబంధాన్ని బట్టి రోజూ కోవిడ్ పరీక్షలు నిర్వహించాలా వద్దా అనేది నిర్ణయిస్తారు. ► ఒలింపిక్స్‌లో పాల్గొనేవారు తమకు కేటాయించిన పనులను మాత్రమే చేయాలి. అంతేకాకుండా వారంతా జపాన్ వాసులకు, జపాన్‌లో 14 రోజులకు పైగా ఉంటున్న వారితో ఒక మీటర్ కంటే తక్కువ దూరంతో ఉంటూ చేసే సంభాషణలను సాధ్యమైనంత మేర తగ్గించాలి. ► ఒలింపిక్స్‌లో పాల్గొనడానికి వచ్చిన వారు తమకు ప్రత్యేకంగా కేటాయించిన వాహనాల్లో మాత్రమే ప్రయాణం చేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజా రవాణాల్లో ప్రయాణం చేయరాదు. ► ఒలింపిక్స్‌లో పాల్గొనే వారు తమకు కేటాయించిన ప్రదేశాల్లో మాత్రమే అల్పాహారం, భోజనం వంటివి చేయాలి. ► కోవిడ్ పాజిటివ్‌గా తేలిన వ్యక్తితో 15 నిమిషాలు లేదా అంతకంటే ఎక్కువగా మాట్లాడినా, ఒక మీటర్ పరిధిలో ఉన్నా, మాస్క్ వేసుకోకుండా మాట్లాడిన వారిని క్లోజ్ కాంటాక్టులుగా భావిస్తారు. అయితే ఇవన్నీ కూడా ఒక గదిలో లేదా వాహనంలో జరగాల్సి ఉంటుంది. ► ఒలింపిక్స్, పారాలింపిక్స్‌లో జరిగే పోటీలను ప్రత్యక్షంగా చూడటానికి ఎంతమంది దేశవాళీ ప్రేక్షకులను అనుమతించాలి అనే విషయంపై జూన్‌లో నిర్ణయం తీసుకోనున్నారు. కరోనా నేపథ్యంలో ఇప్పటికే విదేశీ ప్రేక్షకులను అనుమతించకూడదనే నిర్ణయాన్ని ఐఓసీ తీసుకున్న విషయం తెలిసిందే. -
స్కాట్లాండ్ ఓకే చెప్పింది
ప్రపంచంలోనే తొలిసారి ఇలాంటి ఒక చట్టం తెచ్చిన ఘనతను స్కాట్లాండ్ దక్కించుకుంది. బిల్లు చట్టం కాగానే దేశవ్యాప్తంగా మహిళలకు శానిటరీ ప్యాడ్స్ ఉచితంగా లభిస్తాయి. ఉచిత విద్యకు, ఉచిత ఆరోగ్య భద్రతకు బిల్లు తెచ్చినంత సులభంగా ఉండదు ఉచితంగా శానిటరీ ప్యాడ్స్‌ను పంపిణీ చేసే బిల్లుకు ఆమోదం లభించడం. ‘అవసరమా?’ అనే ప్రశ్న మొదటే పురుషుల నుంచి వస్తుంది. ఆ తర్వాత ప్రతిపక్షం నుంచి వస్తుంది. తిండికి లేదా? పెడదాం. చదువుకోవాలని ఉందా? చదివిద్దాం. అనారోగ్యం వస్తే వైద్య ఖర్చులకు డబ్బుల్లేవా? ఉచితంగా వైద్యం చేయిద్దాం. కానీ ఇదేంటి! శానిటరీ న్యాప్కిన్లను, టాంపన్లను ప్రభుత్వం ఉచితంగా ఇవ్వడం.. అని రెండేళ్లుగా ‘పీరియడ్ ప్రాడక్ట్స్ (ఫ్రీ ప్రొవిజన్) చట్టం’ బిల్లుకు స్కాట్లాండ్ పార్లమెంటులో విపక్ష సభ్యులు అభ్యంతరం చెబుతూ వస్తున్నారు. అనుకూలంగా ఓటేయకుండా బిల్లును ఆపుతున్నారు. ఎట్టకేలకు.. ఏడాదికి కనీసం 86 కోట్ల రూపాయల ఆర్థిక భారాన్ని ప్రభుత్వంపై మోపే ‘పీరియడ్ పావర్టీ బిల్లు’కు మంగళవారం నాడు ఏకగ్రీవ ఆమోదం లభించింది. దాంతో ప్రపంచంలోనే తొలిసారి ఇలాంటి ఒక చట్టం తెచ్చిన ఘనతను స్కాట్లాండ్ దక్కించుకుంది. అన్ని పేదరికాల మాదిరిగానే ప్యాడ్స్‌ని కొనలేని పేదరికం కూడా ఉంటుందని అంటూ ఈ బిల్లుకు ఊపిరిపోసి, బిల్లు సాధనకు ఉద్యమరూపం తెచ్చి, సభ ఆమోదం పొందగలిగేవరకు ఆవిశ్రాంతంగా పోరాటం జరిపిన మోనికా లెనన్ (39) ఇప్పుడు ఆ దేశంలోని మహిళల మన్ననలను పొందుతున్నారు. బిల్లు ముసాయిదాలో పలుమార్లు కనిపించే ‘పీరియడ్ పావర్టీ’ అనే మాటను కూడా తనే సృష్టించిన మోనికా 2016 నుంచీ స్కాటిష్ లేబర్ పార్టీ ఎంపీగా ఉన్నారు. ఆమె