జిల్లాకు రూ.8 కోట్లు
గొర్రెల పెంపకందారులకు రుణాలు
పశుసంవర్ధక శాఖ జేడీ విక్రమ్‌కుమార్
సిద్దిపేట రూరల్: నేషనల్ కో-ఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్సీడీసీ) ద్వారా గొర్రెల పెంపకందారులను రుణాలు అందిచనున్నట్లు పశుసంవర్థక శాఖ జేడీ డాక్టర్ ఎన్. విక్రమ్‌కుమార్ తెలిపారు. సోమవారం సిద్దిపేటలో ఆయన మాట్లాడుతూ గొర్రెల పెంపకందారుల రుణాల కోసం జిల్లాకు రూ. 8కోట్లు విడుదలైనట్లు తెలిపారు.
గత ఏడాది మహబూబ్‌నగర్ జిల్లాను పైలట్ ప్రాజెక్ట్‌గా ఎంచుకుని నిధులు విడుదల చేసినట్లు తెలిపారు. దీనిలో భాగంగా ఈ ఏడాది మెదక్ జిల్లాకు విడుదల అయినట్లు పేర్కొన్నారు. జిల్లా గొర్రెల పెంపకందారుల సహకార సంఘం ఆధ్వర్యంలో 617 సొసైటీలు ఉన్నట్లు తెలిపారు. ఇందులో జిల్లాలోని 997మందికి రుణాలు అందిస్తామన్నారు.
రూ. లక్ష యూనిట్‌గా తీసుకోని అందులో రూ. 60వేలు రుణం, రూ. 20వేలు సబ్సిడీ, రూ. 20వేలు లబ్ధిదారుడే చెల్లించాల్సి ఉంటుందన్నారు. దీని ద్వారా 20 ప్లస్ 01 గొర్రెలను కొనుగోలు చేయాల్సి ఉంటుందన్నారు. ఈ లావాదేవీలన్ని సహకార సంఘం ఆధ్వర్యంలోనే కొనసాగుతాయన్నారు. అలాగే తీసుకున్న రుణాన్ని లబ్ధిదారుడు సక్రమంగా చెల్లిస్తే పావలా వడ్డీ చెల్లించాలన్నారు. సక్రమంగా చెల్లించని పక్షంలో రూపాయి వడ్డీ పడుతుందన్నారు.