ఫేస్బుక్ పోస్టు చూసి ఇంగ్లండ్ నుంచి భూపాలపల్లికి!
సాక్షి, హైదరాబాద్: ఎక్కడి దేవుని గుట్ట.. ఎక్కడి బ్రిటన్.. ఫేస్‌బుక్‌లోని ఓ పోస్ట్ అక్కడి పరిశోధకుడిని రాష్ట్రానికి లాక్కొచ్చింది. ఇక్కడి చరిత్ర ఖండాంతరాలను దాటింది.. వరంగల్‌కి చెందిన పరిశోధకుడు, టూరిజం కన్సల్టెంట్ అరవింద్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని దేవునిగుట్ట గురించి సామాజిక మాధ్యమం ఫేస్బుక్లో పోస్ట్ చేయగా.. దాన్ని చూసి ఇంగ్లండ్‌కు చెందిన ప్రొఫెసర్ ఆడమ్ హార్డీ ఇక్కడికి వచ్చారు.
దేవుని గుట్ట అత్యద్భుత కట్టడం..
జయశంకర్ భూపాలపల్లి జిల్లా ములుగు మండలంలోని కొత్తూరు గ్రామానికి సమీపంలో ఉన్న అడవుల్లో ఈ దేవునిగుట్ట ఆలయముంది. గతేడాది వెలుగులోకి వచ్చిన ఈ దేవునిగుట్టకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభిస్తోంది. ప్రపంచంలోని ఆంగ్కోర్ వాట్ దేవాలయం కంటే ముందే తెలంగాణలోనూ అలాంటి నిర్మాణాలు జరిగాయని ఈ ఆలయం నిరూపించింది. ఇటీవల ప్రొఫెసర్ ఆడమ్ హార్డీ, అరవింద్ గ్రామస్తులతో కలసి దేవునిగుట్టపై నిశితంగా అధ్యయనం చేశారు. ఈ ఆలయం సాటిలేని నిర్మాణమని, అత్యద్భుత కట్టడమని ఇలాంటి ఆలయం భారత్‌లో మరెక్కడా లేదని ఆడమ్ అన్నారు.
దేవుని గుట్ట క్రీ.శ. 6 లేదా 7 శతాబ్దాలకు చెందిన కట్టడం గా భావిస్తున్నట్లు చెప్పారు. రాతిని ముక్కలు ముక్కలుగా చెక్కి వాటిపై శిల్పాలను కూర్చిన ఆలయం అరుదైన నిర్మాణ పద్ధతులను కలిగి ఉందన్నారు. విష్ణు కుండినుల కాలం నాటి ఆలయ నిర్మాణ పద్ధతులకు, ఈ ఆలయ నిర్మాణానికి సారూప్యత ఉందన్నారు. శిథిల స్థితిలో ఉన్న ఈ ఆలయాన్ని త్వరగా పునరుద్ధరించాల్సిన అవసరముందన్నారు. కేంద్ర పురావస్తు శాఖ పరిధిలోకి తీసుకుని ఆలయ పునరుద్ధరణ చేయాలని కోరారు.
38 ఏళ్లుగా పరిశోధనలు..
ఆడమ్ హార్డీ ఇంగ్లండ్‌కు చెందిన ప్రఖ్యాత చరిత్రకారుడు. గత 38 ఏళ్లుగా దక్షిణాసియాలోని పురాతన కట్టడాల నిర్మాణ పద్ధతులను గురించి పరిశోధన చేస్తున్నారు. ఈ పరిశోధనా క్రమంలో ఆయన సుదీర్ఘ కాలం భారత్‌లో పర్యటించారు. ఈయన చేసిన పరిశోధనల తాలూకు పత్రాలను పుస్తకాలుగా ప్రచురించారు.
విదేశీయుల సందర్శన
భారతీయ శిల్పకళలో మరో కోణానికి నిదర్శనంగా నిలిచిన దేవునిగుట్ట ఆలయాన్ని ఇప్పటికే పలువురు దేశ, విదేశీ చరిత్రకారులు, పరిశోధకులు పరిశీలించారు. భారత ప్రాచీన చరిత్ర, చిత్ర, శిల్ప కళలపై 30 ఏళ్లుగా అధ్యయనం చేస్తున్న జర్మనీకి చెందిన కొరీనా గతేడాది దేవుడిగుట్టను సందర్శించారు. ఇటలీ నుంచి లక్ష్మీ ఆండ్రీ అనే విదేశీ మహిళ కూడా గతంలో ఈ ఆలయాన్ని సందర్శించారు.