ఆరోగ్య సంరక్షణను పొందడంలో ఖైదీలకు ఎదురవుతున్న అంతరాలను పూడ్చటానికి కోవిడ్–19 మహమ్మారి గొప్ప అవకాశాన్ని అందించింది. కటకటాల్లో ఉన్నవారితో సహా దేశంలోని పౌరులందరికీ వైద్య చికిత్సల విషయమై ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యతనివ్వాలి. 2020–21 సంవత్సరంలో మన స్థూల దేశీయోత్పత్తిలో ప్రజారోగ్య సంరక్షణకు పెట్టిన ఖర్చు 1.8 శాతం మాత్రమే. 2025 నాటికి ఆరోగ్యరంగ వ్యయాన్ని జీడీపీలో 2.5 శాతానికి పెంచాలని జాతీయ ఆరోగ్య విధానం –2017 సిఫార్సు చేసింది. దీంతోపాటు వైద్యరంగంలో ఖాళీలన్నింటినీ పూరించాలి. కనీసం 300 మంది ఖైదీలకు ఒక డాక్టర్ ఉండేలా వైద్య వ్యవస్థను సంస్కరించాలి.
గత నెలలో బాంబే హైకోర్టు రాష్ట్రంలోని 47 కారాగారాల్లో డాక్టర్ పోస్టుల్లో ఎన్ని ఖాళీలున్నాయని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మహారాష్ట్ర లోని జైళ్లలో ప్రభుత్వం మంజూరు చేసిన వైద్యుల పోస్టుల్లో కనీసం మూడింట ఒకవంతు ఇప్పటికీ ఖాళీగా ఉండటమే. రాష్ట్రంలోని 30 వేలకు పైగా ఉన్న ఖైదీల బాగోగులను చూడటం కోసం 32 మంది డాక్టర్లు మాత్రమే ఉన్నారని ఈ వ్యవహారంపై విచారణ చేస్తున్న ధర్మాసనం పేర్కొంది. జైళ్లలో వైద్యుల సంఖ్యను పెంచమని మేం కోరడం లేదు. కనీసం ఇప్పటికే మంజూరు చేసిన పోస్టులనైనా పూరించమని మాత్రమే కోరుతున్నాం. ఒకసారి పోస్టులను మంజూరు చేశాక, వాటిని పూరించడం మీ బాధ్యత కాదా అంటూ బాంబే హైకోర్టు ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసింది.
కోవిడ్–19 మహమ్మారి సెకండ్ వేవ్‌లో దేశం మొత్తంగా చిక్కుకుని ఉన్న సమయంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వైరస్ వ్యాప్తికి కారాగారాలు ప్రమాదరకమైన కేంద్రాలుగా కొనసాగుతూ వస్తున్నాయి. గత సంవత్సరం కారాగారాల్లో కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదైన విషయం బయటపడ్డాక కూడా జైళ్లలో ఆరోగ్య సంరక్షణ పరిస్థితి ఏమాత్రం మారకపోవడం గమనార్హం. కారాగారాల్లో వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి గత సంవత్సరం చివరలో నిర్దిష్ట చర్యలు చేపట్టినప్పటికీ అప్పటికే ఆలస్యం జరిగింది. 2020 మే నెల నుంచి డిసెంబర్ వరకు దేశంలోని కారాగారాల్లో 18 వేలమంది ఖైదీలకు, జైలు సిబ్బందికి పరీక్షల్లో పాజిటివ్ అని తేలిందని వీరిలో 17 మంది తమ ప్రాణాలు కోల్పోయారని కామన్‌వెల్త్ హ్యూమన్ రైట్స్ ఇనిషియేటివ్ పొందుపర్చిన డేటా తెలుపుతోంది. ఖైదీలు, జైలు అధికారుల అవసరాలను తీర్చగలిగే స్థాయిలో జైళ్లలోని ఆరోగ్య సంరక్షణలు లేవన్నది తెలిసిందే. కానీ కరోనా మహమ్మారితో వ్యవహరించడానికి ఉన్నట్లుండి ఇవి ముందుపీఠికి రావలసిన అవసరం తన్నుకొచ్చింది.
