jerusalem church
-
ఆ నిచ్చెనంటే ఎందుకు భయం? జెరూసలేంలో 273 ఏళ్లుగా ఏం జరుగుతోంది?
హమాస్‌తో యుద్ధం కారణంగా ఇజ్రాయెల్ నిత్యం వార్తల్లో కనిపిస్తోంది. దీంతో చాలామంది ఈ చిన్న దేశం గురించి, అక్కడి పౌరుల గురించి, అంటే యూదుల జీవన విధానానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారు. ఇప్పుడు మనం ఆ వివరాలతో పాటు ఇక్కడి జెరూసలేంలో ఉన్న ఒక విచిత్రమైన నిచ్చెన గురించి తెలుసుకుందాం. ఆ నిచ్చెన 273 ఏళ్లుగా ఒక్క అంగుళం కూడా పక్కకు కదలలేదట. అందుకే దీని ప్రత్యేకత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచంలో ఏదేనా వివాదాస్పద స్థలం గురించి చర్చ జరిగినప్పుడు జెరూసలేం పేరు కూడా వినిపిస్తుంది. ఒకవైపు ఇజ్రాయెల్ దీనిని తమ రాజధానిగా చెబుతుండగా, మరోవైపు పాలస్తీనా ఇది తమదేనని వాదిస్తుంటుంది. ఈ నగరం కోసం కొన్ని దశాబ్దాలుగా ఈ రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతోంది. ఈ నేపధ్యంలో ఈ స్థలం ఎందుకు అంత ముఖ్యమైనదనే ప్రశ్న మన మదిలో మెదులుతుంది. నిజానికి ఈ ప్రదేశం నుండే ప్రపంచంలోని మూడు ప్రధాన మతాలైన క్రైస్తవం, ఇస్లాం, జుడాయిజం స్థాపితమయ్యాయని చెబుతారు. జెరూసలేం నగరంలో ‘చర్చ్ ఆఫ్ ది హోలీ సెపల్చర్’ అనే క్రైస్తవ చర్చి ఉంది. ఏసుక్రీస్తుకు ఇక్కడే శిలువ వేశారని, తర్వాత ఇక్కడే తిరిగి అవతరించారని క్రైస్తవులు నమ్ముతారు. అయితే ఈ చర్చిలో క్రైస్తవ మతంలోని వివిధ వర్గాల సంప్రదాయరీతులు నడుస్తుంటాయి. క్రైస్తవ మతంలోని ఆరు వర్గాలు సంయుక్తంగా ఈ చర్చిని పర్యవేక్షిస్తున్నాయి. అయితే ఈ చర్చిలో ఒక ప్రత్యేకమైన నిచ్చెన మెట్లు ఉన్నాయి. ఇవి వివాదాస్పదంగా నిలిచాయని చెబుతారు. ‘ది హోలీ సెపల్చర్ చర్చి’లోని ఒక ప్రాంతంలో 1750 నుంచి ఈ నిచ్చెన ఉంది. ఇప్పటి వరకు ఈ నిచ్చెనను ఒక్క అంగుళం కూడా కదపడానికి ఎవరూ సాహసించలేదు. దీనిని కదిపితే వివిధ వర్గాల మధ్య వివాదం తలెత్తవచ్చనే భావనతో దీనిని ఎవరూ ఇంతవరకూ ముట్టుకోలేదట. నేటికీ చర్చిలో ఎటువంటి మరమ్మతులు చేపట్టినా ఈ నిచ్చెనను ఈ స్థలం నుంచి కదపకపోవడం విశేషం. ఇది కూడా చదవండి: ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జెండాలపై యూనియన్ జాక్ ఎందుకు? -
చెరిగిపోని వారసత్వం
