Jeremy Lalrinnunga
-
Asian Weightlifting Championship: భారత్ ఖాతాలో రెండో పతకం, జెరెమికు రజతం
జిన్జూ (దక్షిణ కొరియా): ఆసియా సీనియర్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్ ఖాతాలో రెండో పతకం చేరింది. పురుషుల 67 కేజీల విభాగంలో జెరెమి లాల్రినుంగా స్నాచ్ ఈవెంట్లో 141 కేజీలు బరువెత్తి రెండో స్థానంలో నిలిచి రజత పతకం దక్కించుకున్నాడు. అయితే మిజోరం రాష్ట్రానికి చెందిన 20 ఏళ్ల జెరెమి క్లీన్ అండ్ జెర్క్ ఈవెంట్లో తడబడి మొత్తం బరువును నమోదు చేయడంలో విఫలమయ్యాడు. మూడు క్లీన్ అండ్ జెర్క్ అవకాశాల్లోనూ జెరెమి నిర్ధారిత బరువును ఎత్తలేకపోయాడు. శనివారం జరిగిన మహిళల 55 కేజీల విభాగంలో బింద్యారాణి భారత్‌కు రజత పతకం అందించిన సంగతి తెలిసిందే. -
Commonwealth Games 2022: జెరెమీ జయహో...
అంచనాలను నిజం చేస్తూ భారత వెయిట్‌లిఫ్టర్లు కామన్వెల్త్ గేమ్స్‌లో తమ అద్భుత ప్రదర్శన కొనసాగిస్తున్నారు. పోటీల మూడో రోజు ఆదివారం భారత్‌కు ఒక స్వర్ణం, ఒక రజతం లభించింది. అంతర్జాతీయ జూనియర్ స్థాయిలో కొన్నేళ్లుగా నిలకడగా రాణిస్తున్న మిజోరం టీనేజర్ జెరెమీ లాల్రినుంగా సీనియర్ స్థాయిలో పసిడి పతకంతో అరంగేట్రం చేయగా... మణిపూర్ మహిళా లిఫ్టర్ బింద్యారాణి దేవి సొరోఖైబమ్ రజత పతకంతో మెరిసింది. ఫలితంగా బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్‌లో భారత వెయిట్‌లిఫ్టర్లు నెగ్గిన ఐదు పతకాలతో పతకాల పట్టికలో భారత్ ఆరో స్థానంలో నిలిచింది. బర్మింగ్‌హామ్: ఏ లక్ష్యంతోనైతే భారత టీనేజ్ వెయిట్‌లిఫ్టర్ జెరెమీ లాల్రినుంగా బర్మింగ్‌హామ్‌లో అడుగుపెట్టాడో దానిని సాధించాడు. మూడు నెలల క్రితం కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణ పతకం నమూనా ఫొటోను తన ఫోన్ వాల్ పేపర్‌గా పెట్టుకున్న 19 ఏళ్ల జెరెమీ ఇప్పుడు నిజమైన పసిడి పతకాన్ని తన మెడలో వేసుకున్నాడు. ఆదివారం జరిగిన పురుషుల వెయిట్‌లిఫ్టింగ్ 67 కేజీల విభాగంలో జెరెమీ లాల్రినుంగా విజేతగా నిలిచాడు. స్నాచ్‌లో 140 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 160 కేజీలు బరువెత్తి ఓవరాల్‌గా 300 కేజీలతో జెరెమీ చాంపియన్‌గా అవతరించాడు. స్నాచ్‌లో, ఓవరాల్ టోటల్లో జెరెమీ రెండు కామన్వెల్త్ గేమ్స్ కొత్త రికార్డులు సృష్టించాడు. వైపావా లోన్ (సమోవా; 127+166=293 కేజీలు) రజతం... ఎడిడియోంగ్ యుమోఫియా (నైజీరియా; 130+160=290 కేజీలు) కాంస్యం సాధించారు. స్నాచ్ ఈవెంట్లో జెరెమీ తొలి ప్రయత్నంలో 136 కేజీలు, రెండో ప్రయత్నంలో 140 కేజీలు ఎత్తాడు. మూడో ప్రయత్నంలో 143 కేజీలకు ప్రయత్నించి విఫలమయ్యాడు. ఇక క్లీన్ అండ్ జెర్క్‌లో తొలి ప్రయత్నంలో 154 కేజీలు, రెండో ప్రయత్నంలో 160 కేజీలు ఎత్తిని జెరెమీ మూడో ప్రయత్నంలో 165 కేజీలకు ప్రయత్నించి