Jaw bone
-
శ్రద్ధ వాకర్ హత్య కేసు.. పుర్రె, దవడ స్వాధీనం చేసుకున్న పోలీసులు
న్యూఢిల్లీ: ఢిల్లీలో దారుణ హత్యకు గురైన శ్రద్ధ వాకర్ శరీర భాగాల కోసం పోలీసులు మెహ్రౌలీ అడవిలో ఆదివారం వెతికారు. పుర్రె, దవడ భాగాలతో పాటు మరికొన్ని ఎముకలను స్వాధీనం చేసుకున్నారు. ఇవి శ్రద్ధవో కావో నిర్ధరించేందుకు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. మిగతా శరీర భాగాల కోసం గాలిస్తున్నారు. అలాగే మైదాన్‌గడీ కొలనులో నీటి స్థాయి తగ్గడంతో గజ ఈతగాళ్లతో అందులో వెతికించారు పోలీసులు. శ్రద్ధ శరీర భాగాలు ఏమైనా దొరుకుతాయేమోనని ప్రయత్నించారు. ఈ కేసులో ఇప్పటి వరకు పోలీసులు స్వాధీనం చేసుకున్న శరీర భాగాలు శ్రద్ధవో కావో నిర్ధరించనున్నారు అధికారులు. ఇందులో భాగంగా డీఎన్ఏ పరీక్ష కోసం ఆమె తండ్రి, తల్లి నుంచి రక్తనమూనాలు సేకరించారు. వీటి ఫలితాలు రావడానికి 15 రోజులు పడుతుందని పేర్కొన్నారు. ఆ తర్వాత ఇప్పటివరకు సేకరించిన ఆధారాలు శ్రద్ధవో కావో కచ్చితంగా చెప్పవచ్చని పేర్కొన్నారు. మరోవైపు ఈ కేసులో నిందితుడు, శ్రద్ధ బాయ్‌ఫ్రెండ్ ఈ హత్యకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు దొరక్కుండా చేసినట్లు పోలీసులు తెలిపారు. శ్రద్ధ ఫొటోలను కూడా కాల్చివేసినట్లు పేర్కొన్నారు. మరిన్ని ఆధారాల కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. ఢిల్లీ మెహ్రౌలీలో ఆరు నెలల క్రితం జరిగిన హత్య ఘటన ఇటీవలే వెలుగులోకి వచ్చి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అఫ్తాబే తన ప్రేయసిని చంపేసి శరీరాన్ని 35 ముక్కలు చేశాడు. అనంతరం వాటిని ఫ్రిజ్‌లో దాచిపెట్టాడు. ఆ తర్వాత వాటిని అడవితో పాటు ఇతర ప్రదేశాల్లో పడేశాడు. ఎవరికీ అనుమానం రాకుండా 20 రోజుల పాటు శరీర భాగాలను పడేశాడు. చదవండి: నైట్ క్లబ్లో కాల్పుల మోత.. ఐదుగురు మృతి.. 18 మందికి గాయాలు.. -
దవడ విరిగింది.. ముఖానికి సర్జరీ.. పడిలేచిన కెరటం
ఆస్ట్రేలియన్ మహిళా క్రికెటర్ బెత్ మూనీ పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోతుంది. ఇంగ్లండ్‌తో యాషెస్ టెస్టు సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు రెండోరోజు ఆటలో బెత్‌మూనీ డైవ్ చేసి బౌండరీని సేవ్ చేయడం వైరల్‌గా మారింది. ఇందులో గొప్పేముంది అనుకుంటున్నారా.. అక్కడికే వస్తున్నాం. ఇంగ్లండ్‌తో టి20 సిరీస్ ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియా జట్టు ఒక ప్రాక్టీస్ మ్యాచ్ ఆడింది. ప్రాక్టీస్ సెషన్లో బెత్‌మూనీ ఫీల్డింగ్ చేస్తూ జారిపడింది. వేగంగా పడడంతో ఆమె దవడ పగిలింది. ముఖమంతా రక్తమయమయింది. దీంతో వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. చదవండి: IPL 2022: సగం సీజన్ ఆడడం ఎందుకు... అక్కడే ఉండండి వైద్యులు ఆమె ముఖానికి మూడు మెటల్ప్లేట్స్ అమర్చి కుట్లు వేసి సర్జరీ చేశారు. దవడ బాగానికి బలంగా తాకడంతో గట్టి పదార్థాలు తినకూడదని డాక్టర్లు పేర్కొన్నారు. దీంతో బెత్‌మూనీ తన రోజూవారి ఆహరంలో సూప్, మిల్క్‌షేక్, ఐస్‌క్రీమ్‌లను కేవలం స్ట్రా ద్వారా మాత్రమే తీసుకుంది. దాదాపు పదిరోజుల పాటు బెత్‌మూనీ ఆహారం ఇదే. సరిగ్గా పదిరోజుల తర్వాత పడిలేచిన కెరటంలా బెత్‌మూనీ యాషెస్‌లో బరిలోకి దిగింది. రెండోరోజు ఆటలో బెత్‌మూనీ బౌండరీలైన్ వద్ద డైవ్ చేస్తూ బంతిని ఆపడం కెమెరాలకు చిక్కింది. గాయం నొప్పి ఇంకా ఉన్నప్పటికి ఏ మాత్రం లెక్కచేయకుండా జట్టుకోసం బరిలోకి దిగిన బెత్మూనీపై ప్రశంసల వర్షం కురుస్తుంది. బెత్ మూనీ దైర్యాన్ని తాము మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నామని.. సర్జరీ జరిగిన కేవలం పదిరోజుల్లోనే తిరిగి క్రికెట్ ఆడిన బెత్‌మూనీ మాకు ఆదర్శప్రాయమని ఆ జట్టు కెప్టెన్ మెగ్ లానింగ్ పేర్కొంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. రెండోరోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ వుమెన్స్ జట్టు 8 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. కెప్టెన్ హెథర్ నైట్ 127 పరుగులు నాటౌట్, సోఫీ ఎసిల్స్టోన్ 27 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు ఆస్ట్రేలియా 9 వికెట్ల నష్టానికి 337 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. Playing with a broken jaw and Beth Mooney is still throwing herself around in the field 😳 #Ashes pic.twitter.com/hBjxOnVgtw — 7Cricket (@7Cricket) January 28, 2022 -
కుంబ్లే... కట్టు... వికెట్టు