విదేశీ యాత్రికుడు ఫిలిప్ లాంకాస్టర్ జెరూసలేంను సందర్శిస్తూ ప్రార్థనా మందిరం తర్వాత అక్కడి ప్రాచీన దారులను, గోడలను వీక్షిస్తూ ముందుకు వెళుతున్నాడు. జాఫా గేట్ వద్ద సెయింట్ జార్జ్ స్ట్రీట్‌లో ఒక టాటూ షాప్ కనిపించింది. జెరూసలేం యాత్ర జీవితాంతం గుర్తుండిపోయేలా పచ్చబొట్టు వేయించుకోవాలనుకున్నాడు. రజౌక్ టాటూ షాప్ అని కనిపిస్తున్న ఆ దుకాణంలోకి వెళ్లి ఆ షాప్ నిర్వాహకుడితో తన చేతి మీద పచ్చబొట్టు వేయమని కోరాడు. మాటల్లో వారి విషయాలు తెలుసుకున్న ఫిలిప్ ఆశ్చర్యానందాలకు లోనయ్యాడు. రజౌక్ టాటూ షాప్ 1300వ సంవత్సరం నుండి అక్కడే ఉంది! 700 సంవత్సరాలుగా జెరూసలేం యాత్రికులు ఆ షాప్‌కి రావడానికి ముచ్చటపడుతూనే ఉన్నారు. ఆ విధంగా ప్రపంచంలోని అతి పురాతన టాటూ షాపులలో రజౌక్ షాప్ ఒకటిగా నిలిచింది. ప్రస్తుతం 27వ తరానికి చెందిన వాసిమ్ రజౌక్ ఈ షాప్‌ను నిర్వహిస్తున్నాడు. శతాబ్దాల క్రితం అతని పూర్వీకులు ఈజిప్ట్ నుండి వచ్చి ఇక్కడ స్థిరపడ్డారట. నాటి సాధనాలు, పద్ధతులతో పచ్చబొట్టు వేసే వృత్తిని ఆ కుటుంబం చేపట్టింది. వాసిమ్ రజౌక్ ఉపయోగించే పచ్చబొట్టు ముద్రలు, నమూనాల ఎంపికకు సంబంధించినవన్నింటికీ వందల సంవత్సరాల వయసు ఉంది. వాసిమ్ బొట్టు వేయడానికి ఆధునాతనమైన, క్రిమిరహితం చేసిన పరికరాలనే ఉపయోగిస్తాడు. షాపులోని ఆలివ్ కలప నుండి చేతితో చెక్కబడిన గ్లాస్ డిస్ప్లే నమూనాలు చీకటిలో అద్భుతంగా మెరుస్తుంటాయి. మ్యూజియంలో ఉండే విలువైన పురాతన కళాఖండాలను పచ్చబొట్లుగా వాసిమ్ వేయడాన్ని వీక్షించాల్సిందే. ప్రాచీన జెరూసలేంలోని శిలువ నమూనాలు ఇప్పటికీ వాసిమ్ దగ్గర అత్యంత ప్రజాదరణ పొందిన డిజైన్లు. స్టెన్సిల్స్‌తో.. క్రీస్తు శిలువ నుండి పునరుత్థానం వరకు అన్ని వర్ణనలు ఈ పచ్చబొట్లలో ప్రతిఫలిస్తాయి. యాత్రికుడు ఒక స్టెన్సిల్‌ను ఎంచుకుంటాడు. వాసిమ్ దానిని ఒక ప్యాడ్‌లో వేసి, ఆ డిజైన్‌ను ఒంటిపైకి బదిలీ చేసి పచ్చబొట్టు పొడుస్తాడు. అతని పనితనం చాలా సునిశితంగా, సున్నితంగా ఉంటుంది. ‘‘జీవిత కాలం కొనసాగే స్మృతి చిహ్నం కోసం ఇలా రజౌక్ టాటూ షాప్‌లో ఒక రోజు గడపడం అంటే క్రైస్తవ ప్రపంచం కూడలి వద్ద కూర్చోవడంతో సమానంగా భావించవచ్చు’’ అని ఫిలిప్ లాంకాస్టర్ అంటారు. -
గెలిస్తే ఉచితంగా జెరూసలేం యాత్ర
