మూడురోజులకోసారే
ఔరంగాబాద్: తాగునీరు దొరక్క పట్టణవాసులు నానాతంటాలు పడుతున్నారు. ఇందుకు కారణం జయక్వాడి జలాశయం నుంచి చేపట్టిన సమాంతర పైప్లైన్ ప్రాజెక్టు సాంకేతిక అవరోధాల కారణంగా నిలిచిపోవడమే. దీంతో ఔరంగాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (ఏఎంసీ) మూడురోజులకోసారి పట్టణవాసులకు నీటిని సరఫరా చేస్తోంది. పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్య విధానం (పీపీపీ)లో ఈ ప్రాజెక్టు పనులను ఏఎంసీ ఓ ప్రైవేటు సంస్థకు కార్పొరేషన్ అప్పగించింది.
జయక్వాడి జలాశయంలోని నీటిని ఈ పైప్లైన్లద్వారా పట్టణవాసులకు అందించాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టును చేపట్టింది. ఇందుకు సంబంధించిన పనులు ఈ ఏడాది జనవరి ఒకటో తేదీన ప్రారంభమయ్యాయి. దాదాపు పది రోజులపాటు పనులు నిర్వహించిన సదరు ప్రైవేటు సంస్థ ఆ తర్వాత నిలిపివేసింది. ఈ ఏడాది వర్షాకాలంలో వానలు ఆశించినరీతిలోనేపడ్డాయి. దీంతోజయక్వాడి జలాశయంలో నీటిమట్టం బాగా పెరిగింది. అయినప్పటికీ నీటి నిర్వహణ విషయంలో ఏఎంసీ విఫలమవడంపై స్థానికులు మండిపడుతున్నారు. వాస్తవానికి జయక్వాడి జలాశయంలో నీటిమట్టం ఈ ప్రాంత ప్రజల తాగు, పారిశ్రామిక అవసరాలను తీర్చగలుగుతుంది. అయినప్పటికీ నీటి సరఫరా అంతంతమాత్రంగానే ఉంది. ఈ విషయమై హేమంత్శుక్లా అనే స్థానికుడు మాట్లాడుతూ కార్పొరేషన్ నీటి నిర్వహణలో విఫలమైందన్నాడు. తమ అవసరాలకు సరిపడా నీటిని సరఫరా చేయలేకపోతోందన్నాడు.
ఇదే విషయమై కార్పొరేషన్ అధికారి ఒకరు మాట్లాడుతూ వివిధ పంపింగ్ కేంద్రాల ద్వారా ప్రతి రోజూ జయక్వాడి జలాశయం నుంచి 140 మిలియన్ లీటర్ల నీటిని పట్టణవాసులకు సరఫరా చేస్తున్నామన్నారు. సమాంతర పైప్లైన్ ప్రాజెక్టు పనులు పూర్తయితే పట్టణవాసుల అవసరాలకు సరిపడా నీటిని సరఫరా చేయగలుగుతామన్నారు. కాగా జయక్వాడి జలాశయంలో దాదాపు 637 మిలియన్ మెట్రిక్ క్యూబ్ల నీరు ఉంది. అయితే నగరవాసులకు రోజుకు 45 మిలియన్ మెట్రిక్ క్యూబ్ల నీటిని సరఫరా చేయగలిగితే వారి కనీస అవసరాలు తీరతాయి. ఔరంగాబాద్ పట్టణవాసుల అవసరాలకు సరిపడా నీరు సరఫరా కాకపోవడానికి కారణం కార్పొరేషన్ అధికారుల వైఫల్యమేనని కమాండ్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (సీఏడీఏ) అధికారి ఒకరు ఆరోపించారు. ఆవిరి నష్టం కింద 228 మిలియన్ మెట్రిక్ క్యూబ్ల నీరు గాలిలో కలసిపోయిందన్నారు. ఇంక పారిశ్రామిక అవసరాల కోసం కార్పొరేషన్ 105 మిలియన్ మెట్రిక్ క్యూబ్ల నీటిని సరఫరా చేయాల్సి ఉంటుందన్నారు. ఇదంతాపోగా కూడా పట్టణవాసుల అవసరాలకు సరిపడా నీరు ఈ జలాశయంలో ఉందన్నారు. వినియోగదారులు క్రమం తప్పకుండా పన్ను చెల్లిస్తున్నప్పటికీ వారి అవసరాలకు సరిపడా నీరు అందడం లేదన్నారు.
వివక్ష చూపుతున్నారు
నీటి సరఫరా విషయంలో కార్పొరేషన్ అధికారులు వివక్ష ప్రదర్శిస్తున్నారని పట్టణంలోని దేవనగ్రి ప్రాంతనివాసి అశోక్ బర్డే ఆరోపించారు. కొన్ని ప్రాంతాలకు బాగానే సరఫరా చేస్తున్నారని, మరికొన్ని ప్రాంతాలకు వారానికి కేవలం ఒక్కరోజు మాత్రమే అందుతున్నాయన్నారు.
చర్చించిన మంత్రులు
నీటి సమస్యపై ముంబైలో గురువారం మంత్రుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేదు. అయితే రాష్ట్రంలోని అన్ని జలాశయాల్లో ప్రస్తుత నీటిమట్టం వివరాలను సమగ్రంగా విశ్లేషించారు. ఈ నెల 15వ తేదీన మరోసారి వారంతా సమావేశమవనున్నారు. ఈ సందర్భంగా ఈ ప్రాంతంలో ఖరీఫ్ పంట కోసం ఏయే జలాశయాలనుంచి ఎంత మొత్తంలో నీటిని విడుదల చేయాలనే అంశంపై వారంతా ఓ నిర్ణయానికొచ్చే అవకాశముంది. కాగా మరాఠ్వాడా ప్రాంతంలో మొత్తం వ్యవసాయ భూమి పరిమాణం 1.87 లక్షలు. ఈ ప్రాంతంలో ప్రధానంగా పత్తి, సోయాబీన్ పంటలను ఎక్కువగా సాగు చేస్తారు. ఇదిలాఉంటే మరాఠ్వాడాకు ఎగువ ప్రాంతాలైన అహ ్మద్నగర్, నాసిక్ జిల్లాల్లోని అన్ని జలాశయాల్లో కలిపి మొత్తం 72 వేల మిలియన్ క్యూబిక్ అడుగుల (ఎంసీటీ) నీరు ఉంది. మరాఠ్వాడాకు ఎగువ ప్రాంతంలో మొత్తం 16 జలాశయాలు ఉండగా అందులో 11 జలాశయాలు పూర్తిగా నీటితో నిండిపోయాయి. దీంతో ఎగువ ప్రాంత వాసులకు ఎటువంటి నీటి ఇబ్బందులు తలెత్తడం లేదు.