‘నాది ఒకటే అభ్యర్థన. దయచేసి అప్పీల్ మాత్రం చేయవద్దు’... అనిల్ కుంబ్లేకు భారత ఫిజియో ఆండ్రూ లీపస్ ఆ రోజు ఇచ్చిన సూచన ఇది. కానీ ఒక దిగ్గజ ఆటగాడిని బౌలింగ్ చేయకుండా, వికెట్ కోసం అప్పీల్ చేయకుండా ఆపడం ఆ గాయానికే సాధ్యం కాలేదు! తలకు చుట్టిన ఆ కట్టు బిగువున బాధను భరిస్తూనే అతను తనదైన శైలిలో తన పని చేసుకుంటూ పోయాడు. అలాంటి ఒక అప్పీల్‌కే ప్రత్యర్థి స్టార్ బ్యాట్స్‌మన్ లారా చిక్కాడు. తన బాధ్యత నెరవేర్చినట్లు భావించిన అనిల్ ఆ నొప్పిని మర్చిపోయాడు. కానీ నాటి అపూర్వ ప్రదర్శనను మాత్రం ఏ భారత క్రీడాభిమాని కూడా మరచిపోడు. అంకిత భావంలో, పోరాటతత్వంలో అందరికీ అందనంత ఎత్తులో ఉండే అనిల్ కుంబ్లే దానిని ఆంటిగ్వా గడ్డపై నిరూపించాడు. వెస్టిండీస్ గడ్డపై 2002లో సౌరవ్ గంగూలీ నాయకత్వంలో భారత జట్టు పర్యటించింది. ఐదు టెస్టుల సిరీస్‌లో తొలి మూడు మ్యాచ్‌లు ముగిసేసరికి ఇరు జట్లు చెరో టెస్టు గెలిచి 1–1తో సమంగా ఉన్నాయి. సెయింట్ జాన్స్ (ఆంటిగ్వా)లో నాలుగో టెస్టు జరిగింది. తొలి రోజు భారత్ 226/3తో పటిష్ట స్థితిలో నిలవగా, రెండో రోజు ఆటలో వికెట్ కీపర్ అజయ్ రాత్రా కంటే ముందే ఏడో స్థానంలో అనిల్ కుంబ్లే బ్యాటింగ్‌కు వచ్చాడు. మరో ఎండ్‌లో వీవీఎస్ లక్ష్మణ్ ఉన్నాడు. విలవిలా... విండీస్ పేసర్ మెర్విన్ డిల్లాన్ అప్పటికే బౌన్సర్లతో జోరు మీదున్నాడు. కుంబ్లేపై కూడా అతను వచ్చీ రాగానే ఇలాగే ఒక షార్ట్ పిచ్ బంతిని సంధించాడు. తప్పించుకునే ప్రయత్నంలో కుంబ్లే తల పక్కకు తిప్పేసినా దూసుకొచ్చిన బంతి అతని దవడను బలంగా తాకింది. పదునైన పేస్ బౌలింగ్ దెబ్బకు అతని ముఖం ఒక్కసారిగా అదిరిపోయింది. ఫిజియో ఆండ్రూ లీపస్ క్రీజ్ వరకు వచ్చేలోపే క్షణాల్లో గాయం నుంచి తీవ్రంగా రక్తం కారింది. స్వల్ప చికిత్స తర్వాత మైదానం వీడాలని సహచరులు కోరినా కుంబ్లే ఒప్పుకోలేదు. తాను ప్రధాన బ్యాట్స్‌మన్ కాకపోయినా పట్టుదలగా నిలబడేందుకే సిద్ధమయ్యాడు. డిల్లాన్ ఏమీ కనికరం చూపలేదు. మళ్లీ అలాగే చెలరేగిపోయాడు. చివరకు డిల్లాన్ బౌలింగ్‌లోనే బ్యాక్వర్డ్ షార్ట్ లెగ్‌లో చందర్‌పాల్‌కు క్యాచ్ ఇచ్చి కుంబ్లే వెనుదిరిగాడు. ఘటన జరిగిన రోజు ఆస్పత్రిలో ఎక్స్‌రే తీయగా ఏమీ కనిపించలేదు. కానీ మరుసటి ఉదయం నొప్పి తీవ్రమైందని కుంబ్లే చెప్పడంతో మరో ఎక్స్‌రే తీశారు. అప్పుడు దవడలో పగులు వచ్చినట్లు కనిపించింది. అయితే భారత్‌లోనే సర్జరీ చేస్తే మంచిదని టీమ్ మేనేజ్మెంట్ భావించింది. దాంతో గాయంపై ఒత్తిడి పడకుండా పెద్ద బ్యాండేజీ చుట్టిన ఫిజియో లీపస్... ఎలాంటి కదలిక లేకుండా, కనీసం మాట్లాడకుండా కూర్చోవాలని చెప్పేశాడు. అయితే కథ అక్కడితో ముగిసిపోలేదు. బ్యాండేజీతో