ఆడవాళ్ల గ్రామమండీ..!
ఆడవాళ్ల కోసం స్పెషల్ బస్సులు చూశాం.. షీ క్యాబులు, లేడీస్ స్పెషల్ రైళ్లు, రెస్టారెంట్లు, కిట్టీ పార్టీల సంగతులూ విన్నాం. అయితే, ప్రత్యేకించి ఆడవాళ్ల కోసమే నిర్మించిన గ్రామం గురించి ఎప్పుడైనా విన్నారా..? ఇటువంటి గ్రామం కెన్యాలో ఉంది. విధివంచిత మహిళలకు స్వర్గధామంగా.. మగవాసనకు దూరంగా ఉండే ఈ గ్రామం పేరు ఉమోజా.
కెన్యా ఉత్తర ప్రాంతంలో రెబెక్కా అనే మహిళ 25 ఏళ్ల క్రితం ఈ గ్రామాన్ని ఏర్పాటు చేశారు. కేవలం మహిళల కోసమే నిర్మించిన ఈ గ్రామంలోకి పురుషుల్ని అనుమతించరు. వివరాల్లోకి వెళ్తే.. సంబూరు తెగకు చెందిన రెబెక్కాను కొందరు వ్యక్తులు కొడుతూ ఉంటే, భర్త చూస్తూ ఉండిపోయాడు. ఏ మాత్రం ప్రతిఘటించలేదు.
ఇదేకాక, గతంలో ఈ ప్రాంతంలో బ్రిటిష్ సైనికులు శిక్షణ పొందేవారు. వారి అకృత్యాలకు అడ్డూ అదుపూ ఉండేది కాదు. మహిళలను శారీరకంగా, లైంగికంగా హింసించేవారు. ఇవన్నీ కళ్లారా చూసిన రెబెక్కాకు పురుషులంటే అసహ్యం వేసింది. తనలాంటి వారికి రక్షణగా ఓ సరికొత్త గ్రామాన్ని సృష్టించాలనుకుంది. ఆ ప్రయత్నమే ఉమోజా అంటారు గ్రామస్థులు.
1990లో ఏర్పాటైన ఈ గ్రామంలోకి నెమ్మదినెమ్మదిగా బాధితులు రాసాగారు. భర్త వేధింపులు తాళలేనివారు, భర్త చనిపోయినవారు, అత్యాచారాలకు గురైనవారు, అనాథలు.. ఇలా స్త్రీలంతా ఒకచోట చేరారు. వీరంతా బతుకుతెరువు కోసం ఆభరణాల తయారీ చేపడుతుంటారు. వీరందరికీ నాయకత్వం వహిస్తున్నారు రెబెక్కా. ప్రస్తుతం ఈ గ్రామం కెన్యాలోని పర్యాటక ప్రాంతాల్లో ఒకటి. అయితే, మగ పర్యాటకులకు మాత్రం అనుమతి లేదండోయ్!