విహార స్థలంగా జవహర్ బాగ్!
మథుర: హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న మథురలోని జవహర్ బాగ్ ను విహారయాత్ర స్థలంగా మార్చాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. కబ్జాదారుల నుంచి స్వాధీనం చేసుకున్న 270 ఎకరాల్లోని కొంత స్థలంలో అమూజ్మెంట్ పార్క్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. జూన్ 2న జవహర్ బాగ్ లో కబ్జాదారులకు, పోలీసులకు మధ్య మథురలో జరిగిన యుద్ధంలో ఇద్దరు పోలీసు అధికారులతో సహా 24 మంది మృతి చెందారు.
సీఎం అఖిలేశ్ యాదవ్ రెండు రోజుల క్రితం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ క్రమంలోనే పార్క్ ఏర్పాటు చేయాలన్న ఆలోచన మొగ్గ తొడినట్టు తెలుస్తోంది. ముందుగా 100.22 ఎకరాల స్థలాన్ని ఉద్యాన శాఖ అప్పగించి పార్క్ అభివృద్ధి చేయాలని సర్కారు భావిస్తోందని అధికార వర్గాలు వెల్లడించాయి. పార్క్ డిజైన్ కోసం ప్రైవేటు ఆర్కిటెక్ ను బుధవారం ప్రభుత్వం సంప్రదించిందని తెలిపాయి.