అంచనాలను నిజం చేస్తూ భారత వెయిట్‌లిఫ్టర్లు కామన్వెల్త్ గేమ్స్‌లో తమ అద్భుత ప్రదర్శన కొనసాగిస్తున్నారు. పోటీల మూడో రోజు ఆదివారం భారత్‌కు ఒక స్వర్ణం, ఒక రజతం లభించింది.
అంతర్జాతీయ జూనియర్ స్థాయిలో కొన్నేళ్లుగా నిలకడగా రాణిస్తున్న మిజోరం టీనేజర్ జెరెమీ లాల్‌రినుంగా సీనియర్ స్థాయిలో పసిడి పతకంతో అరంగేట్రం చేయగా... మణిపూర్ మహిళా లిఫ్టర్ బింద్యారాణి దేవి సొరోఖైబమ్ రజత పతకంతో మెరిసింది. ఫలితంగా బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్‌లో భారత వెయిట్‌లిఫ్టర్లు నెగ్గిన ఐదు పతకాలతో పతకాల పట్టికలో భారత్ ఆరో స్థానంలో నిలిచింది.
బర్మింగ్‌హామ్: ఏ లక్ష్యంతోనైతే భారత టీనేజ్ వెయిట్‌లిఫ్టర్ జెరెమీ లాల్‌రినుంగా బర్మింగ్‌హామ్‌లో అడుగుపెట్టాడో దానిని సాధించాడు. మూడు నెలల క్రితం కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణ పతకం నమూనా ఫొటోను తన ఫోన్ వాల్ పేపర్‌గా పెట్టుకున్న 19 ఏళ్ల జెరెమీ ఇప్పుడు నిజమైన పసిడి పతకాన్ని తన మెడలో వేసుకున్నాడు. ఆదివారం జరిగిన పురుషుల వెయిట్‌లిఫ్టింగ్ 67 కేజీల విభాగంలో జెరెమీ లాల్‌రినుంగా విజేతగా నిలిచాడు.
స్నాచ్‌లో 140 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 160 కేజీలు బరువెత్తి ఓవరాల్‌గా 300 కేజీలతో జెరెమీ చాంపియన్‌గా అవతరించాడు. స్నాచ్‌లో, ఓవరాల్ టోటల్‌లో జెరెమీ రెండు కామన్వెల్త్ గేమ్స్ కొత్త రికార్డులు సృష్టించాడు. వైపావా లోన్ (సమోవా; 127+166=293 కేజీలు) రజతం... ఎడిడియోంగ్ యుమోఫియా (నైజీరియా; 130+160=290 కేజీలు) కాంస్యం సాధించారు. స్నాచ్ ఈవెంట్‌లో జెరెమీ తొలి ప్రయత్నంలో 136 కేజీలు, రెండో ప్రయత్నంలో 140 కేజీలు ఎత్తాడు.
మూడో ప్రయత్నంలో 143 కేజీలకు ప్రయత్నించి విఫలమయ్యాడు. ఇక క్లీన్ అండ్ జెర్క్‌లో తొలి ప్రయత్నంలో 154 కేజీలు, రెండో ప్రయత్నంలో 160 కేజీలు ఎత్తిని జెరెమీ మూడో ప్రయత్నంలో 165 కేజీలకు ప్రయత్నించి తడబడ్డాడు. మూడో ప్రయత్నంలో జెరెమీ తొడ కండరాలు పట్టేశాయి. దాంతో అతను వెయిట్‌బార్‌ను వదిలేశాడు. సమోవా లిఫ్టర్ వైపావా క్లీన్ అండ్ జెర్క్‌లో 166 కేజీలు ఎత్తినా స్నాచ్‌లో జెరెమీ ఎక్కువ కేజీలు ఎత్తడంతో భారత లిఫ్టర్‌కు స్వర్ణం ఖాయమైంది.
ముందు బాక్సింగ్‌లో...
మిజోరం రాష్ట్రానికి చెందిన జాతీయ జూనియర్ బాక్సింగ్ చాంపియన్ లాల్‌నెత్లువాంగా కుమారుడైన జెరెమీ ఆరంభంలో తండ్రి అడుగుజాడల్లోనే నడిచాడు. కొన్నాళ్లు బాక్సింగ్‌లో కొనసాగిన జెరెమీ పుణేలోని ఆర్మీ స్పోర్ట్స్ ఇన్‌స్టిట్యూట్‌లో ప్రవేశం పొందాక వెయిట్‌లిఫ్టింగ్‌వైపు మళ్లాడు. అటునుంచి జెరెమీ వెనుదిరిగి చూడలేదు. 2016లో ప్రపంచ యూత్ చాంపియన్‌షిప్‌లో 56 కేజీల విభాగంలో స్వర్ణం నెగ్గిన జెరెమీ ఆ తర్వాత 2017 ప్రపంచ యూత్ చాంపియన్‌షిప్‌లో రజతం సాధించాడు. 2018 ఆసియా జూనియర్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం... 2018లో అర్జెంటీనా ఆతిథ్యమిచ్చిన యూత్ ఒలింపిక్స్‌లో పసిడి పతకం గెలిచాడు. గత ఏడాది తాష్కెంట్‌లో జరిగిన కామన్వెల్త్ చాంపియన్‌షిప్‌లోనూ జెరెమీ బంగారు పతకం గెలుపొందాడు.
ఒక కేజీ తేడాతో...
మహిళల 55 కేజీల విభాగంలో బింద్యారాణి దేవి రజత పతకం కైవసం చేసుకుంది. మణిపూర్‌కు చెందిన 23 ఏళ్ల బింద్యారాణి మొత్తం 202 కేజీలు (స్నాచ్‌లో 86+క్లీన్ అండ్ జెర్క్‌లో 116) బరువెత్తి రెండో స్థానంలో నిలిచింది. అదిజాత్ అడెనికి ఒలారినోయి (నైజీరియా; 92+111=203 కేజీలు) స్వర్ణ పతకాన్ని సాధించింది. ఒలారినోయి, బింద్యారాణి ఓవరాల్ టోటల్ మధ్య కేవలం ఒక కేజీ తేడా ఉండటం గమనార్హం. ఫ్రెయర్ మొరో (ఇంగ్లండ్; 89+109=198 కేజీలు) కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. ఆదివారమే జరిగిన మహిళల 59 కేజీల విభాగంలో భారత లిఫ్టర్ పాపీ హజారికా నిరాశపరిచింది. పాపీ హజారికా 183 కేజీలు (స్నాచ్‌లో 81+క్లీన్ అండ్ జెర్క్‌లో 102) బరువెత్తి ఏడో స్థానంలో నిలిచింది.
నా స్వప్నం సాకారమైంది. నేను కొత్త ప్రపంచంలో ఉన్న అనుభూతి కలుగుతోంది. యూత్ ఒలింపిక్స్ తర్వాత సీనియర్‌స్థాయిలో నేను పాల్గొన్న పెద్ద ఈవెంట్ ఇదే. నేను 67 కేజీల నుంచి నేను ఒలింపిక్ వెయిట్ కేటగిరీ 73 కేజీలకు మారబోతున్నాను. పారిస్ ఒలింపిక్స్ లక్ష్యంగా ఇప్పటి నుంచే సన్నాహాలు ప్రారంభిస్తాను.
–జెరెమీ లాల్‌రినుంగా
Comments
Please login to add a commentAdd a comment