మహమ్మారి సెకండ్ వేవ్ సమయంలోనూ కారాగారాల్లోని ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలపై నిర్లక్ష్య వైఖరి కొనసాగుతోంది. 2021 సంవత్సరంలో ఇప్పటికే మన జైళ్లలో 4 వేల పాజిటివ్ కేసులు, 18 మంది మరణాలు నమోదయ్యాయి. ఖైదీలు, జైలుసిబ్బంది కూడా మహమ్మారి బారిన పడ్డారు. జైళ్లలో తగిన స్థాయిలో వైద్య మౌలిక సేవల కల్పన లేకపోవడం, వైద్య నియామకాల్లో ఖాళీలపై నిర్లక్ష్యం వంటివి సాధారణ ప్రజానీకం దృష్టికి చాలావరకు రావు. ఈ నేపథ్యంలో కారాగారాలకు ప్రాధాన్యమిచ్చి, వైరస్ వ్యాప్తిని అరికట్టే చర్యలను ప్రభుత్వాలు చేపట్టాల్సి ఉందని అంతర్జాతీయ హక్కుల సంస్థలు నొక్కి చెబుతున్నాయి. భౌతిక దూరం పాటించడం, స్వీయ ఏకాంతం పాటించడం అనేది జైళ్లలోపల దాదాపుగా అసాధ్యం అని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల హై కమిషనర్ మిచెల్లె బ్యాక్‌లెట్ అభిప్రాయం. జైళ్లలోని ఖైదీలను కరోనా కాలంలో విడుదల చేయడానికి, ప్రత్యేకించి వైరస్ ఇన్ఫెక్షన్‌కి గురవుతున్న ఖైదీల విడుదలకు ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుందని ఆమె నొక్కి చెప్పారు.
జాతీయ నేర రికార్డుల బ్యూరో భారతీయ కారాగార గణాంకాలపై 2019 డిసెంబర్‌లో విడుదల చేసిన తన వార్షిక నివేదిక ప్రకారం దేశంలోని 4.78 లక్షలమంది ఖైదీలకు చెందిన వైద్య అవసరాలను 1,962 మంది వైద్య సిబ్బంది మాత్రమే రోజువారీగా పర్యవేక్షిస్తున్నారని తెలుస్తోంది. ఈ కాలానికి గానూ, జైళ్లలోని ఆరోగ్య సంరక్షణ అవసరాల కోసం రోజుకు సగటున అయిదు రూపాయలు మాత్రమే ఖర్చుపెట్టడం గమనార్హం. ఈ నేపథ్యంలో కారాగారాల్లో ఆరోగ్య సంరక్షణ విషయంలో నెలకొంటున్న విషాదస్థితికి పలు ఇతర కారణాలు కూడా తోడవుతున్నాయి.
1. వైద్య నిపుణులు కారాగారాలను సందర్శించడం లేదు. 2. జైలు ఆవరణకు వెలుపల ఉన్న ఆసుపత్రులకు జైలుఖైదీలను తరలించేందుకు తగిన రక్షణ సిబ్బంది లేకపోవడం. 3. మందుల సేకరణకు విషయంలో సవాళ్లు ఎదురుకావడం. 4. ఖైదీల్లో క్షయ, హెచ్‌ఐవీ ఎయిడ్స్, హెపటైటిస్ సి, స్కిన్ అలర్జీ వంటి వ్యాధులు అధికంగా ఉండటం. 5. జైళ్లలోపల ఖైదీలు ఆత్మహత్యలు చేసుకోవడం, మరణాల రేటు అధిక స్థాయిలో ఉండటం. ఖైదీలకు మానసిక కౌన్సెలింగ్, చికిత్స, ఇవ్వడం గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది. 2019లో లక్షమంది ఖైదీలకు గాను ఆత్మహత్యల ద్వారా చనిపోతున్న ఖైదీల సంఖ్య 24.24 శాతంగా నమోదైంది. సాధారణ ప్రజానీకంతో పోలిస్తే ఈ రేటు రెట్టింపు కావడం గమనార్హం.
ఇరుకైన స్థలంలో ఒకరికొకరు సన్నిహితంగా మెలిగే పరిస్థితుల్లో అత్యధికంగా ఖైదీలను నిర్బంధించే వ్యవస్థ విశిష్ట స్వభావం కారణంగా ఆరోగ్య సంరక్షణ నిర్వహణ, వైద్యపరమైన మౌలిక వసతుల కల్పన అనేవి కారాగారాల నిర్వహణలో అత్యంత కీలకమైన అంశాలుగా ఉంటున్నాయి. పైగా తరచుగా మన జైళ్లు ఖైదీలతో కిక్కిరిసి పోవడం కూడా కద్దు. దీని ఫలితంగా కారాగారాలు నిత్యం ఆరోగ్య సమస్యల బారిన పడుతున్నాయి. దీంతోపాటు వైద్య అవసరాలు కూడా జైళ్లలో నిరవధికంగా సమస్యాత్మకంగా ఉంటున్నాయి.