స్త్రీవాది, శాకాహారి. బిల్లు చట్టం రూపం ధరించగానే దేశవ్యాప్తంగా కమ్యూనిటీ సెంటర్లు, విద్యాసంస్థలు, యూత్ క్లబ్బులు, ఫార్మసీ దుకాణాలన్నింటిలోనూ మహిళలకు శానిటరీ న్యాప్కిన్స్, టాంపన్లు ఉచితంగా అందుబాటులోకి వస్తాయి. ‘‘ఈ బిల్లుకు అనుకూలంగా ఓటు వేయడాన్ని గర్వంగా భావిస్తున్నాను’’ అని స్కాట్లాండ్ మహిళా ప్రధాని (ఫస్ట్ మినిస్టర్ అంటారు) నికోలా స్టురియన్ ట్వీట్ చేస్తూ, ‘మహిళలకు, బాలికలకు అవసరమైన ఒక ముఖ్యమైన ప్రభుత్వ విధానంగా’ ఈ చట్టాన్ని అభివర్ణించారు. అరకోటికి పైగా జనాభా వున్న స్కాట్లాండ్ యు.కె. కిందికి వస్తుంది. ‘ప్లాన్ ఇంటర్నేషనల్ యుకె’ అనే సంస్థ 2017 లో జరిపిన ఒక సర్వేలో యు.కె.లోని ప్రతి 10 మంది బాలికల్లో ఒకరు ప్యాడ్స్ కొనే స్థితిలో లేనివారే. అంతేకాదు, యు.కె.లో 14–21 ఏళ్ల మధ్య వయసులో ఉన్న బాలికల్లో సగం మంది ఆర్థిక ఇబ్బందుల కారణంగా ప్యాడ్స్ కొనలేకపోతున్నవారే. -
రెండు రాష్ట్రాలకు పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారిపై పోరులో తమ వంతు పాత్ర పోషిస్తున్న జర్నలిస్టులను ఆదుకోవాలని రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. పాత్రికేయులకు అవసరమైన ఆరోగ్య భద్రత, బీమాలు కల్పించడంపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాలని కోరారు. కరోనా విపత్తులోనూ తెలుగు రాష్ట్రాల్లోని జర్నలిస్టులు చాలా ధైర్యంగా పనిచేస్తూ క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తున్నారని ప్రశంసించారు. తమిళనాడులో 25 మంది, ముంబైలో 50 మందిపైగా జర్నలిస్టులకు కోవిడ్-19 బారిన పడిన నేపథ్యంలో పాత్రికేయులు తమ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకుంటూ విధులు నిర్వహించాలని సూచించారు. తెలంగాణలోనూ కొన్నిచోట్ల జర్నలిస్టులు కూడా క్వారంటైన్‌కు వెళ్లినట్టు తెలిసిందన్నారు. జర్నలిస్ట్ సంఘాలు, మీడియా సంస్థలు.. జర్నలిస్టుల ఆరోగ్య రక్షణకు తగిన ఏర్పాట్లు చేయాలని కోరుతూ పవన్ కళ్యాణ్ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఏపీలో కొత్తగా మరో 80 కరోనా కేసులు -
పోలీసులకు ‘ఆరోగ్య భద్రత’ యథాతథం
సాక్షి, హైదరాబాద్: పోలీసులు, వారి కుటుంబ సభ్యులకు అమలవుతున్న ఆరోగ్య భద్రత పథకాన్ని యథాతథంగా కొనసాగించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వైద్యశాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్ చందా శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం రూపొందించిన జాబితాలో పేర్కొన్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో పోలీసులు, వారి కుటుంబ సభ్యులు చికిత్స పొందవచ్చునని తెలిపారు. చికిత్స పొందిన పోలీసులు ‘ఆరోగ్య భద్రత’ కార్యదర్శి ఆమోదంతో వైద్య బిల్లులను వైద్య విద్య డెరైక్టర్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుని మెడికల్ రీయింబర్స్మెంట్ పొందవచ్చునని సూచించారు. దీనిపై తెలంగాణ పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు గోపిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు.