గొడవపడి ఇన్స్పెక్టర్ను కాల్చేసిన సీఐఎస్ఎఫ్ జవాన్
కేంద్ర పారిశ్రామిక భద్రత దళం (సీఐఎస్ఎఫ్) జవాన్ తన పైస్థాయి అధికారితో గొడవపడి ఆవేశంతో అతణ్ని తుపాకితో కాల్చేశాడు. అనంతరం పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఈ సంఘటన కోల్‌కతా పోర్టు ట్రస్టు వద్ద సీఐఎస్ఎఫ్ శిబిరంలో ఆదివారం జరిగింది.
ఇన్స్పెక్టర్ గురుపాద షీత్, ఓ సీఐఎస్ఎఫ్ జవాన్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. జవాన్ తన రైఫిల్‌తో మూడు రౌండ్లు కాల్పులు జరిపడంతో గురుపాద అక్కడికక్కడే మరణించారు. నిందితుడిని అరెస్ట్ చేసినట్టు కోల్‌కతా డిప్యూటీ పోలీస్ కమిషనర్ నిసాకుమార్ తెలిపారు. అతన్ని కోర్టులో హాజరు పరచనున్నట్టు చెప్పారు.