తడబడ్డాడు. మూడో ప్రయత్నంలో జెరెమీ తొడ కండరాలు పట్టేశాయి. దాంతో అతను వెయిట్బార్ను వదిలేశాడు. సమోవా లిఫ్టర్ వైపావా క్లీన్ అండ్ జెర్క్‌లో 166 కేజీలు ఎత్తినా స్నాచ్‌లో జెరెమీ ఎక్కువ కేజీలు ఎత్తడంతో భారత లిఫ్టర్‌కు స్వర్ణం ఖాయమైంది. ముందు బాక్సింగ్‌లో... మిజోరం రాష్ట్రానికి చెందిన జాతీయ జూనియర్ బాక్సింగ్ చాంపియన్ లాల్నెత్లువాంగా కుమారుడైన జెరెమీ ఆరంభంలో తండ్రి అడుగుజాడల్లోనే నడిచాడు. కొన్నాళ్లు బాక్సింగ్‌లో కొనసాగిన జెరెమీ పుణేలోని ఆర్మీ స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్లో ప్రవేశం పొందాక వెయిట్లిఫ్టింగ్వైపు మళ్లాడు. అటునుంచి జెరెమీ వెనుదిరిగి చూడలేదు. 2016లో ప్రపంచ యూత్ చాంపియన్‌షిప్‌లో 56 కేజీల విభాగంలో స్వర్ణం నెగ్గిన జెరెమీ ఆ తర్వాత 2017 ప్రపంచ యూత్ చాంపియన్‌షిప్‌లో రజతం సాధించాడు. 2018 ఆసియా జూనియర్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం... 2018లో అర్జెంటీనా ఆతిథ్యమిచ్చిన యూత్ ఒలింపిక్స్‌లో పసిడి పతకం గెలిచాడు. గత ఏడాది తాష్కెంట్లో జరిగిన కామన్వెల్త్ చాంపియన్‌షిప్‌లోనూ జెరెమీ బంగారు పతకం గెలుపొందాడు. ఒక కేజీ తేడాతో... మహిళల 55 కేజీల విభాగంలో బింద్యారాణి దేవి రజత పతకం కైవసం చేసుకుంది. మణిపూర్‌కు చెందిన 23 ఏళ్ల బింద్యారాణి మొత్తం 202 కేజీలు (స్నాచ్‌లో 86+క్లీన్ అండ్ జెర్క్‌లో 116) బరువెత్తి రెండో స్థానంలో నిలిచింది. అదిజాత్ అడెనికి ఒలారినోయి (నైజీరియా; 92+111=203 కేజీలు) స్వర్ణ పతకాన్ని సాధించింది. ఒలారినోయి, బింద్యారాణి ఓవరాల్ టోటల్ మధ్య కేవలం ఒక కేజీ తేడా ఉండటం గమనార్హం. ఫ్రెయర్ మొరో (ఇంగ్లండ్; 89+109=198 కేజీలు) కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. ఆదివారమే జరిగిన మహిళల 59 కేజీల విభాగంలో భారత లిఫ్టర్ పాపీ హజారికా నిరాశపరిచింది. పాపీ హజారికా 183 కేజీలు (స్నాచ్‌లో 81+క్లీన్ అండ్ జెర్క్‌లో 102) బరువెత్తి ఏడో స్థానంలో నిలిచింది. నా స్వప్నం సాకారమైంది. నేను కొత్త ప్రపంచంలో ఉన్న అనుభూతి కలుగుతోంది. యూత్ ఒలింపిక్స్ తర్వాత సీనియర్‌స్థాయిలో నేను పాల్గొన్న పెద్ద ఈవెంట్ ఇదే. నేను 67 కేజీల నుంచి నేను ఒలింపిక్ వెయిట్ కేటగిరీ 73 కేజీలకు మారబోతున్నాను. పారిస్ ఒలింపిక్స్ లక్ష్యంగా ఇప్పటి నుంచే సన్నాహాలు ప్రారంభిస్తాను. –జెరెమీ లాల్రినుంగా -
భారత వెయిట్‌లిఫ్టర్ జెరెమీకి స్వర్ణం
కామన్వెల్త్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో భారత యువ లిఫ్టర్ జెరెమీ లాల్రినుంగా స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నాడు. తాష్కెంట్లో జరుగుతున్న ఈ టోర్నీలో మిజోరం రాష్ట్రానికి చెందిన 19 ఏళ్ల జెరెమీ 67 కేజీల విభాగంలో అగ్రస్థానంలో నిలిచాడు. జెరెమీ స్నాచ్‌లో 141 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 164 కేజీలు బరువెత్తి ఓవరాల్‌గా 305 కేజీలతో బంగారు పతకాన్ని దక్కించుకున్నాడు. ఇదే వేదికపై జరుగుతున్న ప్రపంచ చాంపియన్‌షిప్‌లో జెరెమీ ఏడో స్థానంలో నిలిచాడు. -
