మహిళలు, పిల్లలకు ఆరోగ్య భద్రత | Health security for women and children by Andhra Pradesh Govt | Sakshi
Sakshi News home page

మహిళలు, పిల్లలకు ఆరోగ్య భద్రత

Published Sun, Nov 20 2022 5:14 AM | Last Updated on Sun, Nov 20 2022 5:14 AM

Health security for women and children by Andhra Pradesh Govt - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని మహిళలు, పిల్లల్లో రక్తహీనత, పౌష్టికాహార లోపాలను నివారించి, ఆరోగ్యంగా ఉంచాలన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం సూక్ష్మస్థాయిలో కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తోంది. తొలి దశలో 8 అంశాల్లో గ్రామ, వార్డు సచివాలయాలు కేంద్ర బిందువుగా సుస్థిర ప్రగతి లక్ష్యాల సూచికలను సాధించడం ద్వారా దేశంలోనే మొదటి స్థానంలో నిలిచేందుకు ఈ నెల 16 నుంచి ఇంటింటి సర్వే చేపట్టింది. 

వలంటీర్ల ద్వారా ఇంటింటి సర్వే చేసి, రక్తహీనత, పౌష్టికాహార లోపం ఉన్న మహిళలు, పిల్లలను గుర్తించి, వారికి అవసరమైన మందులు, పౌష్టికాహారాన్ని అందించి ఆరోగ్యంగా తీర్చీదిద్దడానికి చర్యలు చేపట్టింది. వారికి ముందులు, ఆహారం సరఫరాను గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు నిరంతరం పర్యవేక్షిస్తారు. ఇప్పటికే 40 లక్షల ఇళ్లలో సర్వే పూర్తయింది. గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ఈ సర్వే కోసం వలంటీర్లకు ప్రాధాన్యత గల 8 సుస్థిర ప్రగతి లక్ష్యాల సూచికలతో ఓ అప్లికేషన్‌ కూడా రూపొందించింది.

2,65,979 క్లస్టర్ల వారీగా 1,59,29,858 కుటుంబాలను వీరు కలుసుకుంటున్నారు. రక్తహీనత, బరువు తక్కువ, పౌష్టికాహార లోపాలతోపాటు పిల్లల్లో స్కూల్‌ డ్రాపవుట్స్‌ పాఠశాలల్లో మహిళా టాయిలెట్ల నిర్వహణ, విద్యుత్, తాగునీటి సదుపాయాలపై సర్వే చేస్తున్నారు. ఆ వివరాలను యాప్‌లో నమోదు చేస్తున్నారు. వాటిని పరిశీలించిన అధికారులు తదనుగుణంగా చర్యలు చేపడతారు. 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు, 11, 12 తరగతుల్లో పిల్లల ఎన్‌రోల్‌మెంట్‌ రేషియోతోపాటు డ్రాపవుట్స్‌ లేకుండా ఆ ఈడు పిల్లలందరూ విద్యా సంస్థల్లో ఉండేలా సర్వే ద్వారా చర్యలు చేపడుతున్నారు.

పిల్లలు ఎవ్వరైనా స్కూల్‌కు రాకపోతే ఆ విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేసి, మళ్లీ బడిలో చేర్పించేందుకు వలంటీర్లు చర్యలు తీసుకుంటారు. స్కూళ్లలో కనీస మౌలిక వసతుల వివరాలు సేకరించి, లోపాలుంటే వెంటనే సరిచేస్తారు. కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఇంటింటి సర్వే పురోగతిని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) డాక్టర్‌ సమీర్‌ శర్మ సమీక్షించారు. సర్వేను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.  

8 సుస్థిర ప్రగతి సూచికల లక్ష్యాల సాధనకు సర్వే అంశాలు ఇవే
► కౌమారదశలో ఉన్న 10 ఏళ్ల నుంచి 19 ఏళ్లలోపు మహిళల్లో రక్తహీనత కలిగిన వారు ఎంత శాతం ఉన్నారు? 
► 15 ఏళ్ల నుంచి 49 ఏళ్ల గర్భిణుల్లో రక్తహీనత కలిగిన వారు ఎంత శాతం ఉన్నారు? 
► ఎదుగుదల లేక కుచించుకపోయిన ఐదేళ్ల లోపు పిల్లలు ఎంత మంది ఉన్నారు? 
► తక్కువ బరువుగల ఐదేళ్లలోపు పిల్లలు ఎంత మంది ఉన్నారు? 
► ఎలిమెంటరీ స్కూల్స్‌లో 1 నంచి 10వ తరగతి వరకు ఎన్‌రోల్‌మెంట్‌ రేషియో 
► ఉన్నత విద్యలో 11, 12 తరగతుల్లో  స్థూల నమోదు నిష్పత్తి 
► స్కూళ్లలో విద్యుత్, తాగునీరు అందుబాటు ఎంత శాతం ఉన్నాయి? 
► స్కూళ్లలో ప్రధానంగా బాలికల టాయిలెట్ల నిర్వహణ, స్థితి ఎలా ఉంది? 

ఈ నెల 25లోగా సర్వే పూర్తి 
మహిళలు, పిల్లల ఆరోగ్యం.. ప్రధానంగా రక్తహీనత, పౌష్టికాహార లోపాలను గుర్తించేందుకు రాష్ట్రం అంతటా తొలిసారిగా పెద్ద ఎత్తున ఇంటింటి సర్వే చేపట్టాం. ఈ నెల 25కి సర్వే పూర్తవుతుంది. సర్వే కోసం ప్రత్యేకంగా నమూనా ఫారమ్‌ను రూపొందించాం. సర్వేలో వివరాల ఆధారంగా రక్త హీనత, పౌష్టికాహార లోపాలు గల, ఇతర ఆరోగ్య సమస్యలున్న వారిపై దృష్టి సారించి, వ్యాధుల నివారణకు చర్యలు తీసుకుంంటాం. తద్వారా 8 అంశాల్లో సుస్థిర ప్రగతి సూచికల లక్ష్యాలను పూర్తి స్థాయిలో సాధించడమే ధ్యేయం.  
– గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌ జైన్‌   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement