సరిహద్దు రక్షణలో అమరుడైన ఏపీ సైనికుడు
రాజస్థాన్ సరిహద్దులో ఉగ్రవాదుల కాల్పుల్లో మృతి
చుండూరు(తెనాలి): దేశ సరిహద్దు రక్షణలో ఏపీ సైనికుడు ఒకరు అమరుడయ్యారు. రాజస్థాన్ సరిహద్దుల్లోని అల్వార్లో ఉగ్రవాదుల కాల్పుల ఘటనలో గుంటూరు జిల్లాకు చెందిన జవాన్ మోదుకూరి నాగరాజు(29) మృతిచెందారు. శుక్రవారం రాత్రి పొద్దుపోయాక ఈ సంఘటన చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గంలోని మండలకేంద్రం చుండూరు నాగరాజు స్వగ్రామం. ఆయన మృతి గురించి ఆదివారం సమాచారమందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. నాగరాజుకు భార్య, మూడేళ్ల కుమారుడు ఉన్నారు. భార్య ప్రస్తుతం నిండుచూలాలు. ఆమె ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని భర్త అమరుడైన విషయాన్ని తెలియజేయలేదు.
పదేళ్లక్రితమే సైన్యంలో చేరిక..
నాగరాజు ఏడేళ్ల వయసులోనే తల్లి శివకుమారి మరణించగా.. వ్యవసాయం చేసుకుంటూ తండ్రి సోమయ్య పిల్లల్ని పెంచారు. పదోతరగతి వరకు చదివిన నాగరాజుకు సైన్యంలో చేరాలనే ఆసక్తి. దీంతో పదేళ్లక్రితం సైన్యంలో చేరి, దూరవిద్యలో ఇంటర్మీడియట్ పూర్తిచేశారు. రాజస్థాన్లోని అల్వార్ వద్ద సరిహద్దుల్లో ఆర్టిలరీ గన్నర్గా విధులు నిర్వహిస్తున్నారు. నాగరాజు అన్నయ్య శివనారాయణ వ్యవసాయం చేస్తుండగా.. తమ్ముడు కృష్ణ సైతం సైన్యంలో చేరారు. ప్రస్తుతం కృష్ణ జమ్మూకశ్మీర్లో విధుల్లో ఉన్నారు. కాగా, నాగరాజు భౌతికకాయం ఆదివారం రాత్రి పదిన్నర గంటల సమయంలో స్వగ్రామమైన చుండూరుకు చేరింది.