న్యూఢిల్లీ: అధికారంలోకి వస్తే క్రైస్తవులను ఉచితంగా జెరూసలేం యాత్రకు పంపిస్తామంటూ నాగాలాండ్‌లో బీజేపీ ఎన్నికల హామీని ప్రకటించింది. మూడు ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్, త్రిపుర, మేఘాలయల్లో ఈ నెలలో ఎన్నికలు జరగనుండటం తెలిసిందే. నాగాలాండ్ జనాభాలో 88% మంది క్రైస్తవులే కావడంతో బీజేపీ ఈ హామీ ని ప్రకటించినట్లు తెలుస్తోంది. అయితే మేఘాలయలోనూ 75% జనాభా క్రైస్తవులే. దీంతో ఈ హామీని బీజేపీ నాగాలాండ్‌కు మాత్రమే పరిమితం చేస్తుందా లేక అన్ని ఈశాన్య రాష్ట్రాలకు వర్తింపజేస్తుందా లేక దేశంలోని క్రిస్టియన్లకందరికీ అవకాశమిస్తుందా అనే దానిపై స్పష్టత లేదు. ముస్లింలకు హజ్ యాత్ర రాయితీని కేంద్ర ప్రభు త్వం గత నెలలోనే రద్దు చేయడం తెలిసిందే. ఇప్పుడు క్రైస్తవులను మాత్రం ఉచితంగానే జెరూసలేంకు పంపిస్తామని బీజేపీ హామీనివ్వడంపై విమర్శలు వస్తున్నాయి. -
జెరూసలెం చర్చికి ముస్లిం కేర్‌టేకర్
జెరూసలెంలోని ‘హోలీ సెపల్కర్’ చర్చి ప్రపంచంలోని క్రైస్తవులందరికీ ఎంతో పవిత్రమైన స్థలమన్నది తెల్సిందే. ఎందుకంటే ఏసుక్రీస్తు సమాధి ఈ చర్చిలోనే భద్రపర్చారన్నది క్రైస్తవుల విశ్వాసం. ఇటీవల సమాధి ఉన్నట్లుగా భావిస్తున్న స్థలాన్ని కూడా పునరుద్ధరించారు. అయితే పునరుద్ధరణ పనుల సందర్భంగా ప్రజలను లోపలి వరకు అనుమతించలేదు. స్థానికులకు తెలుసేమో గానీ ఈ చర్చికున్న మరో విశేషం ఇప్పుడు ప్రపంచం దృష్టికి వచ్చింది. తరతరాలుగా, అంటే 500 సంవత్సరాలకుపైగా ఈ చర్చి సంరక్షణా బాధ్యతలను ఓ ముస్లిం కుటుంబం చూస్తోంది. చర్చికున్న ప్రధాన ద్వారం తాళం చెవి ఈ ముస్లిం కుటుంబం వద్దనే ఉంటోంది. ఆ కుటుంబంలోని 80వ తరానికి చెందిన అదీబ్ జౌదే వద్ద ఇప్పుడు తాళం చెవి ఉంది. ప్రతిరోజూ క్రమం తప్పకుండా వెళ్లి చర్చి తలుపులు తెరిచి రావాలి. అలాగే మూసి రావాలి. తాళం చెవి ఇంట్లో మరచిపోయి చర్చికి రావడం లాంటి సందర్బాలు కూడా లేవట. చారిత్రక, మత పవిత్ర స్థలాలపై ప్రత్యేక కథనాలను ప్రసారం చేసే ‘నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్’ ఇప్పుడు ఓ డాక్యుమెంటరీ ద్వారా ఈ విశేషాన్ని ప్రపంచం దృష్టికి తీసుకొచ్చింది. అప్పట్లో చర్చి నిర్వాహకుల్లో ఆర్మేనియన్, గ్రీక్, ఫ్రాన్సిస్కాన్ క్రైస్తవులు ఉండేవారట. చర్చి కేర్‌టేకర్ తటస్థ వ్యక్తి అయి ఉండాలనే ఉద్దేశంతో ఎంతో ప్రజాభిమానం కలిగిన ఓ ముస్లిం పెద్దకు ఆ బాధ్యతలు అప్పగించారట. అప్పటి నుంచి చర్చి ప్రధాన ద్వారం తాళం చెవి ఆ ముస్లిం కుటుంబం వద్దనే ఉంటూ వస్తోంది. ఈ బాధ్యతను నిర్వహించడం తమకు ఎంతో గర్వకారణమని, ప్రపంచంలోని ముస్లింలందరికీ కూడా ఇది గౌరవ చిహ్నమని ప్రస్తుత కేర్ టేకర్ అదీబ్ వ్యాఖ్యానించారు. -
జెరూసలెం చర్చికి ముస్లిం కేర్‌టేకర్