బరిలోకి... వీవీఎస్ లక్ష్మణ్ (130), అజయ్ రాత్రా (115), రాహుల్ ద్రవిడ్ (91), వసీమ్ జాఫర్ (86) రాణించడంతో... మూడో రోజు భారత్ తొమ్మిది వికెట్లకు 513 పరుగుల భారీ స్కోరు వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. విండీస్ బ్యాటింగ్‌కు వచ్చే సమయానికి పిచ్ స్పిన్‌కు కాస్త అనుకూలంగా కనిపించింది. కానీ ప్రధాన స్పిన్నర్ కుంబ్లే ఆడలేడు కాబట్టి కెప్టెన్ గంగూలీ ఏమీ చేయలేక ఇతర బౌలర్లపై ఆధారపడ్డాడు. అయితే అనూహ్యంగా కట్టుతోనే కుంబ్లే క్రీజ్‌లోకి వచ్చేందుకు సిద్ధం కావడంతో అంతా ఆశ్చర్యపోయారు. అవసరంగా ఒత్తిడి పెంచుకోవద్దు, విశ్రాంతి తీసుకోమని కెప్టెన్ గంగూలీ చెప్పినా కుంబ్లే వినలేదు. ఇలా మధ్యలో నేను వదిలి వెళ్లలేనంటూ బౌలింగ్‌కు సిద్ధమయ్యాడు. తొలి ఓవర్లోనే అతను నొప్పితో అల్లాడుతుండటం చూసిన అంపైర్ డేవిడ్ షెఫర్డ్ బౌలింగ్ చేయగలవా అంటూ మళ్లీ మళ్లీ అడిగాడు. ఆ ఓవర్ తర్వాత లీపస్ మళ్లీ వచ్చి గట్టిగా కట్టు కట్టాడు. చివరకు కుంబ్లే అదే పట్టుదలతో బౌలింగ్ చేసి అత్యంత కీలకమైన బ్రియాన్ లారా వికెట్ పడగొట్టాడు. ఆఫ్‌స్టంప్ పడి లోపలకు దూసుకొచ్చిన బంతికి లారా వికెట్ల ముందు ఎల్బీగా దొరికిపోయాడు. ఆ సమయంలో కుంబ్లేలో కనిపించిన భావోద్వేగం గురించి చెప్పేందుకు మాటలు చాలవు. వరుసగా 14 ఓవర్లు బౌలింగ్ చేసిన అనంతరం మూడో రోజు ఆట ముగిసింది. టెస్టు మ్యాచ్ పేలవ ‘డ్రా’గా ముగిసినా... అనిల్ కుంబ్లే పోరాటం ప్రత్యేకంగా నిలిచిపోయింది. మ్యాచ్‌ను చూస్తూ ఊరికే కూర్చోవడం నాకు బాగా అనిపించలేదు. అందుకే బరిలోకి దిగాను. జట్టు కోసం నాకు సాధ్యమైనంత రీతిలో ప్రయత్నం చేశాననే సంతృప్తితో ఇప్పుడు స్వదేశం వెళ్లగలుగుతున్నాను కదా. –కుంబ్లే వ్యాఖ్య కొసమెరుపు... కుంబ్లే లేని భారం మ్యాచ్‌పై అందరికంటే ఎక్కువగా సచిన్‌పై పడింది. అతని స్పిన్‌ను గంగూలీ నమ్ముకోవడంతో విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో సచిన్ ఏకంగా 34 ఓవర్లు బౌలింగ్ చేశాడు. 200 టెస్టుల కెరీర్లో అతను ఒక మ్యాచ్‌లో బౌలింగ్ చేసిన అత్యధిక ఓవర్లు ఇవే. మరోవైపు భారత్ తరఫున ఆడిన 11 మంది కూడా ఈ ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేశారు. టెస్టు చరిత్రలో ఇలా జరగడం ఇది మూడోసారి మాత్రమే. –సాక్షి క్రీడా విభాగం -
ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా...
