కేరళలో దారుణం: విదేశీ మహిళపై..
తిరువనంతపురం: విహారయాత్ర కోసం కేరళకు వచ్చిన విదేశీ వనితపై ఓ యువకుడు అఘాయిత్యానికి ఒడిగట్టాడు. తీవ్రరక్తస్త్రావం కావడంతో స్పృహతప్పి పడిపోయిన ఆమెను కొందరు గుర్తించి ఆసుపత్రిలో చేర్పించారు. కేరళ రాజధాని తిరువనంతపురం శివారు కోవళంలో చోటుచేసుకున్న ఈ సంఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
జపాన్ కు చెందిన 35 ఏళ్ల మహిళ శుక్రవారం ఉదయం కేరళకు వచ్చి, కోవళంలోని ఓ హోటల్ గదిలో దిగింది. అదే రోజు రాత్రి ఆమె అత్యాచారానికి గురైంది. రక్తస్త్రావం కావడంతో స్పృహతప్పి అచేతనంగా పడిఉన్న ఆమెను హోటల్ సిబ్బంది గుర్తించి, స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు.
బాధితురాలి ఫిర్యాదుమేరకు నిందితుడి కోసం గాలింపు చేపట్టిన పోలీసులు చివరికి కోవళం ప్రాంతంలోనే తేజ(25) అనే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు తేజ కుటుంబం కోవళంలో హ్యాండీక్రాఫ్ట్స్(హస్తకళల) దుకాణాన్ని నడుపుకొంటున్నదని, వీరు కర్ణాటక నుంచి కేరళకు వలస వచ్చారని పోలీసులు చెప్పారు. నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 376ను అనుసరించి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.