తగినంత స్థాయిలో నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ అనేది పౌరుల ప్రాథమిక హక్కు. ప్రజలను నిర్బంధించి ఉంచే ప్రదేశాల్లో ఇది మరింత కీలకమైన అంశం. ఏ వ్యక్తి విషయంలోనూ ఈ హక్కును తోసిపుచ్చరాదు. నేర విధాన పరిశోధన సంస్థ (ఐసీపీఆర్) పరిశీలన ప్రకారం, వ్యక్తిని నిర్బంధించాలంటూ ఇచ్చే తీర్పు, కేవలం ఆరోగ్యానికి నష్టం కలిగించేదే కాదు, వ్యక్తి స్వేచ్ఛను హరించేది కూడా. మెరుగైన ప్రజావైద్యానికి సంబంధించిన సమాచారం, ప్రియమైన వారి సంరక్షణ, సావధానత అనేవి చాలా అవసరం అయిన కరోనా సమయంలో ఖైదీలను బయటి ప్రపంచానికి దూరంగా ఉంచడం అనేది చాలా దుర్భరమైనది. కరోనా సమయంలో ఖైదీలపై అనేక ఆంక్షలు విధిస్తున్నారు. బంధువులను కలిసే ములాఖత్‌లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నారు. ఖైదీల విచారణలోనూ జాప్యం చేస్తున్నారు.
దానికితోడుగా కరోనా మహమ్మారి న్యాయస్థానాల పనితీరును కూడా దెబ్బతీస్తోంది. గత సంవత్సరం కాలంగా విపరీతంగా పెరిగిపోతున్న కేసులు దీని ఫలితమే. 2019, 2020 మధ్య కాలంలో జిల్లా కోర్టుల్లో 18.2 శాతం, హైకోర్టుల్లో 20.4 శాతం, సుప్రీంకోర్టులో 10.35 శాతం దాకా కేసుల విచారణ నిలిచిపోయిందని నేషనల్ జ్యుడిషియల్ గ్రిడ్ గణాంకాలు చెబుతున్నాయి. నిర్బంధంలో ఉన్న ముద్దాయిల విచారణ కూడా నిలిచిపోవడంతో జైళ్లలో ఉంటూ విచారణకోసం ఎదురుచూస్తున్న వారిపై ఇది తీవ్ర ప్రభావం కలిగిస్తోంది. ఇప్పటికే ఆర్థికపరంగా, మానవ వనరుల పరంగా నీరసించిపోయిన జైళ్ల వ్యవస్థపై కరోనా మహమ్మారి అలవిమాలిన భారం మోపింది. తగినంతగా నిధుల పెంపుదల ద్వారా దేశవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలను మెరుగుపర్చినప్పుడు మాత్రమే జైళ్లలోని దుర్భర పరిస్థితులు కూడా మెరుగుపడటం మొదలవుతుంది.జైళ్లలో ఆరోగ్య సంరక్షణ మెరుగుపర్చాలంటే తక్షణం కారాగారాల్లో వైద్య పోస్టుల ఖాళీలను పూరించాలి. మోడల్ ప్రిజన్ మాన్యువల్ 2016 ప్రకారం కనీసం 300మంది ఖైదీలకు ఒక డాక్టర్‌నయినా ఏర్పర్చాలి. జైళ్లలో ఖైదీలను పరిమితికి మించి కుక్కడమే ఆరోగ్య ప్రమాణాలు పడిపోవడానికి పారిశుధ్య సమస్యలకు కారణమవుతున్నాయి. జైలు ఆసుపత్రుల్లో స్త్రీపురుషులకు సమాన అవకాశం కల్పించడం, నాణ్యమైన ఆహారం అందించడం, జైలు బయట స్పెషలిస్టు ఆసుపత్రులకు ఖైదీలను సకాలంలో పంపడం, మానసిక శాస్త్రజ్ఞులు, శస్త్రచికిత్సా నిపుణులు, దంత వైద్యులు, గైనకాలజిస్టులు, ఇతర వైద్య నిపుణులను క్రమం తప్పకుండా ఖైదీలను సందర్శించే ఏర్పాట్లు చేయడం జైళ్ల శాఖ, రాష్ట్ర ఆరోగ్య శాఖ విధిగా ఉండాలి.
వ్యాసకర్త: సబికా అబ్బాస్
ప్రోగ్రామ్ ఆఫీసర్
కామన్‌వెల్త్ హ్యూమన్ రైట్స్ ఇనిషియేటివ్
(ట్రిబ్యూన్ సౌజన్యంతో)
Comments
Please login to add a commentAdd a comment