బీజింగ్ : ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా 3డి విధానంతో తయారైన కృత్రిమ దవడను 10 సంవత్సరాల బాలుడికి అమర్చారు వైద్యులు. చైనాకు చెందిన చిన్చాంగ్ అనే 10 సంత్సరాల బాలుడి దవడలో ట్యూమర్ ఉందని గుర్తించిన వైద్యులు దాన్ని శస్త్రచికిత్స చేసి తొలగించారు. అయితే అప్పటినుంచి కింది దవడ పనిచేయటం మానేసింది. దీంతో 3డి విధానంలో తయారు చేసిన దవడను బాలుడికి అమర్చాలని నిశ్చయించుకున్నారు వైద్యులు. బాలుడి దవడకు సరిపోయేలా టైటానియంతో 3డి దవడను తయారుచేయించి అతనికి అమర్చారు. జినాన్లోని షాంగ్‌డాంగ్ యూనివర్శిటీ వైద్యులు మూడు గంటల పాటు కష్టపడి చికిత్సను పూర్తి చేశారు. మూడు నెలల తర్వాత బాలుడు మామూలు స్థితికి చేరుకుంటాడని వైద్యులు తెలిపారు. -
‘లెనోరా’లో ఏఆర్టీ శస్త్రచికిత్స సక్సెస్
దేశంలోనే తొలిసారిగా స్వదేశీ కృత్రిమ దవడ ఎముక కీలు అమరిక రాజానగరం: దవడ ఎముకలు అతుక్కుపోవడంతో ఆహారం తినే అవకాశం లేక బాధపడుతున్న 28 ఏళ్ల మహిళకు తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలోని కేఎల్ఆర్ లెనోరా ఇనిస్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సెన్సైస్‌లో మంగళవారం అరుదైన చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ‘అల్లోప్లాస్టిక్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ టెంపొరోమాన్డిబ్లార్(ఏఆర్టీ) జాయింట్’ అనే ఈ శస్త్ర చికిత్సలో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో చెన్నైలో తయారుచేసిన కృత్రిమ దవడ కీలును వినియోగించారు. వివరాలు... పశ్చిమ గోదావరి జిల్లా ఆరికిరేవులకు చెందిన కడియం ఝాన్సీకి పుట్టుకతోనే ఆహారం తినడంలో సమస్య ఉంది. ఆమె గత నెల 17న లెనోరా దంత వైద్యశాలకు రాగా పరీక్షించిన వైద్యులు సమస్యను గుర్తించి, ఏఆర్టీ జాయింట్ శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించారు. అయితే విదే శాల్లో తయారుచేసిన కృత్రిమ దవడ ఎముక జాయింట్‌ని వాడితే రూ.5 లక్షల వరకు ఖర్చవుతుంది. రోగి ఆర్థిక పరిస్థితి దృష్ట్యా వైద్యులు చెన్నైకి చెందిన మీనాక్షి అమ్మాళ్ డెంటల్ కాలేజీ ప్రొఫెసర్ డాక్టర్ నీలకందన్ని సంప్రదించగా స్వదేశీ పరిజ్ఞానంతో దవడ ఎముక జాయింట్ ఉచితంగా తయారు చేసి ఇవ్వగలనన్నారు. ఆయన రూపొందించిన జాయింట్‌ను మంగళవారం తొమ్మిది గంటల పాటు శస్త్ర చికిత్స నిర్వహించి రోగికి అమర్చామని లెనోరా కళాశాల కార్యదర్శి డాక్టర్ వై. మధుసూధనరెడ్డి తెలిపారు. డాక్టర్ నీలకందన్, డాక్టర్ దర్పన్ భార్గవ్, డాక్టర్ వి.దర్సింగ్ ఆధ్వర్యంలో డాక్టర్ పి. నవేన్ , డాక్టర్ డి.శ్రీకాంత్, డాక్టర్ ఎం. వైష్టవి, డాక్టర్ వేణుగోపాల్‌ల బృందం శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసిందన్నారు. కాగా ఈ శస్త్ర చికిత్సను రాష్ట్రం నలుమూల నుంచి వచ్చిన పీజీ విద్యార్థులకు లైవ్‌లో చూపి, వివరించారు.