ఒకేసారి 27 రికార్డులు బద్దలు
దోహా: ఖతర్ కప్ అంతర్జాతీయ వెయిట్‌లిఫ్టింగ్ టోర్నమెంట్లో యూత్ ఒలింపిక్స్ చాంపియన్, భారత యువతార జెరెమీ లాల్రినుంగా రజత పతకం సాధించాడు. పురుషుల 67 కేజీల విభాగంలో పోటీపడిన మిజోరం లిఫ్టర్ లాల్రినుంగా మొత్తం 306 (స్నాచ్‌లో 140 కేజీల+క్లీన్ అండ్ జెర్క్‌లో 166 కేజీలు) కేజీలు బరువెత్తి రెండో స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో 17 ఏళ్ల లాల్రినుంగా తన పేరిటే ఉన్న ఐదు సీనియర్ జాతీయ రికార్డులను, ఐదు జాతీయ జూనియర్ రికార్డులను, ఐదు జాతీయ యూత్ రికార్డులను, మూడు యూత్ వరల్డ్ రికార్డులను, మూడు ఆసియా యూత్ రికార్డులను, ఆరు కామన్వెల్త్ రికార్డులను బద్దలు కొట్టాడు. -
భారత్ ‘బంగారు’ చరిత్ర
బ్యూనస్ ఎయిర్స్(అర్జెంటీనా): యూత్ ఒలింపిక్స్‌లో భారత్ టీనేజ్ వెయిట్‌లిఫ్టింగ్ సంచలనం జెరెమీ లాల్రిన్గుంగా స్వర్ణ పతకాన్ని సాధించి కొత్త చరిత్ర సృష్టించాడు. మంగళవారం జరిగిన వెయిట్‌లిఫ్టింగ్ పోరులో 15 ఏళ్ల లాల్రిన్గుంగా ఫైనల్ అటెంప్ట్‌లో 150 కేజీల బరువు ఎత్తడంతో పసిడిని ఒడిసి పట్టుకున్నాడు. గ్రూప్-ఎలో భాగంగా 62 కేజీల విభాగంలో పోటీపడ్డ ఈ యువ వెయిట్‌లిఫ్టర్.. మొత్తంగా 274 కేజీల బరువు ఎత్తి స్వర్ణాన్ని సాధించాడు. తొలుత స్నాచ్ విభాగంలో అత్యధికంగా 124 కేజీల బరువును సునాయాసంగా ఎత్తిన జెరెమీ.. క్లీన్ అండ్ జర్క్‌లో అత్యధికంగా 150కేజీలను ఎత్తాడు. దాంతో టర్కీ వెయిట్‌లిఫ్టర్ తొప్తాస్ కానర్(263 కేజీలు)లను అధిగమించి తొలి స్థానంలో నిలిచాడు. ఫలితంగా స్వర్ణం ఖాయమైంది. కాగా, ఓవరాల్ యూత్ ఒలింపిక్స్‌లో ఇదే భారత్‌కు తొలి స్వర్ణం కావడం విశేషం. దాంతో యూత్ ఒలింపిక్స్‌లో భారత్ ‘బంగారు’ చరిత్రను ఆరంభించినట్లయ్యింది. సోమవారం ఆటల్లో భాగంగా షూటింగ్ సంచలనం మేహులి ఘోష్ స్వర్ణ గురి తప్పింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో 18 ఏళ్ల మేహులి రజతంతో సరిపెట్టుకుంది. ఆఖరి షాట్ మినహా అన్ని షాట్లను లక్ష్యానికి దగ్గరగా గురిపెట్టిన ఆమె చివరి 24వ షాట్‌తో స్వర్ణానికి దూరమైంది. కాగా, భారత్ ఖాతాలో తాజాగా స్వర్ణం చేరడంతో కొత్త అధ్యాయానికి నాంది పలికింది. మూడో యూత్ ఒలింపిక్స్‌లో భారత్ పసిడి ఖాతాను తేరవడం గమనార్హం. ఇప్పటివరకూ ఈ యూత్ ఒలింపిక్స్‌లో భారత్ ఒక గోల్డ్ మెడల్‌తో పాటు మూడు రజత పతకాలు సాధించింది. ఇదే భారత్‌కు యూత్ ఒలింపిక్స్‌లో అత్యుత్తమ ప్రదర్శనగా నిలిచింది. అంతకుముందు 2014లో భారత్ కేవలం రెండు పతకాల్ని మాత్రమే సాధించింది.